ప్రశ్న: నమస్కారం సద్గురు. అహం అంటే ఏమిటి? దాన్ని మనం ఎలా నాశనం చేయాలి.

సద్గురు: అహం వచ్చేది మీరేదో ఘనకార్యం చేసినందుకో, ధనవంతులయినందుకో, లేకపోతే సౌందర్యవంతులు కావడం వల్లో, మరొకదానివల్ల కాదు. మీరు మీ తల్లి గర్భంలో తన్నడం ప్రారంభించినప్పుడే అహం పుట్టింది. మీ స్థూల శరీరంతో గుర్తింపు ఏర్పరచుకొన్నారంటే అహం పుట్టినట్లే. అదొక రక్షణ యంత్రాంగం. మీరీ చిన్న శరీరంతో గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ అంతమవుతుందో తెలియని ఈ విశాల అస్థిత్వం గురించి మీకెటువంటి అవగాహనాలేదు. అందులో మీ చిన్న దేహం బతికి బట్ట కట్టాలి. మనుగడ కోసం మిమ్మల్ని మీరు పెద్దవాడిగా చూపించుకోవాలి. అందువల్ల అహం పుడుతుంది. మనుగడ కోసం మీరు సృష్టించుకున్న మిథ్యావాస్తవం అహం. ఏది అహం? అది మీ నీడ లాంటిది. మీకు శరీరం ఉందంటే నీడ ఉంటుంది. నీడ దానంతట అది మంచిదీ కాదు, చెడ్డదీ కాదు. సూర్యుడు నెత్తిమీద ఉంటే మీకు చిన్న నీడ ఉంటుంది. అదే సూర్యుడు మరీ కిందికి ఉంటే మీ నీడ మైలు పొడుగవుతుంది. బాహ్య పరిస్థితిని బట్టి నీడ ఉంటుంది. మీకుండవలసిన అహం కూడా ఇలాగే ఉండాలి – బాహ్య పరిస్థితికి అవసరమైన విధంగా.

వైరాగ్యం

మీరు వైరాగ్యమనే మాట విని ఉంటారు. ‘రాగ’ అంటే రంగు. ‘వై’ అంటే అతీతం. వైరాగ్యం అంటే రంగుకు అతీతమైనది. అంటే మీరు పారదర్శకంగా ఉండడం. మీరు పారదర్శకంగా ఉంటే మీ వెనుక ఉన్న రంగు ఎరుపైతే మీరు ఎర్రగా ఉంటారు. అదే మీ వెనుక నీలం రంగు ఉంటే మీరు నీలమైపోతారు. అదే పసుపుపచ్చ అయితే మీరు పసుపు పచ్చగా ఉంటారు. మీకు రాగద్వేషాలు ఉండవు. మీరెక్కడుంటే దానిలో భాగమవుతారు. కాని ఏదీ మీకు అంటదు. మీరిలా వైరాగ్యస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, మీరిక్కడ నివసించినప్పుడు జీవితంలోని అన్నికోణాలనూ శోధించే సాహసం చేయగలుగుతారు.

పరిస్థితులు సజావుగా నడిస్తే మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పరిస్థితులు అడ్డం తిరిగితే మీరు భిన్నంగా ఉంటారు.
మన జీవితాలలో వివిధరకాల పరిస్థితులని ఎదుర్కోవడానికి మనకు భిన్నరకాల గుర్తింపులు కావాలి. మీరు సమయానుకూలంగా, ఒక పాత్ర నుండి మరోపాత్రలోకి సులువుగా మారగలిగితే మీ పాత్రను మీరు సంపూర్ణంగా పోషించగలుగుతారు, మీకు దానితో సమస్యే ఉండదు. కాని మీరిప్పుడు మీ పాత్రతో ఎంతగా గుర్తింపు ఏర్పరచుకుంటున్నారంటే ఆ పాత్రే మీరని నమ్ముతున్నారు. “నేను నీడని” అని మీరొకసారి విశ్వసించిన తర్వాత మీరింకేం చేయగలరు? సహజంగానే మీరు భూమి మీద పాకుతారు. మీరలా పాకుతున్నట్లయితే జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ కార్పెట్ పరిచి ఉనట్లయితే మీకు కొంత సౌకర్యంగా ఉంటుంది, కాని ఆనందం ఉండదు. ఒకవేళ రాళ్లూ, రప్పలూ, ముళ్లూ వచ్చాయనుకోండి? అప్పుడు మీరు ఏడుస్తారు, గగ్గోలు పెడతారు. ఇప్పుడు మీ జీవితం ఇలానే నడుస్తోంది. బయటి పరిస్థితులు కార్పెట్ పరచినట్లుగా ఉంటే కొంత సౌకర్యంగా పాకగలరు. చిన్నచిన్న ముళ్లు వస్తే మొత్తుకుంటారు, ఎందుకంటే మీరు నేలమీద పాకుతున్నారు.

పండువల్లనే తోక్కకి ప్రాధాన్యత

ప్రస్తుతం, మీ జీవితానుభవమంతా శరీరానికే పరిమితమై ఉంది. మీ పంచేంద్రియాల ద్వారా మీరు తెలుసుకునేదంతా శరీర సంబంధమైనదే. శరీరికానికి సొంత ప్రయోజనం ఉండదు. అది పండు మీద తొక్కలాంటిది. తొక్క కేవలం లోపలి పండుకు రక్షణ కవచం మాత్రమే. శరీరం ఎందుకు ముఖ్యమంటే దాని లోపల మరేదో ముఖ్యమైంది ఉంది కాబట్టి. మీరు లోపలున్నదాన్ని ఎన్నడూ అనుభూతి చెందలేదు. రేప్పొద్దున ఆ లోపలున్నది మీ శరీరం నుండి వెళ్లిపోతే ఈ శరీరాన్ని తాకడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. అదొక శవంగా మారిపోతుంది. అందువల్ల ఇవ్వాళ అది ఇక్కడుంది కాబట్టి మనం దాన్ని భద్రంగా చూసుకోవాలి. మనం శరీర పరిమితులను దాటనట్లయితే, శరీర పరిమిత అస్తిత్వాన్ని అధిగమించక పోయినట్లయితే, జీవితం ఒక ఘర్షణగా మిగిలిపోతుంది. పరిస్థితులు సజావుగా నడిస్తే మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పరిస్థితులు అడ్డం తిరిగితే మీరు భిన్నంగా ఉంటారు. అయితే, పరిస్థితులు బాగానే నడుస్తున్నా అవి ఏ క్షణంలోనైనా చెడిపోవచ్చని మీకు తెలుసు. అది కేవలం చెడిపోవడం మాత్రమే కాదు, జీవితం ఏ క్షణంలో ఎటువంటి మలుపయినా తీసుకోవచ్చు. ఏ క్షణంలోనయినా పరిస్థితులు మీకు నచ్చని మలుపు తీసుకోవచ్చు. మీకు ప్రపంచంలో ప్రతిదీ ఎంతో వ్యతిరేకంగా సాగుతున్నప్పటికీ మీరు దాని స్పర్శ కూడా తగలకుండా మీలో మీరు శాంతంగా, సంతోషంగా ఉండవచ్చు, అప్పుడు మీరు జీవితాన్ని ఉన్నదున్నట్లుగా తెలుసుకుంటారు. లేకపోతే కేవలం మీరు భౌతికానికి బానిసలవుతారు.

అహాన్ని “నాశనం చేయడం” ఆపండి

అహాన్ని నాశనం చేయడం గురించి ఇవ్వాళ లోకంలో అనవసర ప్రసంగాలెన్నో నడుస్తున్నాయి. దీన్ని పవిత్ర గ్రంథాల నుండి తీసుకుంటున్నారు. మీ వ్యక్తిత్వం వికారంగా మారినప్పుడల్లా మీరు దాన్ని అహం అంటారు. బాధ్యతను వదిలించుకునే మరో పద్ధతి ఇది. మీ వ్యక్తిత్వం అసహ్యంగా మారినప్పుడు అది మీరేనని మీరు గుర్తించాలి. “నేను వికారంగా ఉన్నాను” అని మీరనుకుంటే దాని గురించి మీరేమైనా చెయ్యవచ్చు. మీరలాగే ఉండాలని కోరుకోరు కదా. కాని ఈ సంభావ్యతను తప్పించుకోవడానికి మనమెన్నో కొత్త వ్యూహాలు కనుక్కున్నాం. ఒక సమయంలో మీరు అందంగా ఉన్నా, వికారంగా ఉన్నా అది మీరే, అవునా? దాన్ని అలాగే ఉంచండి. అక్కడ లేనివాటిని సృజించకండి – మీ అహం, మీ ఆత్మ, మరేదైనా.. “అందమైనది నా ఆత్మ, వికారమైనది నా అహం” వంటి అభిప్రాయాలు సృష్టించుకున్నట్లయితే మార్పు సాధ్యం కాదు. “నేనెటువంటి పనికిమాలిన వాణ్ణయినా, నాలో ఉన్నది అందమైనదయినా, వికారమైనదయినా ఆ రెండూ కూడా నేనే” అని మీరు చూడగలిగినట్లయితే, మీలో ఉన్న వికారాలు సహజంగానే మారతాయి – మీరు మారవలసిందే, మరో మార్గం లేదు.

ఇవ్వాళ ప్రపంచంలో జీవిత స్పృహను తీసుకురావలసి ఉంది. ప్రస్తుతం ప్రజలకి అహం పట్ల స్పృహ మాత్రమే ఉంది(Ego-sensitive) తప్ప జీవిత స్పృహ లేదు. వాళ్లు అహం పట్ల స్పృహ కలిగినవాళ్లు, జీవితస్పృహ లేనివాళ్లు. ఇలా అయితే మిమ్మల్ని మాత్రమే మీరు జీవితంగా చూస్తారు, మరెవరూ జీవితం కాదు. మీరు దేనిమీది నుంచైనా, ఎవరిమీది నుంచైనా తొక్కుకుంటూ నడవగలరు. కాని మీకు జీవిత  స్పృహ ఉంటే జీవితంలో ప్రతిదీ మీ అనుభవమవుతుంది, అందువల్ల సహజంగానే మీరు మీ చుట్టూ ఉన్న ప్రతిజీవి పట్ల చాలా స్పృహతో ప్రవర్తిస్తారు. మీరు జీవిత స్పృహ కలిగినవారైతే అహం అనేదొక సమస్య కాదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు