మనకు అసలు ఎలాంటి నాయకత్వం కావాలి?
స్వాతంత్యం వచ్చిన 60 ఏళ్ళ తర్వాత కూడా మన దేశ పరిస్థితి ఇలా ఎందుకు ఉంది? దీనికి మన నాయకత్వమే కారణమా? అసలు మనకు ఎలాంటి నాయకత్వం కావాలి? ఈ ప్రశ్నలకు సద్గురు సమాధానాల కోసం ఈ ఆర్టికల్ తప్పక చదవండి!
ప్రశ్న: ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలలో ఆందోళనలు(యాక్టివిజమ్), అలాగే సాయుధపోరాటాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితికి నాయకత్వ వైఫల్యమే కారణం అని మీరు అనుకుంటున్నారా?
సద్గురు: ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయి ఆందోళన(యాక్టివిజమ్) వైపు అడుగేసారు. ప్రస్తుతం, ఆందోళన చేయడం ఓ వృత్తి అయిపోయింది. అయితే అడ్డూ అదుపూ లేని ఆందోళన హింస వైపు వేసే తొలి అడుగు అవుతుంది. మావోయిస్టులు కూడా తమని తాము ఆందోళనకారులు(యాక్టివిస్ట్లు)గా పిలుచుకుంటారు. కాబట్టి ఆందోళన హింసగా పరిణామం చెందవచ్చు. మీరు ధర్నా చేయచ్చు. కానీ ఎల్లప్పుడూ ధర్నా చేస్తూ ఉంటే, అది అరాచకానికి దారితీస్తుంది. దేశాన్ని అస్తవ్యస్తం చేయాలనుకోవటానికి ఇదేమీ స్వతంత్రం రాక ముందు కాలం కాదు. ఇది మన సొంత దేశం. దీన్ని అస్తవ్యస్తం చేయాలని మనం అనుకోకూడదు. ఒక సీఎం వీధిలో కూర్చొని ధర్నా చేయలానుకుంటే, ఇక చట్టం ఎక్కడున్నట్లు? తాను మాహాత్మా గాంధీని అనుకరిస్తున్నానని అతననుకుంటే, అలా అనుకరించడానికి ఇది సరైన సమయం కాదు. దేశంలో గందరగోళం కలిగించకుండా, అందరితో కలిసి పనిచేసి మార్పు తీసుకురావాల్సిన సమయమిది.
ప్రశ్న: ఆందోళన చేయడం అనేది ప్రపంచమంతటా ఉంది. అలాంటప్పడు భారతదేశంలో ఇది ఎలా భిన్నమైనది? ఎలాంటి నాయకత్వం ఈ సమస్యని పరిష్కరించగలదు?
సద్గురు: ఇతర దేశాల్లో ప్రజల్లోని మేధస్సు మనతో పోలిస్తే, మెరుగ్గా క్రమబద్ధీకరించబడింది. కానీ సహజసిద్ధమైన మేధస్సు విషయానికొస్తే, మనం చాలా మేలు. భారతదేశం చాలా సంక్లిష్టమైన మూలాలు, బలమైన జన్యుశీలత కల దేశం. దీనివల్ల భారతీయులు ఒక ప్రత్యేక తరహా ప్రజలుగా తయారయ్యారు. ప్రతీ భారతీయుడు అన్ని స్థాయిల్లో ఎంతో అస్తవ్యస్తతకి గురిచేయబడుతాడు. కానీ ఇతర దేశాల ప్రజలు ప్రభావితమైనట్టుగా వాటి వల్ల అతను ప్రభావితమవ్వడు. దీనికి కారణం ఏమిటంటే మన దేశ సంస్కృతి మౌలికంగా ఆధ్యాత్మికత మీద ఆధారపడి ఉంది. ఈ ఆధ్యాత్మికత తక్షణ పరిసరాలతో ప్రభావితం కాకుండా ఉండగలిగే ఒక బ్రహ్మాండమైన గుణాన్ని మనకందించింది.
కానీ ఇప్పుడీ గుణమే మనకు వ్యతిరేకిగా మారుతోంది. ప్రస్తుత కాలంలో, మనం దేశ సమస్యల పట్ల మరికొంత శ్రద్ధ చూపాలి. మనం పరిష్కారాలు కనుక్కోవాలి. మనం వందకోట్ల మందిని ఒక్క తాటి మీదికి తీసుకురావాలి. ప్రపంచమంతటా ప్రజలు కేవలం కోపంతోనే సమస్యల్ని పరిష్కరించగలమని నమ్ముతున్నారు. కాని అది నిజం కాదు. మానవ మేధస్సు సమస్యలని పరిష్కరించగలదు. ప్రేమ సమస్యల్ని పరిష్కరించగలదు. కరుణ సమస్యలని పరిష్కరించగలదు. అన్నిటికి మించి, ఇంగిత జ్ఞానం సమస్యల్ని పరిష్కరించగలదు. మనం కోపాన్ని పెరగనిస్తే, దాని వల్ల వచ్చే పరిష్కారం అసలు సమస్య కన్న మరింత పెద్ద సమస్య అవుతుంది. మన దేశంలో ఒక గొప్ప మార్పు సంభంవించే తరుణమిది. హింసతో పనిలేకుండా ఆ మార్పుని తీసుకురాగల సామర్థ్యం మనకుంది. మనకు లేనిదల్లా నిబద్ధతా, కార్యదీక్షత గల నాయకత్వమే. చాలా కాలంగా మనకు ఇలాంటి నాయకత్వం లేదు.
అలాగే ఒక నాయకుడికి కావాల్సింది అతని నాయకత్వాన్ని సమర్థవంతం చేయడానికి వివిధ స్థాయిల్లో మనం అందించే సహాయమే గానీ, అతన్ని ఆరాధించటం కాదు. ఈ సమాజం సరిగ్గా పనిచేయడానికి నేను 11 అంచెల నాయకత్వాన్ని గుర్తించాను. కేవలం ఒక సీఎం, ఒక పీఎం కాదు, మనకు వివిధ స్థాయిలలో నాయకులు అవసరం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నాయకులని అర్థం. రోజులో పదిమందిని తాకే ఎవరికైనా సరే, ఈ మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉంది. అది ఎవరైనా కావచ్చు – ఒక గ్రామ పంచాయతీ నాయకుడు కావచ్చు, ఒక చిల్లర వ్యాపారి కావచ్చు లేదా ఒక ఇంటిని నడిపించేవాడు కావచ్చు.
ప్రశ్న: అయితే మనమెందుకు ఎప్పుడూ ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటాం?
సద్గురు: ఎందుకంటే నాయకత్వం అంటే మనం చూడాలనుకుంటున్న మార్పుని తీసుకురావడానికి కావలిసిన పని చేయడం. భారతదేశంలో, కొన్ని తరాల పాటు మనం మనుగడ కోసమే పోరాడం. మన ముందుకు రాకూడదని, కష్టమైన సందర్భాల్లో ఇంటికి పరిగెత్తాలని మనకు నేర్పించారు. ఇది గత తరాల అనుభవసారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మనకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.
కాబట్టి, ఈ కొత్తతరాన్ని శక్తివంతం చేయాలి. దేశం కోసం మీరు ముందుకు రావాలని చెప్పాలి. లేదంటే, ఈ దేశం ముందుకు సాగదు. అందుకే, ఈ దేశం పురోగమనం చెందడానికి ఏది అవసరమో అర్థం చేసుకునే నాయకుడు కావాలి.
ప్రశ్న: అవకాశానికీ, వాస్తవానికీ మధ్య ఉన్న అంతరాన్ని పూరించడానికి మనముందున్న మార్గం ఏమిటి? దాన్నిపూరించడానికి కావాల్సిన నాయకత్వాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు?
సద్గురు: దేశం అన్నది ఓ భావన. ఈ భావన పనిచేయాలంటే, మన సర్వస్వాన్నీ దాని కోసం వెచ్చించాలి. ఈ భావన ప్రతీ మనిషిలోకి పాతుకుపోవాలి. ఇలా జరగాలంటే, ప్రతీ మనిషి తన దేశం గురించి ఆలోచించినప్పుడు గర్వించగలగాలి. గర్వించ లేకపోతే, ఏదైనా చేయడానికి నిజంగా ముందుకొచ్చే వాళ్ళెవరూ ఉండరు.
దేన్నైనా సాధించడానికి మనసుని, శరీరాన్ని అత్యుత్తమమైన రీతిలో ఎలా ఉపయోగించాలనే దాని గురించి ఈ సంస్కృతిలో ఆపారమైన జ్ఞానం ఉంది. అన్నిటికీ మించి, మనం ఎలా ఉండచ్చు అన్నదాని గురించి చాలా జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని అంతటినీ పక్కన పెట్టేశారు. ఈ మధ్యనే యూకేలోని ఒక యూనివర్సిటీ వాళ్ళు సూర్య కిరణాలు ఓంకార శబ్దంతో ప్రతిధ్వనిస్తున్నాయని చెబుతున్నారని నాకు ఒకరు చెప్పారు. భారతదేశంలో ఇది మేము ఎప్పటి నుండో చెప్తూ ఉన్నామని నేను వారితో అన్నాను. కానీ అది బయటి దేశం నుండీ వస్తేనే మనం నమ్ముతాం.
మన దేశ నాయకులు ఎప్పుడూ తమని తాము ఇలానే చూపించుకున్నారు. తాము విదేశాల నుండి వచ్చిన వాటినే పాటిస్తున్నట్లు చూపించుకున్నారు. భారతదేశంలో జనించిన ఆలోచనల్ని అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు. అందుకే, భారతదేశ నేపథ్యంలో పెరిగి, అంతర్జాతీయ దృక్పథంగల నాయకుడు మనకు ఉండడం చాలా ముఖ్యం. లేదంటే, ఈ దేశ నిర్మాణంలో ప్రతీ ఒక్కరిని చురుకుగా పాల్గొనేలా చేయలేం. కాబట్టి ఇప్పుడు మనం చూడల్సినదంతా అవకాశానికీ, వాస్తవానికీ మధ్యనున్న దూరాన్ని నడవడానికి కావలిసిన నిబద్ధత మన దగ్గర ఉందా, లేదా అనే.
ప్రశ్న: ప్రజల ఆలోచనా విధానంలో సమస్య ఉందంటారా? స్వతంత్ర భారతదేశ ఆవిర్భావానికి పురిగొల్పిన జాతీయ భావన, గర్వభావన మనలో ఇప్పుడు లేవంటారా?
సద్గురు: ఈ దేశపు మౌలికాంశం జననాయకత్వం, అంటే ప్రజాస్వామ్యం. మనది ప్రజాస్వామ్యమని చెప్పుకుంటాం. కానీ మనది ఫ్యూడల్ మనస్తత్వం. మనం కులం, వర్గం, మతం ఆధారంగా ఎన్నుకుంటాం. ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుంది?
కానీ ఇది గ్రహించటానికి కూడా, మనం స్వేచ్ఛగా ఆలోచించ గలగాలి. చరిత్రను గమనిస్తే, మనం మనల్ని ఏలిన శక్తులకు దాసోహం కావడానికి రూపొందించిన విద్యా వ్యవస్థ ఇది అని అర్థమవుతుంది. కనీసం స్వాతంత్ర్యం గెలుచుకున్నప్పుడైనా, మన చరిత్రను మనం తిరగరాసుకొని ఉండాల్సింది. మనల్ని బానిసలుగా చేసినవారు రాసిన చరిత్రను మనం చదవకూడదు. అలాగే మనం మన సహజ బలాలపై ఆధారపడి ఎదగాలి. మనం 'మనం కాని వారిగా' మారే ప్రయత్నం మానుకోవాలి. లేకపోతే, ఏదో ఒక విధంగా మనం బానిసలు అయిపోతాం. ఎందుకంటే అప్పడు ఈ దేశంలో సహజమైన ఆలోచన అన్నది ఉండదు.
పాశ్చాత్య దేశాలు వీసా వ్యవస్థను తీసివేస్తే, 80% ప్రజలు అవసరమైతే సముద్రం ఈదుకుంటూ ఐనా సరే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు. దీనర్థం ఏమిటి? ఇదొక జైలు, దేశం కాదు. బహుశా ఆర్ధిక, భౌతిక పరిస్థితులను మనం వెంటనే మార్చలేకపోవచ్చు, కానీ ప్రతి పౌరుడు భారతదేశం అంటే గర్వపడేలా చేయవచ్చు. ఈ దేశంలో ఉన్నదేదీ మంచిది కాదని, మంచిది కాబోదని మనం నమ్మేలా చేశారు. వలస పాలకులు రూపొందించిన విద్యా విధాన ఫలితమే ఇది. ఇది మనం మార్చాలి.