ప్రశ్న: నేను నా జీవితంలోని ప్రతి అవకాశాన్ని, చివరకు కష్టాన్ని కూడా, నా ఉన్నతికి ఒక సోపానంగా ఎలా ఉపయోగించు కోగలను?

సద్గురు: మీరు ప్రతిదానినీ, ప్రతివారినీ మీ ఉన్నతికి ఎలా ఉపయోగించుకోవాలి? మొట్టమొదటగా, మీరు కృతజ్ఞతాభావంతో ఎదగండి, దయ చూపిస్తూ కాదు. మీరు దయాభావం కలవారు కావాలని నేను కోరుకోవడం లేదు. మీరు ఎప్పుడూ పూర్తి కృతజ్ఞతా భావంతో ఉండేవారిగా తయారు కావాలి. దయా హృదయులు, కొంతకాలం తర్వాత పట్టించుకోని వారు అవుతారు. గౌతమ బుద్ధుడు ఒక ధర్మ సూత్రాన్ని అందించారు. ‘‘మీ ఆహారాన్ని మరొకరికి ఇచ్చేయటం ద్వారా మీరు బలవంతులు అవుతారు, బలహీనులు కాదు- ఇది అర్థం చేసుకోవడం కష్టం’’, అంటారు ఆయన. మీ ఆహారం ఇంకొకరికి ఇచ్చేసి ఎలా బలవంతులు కాగలరు? ఇది మీ దగ్గర సమృద్ధిగా ఉన్న దాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం గురించి కాదు. మీకు ఎంతో కావాల్సిన దాన్ని, మీ జీవాధారాన్ని, ఇంకొకరికి ఇచ్చివేయడం ద్వారా మీరు దైవానికి దగ్గరవుతారు.

సన్యాసి, రోజులో చాలా మటుకు ఆకలితోనే ఉంటాడు. ఆయన, రోజుకు ఒకసారి మాత్రమే ఆహారాన్ని యాచించి, భోజనం చేస్తాడు. ఒకరోజు అతనికి ఎవరో కాస్త అన్నం పెట్టవచ్చు ఇంకో రోజు అంత కన్నా తక్కువే దొరకొచ్చు.. అతనికి ఏమి దొరికినా, నియమం మాత్రం, అతను రోజుకి ఒక్క ఇంటి దగ్గర మాత్రమే, భిక్ష అడగాలి.. ఒక్కోరోజు అతనికి ఏమీ దొరక్కపోవచ్చు. కొంతకాలానికి ఈ ఒక్క ఇల్లు అనే నియమాన్ని సడలించి, దాన్ని మూడు ఇళ్లకు పెంచారు, ఎందుకంటే దానం చేసే విషయంలో, ప్రజలు మరింత జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి, సన్యాసులు ఎప్పుడూ ఆకలితోనే ఉండేవారు.. మరి, గౌతముడు మీ ఆహారాన్ని మీరు ఇచ్చివేస్తే, మీరు మరింత బలవంతులు అవుతారు, బలహీనులు కాదు అంటున్నారు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం, కానీ అదే యదార్థం.



ఆస్ట్రియా (ఆష్ విట్జ్) కథ

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆష్విట్జ్ జర్మన్ కాన్సెంట్రేషన్ క్యాంపులో జరిగిన అద్భుతమైన యదార్థ గాథ ఒకటి ఉంది. బందీలను వధించడానికి, వారిని వధ శాలకు తీసుకువెళ్లడానికి వారి నెంబర్లు పిలుస్తున్నారు. ఆ నెంబర్లు కూడా ఏదో ఒక పద్ధతి లేకుండా, బలహీనంగా ఉన్న వారిని, లేకపోతే పనిచేయలేని ముసలి వారిని పిలుస్తున్నారు. మీ నెంబరు వచ్చిందంటే మీరు మరణానికి తీసుకు వెళ్ళబడుతున్నారు అన్నమాట.

అలాంటి పరిస్థితిలో, ఒకతని నెంబరు పిలవడంతో అతను చాలా భయ భ్రాంతుడయ్యాడు. అతనికి చనిపోవాలని లేదు. అతని పక్కనే ఒక క్రిస్టియన్ మిషనరీ ఉన్నాడు. అతని నంబరు పిలవబడలేదు. మొదటి మనిషి భయాన్ని చూసి అతను, ‘‘మీరు భయపడవద్దు నేను మీ స్థానాన్ని తీసుకుంటాను’’ అన్నాడు. మొదటి వ్యక్తి సిగ్గుపడ్డాడు. కానీ, అదే సమయంలో, అతను తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ‘వద్దు’ అనలేకపోయాడు. అతనికి బ్రతికుండాలని ఉంది. ఆ మిషనరీని చంపేశారు.

ఆ తరువాత జర్మనీ యుద్ధంలో ఓడిపోయింది. ఈ మనిషిని వదిలేశారు. చాలాకాలం ఆ వ్యక్తి సిగ్గుతోనూ, ఒక రకమైన పరాజయ భావనతోనూ బతికాడు. ఆ తర్వాత ఈ కథను వివరించాడు. తన జీవితమే మరొకరి దాతృత్వం కాబట్టి, ఆయన దానికి విలువే లేదు అనుకున్నాడు. మరొక మనిషి గొప్పదనం వల్ల మాత్రమే తను ఇంకా బతికి ఉన్నాడు. లేకపోతే అతను ఆరోజే చనిపోయి ఉండేవాడు - ఆ రోజు పిలిచిన నంబరు తనది.

ఆ మిషనరీకి అతను తెలియదు. అతను ఒక స్నేహితుడు కాదు, బంధువు కాదు, తండ్రి కాదు, కొడుకు కాదు. కేవలం అతని భయాన్ని తగ్గించడం కోసం ఆయన పోవడానికి సిద్ధమయ్యాడు. అటువంటి వారికే జీవితం అంటే తెలుస్తుంది – వెళ్ళిపోయిన అతనికి, అంతేగాని బ్రతికిపోయిన వాడికి కాదు. ఆయన తనలో ఒక రకమైన బలాన్ని, శక్తిని అనుభూతి చెందగలడు. అంతేగాని తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసినవాడికి ఎన్నటికీ తెలియదు.

అంటే మీరేదో ఒక త్యాగం చేయాలనో, మరేదో తెలివిమాలిన పని చేయమనో కాదు. ఆ రోజు మరణాన్ని ఎంచుకున్న వాడు, తానేదో గొప్ప త్యాగం చేశాననే భావంతో చేయలేదు. అతను మరొకరి కోసం త్యాగం చేయాలని ఎదురు చూడలేదు. ఆ క్షణంలో ఏది అవసరమో అది, మరో ఆలోచన లేకుండా అతను చేశాడు. అది అద్భుతం. కానీ మీకు ఏదో బలం చేకూరుతుందని త్యాగం చేయటానికి ప్రయత్నిస్తే అది సరైనది కాదు.

స్వర్గం లభిస్తుందని కాకుండా, మీరు మీ జీవితాన్ని నడిపిస్తుంటే, మీరు సరైన మార్గంలోనే ఉన్నట్లు. అదే మీరు ఆ ప్రతిపాదన తీసుకుని, ఓ ఒప్పందం కుదుర్చుకుని కూడా మీరు సరైన దిశలోనే ఉంటే, అలానే చెయ్యండి. అసలు ఏ ప్రతిపాదనలు లేకుండా మీరు మీ మార్గంలోనే ఉండే పరిపక్వత ఉంటే అది మంచింది. మీకు ఏ అదనపు ప్రోత్సాహకాలు లేకుండానే మీరు ఇంకా అదనంగా పనిచేయడానికి సుముఖంగా ఉండే స్థితికి మీరు చేరితే, అప్పుడు మీకు వేరే తరహా శక్తి ఉంటుంది. కావలిసినంత వరకే పనిచేసే మనిషికి అంతే దక్కుతుంది. అతను జీవితాంతం బిచ్చగాడిగానే ఉండి పోతాడు. అతనికి నిజంగా బలమంటే ఏమిటో ఎప్పటికీ తెలియదు, దివ్యత్వం ఏమిటో తెలియదు, ఎందుకంటే దివ్యత్వం ఎప్పుడూ ఏ కారణం లేకుండానే పని చేస్తుంది. అంతా ఉద్దేశరహితంగానే జరుగుతుందని గ్రహించండి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు


Editor’s Note: Excerpted from Mystic’s Musings. Not for the faint-hearted, this book deftly guides us with answers about reality that transcend our fears, angers, hopes, and struggles. Sadhguru keeps us teetering on the edge of logic and captivates us with his answers to questions relating to life, death, rebirth, suffering, karma, and the journey of the Self. Download the sample pdf or purchase the ebook.