శిరోముండనం చేయించుకోవటంగానీ, లేక జుట్టును అల్లాగే పెరిగిపోనివ్వటం గానీ ఆధ్యాత్మికమార్గంలో ప్రగతిని ఎలా ప్రభావితం చేస్తాయో సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: మన ఆశ్రమంలోనూ, ఇతరప్రదేశాలలో చాలా చోట్ల కూడా సన్యాసులలో కొందరు పూర్తిగా శిరోముండనం (head shaving) చేయించుకోవడం కనిపిస్తుంది. మరికొందరు కేశాలకు కత్తిరింపే లేకుండా పొడుగ్గా పెరగనిస్తారు.ఈ రెంటికీ మధ్య వ్యత్యాసం ఏమిటి?

సద్గురు: మీరు గమనించారో లేదో, చెట్ల ఆకులని ఎప్పటికప్పుడు సమంగా కత్తిరిస్తూ ఉంటే, చెట్టు తన ప్రాణ శక్తిని అలా కత్తెర పడిన ప్రాంతాల మీదికి ఎక్కువగా ప్రసరింపజేస్తుంది. ఆ తరవాత ఆ కత్తెరపడిన చోట పుట్టుకొచ్చే ఆకుల సంఖ్య చెట్టులో మిగతా చోట్ల పుట్టుకొచ్చే ఆకుల సంఖ్య కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం చెట్టు తన శక్తిని కత్తెర పడ్డ ప్రాంతం మీదికి మళ్లించటం. మీ శరీరంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు అకస్మాత్తుగా జుట్టు కత్తిరించేసుకొంటే, మీ శక్తి ప్రవాహం అటువైపుగా ప్రవహిస్తుంది. కొన్ని రకాల ఆధ్యాత్మిక సాధనలు చేసే వారు అలా జరగాలని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు శిరోముండనం చేసుకోరు. శివరాత్రి (ప్రతీ నెల వచ్చే శివరాత్రి) నాడు చేసుకుంటారు. శివరాత్రి, అమావాస్యకు ఒక రోజు ముందు వస్తుంది. అమావాస్య నాడూ ఆ తరవాతి రోజూ మన శరీరంలో శక్తి స్థాయి ఉచ్చ దశలో ఉంటుంది. దాన్ని మరి కాస్త పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ శిరో ముండనం జరుపుతారు.

ఆ రోజు చేయించే శిరోముండనంతో ఒక సాధన ముడిపడి ఉంటుంది. అలా కాకుండా సాధనలతో నిమిత్తం లేకుండా చేయించే శిరో ముండనం వల్ల పెద్ద ప్రభావమేమీ ఉండదు. మీలో కొందరికి ఈ విషయం తెలిసి ఉండచ్చు, జీవితంలో ఎప్పుడూ శిరో ముండనం చేయించుకోని స్త్రీలు, మొదటిసారి చేయించుకున్నప్పుడు, ఒక్కొక్కప్పుడు కొంత మానసిక చాంచల్యానికి గురవుతుంటారు. ముండనం తరవాత శిరస్సు వైపు ప్రవహించే అదనపు శక్తి ప్రవాహానికి వాళ్ళు తట్టుకోలేకపోవటం వల్ల అలా జరుగుతుంది. ముందే మతిస్థిమితంలో ఏదైనా కొద్దిపాటి అసంతులనం (imbalance) ఉండి ఉంటే, అది మరింత తీవ్రమౌతుంది. కానీ ఆ శక్తి ప్రభావాన్ని కొంత క్రమబద్ధం చేసుకోగలిగి, దాన్ని సద్వినియోగం చేసుకోగల ఆధ్యాత్మిక సాధనలేవన్నా చేస్తూ ఉంటే మాత్రం, అది మీకు లాభాన్నే కలిగిస్తుంది. కేవలం తన ఆధ్యాత్మిక సంక్షేమం కోసమే కాకుండా, అంతకంటే ఉన్నతమైన లక్ష్య సిద్ధి కోసం అన్వేషిస్తున్న సాధకుడు లోకంలో అందుకు ఏ కొద్దిపాటి దోహదం కలిగించే ఉపాయం లభ్యమైనా వదిలిపెట్టడు. శిరోముండనం అటువంటి వాటిలో ఒకటి.

తన తలలో శక్తి ప్రవాహాలు పొంగి ఉబికి వస్తున్నప్పుడు, సాధకుడు తన భౌతిక శరీరానికి పైన ఉండే రెండు శక్తి చక్రాలను ఉత్తేజితం చేయగలిగితే, అప్పుడు ఆయనకి శిరోముండనం అవసరం ఉండదు. నిజానికి అలాంటి స్థితిలో ఆయన జుట్టు బాగా పెంచేసి తలపైన కొప్పుగా కట్టి ముడివేసుకుంటాడు. ఆ శక్తి చక్రాల రక్షణకూ పోషణకూ ఈ కొప్పు ఉపయోగపడుతుంది. తగినంత జుట్టు లేని వాళ్ళు తల గుడ్డను వాడతారు. భౌతిక శరీరానికి పైన ఉన్న ఆ రెండు చక్రాలూ ఉత్ప్రేరితం అయ్యాయంటే మాత్రం, అదొక మహత్తరమైన సంభావ్యత (phenomenal possibility)! అయితే, అలా జరిగినప్పుడు, అది మామూలు కంటే చాలా ఎక్కువ శక్తిని లాగేసుకుంటుంది కనక, భౌతిక శరీరం బాగా బలహీనమైపోతుంది. అందుకే, యోగులలో చాలా మంది 35 సంవత్సరాల వయసు కూడా దాటకుండానే చనిపోతారు. కారణం వాళ్ళు ఒక ఉన్నతమైన శక్తి స్థాయిని చేరుకుని ఉంటారు, కానీ వాళ్ళకు ఈ మానవ శరీర వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉండదు. మానవ శరీరం ఒక మహాద్భుతమైన యంత్రం. సృష్టికర్త దీన్ని అతి సంక్లిష్టంగా తీర్చి దిద్దాడు. ఆ సంక్లిష్టత వెనక ఉద్దేశ్యం ఈ యంత్ర నిర్మాణ రహస్యం ఎవరికీ అర్థం కాకూడదని కాదు. అలా తీర్చి దిద్దితేనే, ఈ యంత్రం ఒక సాధారణ యంత్రం కంటే ఎన్నో ఎక్కువ రెట్లు సంభావ్యతలు సాధించగలదని.

తన భౌతికత (physicality) విషయమై తగినంత అవగాహన లేనివాడు ఉన్నత సంభావ్యతలు పొందినప్పుడు, అవి అతడిని తన భౌతిక స్థితికి అతీతంగా దూరంగా లాక్కెళ్ళిపోతాయి. భౌతికత నుంచి దూరం కావటమంటే, భౌతిక శరీరం బాగా బలహీనం కావటం అయినా కావచ్చు, లేక, భౌతిక శరీరాన్ని పూర్తిగా వదిలిపోవటమైనా కావచ్చు! హఠయోగానికి ఈ రోజు ఇంత ప్రాముఖ్యత ఉన్నదంటే, అందుకు కారణం ఇదే. మీరు ఉన్నత సంభావ్యతలు కోసం ప్రయత్నించాలంటే, మీ ప్రాణ శక్తి స్థాయికీ మీ భౌతిక శరీరానికీ మధ్య సరైన అనుసంధానం ఉండాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు