సద్గురు: ఒకసారి ఫ్యామిలి అంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు, శంకరన్ పిళ్ళై తను పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించాడు. అందరూ దానికి “ఏంటి? ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నావ్?” అని అడిగారు.

శంకరన్ పిళై “నేను మన పొరిగింట్లో ఉన్న లూసీని పెళ్ళాడబోతున్నాను” అన్నాడు.

దానికి అతని తండ్రి, “ఏంటీ...? ఆ పిచ్చి లూసీనా నువ్వు పెళ్ళాడేది? మనకు కనీసం ఆమె పుట్టుక వివరాలు కూడా తెలియదు” అన్నాడు.

అతని తల్లి, “ఏంటీ...? ఆ పిచ్చి లూసీనా నువ్వు పెళ్ళాడేది? ఆమెకు ఆస్తి కూడా ఏమీ లేదు” అని అంటుంది.

అతని అంకుల్, “ఏంటీ...? ఆ పిచ్చి లూసీనా నువ్వు పెళ్ళాడేది? ఆమె జుట్టంతా పేలు పట్టి ఉంటాయి” అన్నాడు.

అతని ఆంటీ , “ఏంటీ...? ఆ పిచ్చి లూసీనా నువ్వు పెళ్ళాడేది? ఆమె భయంకరంగా మేకప్ చేసుకుంటుంది” అని అంటుంది.

చిన్నపిల్లాడైన అతని మేనల్లుడు కూడా తనవంతుగా ఇలా అన్నాడు “ఏంటీ...? ఆ పిచ్చి లూసీనా నువ్వు పెళ్ళాడేది? ఆమెకు క్రికెట్ గురుంచి ఏమీ తెలీదు”.

శంకరన్ పిళ్ళై వెంటనే నుంచుని ఇలా అన్నాడు, “అవును....నేను ఆ లూసీనే పెళ్ళాడబోతున్నాను ఎందుకంటే ఆమెను చేసుకుంటే ఒక లాభం ఉంది.”

“ఏమిటది” అని అందరూ అడిగారు. 

“ఆమెకు ఫ్యామిలీ లేదు” అన్నాడు శంకరన్ పిళ్ళై.

కుటుంబ పద్ధతి దేనికి?

ఒక బిడ్డ పుట్టగానే, వేరే జీవాలకున్న రీతిలో అన్నీ సమకూర్చబడివుండవు. ఆ బిడ్డకు పోషణ, శిక్షణ లాంటివి అవసరమవుతాయి. అంటే ఒక కుటుంబం అవసరమవుతుంది. ఒక మనిషి ఎదగడానికి కుటుంబం అనేది ఎంతో సహాయకరంగా ఉంటుంది. కానీ చాలా మందికి కుటుంబం అనేది సపోర్ట్ లాగ కాకుండా ఒక అడ్డంకి అవుతుంది. అది ఉన్నతికి సోపానంలా కాకుండా, అవరోధం అవుతుంది. కుటుంబం అంటే ఇక్కడ సమస్య అని కాదు కానీ మీరు దాన్ని ఎలా నిర్వహిస్తున్నారని.  

ఒక పద్ధతి ప్రకారంగా నిర్వహించగలిగితే కుటుంబం అనేది ఎంతో అందంగా ఉంటుంది, లేకపోతే ఎంతో భయంకరంగా ఉంటుంది.

మీ శ్రేయస్సు కోసం ఉద్దేశించబడినది, మీకు ప్రతికూలంగా మారితే, దానికి కుటుంబం ఒక ఉదాహరణ. ఇది ఎన్నో రకాలుగా జరుగుతుండటం మీరు చూస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఐశ్వర్యం అనేది శ్రేయస్సుకు ఉపయోగపడాలి కానీ చాలామంది దానిని ఒక విషంలా ఉపయోగిస్తున్నారు. విద్యాభ్యాసము కూడా మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడాల్సింది కానీ ఈ రోజుల్లో విద్యాధికులే ఈ భూమిని నాశనం చేస్తున్నారు. మన శ్రేయస్సు కోసం ఏవైతే ఉద్దేశింపబడ్డాయో అవి గొప్ప వరాల్లా కాకుండా, మానవ జాతి ఉనికికే ప్రమాదకరంగా మారాయి.

అదేవిధంగా, ఒకరికి ఆధారంగా ఇంకా అభివృద్ధికి దోహదపడాల్సిన కుటుంబం చాలామందికి ఒక అవరోధంగానూ, భారంగానూ అయ్యాయి. ఒక పద్ధతి ప్రకారంగా నిర్వహించగలిగితే కుటుంబం అనేది ఎంతో అందంగా ఉంటుంది, లేకపోతే ఎంతో భయంకరంగా ఉంటుంది.

కుటుంబం అనేది ఒక కర్తవ్యం కాదు

కుటుంబం అంటే ఆధారం కాదు, అది మీరు ఏర్పరుచుకున్న ఒక భాగస్వామ్యం. భాగస్వాములు ఇద్దరూ ఇష్టపూర్వకంగా కలిసి ఒక మార్గంలో ప్రయాణించినప్పుడే భాగస్వామ్యం చిగురిస్తుంది. భాగస్వాములు ఇద్దరూ, ఎల్లప్పుడూ ఒకరినొకరి శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుంటేనే భాగస్వామ్యానికి ఒక అర్ధం ఉంటుంది. కుటుంబపరంగానైనా, వృత్తి పరంగానైనా లేదా ఆధ్యాత్మిక పరంగానైనా ఎల్లప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటే, అటువంటి వ్యక్తికి భాగస్వామ్యం పనికిరాదు ఇంకా మీరు కలిసివుంటే మీరు ఇద్దరికీ కూడా ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టిస్తారు.

మీరు కుటుంబంలో ఉండేది కర్తవ్యం గురుంచి కాదు. ఒక రకమైన ప్రేమ పంచటమనేది ఉండటంవల్లనే మీరు కుటుంబంతో ఉంటారు.

మీరు కుటుంబంలో ఉండేది కర్తవ్యం గురించి కాదు. ఒక రకమైన ప్రేమ పంచటమనేది ఉండటం వల్లనే మీరు కుటుంబంతో ఉంటారు. ఇది ఉన్నట్లయితే, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదనేది మీకు ఎవరూ చెప్పనవసరం లేదు. ఏది అవసరమో మీరు అది చేస్తారు.

ఏదో చెయ్యాలన్న అభిలాష

మీరు ఒకరితో లేదా కొంతమందితో ఈ ప్రేమబంధం ఏర్పరుచుకున్నంత మాత్రాన మీకు జీవితంలో గొప్ప అభిలాష ఉండకూడదని కాదు. మీరు మిమ్మల్ని ఒక గొప్ప అద్భుతమైన వ్యక్తిగా మార్చుకుంటే, మీ చుట్టూ ఉన్నవాళ్ళకు అదే ఒక గొప్ప బహుమానమవుతుంది. మీరు అభిలాషించిన దిశగా కొనసాగాలి. మీరు ఎంతగా వికసిస్తే, మీ చుట్టూ ఉన్నవాళ్ళకు అంతగా తోడ్పడతారు. ఒకవేళ వాళ్ళు ఇది అర్థం చేసుకోకుండా, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వాళ్ళ స్థాయిలోనే మీరు ఉండిపోవాలని, అవే పరిమితుల్లో, అవే సమస్యలతో, ఇంకా మీరు అంతకు మించి స్వేచ్చని కోరుకోకూడదని అనుకుంటే, అది కుటుంబం కాదు, ఒక ముఠా. మీరు ఒకరి నుంచి ఒకరు ఎలా కొల్లగొట్టుకోవాలని ఒక ముఠాని నడిపితే, అది కుటుంబం అవదు. ఒకరికొకరు ఉత్తమంగా ఇచ్చుకోగలిగితేనే అది కుటుంబం అవుతుంది.