ప్రశ్న: నమస్కారం సద్గురు. నిద్రలో మనం సాధారణంగా అచేతనంగా ఉంటాము. నిద్రలో కూడా చేతనంగా ఉండే మార్గం ఏదైనా ఉందా?


మీరు నిద్రపోయేటప్పుడు హాయిగా నిద్రపోండి. ఇంకేదో చేయటానికి ప్రయత్నించకండి. ఒక అందమైన కధ ఉంది. ఎన్నో సంవత్సరాలుగా సప్త ఋషులు అనే ఏడుగురు మునులు ఆదియోగి దగ్గర నేర్చుకుంటూ, సాధన చేస్తూ, ఆయనతో అనుబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. వారి మధ్య బంధం ఎంత లోతుగా మారిందంటే వారికి ఆయన తప్ప వేరెవ్వరూ గుర్తులేదు. కానీ ఆయన ఒక రోజు, “ఇక మీరు వెళ్ళవలసిన సమయం వచ్చింది. దీన్ని మీరు ప్రపంచానికి అందించాలి.” అని అన్నారు. ఆయన వారిని సుదూర ప్రాంతాలకు వెళ్ళమని చెప్పారు. ఒకరు మధ్య ఆసియా, మరొకరు ఉత్తర ఆఫ్రికా, ఒకరి దక్షిణ అమెరికా, మరొకరు ఆగ్నేయ ఆసియా, ఇంకొకరు దక్షిణ భారతదేశానికి, ఇంకొకరు నేడు మనం భారత భాగంగా చెప్పుకునే హిమాలయాలకు వెళ్ళారు. ఒక్కరు మాత్రమే ఆయన దగ్గర ఉండిపోయారు. మీరు మీ శరీరంతో గుర్తించబడకపోతే మాత్రమే నిద్రలో చేతనంగా ఉండటం అనేది వీలవుతుంది.

15,000 సంవత్సరాల క్రితం ఎవరిననైనా దక్షిణ అమెరికాకు వెళ్ళమంటే అది వేరొక పాలపుంతకు వెళ్ళమని అడిగినట్లే. అప్పుడు సప్తఋషులు “మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు, అక్కడ ఎలాంటి వారు ఉంటారో, వారు మమల్ని ఎలా ఆదరిస్తారో, వారు దీన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉంటారో లేదో కూడా తెలియదు.మేము ఏదైనా ఇబ్బందులలో చిక్కుకున్నా లేక మేము అనుకున్నట్లుగా ప్రసారణ చేయలేకపోయినా, మాకు తోడుగా మీరు ఉంటారా?” అన్నారు. అప్పుడు ఆదియోగి వారిని నమ్మలేనట్లుగా చూసి అన్నారు, “ మీరు ఇబ్బందులలో ఉన్నా, మీ ప్రాణానికి హాని కలిగేలా ఉన్నా లేక మీరు చేసే పనికి హాని కలిగేలా ఉన్నా నేను నిద్రపోతాను.” వారికి విషయం అర్ధం అయ్యింది. కానీ ఆ మాట నేను మీతో అంటే మీకు అభద్రతాభావం కలిగి, నేను మిమల్ని అవమాన పరిచాననుకుంటారు. “ నేను నా కష్టాలు చెప్పుకుంటే ఆయన నేను దాని గురించి నిద్రపోతాను అని అంటున్నాడు!” అని అనుకుంటారు.

శుషుప్తి స్థితిని రెండు లేదా మూడు సెకండ్లు మీరు అనుభూతి చెందిన రోజు మీరు ఆ రాత్రి నిద్రపోలేరు. మీరు చలాకీగా, చురుకుగా ఉంటారు. 

మీరు చేతనంగా నిద్రపోగలగాలంటే మీకు మీ శరీర స్పృహ ఉండకూడదు. మీ శరీరంతో మీ గుర్తింపు పూర్తిగా లయమైపోయినప్పుడే మీరు చేతనంగా నిద్రపోగలరు. మనం మేల్కొని ఉన్నప్పుడు మనం చేతనంగా ఉంటాము కానీ మన శక్తులు ఎన్నిటిలోనో కలిసి పని చేస్తూ ఉంటాయి. మనం కూర్చోవాలి, మాట్లాడాలి, ఎదో ఒక పని చేయాలి, ఇంకేదో చేయాలి. కానీ నేను చేతనంగా నిద్రపోగలిగితే నా శక్తులు అన్నీ పూర్తిగా కేంద్రీకృతమవుతాయి, అయితే నేను ఇంకా చేతనంగానే ఉన్నాను – అంటే నేను నా ఉత్తమ స్థాయి నిర్వహణలో ఉన్నానని అర్ధం. కనుక శివుడు, “ మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను నిద్రపోతాను” అని అన్నప్పుడు దానర్ధం “నేను నాకు వీలైనంతలో ఉత్తమమైనది మీకోసం చేస్తాను” అనే, ఎందుకంటే అప్పుడు ఆయన తన ఉత్తమ స్థితిలో ఉంటారు. మీలో శూన్య ధ్యానంలో దీక్ష పొందిన వారు ఉంటే మీరు కొన్ని క్షణాలు దీన్ని అనుభూతి చెంది ఉంటారు, దీన్ని యోగాలో శుషుప్తి అని అంటారు – అంటే బాగా నిద్రపోతున్నప్పుడు కూడా మేలుకుని ఉండటం అనమాట. శుషుప్తి స్థితిని రెండు లేదా మూడు సెకండ్లు మీరు అనుభూతి చెందిన రోజు మీరు ఆ రాత్రి నిద్రపోలేరు. మీరు చలాకీగా, చురుకుగా ఉంటారు.

మీరు మీ శరీరంతో గుర్తింపు చెందకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు చేతనంగా నిద్రపోవటం అనేది సంభవం అవుతుంది. ఒక రోజున ఒక చిన్న తాబేలు, ఎంతో ప్రయాసపడి, మెల్లిగా 24 గంటలు తీసుకుని చెట్టు ఎక్కి, కొమ్మ మీద నుంచి దూకి కింద పడింది. మళ్ళీ మెల్లిగా 24గంటలు తీసుకుని పైకి పాకి, దూకి కింద పడింది – మళ్ళీ మళ్ళీ అదే. నాలుగు రోజుల తరువాత ఎదురుగా ఉన్న చెట్టు మీద కూర్చుని ఉన్న రెండు పక్షులలో ఒకటి ఇలా అంది, “ మనం వాడిని దత్తత తీసుకున్నామని ఇప్పుడు చెప్తే మంచిదేమో”. కనుక ఇప్పుడు నేను మీకు ఇది చెప్పటం మంచిదేమో, చేతనంగా నిద్రపోవటానికి ప్రయాస అవసరమైనదే కానీ అది సరిపోదు. మీ భౌతిక స్వభావాన్నుంచి మిమల్ని మీరు దూరం చేసుకోవటం అన్నికంటే ముఖ్యమైనది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు