సెలవులైపోయి, పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, పాఠశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మళ్లీ గతానుగతికంగా విద్యా కార్యక్రమంలో మునిగిపోతారు. గత సంవత్సరం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, సమాజపు, చివరికి తమ సొంత ఆకాంక్షల బరువును తట్టుకోలేక 9000కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా టైమ్స్ అఫ్ ఇండియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా సద్గురు సందేశం ఇది. సామరస్య పూర్వకమైన శరీరం, సమతుల్యత కలిగిన బుద్ధి కోసం ప్రతిదినమూ యోగా చేయడం కోసం 30 నిమిషాలు కేటాయించవలసిందిగా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సద్గురు పిలుపునిస్తున్నారు.

ప్రియమైన తల్లిదండ్రులారా!

మీరు తీసికొనే నిర్ణయాలు చాలావరకు భయం నుండి ఉత్పన్నమవుతాయి. మీ పిల్లలకు అత్యుత్తమమైన విద్య లభించకపోతే వాళ్లు రోడ్డున పడతారని మీ భయం. ఒక తండ్రిగా మీ భయం వాస్తవమేనని నాకు తెలుసు. నిజమేమరి, ఒక సమాజంగా మనం ఏ ఒక్క వ్యక్తీ కూడా జీవితంలో నలిగిపోకుండా ఒక భద్రతావలయాన్ని సృష్టించడంలో విఫలమయ్యాం. కాని అర్థం చేసుకోండి. పరిస్థితులు ఇరవయ్యేళ్ల కిందటికంటే ఇవ్వాళ మెరుగ్గా ఉన్నాయి. మన  ఆర్థిక వ్యవస్థ 8-10 శాతం వృద్ధిని చూపిస్తున్నది. అంటే బతకడమెట్లా అన్న మీ భయం కొంచెం తగ్గిందన్నమాట. ఇప్పుడు జీవితాన్ని ఎలా మలచుకోవాలి అన్న విషయం గురించి మీరు ఆలోచించాలి. ఎవరూ హృదయపూర్వకంగా తమ మనస్సునంతా పెట్టి పనిచేస్తే తప్ప ఆ పని నుండి జీవనం సాధించలేరు. అందువల్ల తాను ఏం చేయాలో ఎంపిక చేసుకోవడం ప్రతి విద్యార్థికీ చాలా ముఖ్యం; ఆర్థికంగా అది ఎంత హీనంగా కనిపించినా దాన్ని పట్టించుకోకండి.

మీరు మీ పిల్లలతో స్నేహంగా ఉంటామని చెప్పుకుంటారు. కాని ఈ స్నేహం వారి చేత మీరు కోరుకున్నదే చేయించే ఉపాయమైతే అప్పుడు మీరు చెడ్డ స్నేహితులనే చెప్పాలి. మీరు నిజమైన స్నేహితులైతే మీ పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి ఎంచేయాలో ఆలోచిస్తారు. మీరు దానిపట్ల శ్రద్ధచూపిస్తారు. మీ పిల్లవాడు ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా నిలబడతాడు, ఏం ఆలోచిస్తాడు, వివిధ సందర్భాలకు ఎట్లా స్పందిస్తాడు మొదలైన వాటన్నిటిమీద మీ ధ్యాస పెడతారు. అతనికి లేదా ఆమెకి నిజంగా ఏమి అవసరమో తెలుసుకుంటారు. ఇప్పుడు మీకున్నదంతా ఒక రెడీమేడ్ ఫార్ములా - ఎంబిబిఎస్, ఇంజినీరింగ్! మీరు దీన్ని బలవంతంగా ఒక ప్రాణం పై రుద్దుతున్నారు, ఆ ప్రాణానికి నిజంగా ఏమవసరమో తెలుసుకోకుండానే.

ఇది ప్రయత్నించండి: మీ పిల్లల్ని రోజూ 30 నిమిషాలు యోగా కోసం కేటాయించనీయండి. విద్య అనే పరుగుపందెంలో కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి ఉపయోగపడే సాధనం యోగా. అది అంతర్గత సమతుల్యతను, పదునైన బుద్ధిని, మెరుగైన ఏకాగ్రతను ఇస్తుంది. శాంభవీమహాముద్ర చేసిన వారిపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనాలు చేసింది. మూడునెలల్లో ఆ విద్యార్థుల మెదళ్లలో న్యూరాన్ల పునరుత్పత్తి 241% పెరిగినట్లు తెలిసింది. కొంచెం యోగా చేయడం మీ పిల్లల్ని మరింత తెలివైన వారిగా, సమతుల్యత గలిగిన వారిగా చేస్తుందన్నది శాస్త్రీయంగా నిరూపితమైంది; ఇదీ, అదీ వాళ్ల ధ్యాసని పక్కదోవలు పట్టనీయకుండా యోగా కాపాడుతుంది.  వాళ్లు తమ హార్మోన్లను మెరుగ్గా నిర్వహించుకోగలుగుతారు. రోజుకు 30 నిమిషాలు వినియోగించండి, ఆరునెలలు అభ్యాసంతో పిల్లలు రోజుకు 2-2.5 గంటలు అధికంగా వినియోగించ గలుగుతారు. సంవత్సరం తర్వాత అది రోజుకు 4,5 గంటలు అధికంగా పొందగలుగుతారు. ఎందుకంటే వారు వారి  పనులను మరింత సమర్థవంతంగా చేయగలరు. ఒకవైపు పిల్లలు యోగా చేస్తుంటే మరోవైపు  మీరూ యోగా ప్రయత్నించండి. అది మీలోని ఆందోళనను తగ్గిస్తుంది, తల్లిదండ్రులుగా మీ ఒత్తిడులను తగ్గిస్తుంది. మన పిల్లలు అర్ధాంతరంగా జీవితం ముగించుకోకుండా వాళ్ల పూర్తి శక్తి సామర్థ్యాలతో సంపూర్ణ జీవితాన్ని గడపడానికి అనుగుణమైన ప్రపంచాన్ని మనం నిర్మించాలి. దానికి కొంత అంకితభావం ఉండాలి. పాఠశాల ఫీజు చెల్లించడంతోనే అది జరిగిపోదు. అటువంటి ప్రపంచం ఏర్పడేటట్లు మనం కృషి చేద్దాం.

ప్రియమైన పిల్లలారా!

మీకు ఒక నిజం చెప్పడంతో ప్రారంభించేదా? మీ సమస్యను మీరు చాలా అధికంగా ఊహించుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు ఎటువంటి ఘర్షణను అనుభవిస్తున్నారో మీకు తెలియదు. ఈ సర్కస్ నడపడానికి, మీకు అన్నీ సమకూర్చడానికి, మీ జీవితం సుఖప్రదంగా గడవడానికి, ఇదంతా జరగడానికి వాళ్లెంత కష్టపడుతున్నారో మీరు ఊహించలేరు. ఇంత ఘర్షణ, ఒత్తిడి, కష్టం పడుతూ కూడా వాళ్లు మీతో ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు.

లేని సమస్యలను సృష్టించకోకండి: మీరు ఇది చదువుతారు, లేదా చదువుతారు ఏదైతే ఏమిటి? కాని ‘‘నేను ఇంజినీరును కాకపోవచ్చు, మీరు విచారించకండి, నేను జీవితంలో బాగానే ఉంటాను’’ అనే విశ్వాసం మీ తల్లిదండ్రుల్లో కలిగించడం మీ చేతుల్లోనే ఉంది. మీరు వాళ్లకు అటువంటి విశ్వాసం ఇచ్చినట్లయితే వెంటనే సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు. కాని చివరికి వాళ్లు అందులోని సత్యం గ్రహించగలుగుతారు. ప్రస్తుతానికయితే మీలో చాలామంది వారికటువంటి విశ్వాసాన్ని కల్పించే స్థితిలో లేరు. మీరు ఎక్కడ వీథిన పడతారోనని, వాళ్లు భయపడి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ తల్లిదండ్రులు మీకు ఏది ఉత్తమమని అనుకుంటారో మీకది చేయడం ఇష్టం లేకపోతే పోనీయండి, కాని మరో రంగంలో మీ సామర్థ్యం చూపించి ‘‘విచారం అవసరం లేదు’’ అని చెప్పగలగాలి.

మీరొక విషయం గుర్తు పెట్టుకోవాలి: మీరు పూజించే శివుడు, రాముడు, కృష్ణుడు, క్రీస్తు ఎవరైనా కానీ, వాళ్లెవరూ ఐఐటీ కాని, మరో పరీక్షకాని పాస్ కాలేదు. వాళ్లు తమ జీవితాన్ని చక్కగా జీవించారు. కాబట్టే మీరు వాళ్లను పూజిస్తున్నారు. మీరు చేయాల్సింది అదే - చక్కగా జీవించడం. మానవ యంత్రం ఈ భూగోళం మీద అత్యంత సమర్థమైన యంత్రం. మీరు ఈ సూపర్ కంప్యూటర్ లోని యూజర్స్ మాన్యువల్‌ను చదవకపోవడమే సమస్య. యోగాయే ఆ యూజర్స్ మాన్యువల్. అది మీరు అంతర్గతంగా సమతుల్యులయ్యేట్లు చేస్తుంది, మీరు మీ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తోడ్పడుతుంది. మీరు అత్యుత్తమంగా పనిచేసినప్పుడు సాఫల్యం కూడా వస్తుంది. మీరు మరో వ్యక్తి కంటే మెరుగ్గా చేయలేకపోవచ్చు కాని, మీరు  చేయగలిగిన దాంట్లో పరాకాష్ఠకు వెళ్లగలరు. జీవితం మీకు విసరిన ఏ సవాలునైనా మీరు హుందాగా ఎదుర్కోగలరు.

ప్రియమైన ఉపాధ్యాయులారా!

మీరు అత్యుత్తమమని దేన్ని అనుకుంటున్నారో అది చేయడానికి విద్యా వ్యవస్థ మీకు స్వేచ్ఛనీయకపోవచ్చు. వ్యవస్థ, తల్లిదండ్రులు మీ నుండి ఆకాంక్షించేది ఎంత ఎక్కువగా ఉంటుందంటే మీరు మీ విద్యార్థులతో ఒక్కమాట కూడా మాట్లాడే సమయం మీకుండదు. కాని ఈ సవాళ్ల అన్నిటితో కూడా మానవజీవితం తన సంపూర్ణ సామర్థ్యాన్ని సాధించే విధంగా అభివృద్ధి చేయడంలో మీరు విశిష్ట పాత్ర నిర్వహించగలరు. మీ విద్యార్థులకు అసలేంకావాలో తెలుసుకోవడానికి, నిజంగా ఏంకావాలో తెలుసుకోవడానికి, మీరు మూడంటే మూడు నిమిషాలు రొజూ కేటాయించండి.

ప్రస్తుతం మన విద్యావ్యవస్థ చేస్తున్న పని  సమాచారం ఇవ్వడం మాత్రమే. ఈ సమాచారం ఇవ్వడానికి అనేక  పద్ధతులున్నాయి. కాని మీ వద్ద నేర్చుకోవడానికి వచ్చిన ఈ పిల్లల్లో కొంచెం స్ఫూర్తిని నింపాలనే విషయం, వెలిగించాలనే విషయం మీకు గుర్తుంటే అది వాళ్ల జీవితాంతం వాళ్లతో ఉంటుంది. సమాచారం ఉపయోగకరమే కావచ్చు. వాళ్లు పరీక్ష పాసవడానికీ, ఉద్యోగం సంపాదించుకోవడానికీ ఉపయోగపడవచ్చు. కాని మీరు వెలిగించిన స్ఫూర్తి వాళ్లు జీవితాంతమూ గుర్తుపెట్టుకుంటారు, విలువనిస్తారు.

ప్రతి ఉపాధ్యాయుడూ ఇది గమనించాలి: నా ముందున్న ఈ పిల్లలకు ఏ సాదాసీదా పద్ధతిలో, ఏ చిన్న పనితో, సరైన సమయంలో చిన్నమాటతో ప్రేరణ నివ్వగలను, స్ఫూర్తిని రగిలించగలను అన్నది. వ్యవస్థ ఎలానైనా ఉండనీయండి, మీరీమాత్రం చేయగలరు. యోగా ఎలా సహాయపడుతుంది? మీకు మానవ సంక్షేమంలో ఆసక్తి ఉంటే అదొక్కటే పరిష్కారమార్గం. మీ పాఠం మొదలుపెట్టే ముందు మీరు రెండు నిమిషాలు కేటాయించగలిగితే, అందరూ తమకనులు మూసికొనేట్లు చేయగలిగితే ఒక మార్పు ప్రారంభమవుతుంది.  మీరు ఆ మార్పు తెచ్చినవారు అవుతారు. అదే యోగా!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుని వివరణ: మామూలు ఉపయోగా అభ్యాసాలు ఆనందం, శాంతి, సంక్షేమం, సాఫల్యం, మరింకెన్నిటి కోసమో '5-Minute Yoga Tools for Transformation' లో ఉన్నాయి. ఉచిత app కోసం డౌన్ లోడ్ చేసుకోండి.