మీ నుంచి ప్రజలు ఆశించే విషయాలు  మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, బహుశా మీరు ఆ విషయాలను వేరే కోణం నుండి చూడాల్సిన సమయం వచ్చింది. మన పరిమితులను దాటి జీవితంలో ఏదైనా ఉన్నతంగా చేయగల అవకాశంగా అంచనాలను చూడవచ్చని సద్గురు చెపుతున్నారు.

సద్గురు: ఒక్కొక్కరూ మీ నుంచి ఒక్కోలా ఆశిస్తూ ఉంటారు. ఇంకా ఈ అంచనాలు ఒక దానితో ఒకటి పొసగవు. మీ భార్య మీరు 5:30కల్లా ఇంటికి రావాలని కోరుకుంటుంది, కానీ మీ బాస్ మీరు సాయంత్రం 7:30 వరకూ ఆఫీసులో ఉండాలనుకుంటారు. మీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉన్నాయి, కానీ మీరు మీ తల్లిదండ్రుల ఆశలూ, మీ పిల్లల అంచనాలు, మీ యజమాని అంచనాలు ఇంకా అన్నింటినీ మించి మీ జీవిత భాగస్వామి ఆశలను నెరవేర్చాలంటే, మీకు నిజానికి రోజుకు అరవై గంటలు కావాల్సి వస్తుంది. "మరి అన్ని గంటలను నేను ఎక్కడ నుంచి తీసుకురాగలను?" అన్నది ప్రశ్న.

ప్రస్తుతం,  ప్రజలు మీ సామర్థ్యాలకు మించిన అంచనాలను మీపై పెట్టుకున్నారు. అందుకు  వారిని తిట్టుకోకండి. వారు మీ నుండి పెద్ద పెద్దవి ఆశించడం గొప్ప వరం.  ప్రజలు మిమ్మల్ని చూసి, "అయ్యో, మేము అతని నుండి ఏమీ ఆశించలేము" అని అనుకుంటే, వారు మీ పట్ల ఎటువంటి అంచనాలను కలిగి ఉండకపోతే, అది మీకు మంచిదని మీరు అనుకుంటున్నారా? మీ బాస్‍కి మీపై ఎలాంటి అంచనాలు లేకపోతే, మీ ఉద్యోగం పోతుంది.  అందరూ మీ నుంచి ఎన్నో ఆశిస్తున్నారు. మీ పరిమితులను దాటి జీవితంలో ఏదైనా చేయడానికి ఇదొక మంచి అవకాశం. అలా అని చెప్పి, అందరి  అంచనాలను నెరవేర్చడానికి, మీరు  ఏదైనా గొప్ప పని చేయాలా? అది అసాధ్యం. కానీ వారందరూ నిరంతరం మీరు చెయ్యగలిగే దానికంటే ఎక్కువ ఆశించినట్లయితే, మీ జీవితం చక్కగా సాగుతోందని అర్థం. దానిని మీరు ఆస్వాదించండి, అంతేకానీ తిట్టుకోకండి.  మీరు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా  చేయండి, అది మాత్రమే మీ చేతుల్లో ఉంది.

మీరు పర్ఫెక్ట్‌గా  ఉన్నంత  మాత్రాన,  జీవితం అందంగా మారదు, మీరు చేసే ప్రతి పనిని మనసు లగ్నం చేసి, చేయడం వల్ల మీ జీవితం అందంగా మారుతుంది.

ఇది, మీ పనిలో  పర్ఫెక్ట్‌గా  ఉండటం గురించి కాదు. జీవితంలో పర్ఫెక్షన్ అంటూ ఏమీ ఉండదు. పర్ఫెక్ట్‌గా జరిగేది ఒక్కటే, అది మరణం. మీరు పర్ఫెక్షన్ కోరుకుంటే, తెలియకుండానే మీరు మరణాన్ని కోరుకుంటున్నట్టే. జీవితంలో పర్ఫెక్షన్‌ను   కోరుకోవద్దు. మీరు పర్ఫెక్ట్‌గా ఉన్నంత మాత్రాన, జీవితం అందంగా మారదు, మీరు చేసే ప్రతి పనిని మనసు లగ్నం చేసి, చేయడం వల్ల మీ జీవితం అందంగా మారుతుంది. జీవితం ఎప్పటికీ పర్ఫెక్ట్‌గా ఉండదు, ఎందుకంటే మీరు ప్రస్తుతం ఎలా ఉన్నప్పటికీ,  అంతకన్నా ఇంకొంచెం బాగా ఉండవచ్చు, అవునా? కాబట్టి పర్ఫెక్షన్ అనేది అసాధ్యం. మీమీద ఎక్కువ అంచనాలు ఉన్నప్పుడే, మీరు మీ పరిమితులను దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇలా ఇంకొంచెం ముందుకు వెళ్లగలిగితే, మీరింకా మీ పరిమితిని చేరుకోలేదని అర్థం. ఎటువంటి అంచనాలు లేకపోతే, మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు.

ఎవరి అంచనాలు లేకుండానే మీరు మీ పూర్తిస్థాయి సామర్ధ్యాన్ని చేరుకోవడానికి, పూర్తిగా భిన్నమైన  చైతన్యం ఇంకా ఎరుక అవసరం. దానికి మీలో ఇంకేదో ఉండాలి. ప్రస్తుతం మీరు అలా లేరు. మీరు కేవలం జనాల అంచనాలను బట్టి మాత్రమే  నడుచుకుంటుకున్నారు. కాబట్టి వారిని మీ నుండి ఇంకా పెద్ద పెద్ద విషయాలను ఆశించనివ్వండి. వారి అంచనాలకు తగినట్టుగా మీరు చేయగలిగినంత చేయండి.  ఎప్పుడూ, కొన్ని విషయాలు మన అదుపు;లో ఉండవు,  మీరు ఎన్ని ఎక్కువ పనులు చేస్తుంటే అన్ని ఎక్కువ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఎన్నో విషయాలు సక్రమంగా కూడా జరుగుతాయి. మీరు ఎంత బాగా జీవిస్తున్నారు లేదా మీ జీవిత సాఫల్యం అనేది ఏదోక దాన్ని సాధించడం మీద ఆధారపడకూడదు. అది మీరు పూర్తిగా అంకితభావంతో చేస్తున్నారా లేదా  అనే దానిపై ఆధారపడి ఉండాలి. మీ సామర్ధ్యం, పరిస్థితులు ఇంకా అవి మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయా లేదా అనే ఎన్నో విషయాలను బట్టి, ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ మీ జీవితంలో మీకు ఎంతో విలువైన వాటి పట్ల పూర్తి శ్రద్ధతో ఉంటున్నారా? అన్నదే ప్రశ్న.

మీరు ఉద్యోగం చేస్తారు, మీ కుటుంబాన్ని పోషించాలి - ఇది  మనుగడ, పెద్ద విషయమేమీ కాదు. మీరేమీ గొప్ప పనులు చేయట్లేదు. వీటిని చేయడానికి పెద్దగా ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది అదే తమ జీవిత ధ్యేయంగా బతుకుతున్నారు. వారి జీవిత ధ్యేయం ఏమిటంటే జీవనోపాధి పొంది, ఎలాగోలా బతకడం. అది అలా ఉండకూడదు. మనిషికి అంతకంటే ఎంతో ఎక్కువ సమర్థత ఉంది. ఈ సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి, మీ మనస్సును కొంతవరకైనా స్పష్టంగా ఉంచుకోవడం అవసరం. దీని కోసం  కొన్ని సరళమైన  సాధనలు, ప్రాక్టీసులు ఉన్నాయి. వీటితో మీరు కొన్నాళ్ల పాటు సాధన చేస్తే, మీ మనసులో స్పష్టత ఏర్పడి, మీరు విషయాలను మరింత స్పష్టతతో చూడగలరు. ఇది మీ సామర్థ్యానికి మించినదేమీ కాదు. ఇది మీరు చేయగలిగినదే, మీ మంచి కోసం తప్పకుండా మీరు ఇలా చేసి తీరాలి.