నన్ను తఱచుగా అడిగే ప్రశ్నల్లో ఒకటి వివాహం చేసుకోటానికి లేదా సాహచర్యానికి తగిన వ్యక్తిని ఎంచుకోవటం ఎలా ? అనేది. మనకి అన్నివిధాలుగా సరిపోయే వ్యక్తి కోసం వెదకటం అంటే అసాధ్యాన్ని సాధ్యం చేయాలనుకోడమే. వైవాహిక జీవితం అల్లకల్లోలంగా ఉండడానికి బహుశా ఒక కారణం - ఈ సంబంధంలో మీరు చాలా విషయాలను పంచుకోవాల్సి రావడం కావచ్చు. అసలు విషయం పెళ్లి , ఆడ/ మగా లేక భార్య/ భర్త గురించి కాదు. ఎప్పుడైనా సరే , మీరు అన్నీ చాలా ఎక్కువగా ఇతరులతో తప్పక పంచుకోవాల్సిన పరిస్థితి వస్తే, మీకు సమస్యలు వస్తాయి.

సాధారణంగా, పెళ్లి లేదా సహజీవనంలో, మీరు కలిసి ఉండే చోటు దగ్గరనించి, దాదాపు ప్రతి విషయాన్నీ పంచుకోవాల్సి వస్తుంది. అందువల్ల , ప్రతి రోజూ మీరు ఒకరి దారికి మరొకరు అడ్డు తగులుతూనే ఉంటారు. ఇతరమైన సంబంధాల్లో, ఎవరైనా హద్దు దాటి ప్రవర్తిస్తున్నారు అంటే, మనం వారిని దూరంగా పెట్టవచ్చు. కానీ, ఇక్కడ మీకు ఆ అవకాశం లేదు. ఎంత దగ్గరగా మసలాల్సిన పరిస్థితి వస్తే, అంత ఎక్కువ ఘర్షణ .

వివాహం ఫలప్రదం కావడానికి కావలసింది ఏ లోపమూ లేని సర్వగుణ సంపన్నుడైన వ్యక్తి కాదు. ఈ భూలోకంలో లోపం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు.

చక్కగా కలిసి ఉంటూ, ఒకరిపట్ల మరొకరికి గాఢానురక్తితో, అద్భుతంగా ఉండే ఎన్నో జంటలున్నాయి. అలాగే, మరి కొంతమంది విషయంలో ఇదే సంబంధం చాలా జుగుప్సాకరంగా కూడా మారవచ్చు. ఆంతర్గతంగా వారి మధ్య ఏం జరుగుతోందో ఎవరికీ తెలియకపోవడం ఈ పరిణామానికి దోహదకారి కావచ్చు. వీధిలో వెళ్తుండగా ఎవరైనా మీ కాలు తొక్కితే మీ ప్రతిస్పందన, నలుగురూ చూస్తున్నారు కాబట్టి, వేరే విధంగా ఉంటుంది. అదే ఇంట్లో భార్య భర్తల మధ్య అయితే గమనించేవారు ఎవరూ లేరు కాబట్టి, ఏమైనా జరగవచ్చు.

వివాహం ఫలప్రదం కావడానికి కావలసింది ఏ లోపమూ లేని సర్వగుణ సంపన్నుడైన వ్యక్తి కాదు. ఈ భూలోకంలో లోపం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ లేరు. కావలసింది సంపూర్ణమైన నిబద్ధత. ఎవరూ గమనిస్తున్నా, లేకున్నా మీ ప్రవర్తన ఒకే రీతిలోఉండాలి. మీ చుట్టూ ఉన్న మనుషుల వల్ల, లేదా పరిస్థితులవల్ల మీ వ్యక్తిత్వం మారిపోకూడదు. మీరెవరన్నది ఒక్కసారి స్థిరపరచుకుంటే, ఇతరులతో కలిసి గడపడం చాలా ఆనందదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి మరో ముఖ్యమైన అంశం- మీరు పరస్పరం ఒకరి నుంచి ఒకరు ఎదో పొందాలని ఆశిస్తూ, మీ భాగస్వామి నుంచి అది మీకు దొరక్కపోతే, ఆ పరిస్థితి నిరంతరం సంఘర్షణకు కారణమవుతుంది.

ఇది కేవలం తాత్కాలికమైన సరదానా, లేక మీకు తోడుగా ఒకరు ఉండాలనే బలమైన కాంక్ష ఉందా అని, మీకు మీరు బేరీజు వేసుకుని నిర్ణయించుకోవాలి. ప్రతిఒక్కరూ పెళ్లి చేసుకోవాలని లేదు. అలాగే ఒంటరిగా ఉండిపోవాలనీ లేదు. ఇది ఎవరికి వారు పూర్తిగా వ్యక్తిగతంగా ఆలోచించుకుని తీసుకోవాల్సిన నిర్ణయం. మీకంటూ ఒకరు తోడు లేకపోతె మీరు బ్రతకలేరని, వివాహం మీ భావి శ్రేయస్సుకు దోహదకారి అని మీకు బలంగా అనిపిస్తే మీరు తప్పక పెళ్లి చేసుకోండి.

పెళ్లి చేసుకోవడం లో తప్పేమీ లేదు. కానీ మీకు ఆ అవసరం లేకుండా మీరు పెళ్లి చేసుకుంటే అదో పెద్ద నేరం. ఎందుకం , దాని వల్ల మీరే కాకుండా మరో జీవిని కూడా మీరు కష్టపెడుతున్నారు. మానవ జాతి అంతరించిపోతున్నట్టయితే, మిమ్మల్నందిరినీ పెళ్లి చేసుకోమనే చెప్తాం. కానీ ప్రస్తుతం జనాభా మితిమీరిపోయింది. మీరు పిల్లల్ని కనకుండా ఉంటే మానవాళికి మేలు చేసినవారవుతారు. ఇవన్నీ పక్కన పెట్టి, అసలు ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెళ్లి అందరికీ తప్పనిసరి ఏమీ కాదు.

"నేనొక సహచరుని ఎంచుకోవాలా?" అని ఒకసారి గౌతమ బుధ్ధుణ్ణి ఒకరు అడిగారు. "ఒక మూర్ఖునితో నడిచేకంటే, ఒంటరిగా నడవడం మేలు " అని ఆయన అన్నాడు. నేనంత క్రూరుణ్ణి కాదు. నేనేమంటున్నానంటే, మీకు మీలాంటి మరో మూర్ఖుడు దొరికితే సరే. ఎదో ఒకటి చేయవచ్చుమీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. అంతేకాని, సమాజం కోసం కాదు. అందరూ చేసుకుంటున్నారని కాదు. లేక మీరు ఒంటరి అయిపోతారేమో అన్న భయంతోనూ కాదు.

అసలు మీకు ఒక తోడు ఎందుకు కావాలి? "ఒకవేళ నాకేమైనా మతి తప్పితే, నాతోపాటు మరొకళ్ళు కూడా ఉంటారు మతి పోగొట్టుకోడానికి " -- అని కాదు.. సహజీవనం లేదా వివాహం మీ అస్తిత్వానికి సంబంధించిన సమస్యలని పరిష్కరించలేవు. అవి కేవలం మీ అవసరాలను తీరుస్తాయి. అంతే. మీకు గాఢమైన శారీరిక, మానసిక, భావోద్వేగ సంబంధ కాంక్షలుంటే, మీరు తప్పక తోడు కోసం చూడాలి. కేవలం సామాజిక, ఆర్ధిక అవసరాల కోసం పెళ్లి చేసుకోకూడదు.

మీరు గుర్తుంచుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, మీకు తోడు కావాలి కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. అది శారీరికం, మానసికం, సామాజికం, ఆర్ధికం ఏదైనా కావచ్చు, మీరేమీ అవతలి వ్యక్తి మీద జాలిపడి పెళ్లి చేసుకోలేదు. మీకు కొన్ని అవసరాలున్నాయి కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. అవి మీకు అవతలి వ్యక్తి ఇవ్వగలిగితే, మీరందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉంటూ జీవితం గడిపితే, అప్పుడు ఘర్షణ కు అంతగా అవకాశం ఉండదు.

ఆదర్శమైన స్త్రీ , పురుషుల కోసం వెతకకండి. అలాటివాళ్ళెవరూ ఉండరు. మీ ఆకాంక్షలే మీరు తోడు కోరుకునేలా చేస్తున్నాయని మీరు అర్థం చేసుకున్నట్లయితే , మీతో అనుకూలంగా ఉండే వ్యక్తి కోసం వెతకండి. మీరు మీ భాగస్వామిని ఆదరించి, గౌరవం, ప్రేమ చూపి, పరస్పరం బాధ్యత వహించి మెలిగినట్లయితే అది ఒక అందమైన సంబంధంగా రూపు దిద్దుకుంటుంది.

నిర్జిత ఛాయ

రెండు జీవితాలు కలిసి ఒకటవడం ప్రతి ప్రేమికుడి కోరిక

మరో బ్రతుకుతో ముడిపడాలనే కోరిక

అది జీవనపు అనుభూతుల అంచులు చేరాలనే తపనే

కలిసి ఉండడంలో కాదు ఉన్న అందం

అది పరిపూర్ణమైన ఏకత్వానిది 

ఛాయా - తత్ కారకం వలె

అరుదైన ఆ కొన్ని క్షణాల్లో ఒక్కటిగా ... ...కానీ ..అయ్యో .. ఈ జీవితమెంత నిలకడ లేనిది ..


కదిలే కాంతి మూలంతో, కలవవు నీడలు ఎల్లపుడూ వృద్ధి, క్షీణమయేవి అవి, గడచే ప్రతి క్షణమూ

మీలోని అస్పష్టతలు తెస్తూంటవి రకరకాల నీడలు


నీడలు  జయించి  నిలిచే జీవన  నైర్మల్యపు ఎరుకతో నడచి,

అద్వితీయమైన ఏకత్వపు అమరిక ఉనికిని  తెలుసుకొందురుగాక

ప్రేమాశీస్సులతో,

సద్గురు