సద్గురు: దుర్యోధనుడి భార్య భానుమతి. ఆమె అద్భుత సౌందర్యరాశి. కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయస్సు కేవలం 17 సంవత్సరాలు.

కృష్ణుని చేత మద్యం త్రాగింపజేసి, ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నాడు. అందుకుగాను అతను అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. విందులో కావలసినంత మద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు. దుర్యోధనుడి స్నేహితులు వచ్చారు, అందరూ మితిమీరి మద్యం సేవించారు. దాంతో నియంత్రణ కోల్పోయారు. కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకుని, అందర్నీఆకట్టుకున్నాడు.

ఈ అత్యుత్సాహంలో, భానుమతి కూడా మితిమీరి మద్యం సేవించింది. ఆమె చాలా చిన్న పిల్ల. తరుణి వయస్కురాలు కావడంతో, ఆమెకు ఇటువంటివన్నీ తెలియదు. ఆమె తూలడం ప్రారంభించింది. కొంతసేపటికి, అక్కడున్న వారందరూ తూలడం ప్రారంభించారు. దాంతో పరిస్థితులు అదుపుతప్పి పోయాయి.

భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది. ఆమె కృష్ణుని మీద వాలిపోయి, ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది. కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకున్నాడు. పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడు. ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే, ఆ తరువాత పర్యవసానాలను ఆమె ఎదుర్కొనలేదు. అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది.

అందువల్ల ఆయన ఆమెను తీసుకొని, ఆ రాజప్రాసాదంలో, భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్లి, అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు. మర్నాడు ఉదయం భానుమతి మనసు, ఇలా చేసినందుకు కృష్ణుడిపట్ల అపారమైన కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. అప్పటి నుండి, ఆమె కృష్ణ భక్తురాలు అయిపోయింది.

కథ #2 - కృష్ణుడి గర్విష్ఠి భార్య

సద్గురు:  కృష్ణుడి రెండో భార్య సత్యభామ, చాలా గర్విష్టి. అందరికంటే తానే అందమైనదాన్నని, ఇంకా ధనవంతురాలునని అనుకునేది. ఎందుకంటే ఆమె తండ్రి అత్యంత ధనవంతుడు. అందువల్ల ఆమె దగ్గర కావలసినంత ధనము, అన్ని రకాల రత్నాభరణాలు ఉన్నాయి. అహంకారం ఆమెకున్న సమస్యలలో ఒకటి.

ఒకసారి శ్రీకృష్ణుని పుట్టిన రోజున, ఆమె తాను కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తుందో అందరికీ ప్రదర్శించాలని అనుకుంది. అందుకు కృష్ణుని బరువుకు సమానమైన బంగారాన్ని పట్టణవాసులందరికీ పంచిపెట్టాలనుకుంది. దీన్ని తులాభారం అంటారు. సాధారణంగా ఇది ఆలయాల్లో జరుగుతుంది. తూనిక త్రాసులో తమ బరువుతో సమానమైన వెన్న, నెయ్యి లేదా బియ్యాన్ని తూచి, వాటిని ఊరు ప్రజలకి పంచిపెడతారు. బియ్యము, పప్పు, ఉప్పు, బంగారం ఇలా ఏదైనా మీరు ఇవ్వగలిగిన వాటిని ఇవ్వచ్చు. ఇది ఒక సాంప్రదాయం.

సత్యభామ తులాభారం సిద్ధం చేసింది. అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ కృష్ణుడికి మాత్రం ఇదంతా నచ్చలేదు. ఆయన వెళ్లి త్రాసులో కూర్చున్నాడు. ఆవిడకి కృష్ణుడి బరువెంతో సుమారుగా తెలుసు గనుక, అంతకు సరితూగే బంగారం సిద్ధం చేసి ఉంచింది. కానీ ఆ బంగారాన్ని త్రాసులో ఉంచినపుడు, అది కొంచెం కూడా కదల్లేదు.

కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నపుడు ఇలాంటిదే ఒకటి జరిగింది. ఒక రాక్షసి వచ్చి, తనని ఎత్తుకు పోవాలని చూసింది. అప్పుడు కృష్ణుడు చాలా చాలా బరువెక్కి పోవడం వల్ల, కృష్ణుడిని ఎత్తే ప్రయత్నంలో, ఆ రాక్షసి కృష్ణుడిని ఎత్తలేక మీద వేసుకుని తానే కిందపడిపోయి నలిగి చచ్చిపోయింది. క్రియా యోగలో, యోగి తన బరువుని పెంచుకోవడం, తగ్గించుకోవడము చేయడానికి ఒక పద్ధతి ఉంది. యోగులు తమ బరువుని పర్వతమంత ఎక్కువగా పెంచుకోవడం గురించి చాలా కథలున్నాయి.

కృష్ణుడు తన బరువుని పెంచుకుని తులాభారంలో కూర్చున్నాడు. ఆవిడ తాను సిద్ధంగా ఉంచుకున్న బంగారాన్నంతా త్రాసులో వేసింది. కానీ ఏ ఉపయోగం లేకపోయింది. అప్పటికే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇది చూడ్డానికి వచ్చేశారు. ఇక ఆవిడ తనకున్న ఆభరణాలన్నింటినీ తీసుకురమ్మని పరిచారికలకు చెప్పింది. ఒకటి తర్వాత ఒకటిగా ఆభరణాలన్నీ తులాభారంలో వేసింది. తనకు ఉన్నవన్నీ త్రాసులో వేసినా అది కొంచం కూడా కదల్లేదు.

తనకిది చాలా అవమానంగా భావించి సత్యభామ ఏడవడం మొదలెట్టింది. తులా భారాన్ని చూడడానికి ఊరు ఊరంతా తరలి వచ్చింది. కానీ తన దగ్గర మాత్రం తగినంత బంగారం లేదు. తన అదృష్టాన్ని మరియు సంపదను చూసుకొని, ఎప్పుడూ గర్వపడుతూ ఉండే ఆమెకి ఇప్పుడు చాలినంత బంగారం లేక, ఏం చేయాలో తోచడం లేదు.

ఇక తాను ఎప్పుడూ అసూయ పడుతూ, ఇబ్బందిగా భావించే-సవతి రుక్మిణి వైపు చూసింది. రుక్మిణితో, "నేనేం చేయను? ఈ అవమానం నాకు ఒక్కదానికే కాదు, నీకు, నాకు ఇంకా అందరికీ. ఏం చేయాలి?" అని అడిగింది. అప్పుడు రుక్మిణి వెళ్లి, బయట ఉన్న తులసి మొక్క ఆకులు మూడింటిని తెంపి తీసుకొచ్చి తులాభారంలో వేసింది. కృష్ణుడు వెంటనే తక్కెడలో తేలికై పైకి లేచాడు!

కథ #3 - కృష్ణుడి సగం భక్తుడు

సద్గురు : ఒక రోజు కృష్ణుడు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. చాలా ఆనందంగా, గర్వంగా సత్యభామ ఆయనకి వడ్డిస్తోంది ఎందుకంటే ఆయన ప్రతిరోజూ ఇంటికి వచ్చే మనిషి కాదు. ఆయనకి భోజనం పెట్టడానికి తనకి చాలా అరుదుగా అవకాశం దొరుకుతుంది. అందువల్ల ఆమె చాలా ఆనందంతో, సంతోషంగా భోజనం పెడుతోంది.

కానీ భోజనం మధ్యలో, కృష్ణుడు హఠాత్తుగా లేచి, చేతులు కూడా కడుక్కోకుండా, ద్వారం వైపు పరిగెత్తాడు. సత్యభామ నిర్ఘాంతపోయింది. ఆమె "ఇదేమిటి? దయచేసి భోజనం పూర్తి చేసి వెళ్లండి" అంది. ఆయన "లేదు. నేను ఇప్పుడు వెళ్లాలి", అంటూ ముఖ ద్వారం వైపు పరిగెత్తాడు.

కానీ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం కొనసాగించాడు. అప్పుడు ఆవిడ "అలా పరిగెత్తారు ఎందుకు, మళ్లీ తిరిగి వచ్చారు ఎందుకు? ఏమిటిది?", అని అడిగింది. ఆయన ఇలా చెప్పాడు,"నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చుని ఉన్నాడు. అతని జీవంలో ప్రతి శ్వాస "కృష్ణ, కృష్ణ, కృష్ణ" గా మారిపోయింది.అతనివైపు ఆకలిగొన్న ఒక పులి వస్తుండగా చూశాను, కాబట్టి పరుగెత్తాల్సి వచ్చింది. ద్వారం వరకు వెళ్లాను, కానీ ఆ మూర్ఖుడు ఒక రాయి తీసుకున్నాడు. దాంతో సరే "అతని సంగతి..అతన్నేచూసుకోనీ" అని నేను వెనక్కి తిరిగి వచ్చేసాను.

కథ #4 - కృష్ణుడి తలనొప్పికి మందు

సద్గురు : ఒకసారి కృష్ణుడి పుట్టినరోజు నాడు, సంగీతం, నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరపాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి. చాలామంది జనం వచ్చారు. కానీ కృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సాధారణంగా ఎలాంటి వేడుకైనా, నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందుంటాడు. కానీ, ఆరోజు మాత్రం, ఎందుకనో ఆయన ఇష్టపడటం లేదు.

రుక్మిణి వచ్చి "స్వామి, ఏమైంది మీకు? ఏమిటిది?, ఎందుకని మీరు వేడుకలో పాల్గొనటం లేదు?" అని అడిగింది. “నాకు తల నొప్పిగా ఉంది", అన్నాడు కృష్ణుడు. ఆయనకు నిజంగా తలనొప్పి ఉందో లేదో మనకు తెలియదు. బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించడంలో కూడా సమర్ధుడు.

"వైద్యుని పిలిపించండి", అన్నది రుక్మిణి. వైద్యులు వచ్చారు. కృష్ణుడికి ఆ మందు, ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు."ఇవన్నీ నాకు పనిచేయవు", అన్నాడు కృష్ణుడు. "మరి ఇంకేం చేద్దాం", అడిగారు జనం. ఆపాటికి చాలా మంది జనం వచ్చిచేరారు. సత్యభామ వచ్చింది. నారదుడు వచ్చాడు. "ఏమైంది? ఏం జరిగింది?". ప్రతి ఒక్కరూ కంగారు పడుతున్నారు. "కృష్ణుడికి తలనొప్పిగా ఉంది. మనమేం చేయాలి?" అని.

"నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు, ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తలమీద రుద్దండి. నొప్పి తగ్గిపోతుంది" అని కృష్ణుడు చెప్పాడు. అప్పుడు సత్యభామ "ఏమిటీ అర్థం లేని మాటలు ? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ నా పాదధూళి తీసి మీ తల మీద పెట్టటం మాత్రం చేయను. అలాంటివి చేయ తగని పనులు" అని అంది. ఇక రుక్మిణి కూడా "ఇది ఎలా చేయగలం? మహా పాపం..ఇది మనం చేయలేము" అంటూ ఏడ్చింది. అక్కడ ఉన్న నారదుడు కూడా "నేను కూడా ఇలాంటి పని చేయ దలుచుకోలేదు. నువ్వు సాక్షాత్తూ భగవంతుడివి. దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు. ఇందులో దాగివున్నకుట్ర ఏంటో తెలీదు. నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను" అని నారదుడు వెనుదిరిగాడు.

ఈ విషయం అంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరు భయపడ్డారు "మేము ఇలాంటి పని చేయలేము. ఆయనంటే ప్రేమే గానీ, ఇలాంటి పని చేసి నరకానికి పోలేము"అని. ఉత్సవం కృష్ణుడి కోసం ఎదురుచూస్తోంది, కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు.

ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధ తన పవిటచెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దానిమీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్లు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి "దీన్ని తీసుకెళ్లి, కృష్ణుడి తలచుట్టూ కట్టండి" అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్లి కృష్ణుడి తలచుట్టూ కట్టగానే కృష్ణుని తలనొప్పి మటుమాయమైంది!

ఆయన ఎప్పుడూ తాను దేనికి ఎక్కువ విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు. రాజులతో పాటు తిరిగినా, రాజ్యాలను తనకు కానుకలుగా ఇచ్చినా, ఆయన అవి తృణప్రాయంగా భావించేవారు. కానీ భక్తితో, ప్రేమతో చేసే పని మాత్రం ఆయనకు ఎంతో విలువైనది.

Editor's Note: Love Krishna stories? Here is a collection of 30 stories from Krishna’s life.