Sadhguru tells us that a spiritual process is not different from having an unbridled enthusiasm for life.

సద్గురు: సాధారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ కలలను సాకారం చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. మీ కల ఏదైనప్పటికీ అది కేవలం మీ గతాన్ని ఇంకొంచెం మెరుగుపరచడం మాత్రమే. మీకు తెలియని దాని గురించి మీరు కలగనలేరు. మీకు తెలిసిన దాని ఆధారంగా మీరు గమ్యాన్ని నిర్ధారించుకున్నారు. మీకు తెలిసిన దాని ఆధారంగా మీరు గమ్యాన్ని నిర్ధారించుకున్నప్పుడు, మీరు ఇక ముందెప్పుడూ ఎదైనా కొత్తది జరగకుండా చూసుకుంటున్నారు. ఇటువంటి కల ఒక సంభావ్యత కాదు, ఇది ఒక విధమైన నిరాశాతత్వం. మీరు గతాన్ని భవిష్యత్తులో కోరుకుంటున్నారు. మీరు వాస్తవానికి వెనక్కి తిరిగి చూసుకుంటూ ముందుకు వెళ్తున్నానని అనుకుంటున్నారు.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏ గమ్యం లేకుండా ఊరికే జీవించగలగటం

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఏ గమ్యం లేకుండా ఊరికే జీవించగలగటం అంటే దానర్థం బద్దకంగా ఉండటం అని కాదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న దానితో పూర్తిగా నిమగ్నం అవ్వడం, అదే సమయంలో ఎటువంటి లక్ష్యం లేకుండా ఉండటం. మీకు గనక ఇక్కడ ఈ విధంగా కూర్చోగలిగే ధైర్యం ఉంటే.. “రేపు ఏం జరిగినా నాకు ఫర్వాలేదు, కానీ ప్రస్తుతం నేను చేస్తున్న దాంట్లో, నేను పూర్తిగా నా శక్తికి తగినట్టుగా చేస్తాను,” అని, అప్పుడు సహజంగానే మీరు ఆధ్యాత్మికులౌతారు.

కొన్నేళ్ల క్రితం నేను ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించిన కొద్దిమంది సాహసికుల బృందాన్ని కలిసాను. వారు ఉత్తర ధ్రువం మీదుగా నడిచారు, సముద్ర మట్టానికి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తుకు చేరుకుంటూ, శీతాకాలంలో మూడు నెలలు అండీస్‌లో గడిపారు. వాళ్లు తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ప్రదేశంలో ఉండాలనుకుంటున్నారు. వాళ్లు నన్ను కలవడానికి వచ్చారు, అప్పుడు మన వాలంటీర్లలో ఒకరు వాళ్ళతో ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రోగ్రాం గురించి చెబుతున్నారు. నేను వీళ్ళ వంక అలా చూసి, వీరి విషయంలో మూడు రోజులు వృధా చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. నేను వాళ్ళతో ఊరికే నాతో పాటు కూర్చుని కళ్లు మూసుకోండి అన్నాను, ఇక అంతే. ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేకుండా, అంతా జరిగిపోయింది. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పుడూ ఆధ్యాత్మికత గురించి ఆలోచించలేదు, వాళ్ళకి కావాల్సింది కేవలం సాహసం - తర్వాతి క్షణంలో ఏం జరుగుతుందో తెలియని విధంగా ఉండే జీవితాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. నేను వాళ్ళకి ఏదీ బోధించాల్సిన అవసరం లేదు. నేను వాళ్లని ఉద్దీపనం చేస్తే చాలు, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బాగా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ శరీరాలు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయి. అలాగే వాళ్ళ మనసు సుముఖంగా, దేనికైనా సిద్ధంగా ఉంది. కావలసిందల్లా అదే.

మీరు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. అది ఏమైనా కావచ్చు. అది ఏమైనా పర్వాలేదు... ...

ఇక్కడ ఊరికే అలా ఉండాలంటే, కేవలం పిచ్చి ధైర్యం వల్ల అయినా ఉండొచ్చు, లేదా సృష్టికర్త మీద ఉన్న విశ్వాసం వల్ల అయినా ఉండొచ్చు. ఇవి రెండు మార్గాలు. ఈ సాహసికులు అసాధారణమైన ధైర్య స్థాయిలతో ఉన్నారు. అది అందరికీ ఉండదు, కానీ కనీసం మీకు సృష్టికర్త మీద విశ్వాసం అన్నా ఉండాలి. సృష్టికర్తను విశ్వసించడం అంటే, మీ ఆలోచనల్లో దేవుడితో మాట్లాడటమో లేదా అటువంటిదేదో చేయడమో కాదు. మీరు ఎక్కడ ఉన్నా, సౌకర్యవంతంగా కూర్చుంటున్నారూ అంటే, అది విశ్వాసమే. ఎందుకంటే భూమి తెరుచుకుని జనాన్ని మింగేసిన సంఘటనలు ఉన్నాయి. ఆకాశం బ్రద్దలయ్యి చక్కలు మనుష్యుల మీద పడి వారిని చంపిన సంఘటనలు ఉన్నాయి. జనాలు పిల్చే ఈ గాలే వారికి వ్యతిరేకంగా మారిన సంఘటనలు ఉన్నాయి. ఈ గుండ్రని గ్రహం విపరీతమైన వేగంతో తిరుగుతుంది, అలాగే ఈ మొత్తం సౌర వ్యవస్థ, ఇంకా ఈ పాలపుంత, అన్ని కూడా ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయో, అది మనకు తెలీదు. ఉదాహరణకి భూమాత ఉన్నట్టుండి తను తిరుగుతున్న దిశకు వ్యతిరేకంగా తిరగాలని అనుకుంటే..ప్రస్తుతం మీరు కూర్చున్న చోటు నుండి ఎగిరిపోతారేమో. మీరు కూర్చుని, నవ్వుతూ, వింటూ, మరొకరితో మాట్లాడటానికి మీకు విశ్వాసం అవసరం - ఎంతో గొప్ప విశ్వాసం అవసరం, అవునా?

ఈ విశ్వాసం మీకు ఉంటే, మీరు ఇక్కడ ఉరికే ఉండగలుగుతారు - ఆధ్యాత్మికతలో అదే ప్రాథమిక అడుగు. మీరు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. అది ఏమైనా కావచ్చు. అది ఏమైనా ఫర్వాలేదు. మీరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. అదే జీవితం పట్ల హద్దుల్లేని ఉత్సాహం.

Editor's Note: Find out more about the incredible potential every human being carries, in the free ebook, “From Creation to Creator”.

Images courtesy: Sunrise in Paradise by shashchatter
Pequeno Alampayo 5410m climbing by twiga_269