సద్గురు : మరణం ఆవల ఏమి ఉన్నదో తెలుసుకోవాలనే మానవుని తపనకు మూలం, తనకు అది తప్పదనే నిజం తెలియటమే! తాము మరణిస్తామని తెలియకపోతే ఎవరూ ఆధ్యాత్మికత వైపు మళ్ళరు. అరవై ఐదు దాటిన తరువాత, శరీరం తన అశాశ్వతత్వాన్ని బలంగా గుర్తుచేస్తుంది కాబట్టే, ఆ వయసు దాటాక మాత్రమే ఆధ్యాత్మికతను అలవరచుకోవాలనే నానుడి, అపోహ ప్రజలలో ఉండటానికి కారణం! యౌవనంలో ఉన్నప్పుడు మీకు మరణం లేదని అనిపిస్తుంది. వయసు పెరిగినకొద్దీ మరణం అనివార్యం అని తెలుస్తుది. కొందరికి ఆ గుర్తింపు తొందరగా వస్తుంది, మరికొందరికి ఆలస్యంగా వస్తుంది. అది వారి వారి ఆరోగ్యాలపై ఆధారపడి ఉంటుంది.

అందువల్లనే శివుడు ఎల్లప్పుడూ స్మశానంలోనే ఉంటాడని అంటారు. ఇంచుమించుగా ప్రతి యోగి ఏదో సమయంలో కొంత కాలం స్మశానంలో గడిపి ఉంటాడు. మన అశాశ్వతత్వాన్ని గుర్తు చేస్తుంది కనుకనే స్మశానం చాలా పవిత్రమైనదిగా భావింపబడుతోంది. ఎవరైనా మరణించినప్పుడు మీ అస్తిత్వం యొక్క అనిత్యత మీ శరీరంలో ఎక్కడో తగులుతుంది. అది భావోద్వేగ పరమైన ప్రతిస్పందన కంటే మించినది. ఆ మరణించిన వారికి మీకు ఏ సంబంధం లేకపోయినా, పడివున్న ఒక మృతదేహాన్ని చూచినప్పుడు, అది మిమ్మల్ని కదిలిస్తుంది. అవునా? మీరు మరింత సున్నితత్త్వాన్ని కలిగి ఉంటే, ఏ మృత దేహమైనా మీ శరీరంపై దెబ్బతీస్తుంది, మనసును కాదు. మాననసికంగాను, భావోద్వేగాపరంగాను కూడా కొన్ని ప్రతిస్పందనలు ఉండవచ్చు. కాని ముఖ్యమైన సంగతి ఏమిటంటే శరీరం తనదైన పద్ధతిలో జీవాన్ని గ్రహిస్తుంది.

శరీరానికి తనదైన జ్ఞాపకశక్తి ఉంది, దాని మార్గంలో అది పనిచేస్తూ ఉంటుంది. ఈ క్షణం, మీ శారీరక జ్ఞాపకాలే, మీ మానసిక జ్ఞాపకాలకంటే ఎక్కువగా మిమ్మల్ని శాసిస్తున్నాయి. మానసికమైన జ్ఞాపకాల కంటే శారీరకమైన జ్ఞాపకాలే ఎంతో ప్రముఖమైనవి.

యోగులు కొండల్లోనే నివసించాలని కోరుకోవటానికి కారణం, అక్కడ శరీరానికి, తన అనిత్యత గురించి ఒక్కసారిగా బలమైన సంకేతాలు అందుతుంటాయి. అది మానసికమైన, మేథాపరమైన సంకేతాలు కాదు, భౌతికమైన సంకేతం. చావుకి బ్రతుకుకి మధ్యవున్న ఎడం చాలా సన్ననిది. కొండల్లో అది మరింత సన్నగా అయిపోతుంది. మీ అస్తిత్వంలోని క్షణిక స్వభావాన్ని, కొండల్లో నివాసం నిరంతరం గుర్తు చేస్తూ ఉంటుంది. మీరు మీ అశాశ్వతను నిరంతరం గుర్తెరిగినప్పుడు, మీరు మరణిస్తారనే స్పృహ మీకు నిరంతరం ఉంటే, మీ భౌతిక శరీరానికి తాను శాశ్వతం కాదని, తానూ భూమిలో కలిసిపోతానని, అది ఇవాళే కావచ్చు అన్న అవగాహన ఉంటే, మీ ఆధ్యాత్మిక అన్వేషణ తీవ్రమౌతుంది. అందుకే యోగులు కొండలను ఎంచుకుంటారు. వారి అనిత్యత వారికి నిరంతరం గుర్తు ఉండాలి, అప్పుడే వారి అన్వేషణ సడలకుండా సాగుతుంది.

మీ శరీర తత్వాన్ని నిరంతరం గుర్తుచేసుకుంటూ ఉండటం ముఖ్యం. ప్రస్తుతం మీరు కుప్పిగంతులు వేస్తున్న మట్టి ముద్ద. ఏ శరీరం చుట్టూ మీ జీవితం అంతా అల్లుకొని ఉన్నదో, అది కేవలం ఒక మట్టిముద్ద. భూమి మిమ్మల్ని తనలోకి తీసుకోవాలని నిర్ణయించినప్పుడు, మీరొక మట్టి ముద్ద అవుతారు, అంతే. ‘తాము కేవలం మట్టిముద్ద తప్ప మరేమీ కాదు’ అనే భౌతిక సంకేతాలను యోగులు నిరంతరం ఆకాంక్షిస్తారు. వారు నిరంతరం భూస్పర్శను కోరుతారు. ఆకారణం చేతనే భూమితో సన్నిహితంగా ఉండటాన్ని వారు ఎన్నుకుంటారు. చుట్టూ భూమితో ఉండే అవకాశం ఎక్కడ ఉన్నది? ఒక గొయ్యి తవ్వుకొని అందులో కూర్చోవచ్చు. కాని అది ఆచరణీయం కాదు. అందువల్ల వారు కొండల్లోకి వెళ్లి అక్కడ సహజంగా ఏర్పడిన గుహలను ఎంచుకుంటారు. అక్కడ వారి శరీరానికి, ‘‘భూమి తనను లోనికి తీసుకోవాలని చూస్తోంది’’ అనే నిరంతర స్పృహ ఉంటుంది. భూమాత తాను ఇచ్చిన ఋణాన్ని వీలైనంత త్వరగా వసూలు చేసుకోవాలని భావిస్తుంది. మీరు బ్రతికుండేందుకు చేసే పోరాటం అందుకు వ్యతిరేకమైనది.

‘మీరు చేసేది ఏపనైనా కానివ్వండి, రోజుకు కనీసం ఒక గంట సేపు మీ వేళ్ళు భూమిలో గుచ్చుతూ ఉండాలి’ అని నేను ఆశ్రమంలో అందరికీ చెపుతూ ఉంటాను.. తోట పనిచెయ్యండి, మీ చేతికి ఎప్పుడో ఒకప్పుడు మట్టి అంటాలి. అందువల్ల మీరు ఎప్పుడైనా చనిపోతారని మీ భౌతిక శరీరానికి గుర్తు వస్తుంది. తాను శాశ్వతం కాదని శరీరానికి తెలుస్తుంది. ఎవరైనా ఆధ్యాత్మిక పథంలో దృష్టి నిలపాలంటే శరీరంలో ఆ అవగాహన ఉండటం చాలా అవసరం. ఆ జ్ఞానం ఎంత త్వరగా వస్తే ఆధ్యాత్మిక స్పృహ అంత బలంగా ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు