ప్రపంచ జనాభా దినం 2018 : జనాభా నియంత్రణపై సద్గురు సూచనలు

జూలై, 11 ప్రపంచ జనాభా దినం. పెరుగుతున్న జనాభాపై సద్గురు చేసిన ప్రసంగంలో కుటుంబాన్నిఎలా నియంత్రించుకోవాలి, జనాభా సంఖ్యను నియంత్రించడంలో జననాల రేటు నియంత్రణా బాధ్యతను తీసుకోవడం ముఖ్యం అని ఆయన అన్నారు
World Population Day 2018: Sadhguru’s Speech
 

జూలై, 11 ప్రపంచ జనాభా దినం. పెరుగుతున్న జనాభాపై సద్గురు చేసిన ప్రసంగంలో  కుటుంబాన్నిఎలా నియంత్రించుకోవాలి, జనాభా సంఖ్యను నియంత్రించడంలో జననాల రేటు నియంత్రణా బాధ్యతను తీసుకోవడం ముఖ్యం అని ఆయన అన్నారు

సద్గురు: నేను చాలా సమావేశాలలో చూశాను అందులో అందరూ మనం ఎదుర్కొంటున్న  వివిధ విపత్తులపై మాట్లాడుతుంటారు – ముఖ్యంగా మనం నిత్యం ఎదుర్కొనే  నీరు, పర్యావరణ పరిరక్షణ వంటివి – అయితే నన్ను బాధించే విషయం ఏమిటంటే – ఏ ప్రభుత్వం కూడా అతి ముఖ్యమైన పెరుగుతున్న జనాభా విపత్తు గురించి మాట్లాడటం లేదు..

ప్రపంచ జనాభా దినం గణాంకాలు : భారతదేశం & ప్రపంచం

20వ శతాబ్దం మొదట, ప్రపంచంలో160 కోట్ల జనాభా ఉండేది. నేడు, ఒక శతాబ్దం తరువాత, జనాభా 730 కోట్లకు చేరింది. ఐక్యరాజ్య సమితి చూపుతున్న లెక్కలు ప్రకారం 2050 నాటికి జనాభా 980 కోట్లకు వరకు చేరుతుంది. నా ఉద్దేశ్యంలో ఇది బాధ్యతారాహిత్యమైన మానవ పునరుత్పత్తి. భారత దేశంలో 1947 నాటికి 33 కోట్ల మంది జనాభా వుండేది. ఈరోజు, మన జనాభా 130 కోట్లు. జనాభా నియంత్రణ చేయకపొతే – మనం ఎన్ని చట్టాలు మార్చినా, ఎంత గొప్ప టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చినా, ఎన్ని చెట్లు నాటినా వాటివల్ల ఏ ప్రయోజనమూ లేదు.

 

This chart shows global population growth with a forecast up to 2100 | World Population Day: Sadhguru's Speech
Credit: Statista.com

 

మనం ఎరుకతో జనాభా నియంత్రణ చేయాలి లేదా ప్రకృతే చాలా భయంకరమైన రీతిలో ఆ పని చేస్తుంది. ఇది ఒక్కటే మనకున్న ప్రత్యామ్నాయం. ముఖ్యంగా భారత దేశంలో  ప్రస్తుతం 60% భూమి కేవలం ఈ 130 కోట్ల మందికి ఆహారం అందించడం కోసం  దున్నబడుతోంది. మన రైతులు ఎంతో అస్థిరమైన మౌలిక వనరులతో  ఈ 130 కోట్లకు మించి ఉన్న జనాభాకు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. 

 

This chart shows the population in 2017 and forecast for 2050 | World Population Day: Sadhguru's Speech
Credit: Statista.com

 

ఇది ఎంతో మెచ్చుకోదగ్గ వాస్తవం, అయినా ఆహారాన్ని ఉత్పత్తి చేసే ఈ రైతులే సరిగ్గా తిండి లేక బాధపడుతున్నారు. అదేమీ గొప్పవిషయం కాదు; అది గర్వించదగ్గ విషయం అంతకంటే కాదు. మనం తినే బియ్యం లేదా గోధుమలను ఎవరైతే పండిస్తారో, ఆ రైతుల పిల్లల  కడుపు నిండడం లేదు. ఎందుకంటే మనకు ఎంత భూమి వుంది? ఎంత మేరకు జనాభాను భరించగలం అని ఆలోచించి నిర్ణయించుకునే బాధ్యతను మనం తీసుకోవడంలేదు. నియంత్రణ లేని జనాభా పెరుగుదలను ఈ దేశం ఖచ్చితంగా భరించలేదు.

ప్రపంచ జనాభా దినం : ఈ భూమి కేవలం మానవుని కోసం కాదు

‘ఈ భూమి కేవలం మానవుల కోసమే’ అన్న ఆలోచన  చాలా పెద్ద స్వార్థపరమైన ఆలోచన. మీరు ‘దేవుని ఆకారంలోసృష్టించ బడ్డారు’ అనేది ప్రజల మనస్సుల్లో బాగా నాటుకొనిపోయింది. కాని నేను ఖచ్చితంగా చెప్పగలను ఒక చిన్న పురుగు, క్రిమి కూడా దేవుడు తమలాగే ఒక పెద్ద పురుగులా వుంటాడని అనుకుంటుంది.

 

Biodiversity: Life ­– a status report | World Population Day: Sadhguru's Speech
Credit: Nature.com

కేవలం పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల విషయంలోనే కాకుండా – మానవ మనుగడ కోసం మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ భూమిపై ప్రతి ప్రాణికీ ఒక పూర్తి జీవితం వుంటుంది. ఒక చిన్న క్రిమికి కూడా తనకంటూ ఒక పూర్తి జీవితం ఉంటుంది – దాని జీవితంలో కూడా అనేక విషయాలు ఉంటాయి. అవి మీకంటే చిన్నగాను లేదా చూడటానికి వేరుగా వున్న కారణంతో వాటికి ఇక్కడ జీవించడానికి ఎలాంటి హక్కు లేదని, కేవలం మీకు మాత్రమే ఇక్కడ జీవించడానికి హక్కు వుందని ఆలోచిస్తే అది మనం మానవత్వం లేకుండా ఘోరంగా జీవించడం అవుతుంది.  మానవత్వం లేని మానవత, అదే ఈరోజు మనం చూస్తున్నది. మనలోని మానవత్వం ముందుకు రాకుంటే, ఎరుకతో జనాభా నియంత్రణ అనేది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. 

ప్రపంచ జనాభా దినం : మనం జనాభా ఎలా నియంత్రణ చేయగలం?

ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. కానీ కేవలం చట్టాలు సరిపోవు. ప్రజాస్వామ్యంలో చట్టాలు అమలు చేయలేము. దీనిపై సరైన అవగాహన వచ్చేలా ప్రచారం చేసినప్పుడు మాత్రమే ఇటువంటి చట్టాలు పనిచేస్తాయి. ఇందుకు ప్రభుత్వంలోని వారు బాగా ఆలోచించాలి. ప్రైవేటు వ్యవస్థలు, ఎన్జీవోలు కొన్ని పనులు మాత్రమే చేయగలరు, ఇటువంటి విషయాలలో ప్రభుత్వ జోక్యం అవసరం.

జనాభా నియంత్రణ వదిలిపెట్టి పర్యావరణ, భూమి, నీటి పరిరక్షణ వంటి విషయాలు మాట్లాడటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదు, ఎందుకంటే సైన్స్, టెక్నాలజీ మనిషిని అతి క్రియాశీలంగా చేస్తుంది. మానవ చర్యలను మీరు ఆపలేరు ఎందుకంటే దాని వల్ల  మానవుని ఆశలను తృంచివేసినట్లు అవుతుంది. అందువల్ల  మీరు కేవలం జానాభా నియంత్రణను మాత్రమే చేయాలి. 

ప్రపంచ జనాభా దినం : జననాలను నియంత్రించడం

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ ఖచ్చితంగా చేయవలసినవే, కానీ గుర్తు చేసుకోవలసిన ప్రాథమిక విషయం ఏమిటంటే, మన సంఖ్య నాలుగు రెట్లు అయింది. మనం దానిపై ఎలాంటి చర్యా తీసుకోలేదు, ఇంకా ఇప్పటికి మన జనాభా పెరుగుతూనే ఉంది, అదే పెద్ద సమస్య.

1947లో, సగటు భారతీయుడి ఆయుర్దాయం 32 సంవత్సరాలు. ఈరోజు, 65 సంవత్సరాలు దాటుతోంది. అంటే మరణాల రేటుపై మనం సాధికారత సాధించాం, అందుకే జనానాల రేటుపై కూడా మనం నియంత్రణా బాధ్యత తీసుకోవాలి. నేడు, 130 కోట్ల జనాభాకు సరిపోయేటంత బస్సులు, భూమి, టాయిలెట్లు, గుళ్ళు లేదా కనీసం ఆకాశం కూడా లేదు. 

మనం చేయగలిగిన పని ఏమిటంటే – మనకున్న వనరులకు తగ్గట్టు మనం జనాబా నియంత్రణ చేయగలమా? ప్రతి ఒక్కరికి కావలసిన సరైన  అవగాహన అందించగలిగితే అది సాధ్యపడుతుంది. మనం ఆ పని చేయగలిగితే, మనకు చెట్లు నాటే అవసరం లేదు. భూమి ప్రమాద స్థితిలో లేదు, ప్రస్తుతం ఆ స్థితిలో వున్నది మానవ జీవితం. ప్రతి మానవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం వుంది. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకొని, అందుకు ఏది అవసరమో అది మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1