క్లిష్టమైనది ప్రయాణం కాదు, మీరే!
ఒక సాధకుడు, “ప్రయాణం ఎందుకింత కష్టంగా ఉంది?” అని అడిగారు. అప్పుడు సద్గురు, “మీకు మేధస్సు ఉన్నది ఎందుకంటే, మీరు మరింత తెలివిగా జీవిస్తారని. కానీ మీకు ఒక నిర్దిష్ట స్థాయి మేధస్సు ఉన్నందున, మీ అంతట మీరే నచ్చింది చేయగలరని అనుకుంటున్నారు. మీకు నచ్చింది చేస్తే, ఒక కరగని బండరాయిలా తయారవుతారు”. అన్నారు.
ప్రశ్న : ప్రియమైన సద్గురు, ఒక ఉప్పుబొమ్మలా మారిపోయి, కరిగిపోయేలా మారడం ఎలా? ప్రయాణం ఎందుకు ఇంత కష్టంగా ఉంది?
సద్గురు : కష్టంగా ఉంది ప్రయాణం కాదు, మీరే! రాయిని సముద్రంలో వెయ్యి సార్లు ముంచినా సరే, అది కరగదు. నిజానికి, నన్ను అడిగితే ప్రయాణం అంటూ ఏమీ లేదు, ఎందుకంటే ప్రయాణం చేయడానికి కొంత దూరం కావాలి. మీతో మీకు ఎంత దూరం ఉంది? ప్రయాణం చేయడానికి ఎంత సమయం పడుతుంది? "ప్రయాణం" అనే పదాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు, లేదంటే ప్రజలు ఊరికే అలా ఏమీ చెయ్యకుండా కూర్చుంటారు. కానీ మీరు "ప్రయాణం" అని చెబితే ఎక్కడికో వెళ్లాలని వాళ్లకి తెలుస్తుంది.
మేము కొంతకాలం క్రితం లాస్ ఏంజెల్స్‌లో ఒక కార్యక్రమం చేశాము. అందులో భాగంగా ప్రజలకు శాంభవి మహముద్రని ఉపదేశించాము. అది కేవలం ఇరవై ఒక్క నిమిషాల క్రియ. అక్కడ లాస్ ఏంజెల్స్‌కి చెందిన ఒక వ్యక్తి నన్ను అడిగారు, “సద్గురు, మీరు ఇంత సుదీర్ఘమైన ఇంకా కష్టమైన ప్రక్రియలను ఎందుకు బోధిస్తున్నారు. రమణ మహర్షి మీరు ఏమీ చేయనవసరం లేదు, అంతా దానంతట అదే జరుగుతుంది అన్నారు". అప్పుడు నేను, “ఆయన చెప్పింది నిజమే, కానీ ఆయన ఏమి చెప్పారో మీరు అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి పద్నాలుగేళ్లు ఏమీ చేయకుండా కూర్చున్నారు. ఎలుకలు వచ్చి ఆయన తొడను కొరికి ఆయన మాంసాన్ని తినేశాయి; దాంట్లోకి పురుగుల వచ్చాయి అయినా ఆయన ఏమీ చేయలేదు. కానీ మీరు ఒక్క దోమ కుడితేనే 911కి ఫోన్ చేసే స్థితిలో ఉన్నారు!" అన్నాను.
మీరు రమణ మహర్షి లాగా ఏమీ చెయ్యకుండా కూర్చోగలిగితే, శాంభవి మహాముద్ర లాంటివి నేనెందుకు నేర్పిస్తాను? మీరు ఏమీ చెయ్యకుండా ఉండగలిగితే, నేను ఏదైనా మీకు ఎందుకు బోధిస్తాను? మీరు మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలంటే, నేను మాట్లాడుతూనే ఉండాలి, లేకపోతే మీరు ఏమీ తోచక తల గోక్కోవడం మొదలు పెడతారు. మేము మిమ్మల్ని ఎదో మార్చేయ్యలని కాదు; అది చాలా కష్టమైన పని. మేము మీ నిర్బంధమైన ఆలోచనలను ఆపాలి, మిమ్మల్ని ఆలోచించకుండా ఉండేలా చెయ్యాలి. ఇది మీకు అర్థమయ్యేలా చేయడానికి, మేము మిమ్మల్ని వంచాలి, మెలితిప్పాలి, తలక్రిందులుగా చేయాలి; ఇలా చాలా పనులు చేయాలి.
సమస్య ఏమిటంటే మీ గురించి మీరు ఎదో అనుకుంటున్నారు. మీరు దేనితో తయారయ్యారో చెప్పండి? మీరు సృష్టిలోని ఉన్న పదార్థాలతో తయారయ్యారా? లేదా అవికాక వేరే పదార్థాలతో తయారయ్యారయ్యారా? సృష్టి మూలం లేకుండా అస్తిత్వంలో ఒక ఆకు, పక్షి లేదా కనీసం ఒక పరమాణువైనా ఉన్నాయా? ఇదే ప్రతిచోటా ఉంది, మీరు కూడా అదే పదార్థంతో రూపొందించబడ్డారు. మరి మీరు ఎందుకిలా తమాషాగా, మీరు ఎదో భిన్నంగా ఉన్నారని అనుకుంటున్నారు? మీకు మేధస్సు ఉన్నది ఎందుకంటే, మీరు మరింత తెలివిగా జీవిస్తారని. ఉనికిలోని అద్భుతమైన విషయం ఏమిటంటే, వివిధ రకాల అవకాశాలతో జీవించే అవకాశాన్ని అందిస్తుంది. మీరు అత్యుత్తమమైన అవకాశాన్ని ఎంచుకుంటారా, లేదా అత్యల్పమైనది ఎంచుకుంటారా అన్నది మీ ఇష్టం. మేధస్సు అంటే భౌతికంగా నిర్దేశించిన పరిమితులను దాటడమే. కానీ మీకు ఒక నిర్దిష్ట స్థాయి మేధస్సు ఉన్నందున, మీ అంతట మీరే నచ్చింది చేయగలరని అనుకుంటున్నారు. మీకు నచ్చింది చేసుకుంటే ఒక కరగని బాండరాయిలా తయారవుతారు.
మీరు ఇక్కడ ఇలా కూర్చున్నప్పుడు, గాలి నిరంతరం శ్వాస రూపంలో మీలోకి ప్రవేశిస్తోంది, మీరు జీవించగలిగేలా చేస్తోంది; దీన్ని మీరు అనుమతిస్తున్నారు. మీరు ఆకలితో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్నది మీ పళ్లెంలోకి ప్రవేశిస్తోంది; మీరు దానినీ అనుమతిస్తున్నారు. మీరు మనుగడ కోసం ఒకటి రెండు తలుపులు మాత్రమే తెరిచి ఉంచి, మిగతావన్నీ మూసివేశారు. మీరు అర్ధం చేస్కోవాల్సింది ఏంటంటే, "నేను నా ముక్కు రంధ్రాలను తెరవకపోతే, శ్వాస తీసుకోలేను. నోరు తెరవకపోతే తినలేను" అని. కానీ మీరు నిజంగా తెలివైన వారైతే, మీరు దీన్ని మరింత అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించాలి. “నేను పూర్తిగా తెరుచుకోకపోతే, నా జీవితం దాని పూర్తి సంభావనీయతతో జరగదు. జీవితాన్ని పూర్తి స్థాయిలో నేను తెలుసుకోలేను” అని. దీనికి అసాధారణ తెలివితేటలు అవసరం లేదు. దీన్ని అర్థం చేసుకునేంత తెలివి అందరికీ ఉంది.
మీరు ఉప్పుబొమ్మగా మారడం అంటే మీరు ఎలా ఉన్నారో అలాగే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం, తద్వారా మీ కంటే ఎంతో ఉన్నతమైనది జరిగేందుకు అవకాశాన్ని కల్పించడం. సమస్య ఏమిటంటే మీతో మీరే ఆకర్షితులయ్యారు. ప్రతిదాని పట్ల మీకున్న అభిప్రాయాలు వల్లనే 'మీరు' ఉన్నారు. మీరు వేటి గురించీ, ఎటువంటి అభిప్రాయం లేకుండా ఉండడం చాలా ముఖ్యం. నాకు ఎవరిమీద ఎటువంటి అభిప్రాయం లేదు. నేను ఎప్పుడూ ఎవరిని కలిసినా మొదటిసారి కలుస్తున్నట్లుగానే కలుస్తాను. ఎల్లప్పుడూ. అవును, పని ఇంకా కార్యాచరణ విషయానికి వస్తే, వారు నిన్న ఏమి చేసారో అనేదాన్ని పరిగణిస్తాము. నిర్దిష్ట కార్యకలాపాలకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పోకడలను, ధోరణులను తెలుసుకుంటాము. ఆధ్యాత్మిక పని విషయానికి వస్తే, నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఒకరి కర్మ సమాచారాన్ని జల్లెడ పట్టి చూస్తాను, అది పని కోసం మాత్రమే. మాములుగా నేను ఎవరినైనా కలిసినప్పుడు, మొదటి సారి కలిసినట్టుగానే కలుస్తాను ఎందుకంటే మీరు చేయగలిగిన చెత్త పని ఏంటంటే మరొక జీవి గురించి అభిప్రాయం కలిగి ఉండటమే. ఏ జీవిపైనా అభిప్రాయాన్ని కలిగి ఉండే హక్కు మీకు లేదు.
మీరు కరిగిపోవాలనుకుంటే, ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేనిపైనా అభిప్రాయాన్ని కలిగి ఉండకూడదు. ప్రతిదానిపై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటానికి సమాజం మీకు శిక్షణ ఇస్తోంది; అలా చెయ్యకపోతే మీకు సమాజంలో ఆత్మగౌరవం ఉండదు. మీ పట్ల మీకు ఎంత చిన్న చూపంటే, ఎవరో వచ్చి, "ఓహ్ ! మీరు ఒక అందమైన వ్యక్తి" అని చెప్పాల్సివస్తుంది. మీరు అభిప్రాయాల ద్వారా అభివృద్ధి చెందుతున్నారు. ఇతరుల అభిప్రాయాలుపై మాత్రమే కాదు, మీ స్వంత అభిప్రాయాల వల్ల కూడా. మీకున్న అభిప్రాయాల వల్ల మాత్రమే మీకు ఒక వ్యక్తిత్వం ఉంది. మీకు ఏ అభిప్రాయం లేకపోతే, ఒక ఉప్పు బొమ్మలా ఉంటారు. మీరు ఊరికే కూర్చుంటే గాలి మాత్రమే కాదు, ఉనికి మొత్తం మీలోకి ప్రవేశిస్తుంది. మీకున్న స్వంత అభిప్రాయాలు తప్ప మరేదీ దీనిని ఆపలేదు. మీ గురించి లేదా ఎవరి గురించి అయినా ఎటువంటి అభిప్రాయాలను కలిగి ఉండకండి. ప్రతి దాన్ని అది ఉన్న విధంగా చూడండి - మీరు అన్నింటితో కలిసిపోతారు. మరో మార్గం లేదు.