జీవితం పట్ల మీకు సంవేదన ఉందా లేదా మీ అహం పట్ల స్పృహ కలిగి ఉన్నారా? జీవితంపట్ల మనం సంవేదనాత్మకం కావడానికి సద్గురు మనకు ఒక సరళమైన ప్రక్రియను తెల్పుతున్నారు.

ప్రశ్న : ఒక ఉన్నత దశకు చెందిన అవగాహనను అనుభూతి చెందాలంటే, ఒక వ్యక్తి  “జీవితం పట్ల సంవేదన”(Life Sensitive) కలిగి ఉండాలని మీరు చెప్పారు. సద్గురు, సంవేదన అంటే ఏమిటి? అది జన్మతః వస్తుందా లేక మనం దాన్ని పెంపొందించుకోవాలా?

సద్గురు : జన్మతః ఇటువంటి లక్షణం ఉండాలా? పసి పిల్లలంతా ఒకేలాగా కనిపిస్తారు. కాని, పిల్లల్లో ఒక్కొక్కరు మరొకరికంటే భిన్నంగా ఉండడం మీరు గమనించే ఉంటారు. పుట్టిన దగ్గర్నుంచీ వాళ్లెలా ప్రవర్తిస్తారు? ఎలా ఏడుస్తారు? ఎలా పాకుతారు? చేతులెలా కదిలిస్తారు? ఎలా కనిపిస్తారు? – ప్రతివిషయంలోనూ భేదం ఉంటుంది. వాళ్లంతా ఒక్కలాగే ఉన్నారనుకోవడం మూర్ఖత్వం. పెద్దవాళ్లు పరస్పరం ఎంత భిన్నంగా ఉంటారో, పిల్లలూ అంతే. ఒకరు ఒకలా పుట్టవచ్చు, మరొకరు మరోలాగా. ఒకరు ఒకవిధమైన సామర్థ్యంతో, మరొకరు అటువంటి భావన లేకుండా పుట్టవచ్చు. కాని జీవన సంవేదన, కేవలం పుట్టుకే నిర్ణయించే విషయం కాదు.

కాని జీవన సంవేదన, కేవలం పుట్టుకే నిర్ణయించే విషయం కాదు. 

పుట్టుక కొన్ని విషయాలను నిర్ణయించవచ్చు. మీరు ప్రారంభంలో అందరికంటే ముందుండవచ్చు. కాని పోటీ పూర్తయేసరికి చివరిస్థానంలోకి వెళ్లిపోవచ్చు. లేదా మీ కారు చెడిపోవచ్చు. మీరు ప్రారంభంలో చివర ఉండవచ్చు, కాని పోటీ గెలవవచ్చు. ఇది సాధ్యమే. పుట్టుక నిజంగానే మార్గం ఏర్పరచవచ్చు, కాని అదే ఏకైక నిర్ణయాత్మక అంశం కాదు. జీవితమే నిర్ణాయకాంశం.

జీవితం పట్ల సంవేదనాత్మకంగా ఉండడం..

మీరు జీవితంపట్ల సంవేదనాత్మకం కావాలంటే ముందు మీరే జీవితం కావలసి ఉంటుంది. ఇరవై నాలుగు గంటల్లో ఎంతసేపు మీరు జీవితంలో ఒక భాగంగా ఉన్నారు? ఎక్కువసేపు మీరు ఒక ఆలోచనగానో, ఒక భావోద్వేగంగానో, ఒక భావంగానో, ఒక అభిప్రాయంగానో, ఒక దర్శనంగానో, ఒక విశ్వాస వ్యవస్థగానో, ఒక సంబంధంగానో లేదా అటువంటిదే మరొకటి గానో ఉంటారు. మీరు జీవితంపట్ల సంవేదనాత్మకంగా ఉండాలంటే మీరే జీవితం కావాలి.

మీరు మీ శరీరాన్ని, మనసుని, మీకు కొంచెం దూరంగా ఉంచగలిగితే మీరు సహజంగానే జీవితంపట్ల సంవేదన కలిగిన వారవుతారు. యోగా పేరుతో మనం చేసేదంతా ఆ జీవిత సంవేదనను తెచ్చుకోవడానికే. మీరు జీవితంపట్ల సంవేదనతో ఉన్నప్పుడు మాత్రమే మీరు వాస్తవికతతో ఉన్నట్లు. ప్రస్తుతం మీరు ‘అహం’ కేంద్రంగా కలిగి ఉన్నారు. నేను చాలా ‘సంవేదనాత్మకమైన వ్యక్తిని’ అని మీరంటున్నారంటే మీకు చాలా పెద్ద, బలమైన అహం ఉందన్నమాట. మీరు సంవేదనశీలంగా ఉండడమంటే ఊరికే మనసు కష్ట పెట్టుకోవడమో, కోపం తెచ్చుకోవడం కాని, విసుగు చెందడం కాని కాదు. మీకు జీవితం పట్ల సంవేదన శీలం ఉందంటే మీరు ఎదుటి వ్యక్తి జీవితాన్నీ మీ జీవితంలాగానే చూస్తారు. ఎందుకంటే మీరు కూడా జీవితమే కాబట్టి. మీ చుట్టూ ఉన్నదంతా మీలాగే జీవితమే. మీరిక్కడ జీవితంగా కూర్చుని ఉంటే మీకు సహజంగానే ఆవిషయం తెలుస్తుంది. మీరిక్కడ ఒక ఆలోచనగానో, భావనగానో కూర్చుని ఉంటే మీరు తక్కిన అనుభవం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటారు. మీరిక్కడ జీవితం కంటే భిన్నంగా కూర్చుని ఉంటే, మీరు నకిలీ అన్నమాట; మీరు వాస్తవం కాదు.

మీరేమనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో దాని ప్రాధాన్యాన్ని తగ్గించండి.

మీరు జీవితం పట్ల సంవేదన శీలంగా ఉండాలంటే, స్పృహతో ఉండాలంటే మీరు చేయవలసిన మామూలు ప్రక్రియ ఇది: మీరేమనుకుంటున్నారో, ఆలోచిస్తున్నారో దాని ప్రాధాన్యాన్ని తగ్గించండి. ఒక్కరోజు ప్రయత్నించి చూడండి. అకస్మాత్తుగా మీరు చల్లగాలిని, వర్షాన్ని, పూలను, మనుషుల్ని, ప్రతి దాన్నీ పూర్తిగా భిన్నరీతిలో అనుభవించగలుగుతారు. అకస్మాత్తుగా మీలోని జీవం మరింత క్రియాశీలమూ, మరింత సజీవమూ నైన అనుభవాన్ని పొందుతుంది. అప్పుడు మీరు సంవేదనాశీల జీవితమవుతారు. మీరు ఈ జీవితంపట్ల సంవేదన శీలురయితే ఎదుటి జీవితం పట్ల కూడా సంవేదన శీలురవుతారు. ఎందుకంటే అప్పుడు మీరు ‘నేను’ అంటే కేవలం మీ శరీరంగా భావించరు. మీరు చుట్టూ కనక చూసినట్లయితే ఈ ‘నేను’ అంతటా కనిపిస్తుంది. అప్పుడు మీరు సహజంగానే ప్రతిదాని పట్లా సంవేదనశీలంతో ఉంటారు.

సంవేదనశీల జీవితం అన్నది ఒక అభ్యాసంకాని, సిద్ధాంతంకాని, దర్శనం కాని కాదు. మీరే జీవితమైతే మీరు జీవితంపట్ల సంవేదన శీలంగానే ఉంటారు. ప్రస్తుతం మాత్రం మీరు జీవితం తప్ప తక్కినదంతా కావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు; అదే అసలు సమస్య. మీరు ఒక ఆలోచనగానో, భావోద్వేగంగానో, భావనగానో, ఫలితాంశం గానో, అభిప్రాయంగానో, దర్శనంగానో, సిద్ధాంతంగానో, మరొకటిగానో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. మీ శరీరం, మీ బుద్ధి, మీ భావోద్వేగం చెప్తున్నది ముఖ్యం కాదని మీరు గుర్తించినప్పుడు మీరు ఆకస్మికంగా జీవితంపట్ల గాఢమైన సంవేదన శీలురవుతారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు