ఒకసారి స్వామి వివేకానంద, “మీరు ప్రార్థనలో ఉన్నప్పుడు కంటే  ఒక ఫుట్ బాల్‌ను తన్నుతున్నప్పుడు దివ్యత్వానికి దగ్గరిగా ఉంటారు" అన్నారు. ఎందుకంటే, మీరు మనసు నిమగ్నమవ్వకుండా కూడా ప్రార్థించగలరు,  కానీ నిమగ్నత లేకుండా మీరు ఒక ఆటను ఆడలేరు. కానీ నిమగ్నతే జీవిత సారంశం. “క్రీడాస్పూర్తితో ఉండటం” అంటే మీరు ఆడటానికి సుముఖంగా ఉన్నారని అర్ధం. ఆడటానికి సుముఖంగా ఉన్నారంటే మీరు ప్రసత్తం మీరున్న పరిస్థితిలో పూర్తిగా నిమగ్నులు అయినట్లే, అంటే మీరు ఆ పరిస్థితిలో సజీవంగా ఉన్నట్లే. అదే జీవిత సారంశం. సాధారణ జీవనంలో ఆధ్యాత్మిక ప్రక్రియకు ఏవైనా దగ్గరిగా ఉన్నాయంటే అవి క్రీడలే!

  మీరు, మీ బ్యాట్, మీ బాల్!

చిన్నప్పుడు మనం ఒక ఆటను కేవలం దాన్ని మనం ఆస్వాదిస్తున్నందువల్లనే ఆడే వాళ్ళము. కానీ మెల్లగా క్రీడలు ఒక పెట్టుబడి అవకాశంగా పరిణామం చెందాయి. ఉదాహరణకు క్రికెట్ వరల్డ్ కప్‌ను తీసుకోండి. చాలా మంది క్రీడాకారులు ఛాంపియన్‌షిప్‌ మీద ధ్యాస పెట్టే కొద్దీ, వారి ఆటను మర్చిపోతున్నారు. వాస్తవానికి, అప్పుడు వారికి ఆట కూడా ఒక పనిగా మారుతుంది.

క్రీడాకారులు ఆడటాన్ని ఆనందిచ్చనప్పుడే  తమ ఉత్తమ ప్రదర్శనను ఇవ్వగలరు. భారతదేశం తరపున ఆడటం అంటే ఒక బిలియన్ ప్రజల ఆకాంక్షలను పూర్తి చేయటం, మరి అది అంత సులభం కాదు. క్రీడాకారులు ఆటను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆడటం మొదలు పెడితే, ఒత్తిడికి గురవుతాయి. వారి శారీరక చురుకుదనం కూడా పరిమితం అవుతుంది.

1024px-GandM_Flare_DXM_bat-Purist_156g_ball

మీరు క్రీజ్‌లో ఉన్నప్పుడు మీ ధ్యాసంతా  మీ గురించి, మీ బ్యాట్ గురించి, మీ బాల్ గురించి అయ్యుండాలి. అది క్రికెట్ గురించి, ఇండియా లేదా బిలియన్ ప్రజల గురించి కాకూడదు. మీరు మీ ప్రత్యర్ధి జట్టును ఓడించటానికి ప్రయత్నించనక్కర లేదు. మీరు చేయవలసింది అంతా బాల్‌ను కొట్టడమే.

మనిషి మెదడుకి గ్రహణ, జ్ఞాపక, కల్పనా (ఊహా) శక్తులు ఉంటాయి. మీరు మీరు క్రీజ్‌లో ఉన్నప్పుడు,  ఆట గురించిన జ్ఞాపకము ఉంటుంది, మీరు కప్పును ఎలా తీసుకుని వెళ్తారనే ఊహా ఉంటుంది, అలాగే బాల్ మీ వైపు ఎలా వస్తుంది అనే వాస్తవం ఉంటుంది. సమస్య ఏమిటంటే మీరు వీటిని విడివిడిగా ఉంచలేక పోతున్నారు. మీరు మీ జ్ఞాపకాలతో, ఊహలతో కలలు కనవచ్చు కానీ,  మీరు వాస్తవాన్ని మాత్రమే నిర్వహించగలరు. వాస్తవం ఏమిటంటే బాల్ మీ వైపు వస్తూ ఉంది, మీ చేతిలో బ్యాట్ ఉంది, ఆ బాలుకు తగిన షాటుని మీరు కొట్టాలి. అంతే గానీ, ఇండియాకో లేక వేరెవరికో తగిన షాటుని కాదు.

మీరు కేవలం గెలవాలనుకోవటం వల్లనే ఏ ఆటను గెలవలేరు. జీవితంలోని మిగతా విషయాల్లో కూడా ఇంతే. ఏదైనా సరే, దానిని మీరు సరిగ్గా చేయటం వల్లనే  సరిగ్గా జరుగుతుంది గానీ, కేవలం సరిగ్గా జరగాలని అనుకోవడం వల్ల కాదు. మీ మనస్సులో ఈ స్పష్టతను తెచ్చుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు వీటికోసం రోజుకు 12 గంటలు వెచ్చించనవసరం లేదు. రోజుకు 20 నుంచి 30 నిముషాలు వెచ్చిస్తే చాలు. మీరు మీకొరకు అధ్బుతాలను సృష్టించుకోవచ్చు.

ఒక వ్యక్తి నిజంగా ఆనందంగా ఉన్నప్పుడు,  స్వేచ్ఛాయుతంగా ఉన్నప్పుడు,  అధ్బుతమైన శారీరక చర్యలో నిమగ్నం కాగలడు. ఇదే యోగాలోని ముఖ్యాంశము. ఆటకు తగిన విధమైన స్పందన ఆ వ్యక్తిలో నుంచి పొంగి పొరులుతుంది. ఈ విధంగా ఉన్న వారు, వారిలోని చురుకుదనంతో ప్రత్యర్ధి జట్టువారు వేసే ప్రతీ ఎత్తుగడకు తగిన విధంగా ప్రతిస్పందించగలుగుతారు

ఒక క్రికెట్ లెజెండ్ ఎలా జన్మిస్తాడు?  ప్రత్యర్ధి జట్టు యొక్క అసమర్ధత వల్ల మాత్రం అస్సలు కాదు. అటువంటి క్రీడాకారుడిలో శారీరక సమన్వయం శిఖరాలను చేరుకొని ఉంటుంది. తన జీవితం నుంచి తనకు ఏమి కావాలో అతనికి కచ్చితంగా తెలుసుంటుంది. అతడు తన జీవితంలో ఏదైతే వాస్తవం కావాలనుకుంటున్నాడో, దానికి నిబద్దుడై ఉంటాడు. మన క్రికెటర్లు వారి శక్తులను, శరీరాలను , మనస్సులను వారు కావాలనుకుంటున్న వాటిపైకి  కేంద్రీకరించగలిగితే,  వారనుకున్నవి సాధించగలుగుతారు.

 క్రీడల్లోని  పవిత్రత!

ఓ క్రీడల్లోని పవిత్రత ఏంటంటే వ్యక్తుల వారి పరిమితులను దాటి వెళ్లగలుగుతారు. తద్వారా  ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిలో ఉన్నవారికి మాత్రమే తెలిసే స్వేచ్ఛా స్థితికి చేరుకుంటారు. అందువల్లే ఈశాలో ఎప్పుడూ ఆటలు ఉంటాయి. మా ప్రతీ కార్యక్రమంలో ఆటలు కూడా ఉంటాయి – ఎందుకంటే  ఆటే జీవితం, జీవితమే ఓ ఆట!

cricket

ఆటలోని మౌళిక అంశము ఏమిటంటే మీరు ఒక ఆట ఆడాలంటే మీకు గెలవాలనే స్ఫూర్తి ఉండాలి, కానీ  అదే సమయంలో “ ఓడిపోయినా పరవాలేదు” అనుకోగలిగే సమతుల్యత ఉండాలి. మీరెప్పుడూ ఆటను ఓడిపోవటానికి ఆడరు.  మీరెప్పుడైనా ఆటను గెలవడానికే ఆడతారు, కానీ ఓడిపోతే, అది మీకు పర్వాలేదు. ఈ మౌళిక అంశాన్ని జీవితంలోని ప్రతీ అంశానికి అనువదిస్తే, మీ జీవితమే ఒక ఆట అవుతుంది. అదే ఈ ప్రపంచం మీ దగ్గర నుంచి కోరుకునేది.  మీరు జీవితాన్ని ఓ ఆటగా చూడాలని, మీరెక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, మీరు ఎప్పటికీ జీవితాన్ని ఓ ఆటగానే చూడాలని ఈ ప్రపంచం ఆశిస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు