ప్రశ్న: సద్గురూ! ఈ భూమి మీద తమ ప్రయాణంలోని చరమ దశని జీవించడానికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఇంకా మానసికంగా ఒకరు ఏ విధంగా సిద్ధం కావాలి?

సద్గురు: అది ఆఖరి అడుగు, కాబట్టి మెల్లగా నడవకండి. పూర్తిగా ఉత్సాహంతో జీవించండి. మొదటి అడుగుకి, ఇంకా ఆఖరి అడుగుకి మధ్య వ్యత్యాసాన్ని తీసుకురాకండి. మొదట్లో మీరు ఆ వ్యత్యాసాన్ని తీసుకువచ్చి ఉంటే, కనీసం ఇపుడు అలా చేయకుండా ఉండడం నేర్చుకోండి. నడిచేందుకు మీకు ఇంకో వంద అడుగులు మిగిలున్నాయా లేదా ఒక్కటే మిగిలుందా అన్నది ముఖ్యం కాదు - ఒకేలా నడవండి, వ్యత్యాసం తీసుకురాకండి. ప్రజలు, “కనీసం మీ జీవితం చివర్లో మీరు దేవుడి గురించి ఆలోచించాలి అంటారు.” మీరు మీ జీవితం అంతా గుడ్డిగా బతికి, ఆఖరి క్షణంలో ‘రామ రామ’ అంటే సరిపోతుంది అనుకుంటే, లాభం లేదు.

మీరు బిజు పట్నాయక్ గురించి విన్నారా? గతంలో ఆయన ఒరిస్సా ముఖ్యమంత్రి. రాజకీయాలలో ముఖ్యమంత్రి అయినా, ఆయన తన జీవితాన్ని తనదైన రీతిలో జీవించాడు. ఆయన మరణానికి దగ్గరై మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, ప్రజలు భగవద్గీత తీసుకువచ్చి, అతనికి చదివి వినిపించాలని అనుకున్నప్పుడు, అతను, “ఈ చెత్తంతా ఆపండి. నేను నా జీవితాని చక్కగా జీవించాను” అన్నాడు.

ఎప్పుడూ అన్యమనస్కంగా ఉండడం

మరి మీరు ఏం చేయాలి? ఒక సంస్కృత శ్లోకం ఉంది. శంకర భగవత్పాదుల భజగోవిందం స్తోత్రంలో “బాలాస్తావత్ క్రీడ సక్త” - మీరు పిల్లవానిగా ఉన్నప్పుడు, మీ ఆటలాడే తత్వం మిమ్మల్ని పూర్తిగా బిజీగా వుంచింది. మీరు పూర్తిగా ఆటలాడుతూ ఉండేవారు. మీరు యవ్వనానికి వచ్చినప్పుడు, ఆ ఆటలు మరీ పిల్ల చేష్టల్లా అనిపించింది. ఇప్పుడు మీరు మరింత అప్రమత్తంగా, ప్రయోజనకరంగా అవుతున్నాను అనుకున్నారు. తరవాత ఏమైంది? మీ హార్మోన్లు మీ బుర్రను దారి తప్పించాయి. ఇక ఆ తర్వాత మీరు దేన్నీ స్పష్టంగా చూడలేకపోయారు. మీరు ఒక పురుషుడినో లేదా స్త్రీనో చూసిన వెంటనే, మీలో ఏవోవో జరిగాయి. ఆ తరవాత వయసు మీద పడింది. వృద్ధులు ఊరికే ఆందోళన పడతారు. ఒక పిల్లవాడు మరీ ఎక్కువగా ఆటపాటలలో మునిగిపోతాడు. అతనితో మీరు పరమోత్తమమైన దాని గురించి మాట్లాడలేరు. యవ్వనం పూర్తిగా హర్మోన్లచే దారి తప్పించబడింది. మీరు అతనికి కూడా దాని గురించి చెప్పలేరు. వృద్దులేమో స్వర్గంలో తమకు ఏ స్థాయి లభిస్తుందో అంటూ ఆందోళన పడతారు. మీరు వారితో కూడా దాని గురించి మాట్లాడలేరు. మరి ఇక మిగిలున్నది ఎవ్వరు? పిల్లవాడు, యువకుడు, వృద్దుడు కాని వాడు, కేవలం జీవంగా ఉన్నవాడు - కేవలం అతనితోనే మీరు మాట్లాడ గలుగుతారు

ఒక జీవం తునక

కాబట్టి దీన్ని మీ మొదటి అడుగుగానో, లేక ఆఖరి అడుగుగానో అనుకోకండి. ఇక్కడ జీవంలో ఒక భాగంగా ఉండండి. అలా ఉండడమే ఉత్తమమైన విధానం. మీరు యవకులూ కాదు, మీరు వృద్దులూ కాదు. మీ శరీరాన్ని తిరిగి ఎప్పుడు తీసుకోవాలో భూమాత నిర్ణయిస్తుంది. ఎరువుగా మారే ఈ శరీరం బాగా పరిపక్వమైనప్పుడు అది తిరిగి తీసుకుంటుంది – దానికై చెట్లు వేచి చూస్తున్నాయి! దాని గురించి కంగారు పడకండి. మీరు కేవలం ఒక జీవం అంతే. జీవ పరంగా ఇది యవ్వనంలో లేదు, ఇది వృద్దాప్యంలో లేదు, ఇది మరింత పెద్దదైన మరో దానిలోకి పరిణితి చెందాలి.

మీరు పుట్టి రెండు రోజులే అయినా, లేదా మీకు ఇంకా రెండు రోజులే మిగిలున్నా, దేనితోనూ గుర్తింపు ఏర్పర్చుకోకుండా, ఇక్కడ కేవలం ఒక జీవంగా ఉండడం ఎలానో చూడండి.

అలాగే మీరు ఇక్కడ ఒక జీవంగా ఉన్నప్పుడు మాత్రమే, జీవంలోని అన్ని అంశాలూ మీకు జరుగుతాయి. మీరిక్కడ ఒక పురుషుడిగా ఉంటే, మీకు కొన్ని జరుగుతాయి. మీరిక్కడ స్త్రీగా ఉంటే కొన్ని ఇతరమైనవి జరుగుతాయి. మీరిక్కడ ఒక పిల్లవానిగా కూర్చుంటే, మీకు వేరేవి జరుగుతాయి. మీరిక్కడ ఒక డాక్టర్ గానో, ఇంజినీర్ గానో, ఒక ఆర్టిస్ట్ గానో, ఇదిగానో, అదిగానో ఉంటే - మీకు వేరు వేరు విషయాలు జరుగుతాయి. కేవలం మీరిక్కడ ఒక జీవంగా ఉన్నప్పుడు మాత్రమే, జీవానికి జరగగల ప్రతిదీ కూడా మీకు జరుగుతుంది.

మీరు పుట్టి రెండు రోజులే అయినా లేదా మీకు ఇంకా రెండు రోజులే మిగిలున్నా, దేనితోనూ గుర్తింపు ఏర్పర్చుకోకుండా, ఇక్కడ కేవలం ఒక జీవంగా ఉండడం ఎలానో చూడండి. భూమితోగానీ, స్వర్గంతోగానీ గుర్తింపు ఏర్పర్చుకోకుండా, ఊరికే ఇక్కడ ఉండడం ఎలానో నేర్చుకోండి. అప్పుడు మనకి, ఒక రోజు మిగిలున్నా, వంద ఏళ్ళు మిగిలున్నా అందులో తేడా ఏముంటుంది? అది ముఖ్యం కానప్పుడు, ఈ జీవానికి జరగవలసిన ప్రతిదీ కూడా ఎలాగూ మీకు జరుగుతుంది. అదే సుముఖత.

Editor’s Note: Check out “Unraveling Death”, the latest DVD from Sadhguru.