... ఇక ఇప్పుడు, యోగా

సద్గురు : చాల సార్లు , డబ్బు పోయిన వెంటనే, ఇక తమ జీవితమే పోగొట్టుకున్నామనుకుని, మనుషులు చచ్చిపోవాలని ప్రయత్నిస్తారు. అవునా ? అసలు అలా కాదు. మీరు డబ్బు పోగొట్టుకున్నారా? అయితే ఇక యోగాకి సమయం వచ్చింది! ఇందువల్లనే, జీవితం మీద అద్భుతమైన ఆ రచనని, పతంజలి తన యోగ సూత్రాలని, అర్ధ వాక్యంతో ప్రారంభించాడు. పెళ్లి చేసుకుంటే, లేక పెళ్లి చేసుకోకుండా ఉంటే, నా జీవితం సార్థకమవుతుందని మీరు ఇంకా నమ్ముతూ ఉంటే, యోగాకి ఇంకా సమయం రాలేదు. కాస్త ధనవంతుణ్ణయితే నా జీవితం స్థిర పడుతుందని మీరు ఇంకా నమ్ముతూ ఉంటే, ఇంకా యోగాకి సమయం కాదు. నేనొక మంచి ఇల్లు కట్టుకుంటే, లేకపోతె ఒక మంచి కారు కొంటే నా జీవిత పరమార్థం నెరవేరుతుందని మీరు ఇంకా నమ్ముతూ ఉంటే, యోగాకి సమయం ఇంకా రాలేదు. ఇవన్నీ జీవితాన్ని కొంచెం సౌకర్యవంతంగా చేస్తాయి తప్ప, ఇవి ఏ విధంగానూ మనలో మార్పు తీసుకురాలేవని మీరు తెలుసుకున్నప్పుడు, ఈ ఒక్క విషయం మీకు బాగా అర్థం అయినప్పుడు - "ఇక ఇప్పుడు, యోగా."

కాబట్టి, చైనాకిప్పుడు సమయం ఆసన్నమయింది - "ఇక ఇప్పుడు, యోగా." ఎందుకంటే, ఏది ఏమయినప్పటికీ, కేవలం రెండు తరాల వ్యవధిలో, అంటే సుమారు యాభై సంవత్సరాలలో, వంద కోట్ల మంది ప్రజలని దుర్భర దారిద్ర్యంలోంచి గౌరవప్రదంగా బతికే స్థాయికి తీసుకువచ్చిన ఒకే ఒక్క దేశం చైనా. మరెక్కడా ఇలా జరగలేదు. ప్రస్తుతం భారత దేశం ఆ అవకాశానికి దగ్గరగా ఉంది. చైనా ఏదైతే బలం ఉపయోగించి సాధించిందో, దాన్ని భారత దేశం ప్రజాస్వామ్య పద్ధతిలోనే సాధించవచ్చు. కానీ మనం ఇంకా ఆ గడప దగ్గరే ఉన్నాం, ఇంకా మనం నడవాల్సిన దూరం చాలా ఉంది.

మనం కూచుని ఎన్ని విషయాల మీదైనా వ్యాఖ్యానాలు చెయ్యవచ్చు- వాక్ స్వాతంత్య్రం, యోగా చెయ్యడానికి స్వేచ్ఛ, నా సొంత లక్ష్యాలను నేను సాధించుకోడానికి స్వేచ్ఛ, వగైరా.. కానీ ఇక్కడ, చైనా ప్రజల ప్రస్తుత సుఖమయ స్థితి, ఎవరో బలవంతంగా అమలు చెయ్యడం వల్లనే వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే, ఇప్పుడు కూడా ఆ రకంగానే బతకాలా? ఒకప్పుడు వారు భయంకరమైన పేదరికంలో మగ్గుతున్నప్పుడు, ఆ రకంగా నిర్బంధంగా ముందుకు నెట్టాల్సి వచ్చింది. తప్పో, ఒప్పో, అప్పటికి అదే పరిష్కారం. అది పని చేసింది కాబట్టి, మనం దాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే, మొత్తంగా ఒక తరాన్ని అంతటినీ నికృష్ట స్థితిలో ఉంచటం, బలవంతంగా కొన్ని పనులు చేయటం కంటే దారుణమైన నేరం. హింసాయుతంగా చేసే పనులు క్రూరమైనవి, బాధ కలిగిస్తాయి, కొన్నిసార్లు మనుషుల ప్రాణాలు తీస్తాయి, కానీ మొత్తం ప్రజలందరినీ దుర్భర దారిద్య్రంలో ఉంచటం అంతకంటే చాల పెద్ద నేరం. ఎందుకంటే ఎలాగోలా బతకనీ అని మనుషులని వదిలివేసి, వాళ్ళకి ఎదగడానికి అవకాశం లేకుండా చేయడం అనేది పరిష్కారం కాదు..

యోగా మనుషులకి మత్తుమందు కాదు

చైనాకి ఇప్పుడు యోగాని అనుసరించాల్సిన సమయం వచ్చింది. అయితే అది ఈ మధ్య అక్కడ ప్రచారంలోకి వచ్చిన మెలికలు తిరుగుతూ, వంకర్లు పోయే యోగా కాదు, అసలైన యోగా! యోగా అంటే మీ అస్తిత్వపు పరిమితులను తుడిచివేయడం. చైనా వంటి దేశం అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం -"ఇదే మేము చేస్తాం" అని ఒక పట్టుదలతో దేశం పట్ల అవలంబంచిన ఖచ్చితమైన విధానం. ఇక ఇప్పుడు ఆ లక్ష్యాలన్నీ నెరవేరాయి కాబట్టి, నెమ్మదిగా వాటిని సడలించడం జరగాలి - అది వాళ్ళు మొదలుపెట్టినట్టున్నారు, కానీ, అది ఈ తరానికి పనికొచ్చేంత వేగంగా లేదు. సడలింపు జరగాలి కానీ ఆందోళనలతోనో, లేక దేశ స్థిరత్వాన్ని భంగపరచే విధంగానో కాదు.. ఆ పద్ధతుల్లో మీరు ఏమీ సాధించలేరు.

పూర్వకాలం మతాలను మత్తుమందుగా వర్ణించారు, ఎందుకంటే, అవి నిజంగా అలాగే ఉండేవి. అవి ప్రజలను నిద్రపుచ్చుతూ ఉండేవి. కానీ, యోగా, ఆధ్యాత్మిక ప్రగతి కోసం చేసే ప్రయత్నం, అది పాతకాలపు మత్తుమందు లాగా ప్రజలను జోకొట్టే పని చేయదు, ఒక నూత్న ఉత్సాహాన్ని నింపే శక్తి లాగా పని చేస్తుంది. ఆ దేశాన్ని పాలించే వ్యక్తులకు ఈ అవగాహన కలిగించాలి. ముందుకు వెళ్ళడానికి అదే మార్గం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు