సద్గురు: భారతదేశంలో “సమాధి” అంటే సామాన్య వ్యావహారికంలో చనిపోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించే గోరీ అనే అర్థం వస్తుంది. ఎవరిదయినా మృత శరీరాన్ని ఒకచోట పాతి పెట్టినప్పుడు, ఆ ప్రదేశం మీద స్మారక చిహ్నం లాంటి కట్టడమేదైనా కడితే, దాన్ని ‘సమాధి’ అని చెప్పుకుంటారు. కానీ “సమాధి” అనే పదానికి మరో అర్థం కూడా ఉంది. మానవ చైతన్యం చేరుకోగల అత్యున్నత స్థితిని కూడా సమాధి అంటారు.   

ఎవరైనా చనిపోతే, వారిని ఖననం చేసిన ప్రదేశానికి ఆ వ్యక్తి పేరు పెట్టుకుంటారు. కానీ, ఎవరైనా, ఒక ప్రదేశంలో పైన చెప్పిన అత్యున్నత చైతన్య స్థితిని చేరుకుంటే, ఆ స్థలం పేరుతో ఆ వ్యక్తిని సంబోధిస్తారు. అందుకే, చాలా మంది యోగులను కొన్ని ప్రదేశాల పేర్లతో ప్రస్తావించడం మీరు గమనించి ఉంటారు. ‘పళని స్వామి’ వారికి ఆ పేరు అలాగే వచ్చింది. ఆయన సమాధి స్థితి అనుభవాన్ని పొందింది పళని అనే ఊళ్ళో. ఆయనను అందరూ పళని స్వామి అనే పిలిచేవారు. ఆయన తనను తాను ఎప్పుడూ, ఏ పేరుతోనూ ఎవరికీ పరిచయం చేసుకోలేదు. ఎందుకంటే ఆయన పేరుతో గుర్తింపు పెట్టుకోలేదు. ఆయన పళనిలో ఆత్మజ్ఞానం పొందారు కనుక ప్రజలు ఆయనను ‘పళని స్వామి’ అన్నారు. ఎందరో యోగులకు సాధువులకు ఇలాంటి పేర్లే ఉన్నాయి.

సమాధి అంటే ఏమిటి ? Samadhi meaning in Telugu

సమాధి అనే పదం చాలావరకు అపార్థం చేసుకోబడింది. సమాధి అంటే ఏదో మృత్యు సంబంధమైనది అని ప్రజలు అనుకుంటారు. అక్షరాలా సమాధి అంటే – “సమ” అంటే సమ స్థితి, “ధి” అంటే బుద్ధి (Intellect). సమస్థితిలో మీ బుద్ధి ఉన్న స్థితికి మీరు చేరుకుంటే, అది సమాధి స్థితి.

సమాధి అనే పదం ‘సమ’, ‘ధి’ అన్న రెండు పదాల కలయిక. ‘సమ’ అంటే సమ స్థితి, ‘ధి’ అంటే బుద్ధి (intellect).సమ స్థితిలో మీ బుద్ధి ఉన్న స్థితికి మీరు చేరుకుంటే, అది ‘సమాధి’.

ప్రాధమికంగా బుద్ధి స్వభావం విచక్షణ చూపడం – మీ బుద్ధి పనిచేస్తుంది కాబట్టే ఇది ఒక వ్యక్తి, అది ఒక చెట్టు అన్న విచక్షణతో ఉండడం సాధ్యపడుతోంది. మనుగడ సాగించేందుకు ఈ విచక్షణ కలిగి ఉండడం అనేది ఎంతో కీలకం. మీరు ఒక రాయిని పగులగొట్టాలి అంటే, అది రాయి, ఇది మీ వేలు అనే విచక్షణ మీకు ఉండాలి. లేదంటే, మీ వ్రేలు చితికిపోవడం ఖాయం. విచక్షణ అనేది ఒక సాధనం. అది శరీరంలోని ప్రతీ కణంలోనూ నిండిన మనుగడ ప్రవృత్తికి సహకరిస్తూ, దానిని నిర్వర్తిస్తుంది.

బుద్ధిని అధిగమిస్తే మీరు సమస్థితిని చేరుకుంటారు. అంటే దానర్థం మీకు ఉండే విచక్షణా సామర్థ్యాన్ని కోల్పోతారు అని కాదు. బుద్ధి పూర్వకమైన విచక్షణను కోల్పోతే మీరు అవివేకిగా మారుతారు. సమాధి స్థితిలో, మీ విచక్షణ కలిగిన బుద్ధి పని చేస్తూనే ఉంటుంది. కానీ అదే సమయంలో మీరు ఆ బుద్ధిని అధిగమిస్టారు. మీరు వాటి మధ్య అంతరాలను చూడట్లేదు – మీరు ఉన్న చోటే ఉండి, జీవం నిజంగా(యదార్థంలో) ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు. మీరు మీ బుద్ధిని అధిగమించిన క్షణమే, విచక్షణ అనేది ఉండదు.

అంతా ఒక్కటిగా ఉంటుంది – నిజానికి అది ఉన్నది ఇలానే. ఈ స్థితిలో విశ్వంతో మమేకమైన అనుభవం మీకు కలుగుతుంది. సమస్తమూ ఐక్యమైన స్థితి అది.

మొత్తంగా ఆధ్యాత్మికత అనేది జీవం భౌతికతకు మాత్రమే ఉద్దేశింపబడిన ఈ విచక్షణ ఇంకా మనుగడ ప్రవృత్తులను అధిగమించడానికే. సమాధి అనేది ఒక సమస్థితిని చేరడం. ఈ స్థితిలో బుద్ధి, దాని సహజమైన విచక్షణ స్వభావాన్ని అధిగమించి, భౌతిక శరీరం నుండి మిమ్మల్ని వదులుగా చేస్తుంది. మీకూ, మీ శరీరానికి మధ్య అంతరం ఏర్పడుతుంది.

ఈ స్థితిలో దేశకాలాలు ఉండవు. దేశ కాలాలు మీ మనసులో మీరు కల్పించుకున్నవి. ఒక్కసారి మీ మానసిక పరిమితులను దాటితే, దేశ కాలాలు మీ అనుభూతిలో ఉండవు. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది, ఇప్పుడు ఉన్నది అప్పుడు ఉంటుంది. మీకు భూతభవిష్యత్తులు ఉండవు. సమస్తమూ ఇక్కడే, ఈ క్షణంలోనే. ఎవరో ఓ మూడు రోజులపాటు సమాధి స్థితిలోనే ఉండిపోయారని మీకు అనిపించవచ్చు, కానీ వారికి అది కొద్ది క్షణాలే - సమయం ఇట్టే గడిచి పోతుంది. ‘ఏది ఉన్నదో అదీ’, ‘ఏది లేదో అదీ’ అనే ద్వైత్వానికి వారు అతీతులైయ్యారు. వారి పరిమితుల్ని దాటి , ‘ఏది లేదో ‘ దేనికైతే రూపమూ, ఆకారమూ, గుణాలూ, లక్షణాలూ ఏవీ లేవో, - శూన్యం – వారి అనుభవంలోకి వచ్చాయి.

ఈ అస్తిత్వం, సృష్టిలోని అనేక రూపాలు ఉండేది, ‘బుద్ధి’ (intellect) అనేది ఉన్నంత సేపే. మీరు మీ బుద్ధిని లయం చేసిన క్షణమే, అంతా ఒక్కటిగా లీనమైపోతుంది.

ఏది లేదో అది

అస్తిత్వం ఎలా చేయబడిందంటే, ‘ఏదైతే ఉన్నదో’ ఇంకా ‘ఏదైతే లేదో’ – ఆ రెండిటితోను. ‘ఏది ఉన్నదో దాని' కి రూపమూ ఆకారమూ, గుణాలూ, సౌందర్యం - ఇవన్నీ ఉంటాయి. ‘ఏది లేదో దాని'కి ఇవేవీ ఉండవు, కానీ అది స్వేచ్ఛ కలిగింది.

అప్పుడప్పుడూ ‘ఏది లేదో అది’, ‘ఏది ఉన్నదో దాని' లో నుంచి తోసుకొని ఉబికి వస్తుంది. దాంతో, ‘ఏది ఉన్నదో అది’ మరింత ఉన్నత స్థాయి చేతనత్వాన్ని (consciousness) పొంది, తను కూడా ‘ఏది లేదో దాని' లాగా అయిపోవాలి అని తపించటం ఆరంభిస్తుంది. ‘ఏది ఉన్నదో దాని’ కి ఉండే రూపమూ, గుణాలూ, లక్షణాలూ, సౌందర్యం - వీటన్నిటిని ఒకరు ఆస్వాదిస్తున్నప్పటికీ, ఇలాంటివేవీ స్పృశించని, సంపూర్ణ స్వేచ్ఛామయమైన స్థితి కోసం తపన కలగటం తప్పనిసరి. కాలంతో ఈ తపన కలగక మానదు, అసలు ఈ ‘కాలమూ’, ‘దేశమూ’ అనే బంధాలకు బానిసగా ఉండటం, ‘ఏది ఉన్నదో దాని'కి మాత్రమే ఉండే ఒక భ్రాంతి. ‘ఏది లేదో దాని'కి, దేశ కాలాలతో నిమిత్తం లేదు, ఎందుకంటే అపరిమితమైనది, అనంతమైనది, అంతేకానీ దేశకాలాల పరిమితుల సంకెళ్ళకు బంధీ అయినది కాదు.

అస్తిత్వం మూల ప్రక్రియ నుంచి విముక్తి చెందాలనే ఈ తపన కలిగినప్పుడు, మన బుద్ధి (mind)కీ, ఇంకా మనలో ఉన్న భయ స్వభావం అనే భావోద్వేగానికీ, అది కేవలం ఆత్మ వినాశనమే (self-annihilation) - అనిపిస్తుంది. తర్కించే మనసుకు, ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, కోరి కోరి చేసుకుంటున్న ఆత్మహత్యతో సమానంగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఆత్మహత్య కాదు, అంతకంటే ఎక్కువే! మనల్ని అంతం చేసుకునేందుకు ఉన్న అత్యధమమైన మార్గం ఆత్మహత్య. అత్యధమం అంటున్నది ఎందుకంటే, ఆ ప్రయత్నంలో అపజయం ఖాయం. అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వదు. అనుకున్న ఆ ఫలితాన్ని సాధించగలిగిన పద్ధతులెరిగిన నిపుణులు, ఈ సంస్కృతిలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రక్రియలు ఆ పద్ధతులే!

ఎనిమిది రకాల సమాధులు – Eight Types of Samadhi

సమాధుల్లో అనేక రకాలున్నాయి. మానవుడు శరీరంతో ఉండగా, ఎనిమిది సమాధి స్థితుల్లోకి వెళ్ళగలడు. ఈ ఎనిమిదింటినీ రెండు అతిముఖ్యమైన విభాగాలుగా విడదీసారు. సవికల్ప సమాధులు - ఈ సమాధి స్థితిలో అనుభూతులు మనోహరంగా ఉంటూ, ఆనందాన్నీ, బ్రహ్మానందాన్నీ కలుగజేసేవి. నిర్వికల్ప సమాధులు - అవి ఆనందానికీ, దుఃఖానికీ అతీతమైన గుణరహిత స్థితులు.

ఆత్మజ్ఞానం దృష్ట్యా సమాధి స్థితులకు స్వతహాగా అంత గొప్ప ప్రాధాన్యత లేదు.

నిర్వికల్ప సమాధిలో ఉన్న వారిని ఎల్లప్పుడూ సురక్షితమైన వాతావరణంలో ఉంచుతారు ఎందుకంటే వారికి శరీరంతో సంబంధం ఒకే ఒక బిందువుతో ఉంటుంది. కాస్తంత అలికిడి, ఒక గుండు సూది శబ్దం చాలు, వారు శరీరం వదిలిపెట్టేయగలరు. తమకీ తమ శరీరాలకీ మధ్య తారతమ్యం ఉందని తెలియడానికి సాధకులు ఇటువంటి సమాధి స్థితిని సాధన చేస్తుంటారు. వ్యక్తి ఆధ్యాత్మిక పరిణామంలో సమాధి ఒక ముఖ్యమైన స్థితి. కానీ అదే అంతిమ స్థితి కాదు. ఆత్మజ్ఞానం దృష్ట్యా సమాధి స్థితులకు స్వతహాగా అంత గొప్ప ప్రాధాన్యత లేదు.

గౌతమ బుద్ధుడి శిష్యులు చాలామంది సుదీర్ఘమైన ధ్యానంలో గడిపారు. ఏళ్ల తరబడి వారు ఆ స్థితి నుండి బయటకు రాలేదు. గౌతమ బుద్ధుడు మాత్రం అలా చేయలేదు. బహుశా ఆయనకు ఆ అవసరం కనిపించి ఉండకపోవచ్చు. అతను ఆ ఎనిమిది రకాల సమాధి స్థితులనీ ఆత్మజ్ఞానాన్ని పొందకముందు అనుభవించి, తర్వాత వాటిని విడిచిపెట్టాడు. ఆ స్థితి తనని ఆత్మజ్ఞానానికి తీసుకుపోదని ఆయన గ్రహించాడు. అది ఒక ఉత్ప్రేరకమైన ఉన్నత స్థితిలోకి వెళ్ళడం, అది ప్రస్తుత వాస్తవం కంటే అందంగా ఉంటుంది కనుక మీరు అక్కడే ఉండిపోవాలని భ్రమపడవచ్చు. మీరు ఇప్పుడు ధ్యానం చేస్తే కనీసం మీ కాళ్ళలో నొప్పి మొదలై, ప్రస్తుత వాస్తవికత గురించి మీకు గుర్తుచేస్తుంది. మరి ఆ సమాధి స్థితిలో, మీకు గుర్తు చేయడానికి నొప్పి ఏమీ ఉండదు, ఆ విధంగా చూస్తే అది ప్రమాదకరమే!

ఒక తాత్కాలికమైన స్థితి

మీరు ఒక సమాధి స్థితిని అనుభవించినంత మాత్రం చేత మీ అస్తిత్వ పునరావృతుల నుండి మీకు విముక్తి లభించిందన్న హామీ లేదు. అది ఒక కొత్త స్థాయిలోని అనుభవం. అంతే! మీరు బాల్యంలో ఉన్నప్పుడు మీరు జీవితాన్ని ఒక స్థితిలో అనుభూతి చెందుతారు. మీరు యవ్వనంలోకి అడుగుపెట్టిన తర్వాత మీకు మరొక ప్రమాణంలో జీవితానుభూతి ఉంటుంది. మీరు జీవితంలో వివిధ స్థాయిల్లో వెరువేరు అనుభూతులకు లోనవుతుంటారు. మీరు ఒక అనుభూతి స్థాయి నుండి వేరొక స్థాయిని చేరుకుంటారు. సమాధి స్థితులు కూడా అటువంటివే. ఒక స్థాయి అనుభూతి నుండి మరింత ప్రధానమైన, ప్రగాఢమైన మరొక స్థాయిని మీరు చేరుకుంటారు. కానీ అది కేవలం మరో స్థాయి అనుభూతి మాత్రమే. 

కొందరు ఒకరకమైన సమాధి స్థితి చేరుకుని కొన్ని సంవత్సరాల పాటు అది అనుభవింప యోగ్యమైనదిగా ఉండడం వలన అక్కడే ఉంటారు. ఈ స్థితిలో వాళ్లకి కాలంతో, స్థానంతో ఏ సంబంధం ఉండదు. వాళ్ళకి ఏ శారీరకమైన సమస్యలూ ఉత్పన్నం కావు. వాళ్ళు శరీర, మానసిక వ్యవస్థలతో కొంతమేరకు సరిహద్దులను చెరిపివేశారు. కానీ ఇది తాత్కాలికం. వాళ్లు ఈ స్థితి నుండి బయటకి వచ్చిన క్షణమే, శరీరానికి తిరిగి నిద్రాహారాలు అవసరం అవుతాయి.

సమాధి వలన ఖచ్చితంగా ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒక వ్యక్తికి అనేక విషయాల్లో ప్రయోజనకరమైనది, కానీ ఇది మిమ్మల్ని ఆత్మజ్ఞానానికి ఏ విధంగానూ చేరువ చేయలేదు. సాధారణంగా, మాములుగా ఉన్నవాడి కంటే కొద్దిగా మత్తుపానీయాలు సేవించినవాడు వేరే స్థాయి అనుభూతిలో ఉంటాడు. కానీ ఎప్పటికో ఒకప్పటికి ఆ స్థాయి నుండి క్రిందకు దిగిరావాలి. ఈ సమాధి స్థితులన్ని ఏ రసాయనిక పదార్థాలూ సేవించకుండా ఆ స్థితిని చేరుకునే మార్గాలు. మీరు ఈ స్థితిలోకి వెళ్ళినపుడు, మీకొక కొత్త ప్రమాణం తెరుచుకుంటుంది. కానీ అది మిమ్మల్ని శాశ్వతంగా మార్చలేదని గుర్తుంచుకోవలసిందే. మీరు మరొక కొత్త వాస్తవంలోకి ప్రవేశించలేరు. మీ అనుభూతి సాంద్రమౌతుంది కానీ స్థూల దృష్టితో చూసినపుడు మీరు స్వతంత్రులు కాలేరు.

మీ సృష్టిలో మీరు బంధీగా అవుతారు

చాలామంది యోగులు తమవైన ప్రపంచాలను సృష్టించుకుని, ఆ వాస్తవికతలలో బంధీగా మారారు. నేను సంధ్యాసమయం లాంటి ఒక స్థితిలోకి వెళ్తున్నాను. కానీ అనేకమంది యోగులు వారి చుట్టూ వారి వారి సొంత ప్రపంచాలను సృష్టించుకున్నారు. ఒక యోగి గుహలోకి వెళ్లి, తనదైన విశ్వాన్ని సృష్టించుకుని అక్కడే నివసిస్తాడు. ఇది పరిహాసం కాదు. తనకు కావాల్సిందంతా ఆయన సృష్టించుకుంటాడు. ఆయన సొంత గ్రహాలూ, సొంత భూగోళం, సమస్తమూ తన ఇష్టానుసారం సృష్టించుకొని, ఎంతో ఆనందంగా అక్కడ జీవిస్తాడు. ఒక గుహలో ఏకంగా విశ్వమే సృష్టించబడింది. ఒక పరమాణువు ప్రమాణంలోనే మీరు సమస్త విశ్వాన్నీ సృష్టించవచ్చు. ఎందుకంటే “అక్కడా ఇక్కడా”, “అంతా ఇంతా” అనేవి మీ మదిలో మీరు కల్పించుకుంటున్నవే.

ఇలాంటి వారు అనేక మంది యోగులు ఉన్నారు. కానీ ఆత్మజ్ఞాన పరంగా వారు మీకంటే ఏమంత చేరువలో లేరు. తాను ఒక భిన్నమైన ప్రపంచంలో నివసిస్తాడు. అంతే! ఆయన ఒక సృష్టికర్త కూడా కనుక ఆయన మీకంటే మరింతగా చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఆయన సృజించే కళను నేర్చుకున్నాడు. దాని అర్థం అదే అంతిమమైన విముక్తి కాదు. అది ఒక భిన్నమైన చర్య, భిన్న విధానంలో పనులు చేయడం.

ఒక కళాకారుడు తెరపై కొత్త ప్రపంచాన్ని చిత్రిస్తాడు. ఒక యోగి వాస్తవంగా దానిని సృజిస్తాడు. కళాకారుడి సృష్టి రెండు-కోణాలలో ఉంటుంది. అదే యోగి చేసిన సృష్టి మూడు-కోణాలలో ఉంటుంది. ఇది మరింత వంచన చేస్తుంది. ఒక కళాకారుడు తాను సృజించే ప్రపంచంలో మరింతగా లీనమై, అది నిజం అని నమ్మడం మొదలు పెడతాడు. అది ఆయనకు వాస్తవం. ఒక కవి తాను ఏదైతే రాస్తాడో అది నిజం అని నమ్ముతాడు. అదే రీతిలో, ఒక చిత్రకారుడు, తాను చేసే దానిలో గాఢంగా లీనమై, తాను చిత్రించే దృశ్యం యదార్థం అని నమ్ముతాడు. రెండు-కోణాల్లో సృజించిన విషయాలే ఇలా ఉన్నప్పుడు, మీరు మూడు-కోణాల్లో విషయాలను మీ చుట్టూ సృష్టించుకుంటే, ఖచ్చితంగా మీరు అందులో మరింతగా చిక్కుకుపోతారు.

లక్ష్యాన్ని పెట్టుకోవడం

మీ సొంత చైతన్య స్థితిని మీరు అధిగమించాలనుకున్నప్పుడు, మీకు ఉన్న యావత్తు శక్తినీ మీరు కూడగట్టుకోవాలి. వేరొక స్థితిలోకి వెళ్ళడం ముఖ్యం కాదు. అది ముక్తికి దారి తీయదు. అనేక మందిని సమాధి స్థితుల్లోకి తీసుకువెళ్లేందుకు సరిపడా శక్తి మా వద్ద ఉంది. ఒక మూడు లేదా ఆరు నెలలు మీరు అలా సమాధి స్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే, అది సాధ్యమే. కానీ ఏం ప్రయోజనం? అది ముక్తిని కలిగించదు. అది కేవలం మరో విధమైన కర్మ.

మీరు లక్ష్యం పెట్టుకుంటే, మీ జీవితంలో ఆత్మజ్ఞానాన్ని అత్యున్నత ప్రాధాన్యతగా పెట్టుకుంటే గనుక, మిమ్మల్ని దాని వైపు ఒక అడుగైనా దగ్గరగా తీసుకువెళ్లలేనిది ఏదైనా, అది అర్థం లేనిదే. ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాలనుకున్న వ్యక్తి, తప్పనిసరి అయితే తప్ప, ఒక్క అడుగు కూడా పక్కకి నడవడు. అతను కూడగట్టుకున్న శక్తినంతా లక్ష్యాన్ని చేరేందుకే వినియోగిస్తాడు. మీరు మీ చైతన్య స్థితిని అధిగమించాలన్నప్పుడు, మీకు ఉన్నదంతా కూడగట్టుకోవాలి.

మహాసమాధి - Mahasamadhi

మహా సమాధి అనేది మీరు విచక్షణను కేవలం అనుభవపూర్వకంగానే కాకుండా, అస్తిత్వపరంగా కూడా అధిగమించిన ఒక పార్శ్వం.

మీరు శరీరంలో ఉన్నంత కాలం మీరు ఏలాంటి విముక్తిని పొందినా, శరీరం ఒక పరిమితిగా ఉంటుంది. అది సంపూర్ణమైన విముక్తి కాదు. ఎవరైనా, శరీరాన్ని సంపూర్ణమైన ఎరుకలో వదిలిపెడితే, దానిని మహాసమాధి అంటారు. ఎందుకంటే అతడు లేదా ఆమె శరీరాన్ని వదిలిపెట్టారు.

మహా సమాధి అనేది మీరు విచక్షణను కేవలం అనుభవపూర్వకంగానే కాకుండా, అస్తిత్వపరంగా కూడా అధిగమించిన ఒక పార్శ్వం. ప్రస్తుతం మీరు వేరుగా, ఇతరులు వేరుగా ఉన్నారు. ఇది ఒక నిర్దిష్టస్థాయి వాస్తవం. సమాధి స్థితిలో, మీరు ఈ విచక్షణను అధిగమిస్తారు, ఇంకా అస్తిత్వంలోకి ఏకత్వం మీ అనుభూతిలోకి రావడాన్ని మీరు చూడగలుగుతారు.

మహాసమాధి అంటే మీరు దానిని ఉన్న విధంగా చూడడమే కాక, మీరు సంపూర్ణంగా అందులో భాగం అవుతారు – విచక్షణ అంతమైపోతుంది. దాని అర్థం వ్యక్తిగత అస్తిత్వం అంతమైంది అని. మీరు ఇక అస్తిత్వంలో లేరు. అప్పటివరకూ వ్యక్తిగత జీవంగా ఉన్న జీవం, ఇప్పుడు సంపూర్ణంగా విశ్వవ్యాప్తం లేదా అనంతమైంది. సాంప్రదాయకంగా వర్ణించాలంటే, మీరు దేవుడిలో ఐక్యం అయ్యారు లేదా అనంతంలో భాగం అయ్యారు.

నేను “దేవుడిలో ఐక్యం” అన్నప్పుడు, దానర్థం ఎవరినో ఎక్కడికో వెళ్లి కలవడం కాదు. అందేంటంటే, మీ వ్యక్తిగత పరిధి అంతం అయ్యింది. ఉపమానంతో చెప్పాలంటే, ప్రస్తుతం మీ అస్తిత్వం ఒక గాలి బుడగ లాంటిది. గాలిలో తేలాడుతున్న బుడగ వాస్తవమే కానీ, ఇప్పుడు మీరు దానిని పగులగొడితే, ఆ బుడగలోని గాలి ఎక్కడికి పోతుంది? అది వాతావరణంలో కలిసిపోతుంది. అది పూర్తిగా కలిసి పోయింది. మనం “అనంతంలో ఐక్యం” అన్నప్పుడు, దాని అర్థం ఇదే. అక్కడ ఏమీ ఉండదు. “మీరు” అనేది ఉండదు. మనం ముక్తి అన్నప్పుడు, దానర్థం మీరు అస్తిత్వం నుండి స్వేచ్ఛని పొందారు అని. అస్తిత్వాన్ని ఒక పరిమాణంగా తీసుకుని, మీరు దాని నుండి స్వేచ్ఛ పొందడం గురించి కాదు నేను మాట్లాడేది. మీరు మీ సొంత అస్తిత్వం నుండి విముక్తి పొందారు – మీ అస్తిత్వం ముగిసింది.

నిర్వాణ – అస్తిత్వాన్ని అధిగమించడం

సంకల్పంతో శరీరాన్ని వదిలిపెట్టే స్థితి మహాసమాధి. జీవన చక్రం ముగిసింది. మళ్ళీ జన్మించే ప్రసక్తి లేదు, అది పరిపూర్ణమైన కలయిక. ఈ వ్యక్తి ఇక నిజంగా లేరు అని మీరు అనవచ్చు.

ముక్తి లేదా నిర్వాణం లేదా మోక్షం అన్నప్పుడు, దానర్థం ఇదే – అస్తిత్వపు ప్రయాస నుండి స్వేచ్ఛ పొందడం. అది అంతిమమైన విముక్తి ఎందుకంటే మీరు అస్తిత్వంలో ఉన్నంత వరకూ, మీరు ఎదో విధంగా బంధీలుగానే ఉంటారు. మీరు భౌతికంగా అస్తిత్వంలో ఉంటే, అది ఒక విధమైన బంధనం. మీరు భౌతిక శరీరాన్ని వదిలిపెట్టి, మరో విధంగా అస్తిత్వంలో ఉన్నప్పటికీ, మరో విధమైన బంధనం ఉంటుంది. అస్తిత్వంలో ఉన్న పతిదీ ఏదో నియమానికి లోబడి ఉంటుంది. అన్ని నియమాలను బద్దలుకొట్టడమే ముక్తి. అలా అన్ని నియమాలూ బద్దలవ్వాలంటే మీరు ఉనికిలో ఉండకూడదు. అప్పుడే అది సాధ్యం.

నిర్వాణం అనేది మరింత భావ్యమైన పదం. ఎందుకంటే నిర్వాణం అంటే “లేనిది” అని అర్థం. అస్తిత్వం అనేది లేనప్పుడు, మీరు స్వేచ్ఛ నుండి కూడా విముక్తి పొందారు. ఎందుకంటే, స్వేచ్ఛ కూడా ఒక విధమైన బంధనమే. అందువల్ల మీరు మీ అస్తిత్వం నుండి విముక్తి పొందారు అని అర్థం. మీకూ, మీరు కాని దానికి మధ్య విచక్షణ సంపూర్ణంగా అంతమైపోయింది.

ఎవరైనా ఈ కృత్యాన్ని చేయాలంటే – శరీరం విచ్చిన్నం కాకుండా జీవాన్ని బయటకు తీసి వదలాలంటే - దానికి మహత్తరమైన శక్తి అవసరం. మహాసమాధి అంటే వ్యక్తి, సంకల్పంతో శరీరాన్ని వదిలిపెట్టే స్థితి. జీవన చక్రం ముగిసింది. పునర్జన్మ ప్రసక్తే లేదు. అది పరిపూర్ణమైన కలయిక. ఈ వ్యక్తి ఇక నిజంగా లేరు అని మీరు అనవచ్చు.

జీవం ఒక స్థాయి నుండి వేరొక స్థాయికి బదిలీ అవుతుంది. వాస్తవంలో మరణం అనేది ఏదీ లేదు. జీవం గురించిన ఎరుక లేని వారికే మరణం అనేది ఉంటుంది. కేవలం జీవం మాత్రమే ఉంది. ఒట్టి జీవం మాత్రమే! కానీ మహాసమాధి అంటే అసలైన ముగింపు. ప్రతీ ఒక ఆధ్యాత్మిక సాధకుడి లక్ష్యమూ ఇదే. అంతిమంగా, అతడు లేదా ఆమె అస్తిత్వాన్ని అధిగమించి వెళ్ళాలనుకుంటారు.