సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపును కోరడం తప్పా?
మన జీవితానికి సంబంధించిన వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ క్షణంలో సరదాగా ఉన్నా, ఇరవైఏళ్ల తర్వాత ఇవ్వాళ పోస్ట్ చేసిన వాటిని గురించి మీరు ఏమనుకుంటారు?. “యూత్ అండ్ ట్రూత్” కార్యక్రమంలో జరిగిన ఒక సంభాషణలో, ఒక విద్యార్థి “సోషల్ మీడియా ద్వారా మన మనోభావాల్ని వ్యక్తపరిచి గుర్తింపుని కోరడం తప్పా” అని సద్గురుని అడిగారు.

ప్రశ్న: సద్గురు, గుర్తింపుని కోరుకునే తరం మాది. మాలో చాలామంది దీనితో ఏకీభవిస్తారనే నేను అనుకుంటాను. మా సంతోషాన్ని, బాధని, ఈరోజు చేసిన పనుల వివరాల్ని, ఏం తిన్నాము, ఈరోజు ఎవర్ని కలిశామన్న వాటన్నింటిని వాట్సాప్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, ఇంస్టాగ్రామ్ మొదలైన వాటిలో వ్యక్తపరుస్తున్నాము. మా సమస్యలకు పరిష్కారాన్ని కోరడం లేదా ఒక మిత్రుడితో మాట్లాడటమో కాకుండా సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి ప్రపంచానికంతటికీ మనం బాధగా ఉన్న సంగతి బిగ్గరగా చెప్పడానికే మొగ్గు చూపుతున్నాం. ఇలాంటి భావవ్యక్తీకరణ, సోషల్ మీడియాలో గుర్తింపును కోరుకునే స్వభావం ఉండటం తప్పా?
సద్గురు: ఇది తప్పొప్పుల గురించి కాదు. ఇది కేవలం జీవితంలో మీరు ఈరోజు ఉన్న దశలో మీరు ఏదైనా మంచి లేదా చెడు చెప్తున్నారా అన్నది ముఖ్యం కాదు. అది మంచిదా లేదా చెడుదా అన్న నిర్ణయం కూడా మేము చెయ్యాలనుకోవట్లేదు, అది పూర్తిగా వ్యక్తిగతం. మీరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డిజిటల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందిన ఈ రోజుల్లో, మీరు పోస్ట్ చేసిన వివరాలన్నీ మీ జీవితకాలం పాటు ఉంటాయి. మీరు ఫేస్ బుక్ నుంచి వివరాల్ని తుడిచేస్తే, వేరెవరో దాన్ని ఎక్కడో భద్రపరిచి ఉంచుతారు. అలా అది మీకు జీవితంలో అవసరం లేనప్పుడు ఎదురుకావచ్చు. ఎందుకంటే ఇప్పటి మీ స్వభావం పదేళ్ల తర్వాత ఇబ్బంది గా అనిపించవచ్చు.మన జీవితంలో సోషల్ మీడియా ఒక అద్భుతమైన సాధనం. ఇంతకుముందెన్నడూ మనుషులు ఈ విధంగా సంభాషించుకునే వీలులేదు. కానీ మనం ఏం సంభాషించు కుంటున్నాము? ఐస్ క్రీమ్ తో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తే అది తప్పనో లేదా ఒప్పనో నేను చెప్పడం లేదు. కానీ దీని గురించి ఇంకాస్త ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను. మున్ముందు మీరే ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడవచ్చు. ఇబ్బందిగా లేకపోతే సరే. నేను అది చెయ్యాలనో లేదా చేయకూడదనో చెప్పడం లేదు. కానీ ఇంకాస్త వివేకంతో వ్యవహరించడం మీ జీవితానికి ఆసరాగా నిలుస్తుంది. ఎందుకంటే ఈ రోజు చేసిన పనులు ఎప్పుడో తర్వాత మీకు ఎదురుపడి మీకు ఇబ్బంది కలిగించకూడదు కదా.
ప్రేమాశిస్సులతో,
సద్గురు
