సద్గురు: సాధన చేసే దీక్షా సమయంలో, ఏవేవో ఏర్పాట్లన్నీ ఉండాలని మీరు కోరవలసిన సమయం కాదు అది. దీక్షా సమయం అంటే వినయంగా మెలగవలసిన సమయం. ఈ భూమి మీద ఉన్న ఎన్నో కోట్ల ప్రాణుల్లో మీరూ ఒకరు అన్న భావనతో గడపవలసిన సమయం ఇది. యదార్థం కూడా అంతే గదా! మీ ఆలోచనలేవో మీకుండచ్చు, కానీ యథార్థం ఏమిటంటే, ఈ భూగోళంలో ఉన్న ఎన్నో కోట్ల ప్రాణుల్లో మీరొకరు! ఎన్నో ప్రాణులలో ఒక ప్రాణిగా ఉండటంలో ఏదో తక్కువతనం ఉందనుకోనక్కర్లేదు. అలా ఉండటమే గొప్ప వరం. మీరు అలా కాదు అనుకొంటూ ఉన్నారంటే అదొక మానసిక వైకల్య స్థితి కిందికి వస్తుంది. ఈ భూమి మీద ఉన్న ఎన్నో జీవులలో మీరు ఒకరు అన్నది యదార్థం. మీరు ఈ భూగోళం మీది ప్రాణుల్లో ఒకానొక జీవి అంటే సృష్టి కర్త స్పర్శనా భాగ్యం మీకు కలిగినట్టు. అలా కాక మీరేదో ప్రత్యేకం అనుకొనే మానసిక స్థితిలో మీరున్నారంటే అది మీ మూర్ఖత్వం. మీరు ఒక చీమ కావచ్చు, దోమ కావచ్చు, బొద్దింక కావచ్చు, మనిషి కావచ్చు. ఈ భూమి మీద ప్రాణి అంటూ అయితే, సృష్టికర్త మిమ్మల్ని స్పృశించినట్టే. అదే అతి గొప్ప భాగ్యం. మీదొక విపరీత మానసిక స్థితి అయితే మాత్రం, అది మీ మూర్ఖత్వం!

సాధనలు చేసే దీక్షా సమయం, ఏవేవో ఏర్పాట్లన్నీ ఉండాలని మీరు కోరవలసిన సమయం కాదు అది. దీక్షా సమయం అంటే వినయంగా మెలగవలసిన సమయం.

ఈ దీక్షా సమయం మీరు పలువురిలో ఒకరు మాత్రమేననీ, అంతకంటే మరేదో ప్రత్యేకం కాదనీ గ్రహించవలసిన సమయం. ఈ సాధనంతా ఈ విషయం మీ మనసులో మరింత లోతుగా నాటుకొనేందుకే. సజీవమైన ప్రాణికి మాత్రమే పరిణామం సాధ్యం. మానసిక వైపరీత్యాలున్న వారికి జరిగేది తిరోగమనం మాత్రమే. మనో వికలుడికి వికాసమంటే పూర్తిగా మానసిక రోగిగా మారటం! సజీవ ప్రాణికి వికాసం అంటే పురోగతే. దానిని ఆపగలిగేది లేదు. అది ఎలాగూ వికసిస్తుంది. ఆ వికాసాన్ని మరింత వేగవంతం చేయాలనీ, త్వరిత పరచాలనీ మాత్రమే మనం ప్రయత్నిస్తున్నాం. మరీ 'డార్విన్ చెప్పినంత నిదానంగా కాకుండా, జీవ పరిణామాన్ని గురించి డార్విన్ కట్టిన అంచనాల కంటే కొంత వేగంగా పురోగమించాలని మన కోరిక.

ఈ శివాంగ సాధన ఈ విధంగా తీర్చిదిద్దబడింది, దాన్లో ఎన్నో కోణాలున్నాయి. వాటిలో ఒకటి, శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవటం. చాలా కుటుంబాలలో స్త్రీలు ఎలాగూ అధిక శరీర శ్రమకు గురవుతూనే ఉన్నారు కనక, స్త్రీలకు మనం శారీరక వ్యాయామం ఏదీ కల్పించటం లేదు. ఈ సాధన దీక్షలోకి వచ్చే వారు 'శివ నమస్కారం' అనే ఒక సులభమైన ప్రక్రియను ఆచరిస్తారు. 

మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ నెమ్మది లేని శరీరం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడదు.

ఈ దీక్షలో మరొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. మీరు బయటికి వెళ్లి కనీసం ఇరవై ఒక్క మందిని భిక్షం అడగాలి. వాళ్ళు మీకేదయినా భిక్ష వేస్తే, వాళ్లిచ్చేదేమిటో మీరు చూడకూడదు. వాళ్ళు ఒక పావలా కాసు ఇస్తున్నా సరే, మీరు చేయి చాచి, వినయపూర్వకంగా వారి ముఖంలోకి చూడాలి. వారు భిక్ష వేసేటప్పుడు మీరు కళ్ళు మూసుకోవాలి. వాళ్ళు ఏమి ఇస్తున్నదీ మీరు చూడకూడదు.

భిక్ష స్వీకరించటం నేర్చుకోవాలి. ఒక్క రూపాయయినా పది లక్షల రూపాయలైనా సమాన భావంతోనే స్వీకరించాలి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఏమి ఇస్తున్నారో చూసుకోక తప్పదు, ఎందుకంటే మీరు ఇచ్చేది మీరు ఇవ్వగలిగిన దానికంటే ఎలాగూ తక్కువే ఉంటుంది. కానీ పుచ్చుకొనేటప్పుడు మాత్రం మీరు కళ్ళు మూసుకోవాలి. ఇచ్చే వారు ఏమి ఇచ్చినా, ఒక రూపాయి గానీ ఒక లక్ష రూపాయలు గానీ, సమానమైన కృతజ్ఞతా భావంతో స్వీకరించాలి. ఇవ్వటం, పుచ్చుకోవటం కేవలం ఒక లావాదేవీ లాగానే ఉండవచ్చు. లేదా, ఒక సంయోజన ప్రక్రియ (inclusion) గానూ భావించచ్చు. ఒకరు మీకు ఇచ్చేదీ పుచ్చుకొనేదీ ఏదైనా, దాన్ని ఒక సమష్టి కార్యంలో  పాలు పంచుకొనే ప్రక్రియగా కూడా భావించచ్చు. అది అంతకంటే కూడా ఎక్కువ కావచ్చు. మీ అహానికున్న హద్దులను తుడిపివేసే ప్రక్రియ కావచ్చు!

అవతలివాడు ఒక పైసా ఇచ్చినా, కోటి రూపాయలే ఇచ్చినా, ఆ ఒక పైసా పుచ్చుకొనేందుకు కూడా, మీరు మీదయినదేదో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సాధన ఇందు కోసం! మీ దర్పం, మీ అహంకారం, మీ గురించి మీకున్న భావనా ఇవన్నీ పక్కన పెట్టేయాలి. వెళ్ళి, చొక్కా కూడా లేకుండా, యాచించటమే. చొక్కా వేసుకొంటే మళ్ళీ 'గొప్ప' వాళ్ళయిపోతారు, కనక చొక్కా లేకుండానే యాచించాలి! కనీసం ఇరవయ్యొక్క మందిని! మీరు కావాలనుకొంటే రెండు వందల మందిని కూడా యాచించచ్చు. కనిష్ఠంగా, ఇరవయ్యొక్క మంది దగ్గరకన్నా వెళ్ళి, ఏదో ఒక భిక్ష వేయమని అర్థించాలి. అలా మీరు బిచ్చమెత్తి సంపాదించినదంతా, ఇక్కడికి మహాశివరాత్రి నాడు గానీ, భక్తులు ఎక్కువగా వచ్చే మరే ఇతర పర్వదినాలలో కానీ, వచ్చిపోయే వేలాదిమంది ప్రజల అన్న సంతర్పణకు వాడవచ్చు.

ఎవరి దగ్గరకైనా, అత్యంత వినయ భావంతో, చొక్కాకూడా లేకుండా, వెళ్ళి 'అయ్యా, మీ దయ...' అని బిచ్చం అడగండి. అడిగి చూడండి, అది ఎంత మార్పును తెస్తుందో. అక్కడేమి జరిగినా, శరీరం నిశ్చలంగా అవుతుంది. ఆ నిదానం, నెమ్మది చాలా 'ముఖ్యం'. ఆ నెమ్మది' అనుభవంలోకి రాకపోతే ఏమవుతుంది? మీరు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ నెమ్మది లేని శరీరం మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడదు. నెమ్మది లేనిది పట్టుకుని ఉంటుంది. 'నేను శరీరాన్ని కాదూ, నేను శరీరాన్ని కాదూ, నేను శరీరాన్ని కాదూ ' అని మీరు ఎంతగా మొత్తుకొన్నా, శరీరం వినిపించుకోదు. మిమ్మల్ని విడవదు. అది నెమ్మదిగా ఉండాలి. అప్పుడే, 'నేను శరీరాన్ని కాదు' అని మీరు అంటే, అది కూడా 'నిజమే, నువ్వు శరీరానివి కాదు!' అని ఒప్పుకొంటుంది. అది అలా ఒప్పుకొనేదాకా, మీకు బయటపడే మార్గం ఉండదు.

అందుకే ఈ నెమ్మది స్థితిని పొందటం చాలా, చాలా ముఖ్యం. మహా శివరాత్రి దాకా ఉన్న ఈ కాలం, భౌతిక శక్తుల పరంగా కానీ, భూగోళం ప్రస్తుతం ఉన్న స్థానం దృష్ట్యా గానీ, మీరు చేస్తున్న సాధన దృష్ట్యా కానీ, చాలా కీలకమైన సమయం. మనసును బాగా లగ్నం చేసి, సాధన చేస్తే, అది తగిన ప్రభావం చూపి, ఇవ్వవలసిన సత్ఫలితాలను ఇస్తుంది. 

సంపాదకుని సూచన: నలభై రెండు రోజుల ఈ వ్రత దీక్ష స్వీకరించేందుకు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాలలో ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి... మరిన్ని వివరాలకు :+91 8300015111 or ఈ-మెయిల్ shivanga@southkailash.org .చూడండి : www.shivanga.org.