సద్గురు: ప్రజలు దేవుడిని నమ్మాలా వద్దా అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు రెండు చేతులు ఉన్నాయని మీరు నమ్ముతున్నారా? లేదా, మీకు రెండు చేతులు ఉన్నాయని మీకు తెలుసా? మీకు రెండు చేతులు ఉన్నాయని తెలుసుకోవడానికి మీరు మీ చేతులను చూడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీ అనుభవంలో రెండు చేతులు ఉన్నాయని మీకు తెలుసు. చేతుల విషయానికి వస్తే, మీకు తెలుసు రెండు ఉన్నాయని. కానీ దేవుళ్ళ విషయంలో, మీరు ఎందుకు నమ్మవలసి వస్తోంది? మీకు తెలియదు అని ఒప్పుకునేంత చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి ముఖ్యమైన కారణం. 

మీకు తెలియదు అని ఒప్పుకునేంత సూటిగా మీరు లేనందున నమ్మవలసి వస్తుంది. "నాకు తెలియదు" అనేది ఒక అద్భుతమైన అవకాశం. "నాకు తెలియదు" అని మీరు గ్రహించినప్పుడు మాత్రమే తెలుసుకోవాలనే తపన వస్తుంది. తెలుసుకోవాలనే తపన వచ్చినప్పుడు, అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణ మొదలైనప్పుడు, తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే, మీకు తెలియని వాటిని విశ్వసించడం మొదలుపెడితే, ఇక మీకు ఎప్పటికీ తెలిసే అవకాశం లేకుండా మీరు చేసుకున్నట్టె.

 

"నాకు తెలియదు" అనేది ఒక అవకాశం

అటు పక్కన ఉన్నదాన్ని ఊహించికుంటే నిజమైన అన్వేషణ జరగదు. ఒకరికి అటు పక్కన ఏముందో తెలియనప్పుడే, అతని అన్వేషణ నిజంగా నిజమైనది అవుతుంది. అన్వేషణ ఎల్లప్పుడూ "నాకు తెలియదు" నుండి ప్రారంభమవుతుంది. మీకు తెలియదు, కాబట్టి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అన్వేషణ అనేది ఒక నిర్దిష్టమైన అజ్ఞానము నుండి వస్తుంది, మీరు బయటకు రావాలనుకునే ఒక రకమైన శూన్యత నుండి. అన్వేషణ అనేది ఒక శోధన. అక్కడ ఏముందో మీకు తెలియదు; మీరు వెతుకుతున్నారు. మీరు మీ మార్గాన్ని కనుగొంటున్నారు.

మనం “శివ” అని చెప్పినప్పుడు మనం ఏదో దేవుడి గురించి మాట్లాడటం లేదు. చెప్పాలంటే, "శివ" అంటే " ఏదైతే లేదో అది" అని అర్ధం.

దురదృష్టవశాత్తు, ప్రపంచంలో చాలా మంది ప్రజలు కష్టపడటానికి ఇష్టపడటం లేదు. దాని వలన ఎన్నో నమ్మకాలు సులభమైన ప్రత్యామ్నాయంగా మారాయి. మీరు, “అవును, దైవం ఉంది. అవును, దెయ్యం ఉంది” అని నమ్ముతారు. దీనితో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవచ్చు, కానీ ఇది మీ మనస్సులో సృష్టించుకున్నారు కాబట్టి, అది అర్ధం లేని విషయం.

ప్రజల్లో చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. ప్రజలు స్వర్గం గురించి మాట్లాడుకుంటారు. మీరు ఇక్కడ పొందలేని వస్తువులన్నింటితో ఒక స్థలాన్ని ఊహించుకుంటారు - ఆహారం, స్త్రీలు, దేవతలు లేదా ఏదైనా కావచ్చు. మీకు ఇక్కడ దక్కని వాటన్నింటిని, “అక్కడ” ఉంచారు. అందుకే భారతీయ సంస్కృతిలో మనం "శి-వ" అని అన్నాము, అంటే " ఏదైతే లేదో అది" అని అర్థం.

మనం “శివ” అని అన్నప్పుడు మనం ఏదో దేవుడి గురించి మాట్లాడటం లేదు. చెప్పాలంటే, "శివ" అంటే " ఏదైతే లేదో అది" అని అక్షరాలా అర్ధం. సృష్టి అంతా శూన్యం నుండి వచ్చిందని, తిరిగి శూన్యంలో కలిసిపోతుందని నేటి భౌతిక శాస్త్రవేత్తలు నిరూపించారు. విశ్వం యొక్క ప్రాథమిక తత్వానికి ఈ విస్తారమైన శూన్యమే ఆధారం. ఎన్నో కోట్ల భారీ పాలపుంతలు ఈ విస్తారమైన శూన్యంలో సన్న చినుకులు మాత్రమే. ఈ శూన్యాన్నే మనం శివంగా సూచిస్తాము.

లేని దాన్ని ఊహించుకోవడం

కాబట్టి, అక్కడ పైన ఏముంది? ఏమీ లేదు. మీరు ఏమీ లేని విషయాన్ని ఎలా ఊహించుకుంటారు? గట్టిగా ప్రయత్నించి చూడండి! మీరు ఎంత ఎక్కువగా దీనిని అన్వయించుకుంటే, అంతగా అది మీ మనస్సులో ఉన్న అన్ని రూపాలను కూల్చి వేస్తుంది. ఈ సంస్కృతిలో, మీరు సృష్టించిన ప్రతీ రూపాన్ని కూల్చివేయడం గురించి మేము మాట్లాడుతున్నాము. కాబట్టి నిరంతరం “శివ” అని అనమని చెప్పాము. మీరు దేవుళ్లను సృష్టించారా లేదా దయ్యాలను లేదా పిశాచాలను సృష్టించారా అనేది ముఖ్యం కాదు. మీరు వాటిని సృష్టించారు. వాటిని కూల్చివేయకపోతే, మీరు వాస్తవాన్ని ఎప్పటికీ చూడలేరు. ఇవన్నీ మీ చుట్టూ తిరుగుతున్నాయని మీరు ఎల్లప్పుడూ ఊహించుకుంటూ ఉంటారు. కాబట్టి వీటన్నింటినీ కూల్చివేయడానికి ఇది మీకు ఒక పద్దతిగా ఇవ్వబడింది.

మీరు "శివ" అని అంటారు, ఎందుకంటే మీరు లేనిదాన్ని భావన చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు ఇది ఎంత ఎక్కువగా చేస్తే అది మనస్సును అంత శుభ్రంగా ఇంకా నిర్మలంగా మారుస్తుంది.

ఆధ్యాత్మిక ప్రక్రియ యొక్క ప్రాథమిక అంశం ఏమిటంటే మీరు దేనినీ ఊహించుకోకూడదు. మీరు "శివ" అని అన్నప్పుడు, శివుడు అక్కడ కూర్చున్నాడని మీరు నమ్ముతున్నారని కాదు. మీరు ఒక శబ్దాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఈ ధ్వని ఆధారం లేకుండా ఇవ్వబడలేదు. వివిధ రకాల శబ్దాలు మీలో ఎలాంటి మార్పు తీసుకు వస్తాయో అనే దాన్ని మనం గమనించాము ఇంకా గ్రహించాము. శి-వ అనేది మీ ఊహలను కూల్చివేయడానికి ఒక మార్గం, తద్వారా జీవితంలోని ప్రతి క్షణం తాజాగా ప్రారంభమవుతుంది. మీ మానసిక వ్యవస్థ ఒక సాదా అద్దంలా మారుతుంది. అది అక్కడ ఉన్న వాటిని మాత్రమే మీకు చూపుతుంది, అంతకు మించి ఏమి చూపించకూడదు. మీ మనసు అలా ఉండాలి. అప్పుడు అది ఉపయోగకరమైన మనస్సు అవుతుంది. ప్రస్తుతం, దీనికి చాలా విషయాలు అంటుకొని ఉన్నాయి. మీ ఇంట్లో ఉన్న అద్దం ముందు ఎవరు వచ్చి నిలుచున్నా, ప్రతిబింబంలోని పది శాతం అది ఉంచేసుకునేలా మారితే, ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ... అప్పుడు అది ఒక్క క్షణంలో పనికిరాకుండా పోతుంది.

ఒక సిద్ధాంతంలో ఇమడ్చ లేనిదాన్ని మీరు సిద్ధాంతపరం చేయాలని ప్రయత్నించినప్పుడు, మీరు ఒక రూపం లేనిదాన్ని చూడటానికి ప్రయత్నిస్తున్నట్టె. మీరు నిజంగా దాని వైపుకు అడుగులు వేస్తే, అది అన్వేషించడం అవుతుంది. అప్పుడు మీరు భౌతికత్వాన్ని అధిగమిస్తారు. మీరు భౌతికత్వాన్ని అధిగమించి కూడా ఇక్కడ ఉన్నట్లయితే, మీరు వేరొక దానిని తాకినట్లు అర్థం. మేము ఆ వేరొక దానిని, " ఏదైతే లేదో అది" అని చెప్పాము.

కాబట్టి, మీరు "శివ" అని అన్నపుడు మీరు లేని దానిని సిద్ధాంతించాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఇది ఎంత ఎక్కువగా చేస్తే, అది మనస్సును అంత స్వచ్చంగా ఇంకా నిర్మలంగా మారుతుంది. మీరు ఇష్టపడేవి ఇంకా ఇష్టపడనివి, మీరు ప్రేమించేవి ఇంకా ద్వేషించేవి అన్నీ మాయమైపోతాయి. మీరు ఒక నిర్మలమైన ఇంకా స్వచ్చమైన మనసును కలిగి ఉంటే, ప్రతిదాన్నీ అది ఉన్న విధంగానే చూస్తారు ఎందుకంటే మీరు విశ్వంలో దేనినైనా చూసే ఏకైక ప్రదేశం, మీ మనస్సే. మీరు దానిని స్వచ్చంగా ఇంకా నిర్మలంగా ఉంచకపోతే, మరు సృష్టించుకున్న దయ్యాలే మీకు కనిపిస్తాయి.

దయ్యాలతో యుద్ధం చేయడం

నేను మీకు ఒక జోక్ చెప్తాను. వైద్యపరీక్ష కోసం ఓ వ్యక్తి ఆసుపత్రి లో చేరాడు. అతను చాలా వినయం గల వ్యక్తి. అతనికి ఇలాంటి శారీరక వైద్య పరీక్షలు అలవాటు లేదు. అక్కడ వారు అతని చేత, ఇది, అది, బరువులు ఎత్తడం, ట్రెడ్మిల్ మీద నడవడం ఇలా అన్ని రకాల పనులు చేయించారు. ఈ సమయంలో మొత్తానికీ, వారు అతనిని బాత్రూమ్ కు వెళ్ళనివ్వలేదు. అతను ఇంక ఆపుకోలేకపోవడంతో, అది మంచం మీదనే జరిగింది! అతను చాలా వినయం, బిడియం ఉన్న వ్యక్తి కావడంతో, అతన్ని పరీక్ష చేస్తున్న అందమైన నర్సు, మంచంపై అతను చేసిన దానిని ఆవిడ చూడకూడదనుకున్నాడు. కాబట్టి, అతను ఆ దుప్పటి తీసుకొని తను ఉన్న మూడవ అంతస్తు కిటికీలోంచి బయటికి విసిరేసాడు.

ఒక తాగుబోతు వీధిలో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా, ఈ తెల్లటి దుప్పటి తేలుతూ వచ్చి అతనిపై పడింది. అతను తన చేతులను కాళ్ళను ఇటు అటు ఆడించడం ప్రారంభించాడు, అక్కడే చుట్టూ తిరిగాడు. ఎలాగోలా, అతను దుప్పటిని తీసివేసాడు. అది అతని కాళ్ళ దగ్గర పడింది. అతను ఆ గజిబిజి దుప్పటి వైపు చూశాడు. అప్పుడు ఎవరో వచ్చి “ఏమైంది?” అని అడిగారు. అతను, "నేను దెయ్యం మల విసర్జన చేసేలా కోటాను!" అన్నాడు. చాలా మందిలో ఇదే జరుగుతోంది. మీరు ఉనికిలో లేని దయ్యాలతో పోరాడుతున్నారు. మీరు వాటితో యుద్ధం చేసి గెలవచ్చు, కానీ మీరు ఎంత ఎక్కువ గెలిస్తే అంత ఎక్కువ నష్టపోతారు.

అన్వేషించడం అంటే ఏదో ఊహించుకుని, అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించడం కాదు - అది పిచ్చి అవుతుంది. మీరు ఏమీ ఊహించుకోకూడదు. మీరు ఊహించుకోకుండా ఎలా ఉండగలరు? ఎందుకంటే ఒక్కసారి మీకు జ్ఞాపకశక్తి ఉంటే ఊహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి, ఈ సాధనం మీకు ఇవ్వబడింది - లేనిదాన్ని సిద్దాంత పరచాలని చూడకండి. కష్టపడి ప్రయత్నించండి. మీరే చూస్తారు, మీ మనస్సు మటు మాయమైపోతుంది.