సద్గురు నాలుగు రకాల ధ్వనుల గురించి, అనాహత ధ్వని గురించీ, సృష్టి, సృష్టికర్తలకు ఆధారమైన అనాది ధ్వనిని వినడం గురించీ మాట్లాడుతున్నారు.

సుమారు 6000 సంవత్సరాల క్రితం ఒక యోగి: స్వచ్ఛమైన శూన్య ప్రదేశం గుండా ధ్వని ప్రయాణిస్తుంది, ఆ ధ్వనిని మీరు వినకపోతే మీ జీవితం సార్థకం కాదు”” అని ప్రకటించాడు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని  కొంతకాలం క్రితమే తెలుసుకున్నారు. అప్పటి వరకు వారు “ధ్వని శూన్య ప్రదేశం గుండా ప్రయాణించదు, దానికేదైనా వాహిక కావాలి. కాబట్టి ఆ యోగి భౌతికశాస్త్ర పాఠాలు నేర్చుకోవాలని” వెక్కిరించేవారు.

మీరు మాట్లాడినప్పుడు ధ్వని ప్రయాణించడానికి గాలి మాధ్యమంగా పని చేస్తుంది. కేవలం శూన్యం మాత్రమే ఉన్నట్లయితే ధ్వని ప్రయాణించదు. శూన్యం ద్వారా ధ్వని ప్రయాణించదు. అందువల్ల యోగికి హైస్కూలు స్థాయి సైన్సు పాఠాలు చెప్పాలి అన్నారు వాళ్లు. కాని ఇవ్వాళ ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు.

నాలుగు రకాల శబ్దాలు

నాలుగు రకాల శబ్దాలున్నాయి. మొదటి రకం ‘వైఖరి’. నేను మాట్లాడేది, మీరు వినేది - భౌతిక శబ్దం. రెండవది మధ్యమ. ఉదాహరణకు నేను ‘చాక్లెట్’ అన్నాననుకోండి. లేదా నేను చాక్లెట్ ఆకారపు వస్తువునేదైనా చూపించాననుకోండి, అప్పుడు మీ మనస్సు ‘‘ఓహ్! చాక్లెట్’’ అనుకుంటుంది. ఈ ధ్వని మీ మానసిక కోణం నుండి వస్తుంది. అది కేవలం ఆలోచనా  ప్రకంపన మాత్రమే కాదు. ‘‘హా  చాక్లెట్’’ అన్నది ఒక గొంతు, ఒక ధ్వని. ఇది మధ్యమ ధ్వని.

ఇప్పుడెవరన్నా దేవుడి గొంతు విన్నామంటే వాళ్లను మానసిక చికిత్సకు పంపించవలసి వస్తుంది.

మూడవది పశ్యంతి. ఆలోచించడంలో మీ మనస్సు శక్తి - పశ్యంతి. నేను మీకేమీ చూపలేదు, ‘చాక్లెట్’ అని కేకవేయలేదు. కాని వెలుపలి నుండి ఏ ప్రేరణా లేకుండా, లోపలి నుండే, మీ మనస్సు లోతుల నుండి - ‘చాక్లెట్’ వినిపిస్తుంది. అది నేనన్నదాని ప్రతిబింబం కాని ప్రతిధ్వని కాని కాదు. ఎక్కడో అంతర్గతంగా మీ మనస్సు దాన్ని సృష్టించగలదు. ఇది మూడవ రకమైన ధ్వని, పశ్యంతి. నాలుగవదాన్ని ‘పరావాక్’ అంటారు. ‘పరా’ అంటే దివ్యమైనది, సృష్టికి మూలం. మీరు సృష్టికర్త గొంతు వింటారు.

ప్రజల్ని నమ్మించడానికి ప్రాచీన కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మెదళ్లు దైవవాక్యాన్ని వింటన్నామని చెప్పుకుంటున్నాయి. మనుషుల సౌకర్యం కొద్దీ కల్పిత స్వరాల గురించి కాని, ఊహలు, భ్రాంతుల గురించి కాని నేను మాట్లాడడం లేదు. దేవుడు, ఆధ్యాత్మిక ప్రక్రియ, ధ్వనులు, స్వరాలు వినపడడం మొదలైనవన్నీ ఎంతో అర్థరహితంగా తయారయ్యాయి. ఇప్పుడెవరన్నా దేవుడి గొంతు విన్నామంటే వాళ్లను నిజంగా మానసిక చికిత్సకు పంపించవలసిందే.

శబ్దమే దైవం

మనం ప్రకంపనలను సృష్టికీ, సృష్టికర్తకూ కూడా ఆధారంగా మాట్లాడుతున్నాం. బైబిలు కూడా చెప్తున్నది. ‘‘మొదట వాక్యముండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడు’’. ఇన్ని శతాబ్దాలలో ఈ వాక్యం యొక్క అర్థ ప్రాధాన్యాన్ని ఎవరూ గుర్తించినట్లు లేరు. అందువల్ల ఎవరూ దాన్ని మార్చడం కాని, తొలగించడం కాని చేయలేదు. కాని ప్రపంచలోని ఆ భాగంలో ఉచ్చరితమైన అతి ప్రధానమైన వాక్యం అది. కేవలం ఈ మూడు వాక్యాలతో మీరు కల్పించిన ఇతర కథలన్నీ ఆవిరై పోవాలి.

పదం అంటే మానవుడు ఒక ధ్వనికి అర్థం కలిపించడమే. విశ్వంలో ఎక్కడా పదాలు లేవు. కేవలం ధ్వనులు మాత్రమే ఉన్నాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు పదాలు వదలడం లేదు, ధ్వనులు చేస్తున్నారు. వింటున్న వ్యక్తి ఆ ధ్వనులను పదాలుగా అర్థం చేసుకుంటాడు. వాళ్లు ‘పదం’ అంటున్నప్పుడు వాళ్ల ఉద్దేశం ధ్వని - ఈ ధ్వని మీరు ఊహించుకున్న దేవుళ్ల రూపాలకంటే గొప్పది. ఈ ధ్వని గురించి యోగి ఇలా అంటాడు, ‘‘ఈ ధ్వనిని విన్నవాడి జీవితం సంపూర్ణంగా సఫలమైంది’’.

నిశ్శబ్దానికి మూల సారమయిన ధ్వని, సంపూర్ణమైన స్తబ్ధ చైతన్యం ‘పరావాక్’. మీకు జీవితంలోని భిన్న కోణాలు - సృష్టి, అవగాహన, అనుభవం, అభివ్యక్తి తదితరాలను గురించి మీకు బోధించాలంటే అది అనంతమైన కథ అవుతుంది, ఎందుకంటే విశ్వం అనంతం. కథ చాలా దీర్ఘమని కాదు, సృష్టి అటువంటిది కాబట్టి. కాని మీరు ఈ ‘అనాది’ అన్న ఒక ధ్వనిని విన్నట్లయితే మొత్తం అంతా ఇక్కడే ఉంది. అదిక అనంతగా కధలా సాగదు.

అనాహత ధ్వని

అనాహతమనేది ఒకటి ఉంది. అనాహతమంటే కొట్టబడని ధ్వని. సాధారణంగా ఒక ధ్వని పుట్టాలంటే ఏదో ఒకదాన్ని మరొక దానితో కొట్టాలి. అనాహతమంటే అట్లా కొట్టబడని ధ్వని - రెండు వస్తువులు కలుసుకుంటాయి. కాని ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. కాని ఒకదానీతో ఒకటి కలుసుకుంటాయి. అందుకే అనాహతాన్ని రెండు త్రిభుజాల కలయికతో సూచిస్తారు. ఈ సంకేతం ప్రపంచ వ్యాప్తంగా భిన్న వ్యాఖ్యానాలతో కనిపిస్తుంది. భౌతికమూ, అభౌతికం రెండూ కలుసుకుంటాయి. అవి ఢీ కొనవు, పరస్పరం కలుస్తాయి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆధ్యాత్మికత, భౌతికతల నడుమ ఘర్షణ లేదు. అవి ఇద్దరు ప్రేమికులు చేతులు కలిపినట్లుగా కలుసుకుంటాయి. భౌతిక, ఆధ్యాత్మికత రెండూ ప్రతి వ్యక్తిలోనూ ఏదో విధంగా కలుసుకుంటాయి. లేకపోతే వ్యక్తికి ఇక్కడ అస్తిత్వమే లేదు.

సృష్టికీ, సృష్టికర్తకూ కూడా ఆది ఉంది. అనాది అంటే మొదలు లేనిది - మనం చూడలేనిది

ఇది అనాహత ధ్వని. దాన్ని మీరు వినగలిగిన్నట్లయితే, ప్రేమ పారవశ్యాలతో మీ కన్నుల నుండి బాష్పాలు వస్తాయి. జీవితం ఆనందమయం, సుందరం అవుతుంది. కాని ఆ తర్వాత ఆ పారవశ్యం కూడా మీకు విసుగు కలిగిస్తుంది. అంతా అద్భుతంగా ఉంటుంది, మీరు ఆనందంతో నిండి ఉంటారు, కాని ఇంకా సాఫల్యం కలగదు. అందువల్లే యోగి ఇలా చెప్పాడు, ‘‘మీరు అనాది శబ్దాన్ని వింటే తప్ప, సృష్టికే కాక సృష్టికర్తకు కూడా ఆధారమైన అనాది శబ్దాన్ని వినే వరకు మీకు సాఫల్యమంటే తెలియదు’’. అనాది అంటే ఆది లేనిది, ప్రారంభం లేనిది. సృష్టికీ, సృష్టికర్తకూ కూడా ఆది ఉంది. అనాది అంటే మొదలు లేనిది - మనం చూడలేనిది, పట్టుకోలేనిది, జయింపలేనిది, వశపరచుకోలేనిది. దాన్ని కేవలం వినవచ్చు.

‘‘వాళ్లు నన్ను వింటున్నారు’’

ఆదియోగి సప్తర్షులకు యోగా బోధిస్తున్న సమయంలో ఆయన వాళ్లకు అన్ని సూక్ష్మ విషయాలను బోధించాడు, కాని ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన కేవలం అక్కడ కూర్చున్నాడు, మత్తిల్లిన స్తబ్ధతతో ఉన్నాడు, ఆయన అర్ధనిమీళిత కన్నులతో ఉన్నారు. అక్కడ ఆ ఏడుగురు ఋషులూ ఏడు భిన్నమైన యోగ రీతుల్ని స్వీకరిస్తూ కూర్చున్నారు. ఇది అనేక మాసాలు, సంవత్సరాలూ కొనసాగింది. ఆయన చేసిందంతా వాళ్లపై ఏమీ ఆసక్తి లేనట్లు కూర్చొని ఉండడమే.

పార్వతి ఆయన్ని, ‘‘వాళ్లక్కడ ఉన్నారు. గొప్ప ఋషులు. మీరు ఏదో ఒకటి ఎందుకు మాట్లాడరు? ఇది అనుచితంగా లేదా?’’ అని అడిగింది. దానికి ఆయన, ‘‘ఆహా, వాళ్లు నన్ను వింటున్నారు’’ అన్నాడు. ఆయన పార్వతికి ఏం చెప్తున్నారంటే ‘‘నీకు నాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల నీవు నన్ను వినలేకపోతున్నావు, అందువల్ల నేను నీతో మాట్లాడవలసి వస్తుంది. వాళ్లు నన్ను వింటున్నారు’’. వాళ్లు ఆయన మనస్సులో ఏం జరుగుతూ ఉందో వింటున్నారని ఆయన భావం కాదు. ఆయనంటున్నది, ‘‘నా చైతన్యానికి ఆధారామైన దాన్ని వాళ్లు వింటున్నారు, అంతే’’.

ప్రేమాశీస్సులతో,
సద్గురు