అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దీని వెనక ఉన్న ఆంతర్యం ఏమిటి? అందరూ ఉపవాసం చేయాలా లేక ఏదైనా ప్రత్యేకమైన రోజున చేయాలా..ఇలాంటి ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానం..

Sadhguruమీరు శరీరంలో సహజమైన ఆవృతిని గమనిస్తే, మీరు "మండలం" ప్రమాణాన్ని గమనించగలరు. మండలం అంటే శరీర వ్యవస్థలో మార్పులు పునరావృతమయే 40 నుండి 48 రోజుల కాల వృత్తం. ఈ కాల వృత్తంలో మీకు 3 రోజుల పాటు ఆహారం అవసరం లేదు. మీకు మీ శరీరం ఎలా పనిచేస్తోందో అనే స్పృహ ఉంటే, మీకు ఫలానా రోజున భోజనం అక్కరలేదన్న సంగతి తెలుస్తుంది. మీరు ఆ రోజునా ఏ శ్రమ లేకుండానే, భోజనం చేయకుండా  గడపగలరు. చివరకి కుక్కలకీ, పిల్లులకీ కూడా ఈ అవగాహన ఉంది. ఒకరోజు అవి అసలు ఆహారం ముట్టుకోవు. ఏ రోజైతే వ్యవస్థ ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తుందో, ఆ రోజు శరీరం తనిని తాను శుద్ధి చేసుకునే రోజు. చాలామందికి ఏ రోజు భోజనం చేయకుండా ఉండాలో తెలీదు గనుక, భారతీయ పంచాంగంలో, ఆ రోజును ఏకాదశిగా గుర్తించారు - ఏకాదశి చాంద్రమానంలో 11వ రోజు. అది ప్రతి 14రోజులకీ పునరావృతమౌతుంది. అది సంప్రదాయంగా ఉపవాసం చేసే రోజు.

కొంతమంది ప్రజలు, వాళ్ళ పని ఒత్తిడి వల్ల, వాళ్ళకి తగిన ఆధ్యాత్మిక శిక్షణ లేనపుడు, ఆ రోజు ఉపవాసం చేయలేకపొతే, వాళ్ళు పండ్లను తిని గడపడానికి నిర్ణయించుకోవచ్చు. మీ మనసునీ, శరీరాన్నీ ముందుగా ఉపవాసానికి తగిన విధంగా సిద్ధం చేయకుండా బలవంతంగా ఉపవాసం చేస్తే, లాభానికి బదులు మీ ఆరోగ్యానికి హాని చేసుకుంటారు. మీ శరీరమూ, మనసూ, శక్తీ, ఆ సాధనకి తగినట్లుగా తయారుగా ఉంటే, మీకు ఉపవాసం వల్ల లాభం చేకూరుతుంది. తరచు పొగతాగేవారికీ, కాఫీ తాగేవారికీ, ఉపవాసం చేయడం చాలా కష్టం అనిపించవచ్చు. కనుక, ఉపవాసం ప్రారంభించక ముందు మీ శరీరాన్ని సరియైన పోషక విలువలున్న పదార్థాలు తినడం ద్వారా సిద్ధం చెయ్యండి. ముఖ్యంగా నీరు ఎక్కువగా ఉండే పళ్ళూ, కూరగాయలూ తినడం ద్వారా. అందరికీ ఉపవాసం చేయడం మంచిది కాకపోవచ్చు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే దానివల్ల ఎన్నో లాభాలున్నాయి.

 దీనికి కారణం, నీటి నుండీ, గాలి నుండీ, సూర్య రశ్మి నుండీ, గ్రహించిన శక్తిని మీలో ఇముడ్చుకోగల సమర్థత  చాంద్రమానం ప్రకారం కొన్ని రోజుల్లో అధికంగా ఉంటుంది.

యోగా యొక్క ప్రయత్నమూ, లక్ష్యమూ, ఈ భౌతిక శరీరమనే సాలెగూడును పగుల గొట్టి, విశ్వమంతటినీ మీలో భాగంగా అనుభూతి చెందగల విస్తృతమైన సంవేదనాత్మక శరీరాన్ని మీరు ధరించేలా చెయ్యగలగడమే. ఉపవాసం ఈ తర్కంలో భాగమే - మీరు ఏమీ తినకుండానే, పౌష్టిక పదార్ధాలను గ్రహించగలగడం..! శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపి శుద్ధి చేసుకోవడం పేరుతో ఈ రోజుల్లో ఉపవాసం ఆచరించవచ్చు. కానీ, ఆ ప్రక్రియ వెనుక ఉన్న తర్కం ఇది.  అందుకనే ప్రపంచంలో ప్రతి మతమూ దాని అనుసరించే వారికి కొన్ని రోజులు ఉపవాస దీక్షకు నిర్ణయించింది. యోగ సంప్రదాయంలో, చాంద్రమానం ప్రకారం ఈ ఉపవాస దినాలు నిర్ణయించబడ్డాయి. దీనికి కారణం, నీటి నుండీ, గాలి నుండీ, సూర్య రశ్మి నుండీ, గ్రహించిన శక్తిని మీలో ఇముడ్చుకోగల సమర్థత  చాంద్రమానం ప్రకారం కొన్ని రోజుల్లో అధికంగా ఉంటుంది. కొన్ని మతాల్లో ఈ ఉపవాస దీక్ష మండు వేసవిలో నిర్ణయించబడింది. ఆ సమయంలో సూర్య రశ్మినీ, నీటినీ మనుషులు తమ వ్యవస్థలోకి స్వీకరించగల అవకాశాలు చాలా ఎక్కువ ఉండడమే దీనికి కారణం.

మా అవ్వ ఒక అద్భుతమైన మనిషి. ఆమె గురించి ఏమీ తెలియనివారు ఆమె చిత్రంగా ప్రవర్తిస్తుందని అనుకునేవారు. ఇందుకు కారణం ఆమె తరచు, తన ఆహారాన్ని చీమలకీ, పిచ్చుకలకీ పెడుతుండేది. అలా చేస్తున్నపుడు ఆమె కళ్ళవెంట తన్మయత్వంతో ఆనందభాష్పాలు కారేవి. ఆమె చుట్టూ ఉన్నవారు, "అవ్వా, అదేదో నువ్వే ఎందుకు తినవు?" అని అంటుండేవారు. ఆమె కేవలం, "నా కడుపు నిండుగా ఉంది," అని చెప్పి ఊరుకునేది. ఆమెకి సలహా ఇచ్చిన వారంతా ఎప్పుడో గతించిపోయారు. ఆమె మాత్రం నిండు జీవితం గడిపి 113 సంవత్సరాల వయసులో మరణించింది.

 మీరు ఆకలిగా ఉన్నప్పుడు మీ శరీరం కోరుకునేది కేవలం ఆహారం. వెంటనే ఆహారాన్ని తీసుకోకుండా, రెండు నిముషాలు నిరీక్షించండి. అది మీలో ఎంతో మార్పును తీసుకువస్తుంది.

మా అమ్మగారు కూడా ఇలా చేస్తుండేవారు. ప్రతిరోజూ ఉదయం ఫలహారం చేసేముందు, ఒక పిడికెడు ఆహారం తీసుకుని చీమలకి పెట్టడానికి వెతుకుతూ వెళ్ళేవారు. మా కుటుంబంలో స్త్రీలందరికీ ఇదే సంప్రదాయంగా వస్తున్న అలవాటు. మీ చుట్టూ మీరు చూసే జీవరాశిలో అప్రధానమని భావించే అతి చిన్న జీవి చీమ. ఆ కారణంగానే మీరు దానికి ఆహారం పెట్టాలి, దేవుడికీ, దేవతలకీ కాదు. ఈ భూమి మీకెంత చెందుతుందో, వాటికీ అంతే చెందుతుంది. ఈ భూమి మీద జీవించడానికి మీకెంత హక్కు ఉందో ప్రతిప్రాణికీ అంతే హక్కు ఉంది. ఈ ఎరుక మీ శారీరక, మానసిక స్పృహ పెంపొందడానికి తోడ్పడుతుంది. అతి తేలికైన ఇటువంటి సాధన, మిమ్మల్ని మీ భౌతిక శరీరంతో గుర్తించుకోవడం నుండి తప్పిస్తుంది. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీ శరీరంతో గుర్తించుకోవడం తగ్గిస్తారో, ఇతర పరిమాణాలలో మీరెవ్వరన్న స్పృహ సహజంగా అధికమౌతుంది. మీరు ఆకలిగా ఉన్నప్పుడు మీ శరీరం కోరుకునేది కేవలం ఆహారం. వెంటనే ఆహారాన్ని తీసుకోకుండా, రెండు నిముషాలు నిరీక్షించండి. అది మీలో ఎంతో మార్పును తీసుకువస్తుంది. మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు మీరు శరీరమే.  దానికి కొంత విరామం ఇస్తే, ఆ తర్వాత మీరు కేవలం  శరీరం కాదు.

గౌతమబుద్ధుడు "మీరు బాగా ఆకలితో ఉన్నప్పుడు, మీ ఆహారాన్ని మరొకరికి ఇవ్వగలిగితే, మీరు మరింత బలశాలురవుతా"రని చెప్పేవరకు వెళ్ళాడు. నేను మీతో అంతదాకా వెళ్ళను గాని,  నేనొకటే చెబుతాను: కేవలం కొన్ని నిముషాలు ఏదీ తీసుకోకుండా ఆగండి. అది మిమ్మల్ని తప్పకుండా బలశాలిని చేస్తుంది. మీరు ఆహారం తీసుకోకుండా ఉండలేను అనుకున్నప్పుడు, స్పృహతో ఒక భోజనాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. ఇది ప్రయత్నించి చూడండి: మీరు బాగా ఆకలిగా ఉన్నరోజు, మరీ ముఖ్యంగా మీకు బాగా ఇష్టమైన వంటకాలు వండుతున్నప్పుడు, భోజనం చెయ్యడం మానెయ్యడానికి ప్రయత్నించి చూడండి. ఇది మిమ్మల్ని హింసించు కోవడానికి కాదు, అతి సులువుగా హింసకు గురికాగల మీ శరీరం నుండి స్వేఛ్ఛను పొందడానికి.

ఉపవాసం చెయ్యడం అంటే, మీరు ఏరకమైన ఆహారం తీసుకుంటారో, ఎంత తింటారో, ఎలా తింటారో అన్నవి, మీ నిర్బంధనలు  నిర్ణయించకుండా, "మీరు" స్పృహతో నిర్ణయించుకోగలిగేలా చేసే ప్రయత్నం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు