దైవాన్ని తమ అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒక సులువైన మార్గం సంపూర్ణంగా శ్రమించడమే అని, నిష్కర్మను తెలుసుకోవాలంటే ముందు కర్మ చేయడం తెలియాలని, ఆ స్థితిలోనే దైవం నిజంగా అనుభవంలోకి వస్తుందని సద్గురు చెబుతున్నారు.

తార్కికంగా చూసినప్పుడు, తన జీవితంలో ఎన్నడూ శ్రమించనివాడికి శ్రమలేకుండా ఉండడమంటే ఏంటో తెలిసి ఉండాలి. కానీ అది నిజం కాదు. మీకు శ్రమ లేకపోవడం ఏమిటో తెలియాలంటే, ముందు శ్రమించడం తెలియాలి. మీరు మీ ప్రయత్నంలో అత్యున్నత స్థాయిలో శ్రమించినప్పుడు, మీకు సునాయాసంగా ఒక పనిని చేయడం తెలుస్తుంది. పని చెయ్యడం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తికి, విశ్రాంతి అంటే ఏమిటో అర్థం అవుతుంది. వైరుధ్యమేమిటంటే, ఎప్పుడూ విశ్రాంతి తీసుకునే వారికి, విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. వాళ్ళు సోమరితనంలోకీ, జడత్వంలోకీ జారుకుంటారు.  జీవితం పనిచేస్తున్న తీరు అదే.

రష్యాకు చెందిన బాలే డాన్సరు 'నిజిన్స్కీ' కి అతని జీవితం అంతా నృత్యమే. మానవులకి అసాధ్యమనిపించేలా అతను ఎగిరి విన్యాసాలు చేసిన కొన్ని క్షణాలున్నాయి. ఒకవేళ ఒక వ్యక్తి కండరాలు వాటి అత్యుత్తమ ప్రదర్శన చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాయనుకున్నా, ఒక మనిషి ఎగరగల ఎత్తుకి కొన్ని హద్దులున్నాయి. కాని ఆ క్షణాల్లో ఇతను ఆ పరిమితులను కూడా దాటగలడనిపిస్తుంది. ప్రేక్షకులు తరచూ ఇతడిని: "మీరిలా ఎలా చెయ్యగలిగారు?" అని అడిగేవారు. దానికతను: "నేనా విన్యాసాన్ని ఎన్నడూ చెయ్యలేను. అక్కడ నిజిన్స్కీ లేనప్పుడే అది జరుగుతుంది." అని వినయంగా   సమాధానం చెప్పేవాడు.

మీరు ఎన్నడైతే మీ పూర్తి సామర్ధ్యంతో పనిచేసి, అత్యున్నత శ్రమను తట్టుకుని నిలబడగలరో, అప్పుడు మీరీస్థితికి చేరుకుంటారు.

ఒక వ్యక్తి నిరంతరం తన 100 శాతం సమర్థతని ప్రదర్శిస్తుంటే, ఏదో ఒకనాడు అతను ఆ పనిని అవలీలగా చేయగలిగిన స్థితి వస్తుంది. అవలీలగా చేయడం అంటే, మందకొడిగా తయారవడం కాదు. దానర్థం భౌతిక చర్య అవసరంలేని నైపుణ్య స్థితి. మీరు ఎన్నడైతే మీ పూర్తి సామర్ధ్యంతో పనిచేసి, అత్యున్నత శ్రమను తట్టుకుని నిలబడగలరో, అప్పుడు మీరీస్థితికి చేరుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఆధ్యాత్మిక వికాసానికి "జెన్" అనుసరిస్తానని అనడం వింటున్నాం. ఎందుకంటే అందులో వాళ్ళు ఏమీ చేయనవసరం లేదు అని అనుకుంటున్నారు. నిజానికి, జెన్ లో చాలా ఎక్కువ పరిశ్రమ చెయ్యాలి. ఎందుకంటే, అది జీవితం నుండి ఏ విధంగానూ దూరంగా పారిపోవడం లేదు. ఒక జెన్ సన్యాసికి జెన్ తోటలో గులకరాళ్లు ఒక క్రమంలో పేర్చడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. ఆ పని చేయడంలో నిమగ్నమై, మీరు నిష్క్రియ స్థితికి చేరుకోవచ్చు. ఆ స్థితికి రావడానికి కారణం, మీరు ‘నేను చేస్తున్నాను’ అనే అనుభూతిని అధిగమించడమే. ఆ స్థితిలోనే మీకు ఆ అతీత స్థితి ఏమిటో అనుభవంలోకి వచ్చేది.

మీరు ఆ స్థితిని నిజిన్స్కీ, మరికొందరిలా, ఉన్నతస్థాయి పరిశ్రమ చెయ్యడం ద్వారా అందుకోగలిగితే, ఆ క్షణాలు మీకు ఇంద్రజాలంలా ఎంతో మధురానుభూతిని కలిగిస్తాయి. కాని మీరు ఆ స్థితిని క్రియ లేని తీవ్రత ద్వారా చేరుకుంటే, అది ఒక యోగ ముద్ర అవుతుంది.  ఆ స్థితిని మీరు ఎక్కువ కాలం నిలుపుకోగలరు.

ధ్యానం యొక్క పరమావధి మిమ్మల్ని తీవ్రమైన పరిశ్రమ ద్వారా అటువంటి చైతన్య స్థితికి తీసుకువెళ్ళడం. కొంతకాలం తరువాత, మీరు ఏ ప్రయత్నమూ చెయవలసిన పనిలేదు. అప్పుడు ధ్యానం ఒక క్రియగా కాకుండా మీరప్పటికే అందుకోగలిగిన చైతన్య స్థితికి సహజ పరిణామం అవుతుంది.  మీరు కేవలం ఆ స్థితిలో ఉంటారు.  ఇటువంటి ఏ నిర్బంధం లేని అస్తిత్వ క్షణాల్లోనే, ఒక వ్యక్తి సృష్టిలో భాగంగా వికసించడానికి అనువైన అవకాశాలు  సృష్టించబడతాయి.

మనం వ్యక్తులుగా, సమాజాలుగా, అటువంటి వికాసానికి తగిన వాతావరణం కల్పించకుండా కాలాన్ని దొర్లిపోనిస్తే, మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకున్నట్టే. స్వర్గం, అక్కడి సుఖాలు అనే చిన్నపిల్లల మాటలు ఎందుకు అంత ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయంటే,  ఒక మనిషిగా ఉండడంలోని మహత్వాన్ని పూర్తిగా శోధించకపోవడం వల్లనే. మీ మానవత్వం పెల్లుబికినపుడు, దైవత్వం దానంతట అదే అనుసరిస్తుంది. మీకు సేవ చేస్తుంది.  దానికి మరో గతిలేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు