సద్గురు: ఈ రోజుల్లో మనం ప్రజలను “వికలాంగులు” అని పిలవడంలేదు. మనం వారిని స్పెషల్ పిల్లలని లేదా స్పెషల్ వ్యక్తులని పిలవడం ప్రారంభించాము. అతను స్పెషల్, కాబట్టే మీరు ఇతరులను చూసుకునే దానికంటే అతనిని ఇంకొంచం ఎక్కువగా చూసుకోవాలి, అలాగే మీ మానవత్వాన్ని ఆచరణలో పెట్టడానికీ, ఇంకా జీవాన్ని సున్నితత్వంతో నిర్వహించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవడానికీ, మీకు ఇది ఒక అవకాశం. ఎదో ఆధ్యాత్మిక లేదా దైవిక పరిష్కారం కోసం వేచి చూసే బదులు, ఈ విధమైన సున్నితత్వం ప్రజలలో సహజంగానే రావాలి.

వ్యాధులు, గాయాలు ఇంకా పుట్టుకతో వచ్చే లోపాలు-ఇవన్నీ జీవితంలోని వాస్తవికతలు. అవును మనం నిజంగానే ప్రతిఒక్కరికీ కాళ్ళు ఉండాలనుకుంటాము, కానీ ఎవరికైనా అలా లేకపోతే, అది అతనికి గొప్ప కష్టంగా మారవలసిన అవసరం లేదు. అతని జీవితం అంత కష్టమైనదిగా అవ్వకుండా చూసేందుకు, ప్రజలు ఆయనకు మద్దతు ఇవ్వవచ్చు. వ్యక్తిగత సమస్య కంటే కూడా, ఇక్కడ పరిష్కరించాల్సింది సామాజిక సమస్యని.

సమానత్వం కాదు, సమాన అవకాశం

వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు సామర్థ్యాలు ఉంటాయి. మనలో ప్రతి ఒక్కరమూ 9 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తలేము. దానర్థం మనం శారీరకంగా వికలాంగులమనా? అలా పరిగెత్తగల ఆ వ్యక్తితో పోలిస్తే, మనం వికలాంగులమే, కాదా? కాబట్టి, “వైకలవ్యం” అనేది చాలా సాపేక్ష మైనది. శారీరక ఇంకా మానసిక కార్యకలాపాలు ఎప్పుడూ కూడా వివిధ వ్యక్తులకు వివిధ ప్రమాణాలలో ఉంటాయి. కానీ సమాజం చేయగలిన ఒక విషయం ఏమిటంటే, సాధ్యమైనంతవరకు సమాన అవకాశాలను సృష్టించడం. మీరు ప్రజలందరినీ సమానంగా చేయలేరు. అలా చేయడం క్రూరత్వమే అవుతుంది. ఒక వ్యక్తికి కాలు లేకపోతే, మీరు ప్రతి ఒక్క వ్యక్తి కాలునూ తీసేస్తారా ? అది సమానత్వం అవుతుందా ? సమానత్వం ఒక మూర్ఖమైన ఆలోచన. కానీ సమాన అవకాశం అనేది ప్రతి సమాజంలో జరగవలసిన విషయం.

ఒకానొక సమయంలో చాలా మంది పోలియో బారిన పడేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు, సంస్థలు, ఇంకా ‘ప్రజల ఆరోగ్యం గురించి అవగాహన ఉన్న వ్యక్తులు’ ప్రతి బిడ్డకూ పోలియో వ్యాక్సిన్ అందేలా చూడటానికి చాలా కృషి చేస్తున్నారు. కానీ ఎవరైనా పోలియో బారిన పడితే, సమాజం అతనికి ఫలదాయకమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అవకాశాన్ని ఇవ్వాలి. ప్రజా రవాణా వాహనాలలోకి ఎక్కి దిగే విషయంలో గానీ, లేదా బహిరంగ ప్రదేశాలను వినియోగించుకునే విషయంలో గానీ, చాలా దేశాలు ఇంకా, కొద్దిగా వైకల్యం ఉన్న వ్యక్తి ఈ సమాజంలో మనగలిగేలా చూడటానికి తగిన చర్యలను తీసుకోలేదు. మనం సృష్టించిన ప్రతిదీ కూడా అతనికి దాదాపూ ఒక సవాలుగానే ఉన్నట్టు ఉంది.

మీ సామర్థ్యాన్ని ఉత్తమంగా వినియోగించుకోవడం

మీరిది అర్ధం చేసుకోవాలి. శారీరకంగా వికలాంగులు కానివారు కూడా కొన్ని అసమర్థతల వల్ల ఏదో ఒక విధంగా హేళనకి గురవుతూ ఉంటారు. మనలో ప్రతి ఒక్కరూ ప్రతిదాన్నీ ఒకే విధంగా చేయలేము. ఉదాహరణకి మీరు చాలా బాగా పాడగలరని అనుకుందాం, కాని మీరు నన్ను పాడమని అడిగితే, నేను భయంకరంగా పాడతాను, ఇక మీరు నన్ను చూసి నవ్వవచ్చు. సమాజానికి మానసిక వైకల్యం ఉంది. ఆఖరికి మీ ముక్కు కొంచం వింతగా ఉన్నా సరే, ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. ఎదో ఒక విషయంలో మీకన్నా ఉన్నతులమని అనుకునే వారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఇతరులు దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి హేళన చేస్తున్నారు అనుకునే బదులు, మీకు ఉన్న దాన్ని ఉత్తమంగా వినియోగించుకోవడం ఎలాగో మీరు చూడాలి. మీకున్న దానితో మీరు మరేదైనా చేయవచ్చు, అలాగే అది మీకు మరింత ఆనందాన్ని కలిగించవచ్చు.

మీలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే విషయం గురించి ఒక శాస్త్రమే ఉంది. ఇతరులు ఏమంటున్నా సరే, మీ శరీరంలో, మనస్సులో ఇంకా భావోద్వేగాలలో మీరు శాంతిగా ఎలా ఉండాలి అనే దాని గురించి శాస్త్రమే ఉంది. దాన్నే మనం “యోగా” అని పిలుస్తాము. ఇది, మీరు మీ గుర్తింపును నిర్వహించుకోగలిగేలా చేసే ఒక టెక్నిక్. “మీరు” ఇకపై సమస్య అవ్వరు; సమస్యలు అన్ని బయటవే అవుతాయి. బయటి సమస్యలను మనము, మనమున్న పరిస్థితులని బట్టి, మనకున్న సామర్థ్యం మేరకు మాత్రమే నిర్వహించగలుగుతాము. కానీ మీరే ఒక సమస్య అయితే, బయట మీరు చేయగలిగేది కూడా మీరు చేయరు. ఒక మనిషి తాను చేయలేనిది అతను చేయకపోతే, అది పరవాలేదు, కానీ తాను చేయగలిగినది తను చేయకపోతే, అప్పుడు అతని జీవితం ఒక విషాదమే అవుతుంది. అలా జరగకూడదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor’s Note: Check out the “5-minute Yoga Tools for Transformation” – simple Isha Upa-Yoga practices for joy, peace, wellbeing, success and more. You can also download the app for android and iOS.

A version of this article was originally published in The Week.

www.theweek.in/columns/sadhguru/disability-should-not-take-away-inner-joy.html