సకారాత్మక ఆలోచనకు(Positive thinking) నిజంగా ప్రయోజనం ఉందా? ‘సకారాత్మకంగా ఆలోచించే’ ప్రయత్నాలు చివరికి ఎలా కూలిపోకతప్పదో సద్గురు వివరిస్తున్నారు.

ప్రశ్న: సద్గురు, పాజిటివ్ థింకింగ్ గురించీ, అవి మీ జీవితాన్ని ఎలా పరివర్తన చేస్తాయన్నదాని గురించీ చాలా చాలా బోధిస్తూ ఉన్నారు. అయినా నిరంతరం సకారాత్మక నిశ్చయాలను నొక్కివక్కాణించేవారు చాలా బోలుగా కనిపిస్తున్నారు. అదంత సాధారణమైన విషయమా? పాజిటివ్ థింకింగ్ లు కర్మను తొలగించుకోవడంలో ఉపయోగపడతాయా, కనీసం మరింత కర్మను సృష్టించుకోకుండా ఉపయోగపడతాయా?

సద్గురు: ఇలా ఆలోచించే వాళ్ళు తమ జీవితానుభావం యొక్క లోతును కోల్పోవడానికి కారణం, వాళ్లు తమకు వీలుగా ఉన్నవాటి మీద మాత్రమే కేంద్రీకరించడం వలన. దీన్నే వాళ్లు సకారాత్మకత అంటున్నారు. వాళ్లకు ప్రతిదీ త్వరత్వరగా జరగాలి. వాళ్లు దేనిపట్లా అంకిత భావంతో ఉండలేరు. ఉదాహరణకు ఒక వ్యక్తి శాస్త్రవేత్త అవ్వాలనుకుంటే, అతనెన్నో సంవత్సరాలు అధ్యయనం చేయాలి. బహుశా భార్యాపిల్లల్ని కూడా మరచిపోవచ్చు, సర్వం దానికే అంకితం చేయవలసి రావచ్చు. అది భౌతిక రంగంలోనైనా కూడా, అలా ఉన్నప్పుడే ద్వారాలు తెరచుకుంటాయి.

నిజానికి మీరు ఈ క్షణంలో ఇక్కడ కాకుండా మరోచోట ఎక్కడైనా జీవించి చూపండి చూద్దాం. ఎలాగైనా సరే మీరు ‘ఈ క్షణం’ లోనే కదా ఉండాలి.

ఇటువంటి నిశ్చలమైన శ్రద్ధ, కేంద్రీకరణ ఆధునిక ప్రపంచంలో కనిపించడం లేదు. దానికి కారణం ఇటువంటి బోధనలు విపరీతంగా పెరగడం, “విచారించవద్దు, సంతోషంగా ఉండండి. అంతా బాగానే జరుగుతుంది. ఆనందించండి చాలు!” ఇటువంటి ఆనందం ఎంతో కాలం నిలవదు. అది కుప్పకూలిపోక తప్పదు. ఇలా చేయడం వల్ల ప్రజలు మానసిక అస్వస్థతా పరిస్థితుల్లోకి వెళతారు. పశ్చిమ దేశాల్లో జనాదరణ పొందిన వాక్యం నేనొకటి వింటుంటాను, అదిప్పుడు భారతదేశంలో కూడా ప్రచారం పొందుతూ ఉంది. అదేమిటంటే, “ఆనందంగా ఉండండి, ఈ క్షణంలో జీవించండి” అని. నిజానికి మీరు ఈ క్షణంలో ఇక్కడ కాకుండా మరోచోట ఎక్కడైనా జీవించి చూపండి చూద్దాం. ఎలాగైనా సరే మీరు ‘ఈ క్షణం’ లోనే కదా ఉండాలి. అలా కాకుండా మరెక్కడుంటారు? ప్రతివాళ్లూ ఈ వాక్యం ఉటంకిస్తూ ఉంటారు. అనుభవం కాని, అవగాహన కానీ లేనివాళ్లు రాసే పుస్తకాలు, నిర్వహించే కార్యక్రమాలే వీటన్నిటికీ కారణం.

కర్మ అనే తీగచుట్ట

“సంతోషంగా ఉండండి” అని చెప్పేవారిని గమనిస్తూ ఉండండి. వాళ్ల జీవన శైలుల కారణంగా కొద్ది సంవత్సరాల్లోనే వాళ్లు మానసిక ఒత్తిళ్లకు లోనవుతారు. మీ కర్మ నిర్మాణం ప్రకారంగా, మీ శక్తులు విభిన్న సంభావ్యాల వైపు కేటాయించబడి ఉంటాయి. కాబట్టి మీకు దెబ్బ తగలక తప్పదు. మీ నొప్పికి, బాధకు, ఆనందానికి, ప్రేమకు అన్నిటికీ ఏదో కారణముంది. దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అది కేవలం మీ బుర్రలో లేదు. కర్మ అన్నది సమాచారం. మీ శక్తి ఈ సమాచారం ప్రకారం పనిచేస్తుంది. ప్రారబ్ధ కర్మ అన్నది ఒక తీగచుట్ట (స్ప్రింగు) వంటిది. దానికి ముక్తి కావాలి. వాటికి వ్యక్తమయ్యే అవకాశం ఉండాలి. మీరు వాటి మార్గాన్ని నిరోధిస్తే అవి పూర్తిగా భిన్నమైన మార్గం ఎంచుకుంటాయి.

ఉన్నవాటిని అవి ఉన్నరీతిలో చూడడం చాలా ముఖ్యం. మీరు దేన్నీ తిరస్కరించకూడదు. దుఃఖం కలిగితే దుఃఖం. విచారం కలిగితే విచారం. ఆనందం వస్తే ఆనందం. పరమానందం కలిగితే పరమానందం. మీరిలా చేసినప్పుడు మీరు దేన్నీ తిరస్కరించడం లేదు, దేన్నీ నిరోధించడం లేదు. అదే సమయంలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది, కానీ మీరు వాటినుండి ముక్తులుగా ఉంటారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు