సద్గురు: ఒక యువ వైద్యుడు ఉండే వాడు. ఒక రోగికి, ఏ వ్యాధి వచ్చిందో అతనికి అంతు చిక్కలేదు. దానితో, అతనికి తెలిసిన, ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడి దగ్గరకి సలహా కోసం వెళ్ళాడు. ఆ అనుభవజ్ఞుడు, “ఓహో నరాలలో సమస్యా, వాంతులు ఔతున్నాయా?” “ఔను” అని యువ వైద్యుడు సమాధానం ఇచ్చాడు, “కానీ అలా జరగడానికి వైద్య పరమైన ఎలాంటి కారణమూ లేదు” అని అతను మళ్ళీ అన్నాడు. అప్పుడు ఆ అనుభవజ్ఞుడు, “ఒక పని చెయ్యి. అతడు గోల్ఫ్ ఆడుతున్నాడేమో కనుక్కో. ఆ ఆట ఆడక పొతే ఆడమని చెప్పు. ఆడుతూ ఉంటే ఆపెయ్యమని చెప్పు. అతను బాగైపోతాడు.” ఆరోగ్యం అంటే అలా ఉంటుంది మరి!

ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే శరీరంతో బాగా పని చెయ్యాలి. ఎంత పని చేస్తే ఆరోగ్యం అంతగా మెరుగౌతుంది.

ఎక్కువ పనితో అలసిపోయి కొందరు ఆరోగ్యం పాడు చేసుకుంటారు. కానీ తగినంత పని చెయ్యక పోవడం మూలాన చాలా మంది ఆరోగ్యం దెబ్బ తింటుంది. మీరు ఓ 200 ఏళ్ల క్రితం జీవించి ఉంటే, మీరు ఇప్పుడు చేస్తున్న శారీరిక కార్యకలాపాల కంటే 20 రెట్లు ఎక్కువ చేసి ఉండే వారు. ఎక్కడకైనా నడిచే వెళ్ళేవారు. ప్రతి పనీ, మీరు చేతులతోనే చెయ్యవలసి వచ్చేది. అంత శారీరక శ్రమ చేస్తుంటే నేను మిమ్మల్ని కొంచెం విశ్రాంతి తీసుకోమని చెప్పేవాడిని. కానీ ఈ రోజులలో దాదాపు అందరూ, శరీరంతో అంత పని చెయ్యటం లేదు. భౌతికంగా చేస్తున్న పని చూస్తే, ఈ రోజులలో చాలా మంది 20 ఏళ్ల వయసు వారు, 100 ఏళ్ల క్రితం 60 ఏళ్ల మనిషి చేసే పని కూడా చెయ్యలేడు! అంటే మానవ జాతి క్రమంగా బలహీనం అవుతోందన్న మాట! ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే శరీరంతో బాగా పని చెయ్యాలి. ఎంత పని చేస్తే ఆరోగ్యం అంతగా మెరుగౌతుంది.

వాక్ - కింగ్స్!

చాలా ఏళ్ల క్రితం నేను కొంతమందిని తీసుకుని పడమటి కనుమలలో నడవటానికి (trekking) వెళ్ళాను. అది హసన్-మంగళూరు ప్రాంతం. నేను ఆ ప్రాంతాలలో ఎంతో విస్తృతంగా తిరిగాను కాబట్టి, వాటి ఆకర్షణ, అందం, శోభ నాకు బాగా తెలుసు. అవి మనలను మంత్రం ముగ్ధుల్ని చేస్తాయి. ఆ ప్రాంతాలు వన్య ప్రాణులతోనూ, దట్టమైన వృక్షకోటితోనూ నిండి ఉంటాయి. అందుకు కొన్ని వారాల కిందటే బెంగుళూరుకి వెళ్తున్న ఒక నౌకాదళ హెలికాప్టర్, ఆ అడవులలోనే ఎక్కడో చెట్లతో ఢీకొట్టి కూలి పోయింది. అన్వేషణ బృందాలు ఆకాశం నించి హెలి కాప్టర్లతో ఎంతో వెతికారు – కానీ అది ఎక్కడా కనబడలేదు. అప్పుడు ఇక 200 మంది పదాతి దళాన్ని తెచ్చి, ఆ ప్రదేశం అంతా క్షుణ్ణంగా కొన్ని వారాల పాటు వెతికినా హెలి కాప్టర్ ఎక్కడా కనబడలేదు. చెట్లు అంత దట్టంగా ఉన్నయ్యన్న మాట!

ఆరోగ్యంగా ఉండటానికి అతి సరళమైన ఉపాయం ఏమిటంటే, మీ శరీరాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం. మీరు అలా శరీరాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే, మీ ఆరోగ్యం దానంతట అదే అద్భుతంగా ఉంటుంది.

దాదాపు 35-40 మందిమి ఆ దారిలో నడుస్తున్నాము. ధారాపాతంగా కురుస్తున్న ఆ వర్షంలో, వండుకోటానికి మాకు ఏ వసతులు లేవు. రోజంతా నడిచి నడిచి అలిసి పోయి ఉన్నాము. మా అదృష్టం కొద్దీ మాకు ఒక మిలిటరీ క్యాంపు కనిపించింది. ఆ ఆహారం వాసన మా ముక్కుపుటాలకి తగలగానే పిలవని అతిధులుగా మేమే లోపలికి వెళ్ళాము. భౌతికంగా అంత శ్రమిస్తే కానీ మీకు ఆహారం యొక్క అసలు విలువ తెలియదు. అక్కడ ఉన్న ముఖ్య సేనాధికారి చాలా ఉదార స్వభావం కలవాడు. మమ్మల్ని చూసి చాలా సంతోషించి మమ్మల్ని లోపలికి హృదయ పూర్వకంగా ఆహ్వానించాడు.

అక్కడ ఉన్న ఒక సార్జెంట్ మేము ఎందుకు నడుస్తున్నామని అడిగాడు. మాకు నడవటం ఇష్టం కాబట్టి నడుస్తున్నాము అని బదులిచ్చాము. అతను నమ్మలేక పోయాడు! “నిజంగానే మీరు వూరకే నడుస్తున్నారా?” అని ప్రశ్నించాడు, ఆశ్చర్యపోతూ. “మేము ఇక్కడ ఎన్నో వారాలనుండి నడుస్తున్నాము. ఎప్పుడు ఈ ముదరష్టపు పని అవుతుందా అని ఎదురు చూస్తున్నాము. ఆ బోడి హెలికాప్టర్ కోసం వెతుకుతూ ప్రతి రోజూ మేము 20-30 కిలోమీటర్లు నడవాలి. అది కనబడి చావటం లేదు. మీరేమో ఊరికే జాలీగా తిరగటం కోసం నడుస్తున్నామంటున్నారు – ఇది నమ్మ శక్యంగా లేదు!” “నిజంగానే ఎవరన్నా సరదా కోసం కాళ్ళు బొబ్బలెక్కినా నడుస్తున్నారంటే నమ్మబుద్ధి కావటం లేదు.” ఈ బలవంతపు భౌతిక శ్రమ మూలంగా, అతను ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాడన్నది అతనికి తెలియటం లేదు.

జీవం పూర్తిగా అభివ్యక్తమవ్వనివ్వు

ఆరోగ్యంగా ఉండటానికి అతి సరళమైన ఉపాయం ఏమిటంటే, మీ శరీరాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. మీరు అలా శరీరాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే, మీ ఆరోగ్యం దానంతట అదే అద్భుతంగా ఉంటుంది. మన శరీరాలని భౌతికంగా ఎంత ఉపయోగించాలో మనం దానిని అంతగా ఉపయోగిస్తే, నా అంచనా ప్రకారం ఈ భూమి మీద 80 శాతం రోగాలు మాయమైపోతాయి. ఇహ మిగతా 20% లో ఒక 10% మనం తినే తిండి వల్ల వస్తాయి. అంటే, మీ ఆహారం పౌష్టికరంగా ఉంటే ఇంకో 10% రోగాలు మాయమైపోతాయి. ఇహ 10% శాతం మాత్రమే మిగులుతాయి. వీటికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. ఒకటి మీ పూర్వ జన్మ కర్మల వల్ల కావచ్చు. ఇంకొకటి వాతావరణం వల్ల కావచ్చు. లేదా మీ శరీర భాగాలలో ఏదైనా సమస్య ఉండవచ్చు – దానికి సరైన చికిత్స చెయ్యవచ్చు. కాబట్టి రోగులలో 90% శరీరాన్ని పూర్తిగా ఉపయోగించటం ద్వారానూ, పౌష్టిక ఆహరం ద్వారానూ ఆరోగ్యవంతులైతే, మిగతా 10% వ్యాధులను, మనం తేలికగా సంబాళించుకోవచ్చు. కానీ ఇప్పుడు తిండి సరిగ్గా తినక పోవటం వల్ల కానీ, సరైన తిండి తినక పోవటం వల్ల కానీ, శరీరం సరిగ్గా ఉపయోగించక పోవటం మూలాన కానీ, రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

మీరు మీ శరీరాన్ని, మీ బుర్రనీ, మీ జీవ శక్తులనీ ఉపయోగిస్తే చాలు. ఈ మూడు విభాగాలు సమతుల్యంగా శ్రమిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

తామే ఆరోగ్యాన్ని కనిపెట్టినట్లూ, తమంత తామే ఆరోగ్యంగా ఉండగలమనీ మనుషులు అనుకుంటున్నారు. ఆరోగ్యం అన్నది మీరు కనిపెట్టలేదు. అసలు దాని గురించి మీకు అవగాహానే లేదు. మీ జీవన ప్రక్రియలు సరిగ్గా జరుగుతున్నాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు. జీవశక్తిని పూర్తిగా అభివ్యక్తమయ్యేలా చేస్తే, మీరు ఆరోగ్యంగా ఉంటారు.

కాబట్టి మీరు మీ శరీరాన్ని, మీ బుర్రనీ, మీ జీవ శక్తులనీ ఉపయోగిస్తే చాలు. ఈ మూడు విభాగాలు సమతుల్యంగా శ్రమిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం. ఇది చాలా రోజుల కిందట – రెండవ, మూడవ భావ స్పందన ప్రోగ్రాములో జరిగింది. నేను ఈ ప్రోగ్రామును ఒక కుగ్రామంలో ఏర్పాటు చేశాను. ప్రతి దానికీ, నేను మెట్లు ఎక్కటం దిగటం చేయవలసి వచ్చేది. ఆ ప్రదేశం అలా ఉంది మరి. ఒక రోజు ప్రోగ్రామునీ, వంట గదినీ రెండూ నేను చూసుకోవాల్సి వచ్చింది. నేను కనీసం 125 సార్లు మెట్లు ఎక్కి దిగి ఉంటాను! కానీ ప్రోగ్రాం పూర్తి అయిన తర్వాత ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది.

మీరు అకస్మాత్తుగా, ఏదో ఒక రోజున విపరీతమైన వ్యాయామం చేస్తే జబ్బు పడవచ్చు. కానీ మీరు– భౌతిక, మానసిక మరియు జీవశక్తి – ఈ మూడు ప్రక్రియలనూ, మీ జీవితంలో క్రమేపీ పెంచుకుంటూ పొతే, వేరే ఏ ప్రయత్నాలు లేకుండానే మీకు ఆరోగ్యం సమకూరుతుంది. మీ శరీరం బ్రహ్మాండంగా పని చేస్తోంది, మీ మనసు అద్భుతంగా పని చేస్తోంది. మీ జీవశక్తి ఆ రెండింటికీ ఆలంబనంగా ఉన్నది అంటే అదే ఆరోగ్యం. జీవిత శక్తి పూర్తి ఉత్సాహభరితంగా ఉంటే అదే ఆరోగ్యం!

ప్రేమాశీస్సులతో,

సద్గురు