కాశీ గురించిన నిగూఢ రహస్యాలు
వేలకుపైగా లింగాలు ఉండడానికి మించి ఇంకా గంగ ఒడ్డున ముక్తి పొందుతాము అన్న భావనకు మించి కాశీలో మరేదైనా ఉందా? భక్తుల సమూహాలతో ఈ నగరం నిండిపోవడానికి కారణం ఏమిటి? సద్గురు కాశీ మూలాలను గురించి లోతుగా వివరిస్తున్నారు. అది అంతటి ప్రసిద్ధిని ఎలా పొందగలిగింది, అక్కడ ఉన్న శక్తి ఈనాటికీ ఎంత సజీవమైనది అన్న విషయాలను మనకు తెలుపుతున్నారు.
మణికర్ణిక : శివుని ఆటలు – శ్రీహరి పాట్లు
సద్గురు: కాశీలో ఉండడం ఎటువంటి ప్రాముఖ్యత కలిగింది? “కాశి” అన్న పదానికి అర్థం కాంతి, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే కాంతి శిఖరం అని అర్థం. మీకు శివుడు పార్వతీదేవిని ఆవిడ చెవి కమ్మలు కిందకి పడేయమన్న కథ తెలుసా? ఆవిడ చెవి కమ్మలు పడేసింది అవి కిందపడి భూమిలో పాతుకుపోయాయి. విష్ణుమూర్తి స్త్రీలతో చనువుగా ఉండే వాడు కాబట్టి ఆయన తన శౌర్యాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. ఆయన ఈ చెవి దుద్దులు తీసుకురావడానికి వెళ్ళాడు. ఆయన వాటి కోసం భూమిని లోతుగా ఇంకా లోతుగా తవ్వడం మొదలు పెట్టాడు. దానితో ఆయనకు చెమటలు కారి, ఆ చెమట అంతా ఒక కుండంలా తయారయింది. ఇదే మణికర్ణిక. మణికర్ణిక నిజానికి ఒక కొలను లేదా ఒక కుండం. దాని ఒడ్డునే ప్రజలు అంత్యక్రియలు కూడా చేసేవారు.
వాళ్లు పైకి చూసినప్పుడు శివుడు ఒక కాంతి శిఖరంలా కనపడేవాడు. మీరు ఎప్పుడైనా ఒక టార్చ్ లైట్ ను ఆకాశంలోకి వేశారా? ఒకవేళ టార్చిలైట్ శక్తివంతమైనది అయితే, రాత్రిపూట అలా వేసి చూస్తే మీకు ఒక కాంతి శిఖరం పైకి పోతున్నట్లు కనిపిస్తుంది. అది ఎక్కడ అంతమవుతుందో మీకు తెలియదు. అది నిజంగా ఎక్కడ అంతమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ కాంతిపుంజం అనంతంగా సాగుతున్నట్టు, ఏది దాన్ని అరికట్ట లేనట్లుగా కనిపిస్తూ ఉండేది. ఈ కాంతి పుంజమే కాశీకి ప్రతీక. కాశీ ఒక యంత్రం లాంటిది, ఇది యావత్ బ్రహ్మాండాన్ని మీ అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన ఒక కృషి.
బ్రహ్మాండానికి మార్గం
అదృష్టవశాత్తు ఈ బ్రహ్మాండంలోని ప్రతి అణువు - ఒక అణువు నుండి ఒక అమీబా నుండి మొదలుకుని ఈ విశ్వంలో ఈ బ్రహ్మాండంలో అన్నీ ఒకే ప్రాథమిక నమూనాతో రూపొందించబడ్డాయి. పిండాండాన్ని బ్రహ్మాండంతో, పరిమితమైన దాన్ని అపరిమిత తత్వంతో, భౌతిక అభివ్యక్తాలను అనంతమైన సృష్టి పార్శ్వాలతో మమేకం చేసేందుకు చేసిన కృషి కాశీ నగరం. దీనర్థం మనం విశ్వాన్ని ఏకం చెయ్యాలని కాదు. విశ్వం ఎల్లప్పుడూ ఏకాంగానే ఉంది. మన మనుగడను అధిగమించి మనము సృష్టితో అనుసంధానం అవ్వాలి. ఇలా చేయాలంటే మనకు సాధనాలు కావాలి.
మీరు సృష్టి తత్వాన్ని అవగాహన చేసుకుంటే, ఉన్నట్లుండి మీరు పని చేసే విధానము, మీరు సృష్టితో అనుసంధానం చేసుకునే విధానం, మీరు జీవించే విధానం పూర్తిగా మారిపోతాయి. ఇలా చేయాలంటే మీరు కాశీలో ఉండడం అవసరమా? లేదు అవసరం లేదు. ఇది ఎలా పోల్చి చెప్పవచ్చు అంటే, మీరు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగానే ఉండవచ్చు, కానీ చాలామంది ప్రజలు అనారోగ్యంగా ఉన్నప్పుడు హాస్పిటల్ కి వెళ్తారు, ఎందుకంటే అక్కడ వారికి ఎన్నో సాధనాలు, సౌకర్యాలు, మందులు, వారికి అవసరమైన నైపుణ్యం అందుబాటులో ఉంటుంది. కాశీ కూడా అటువంటి ప్రదేశమే - ఇక్కడ ఒక సంపూర్ణమైన వ్యవస్థ ఉంది - విజ్ఞానం, విధానాలు, సామర్థ్యాలు - ఒకానొకప్పుడు అన్ని రకాల ప్రత్యేకతలు కలిగిన వారు ఇక్కడ జీవించేవారు.
నిగూఢమైన శక్తి నిర్మాణం
మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ భౌతిక శరీరానికి ఉన్న పరిమితులను తెలుసుకోవడం. నిన్న మీరు జన్మించారు, రేపు మిమ్మల్ని పాతి పెడతారు, మీరు జీవించడానికి ఉన్నది ఈ రోజు మాత్రమే. సృష్టి స్వభావం ఇదే, మరణం వచ్చేలోపే జీవం వికసించాలి. అందుకే దేశవ్యాప్తంగా మనం ఇందుకు అవసరమైన సాధనసామగ్రిని నెలకొల్పాము. కానీ ఇటువంటి సాధనాలు, దురదృష్టవశాత్తు వీటిలో చాలా వరకూ విచ్ఛిన్నమై పోయాయి. కాశీ కూడా చాలా వరకూ చెల్లాచెదురైంది. కానీ దానిలోని శక్తి ఇంకా సజీవంగా ఉంది. ధ్యానలింగంతో సహా, ఇటువంటి స్వభావం గల ప్రదేశాలను మనం ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు, వాటికి ఉన్న భౌతిక వ్యవస్థ అనేది ఒక తొడుగు లాంటిది మాత్రమే. సామాన్యంగా పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే కాశీ శివుని త్రిశూలం మీద ఉందని, ఇది భూమి మీద లేదనీ.
నా అనుభవంలో కాశీ యొక్క నిజమైన వ్యవస్థ, భూమికి దాదాపుగా 33 అడుగులకు పైన ఉంది. ఒకవేళ మనకు కనుక ఇంగితం ఉండి ఉంటే మనము 33 అడుగుల ఎత్తు దాటి మరి దేన్ని కట్టి ఉండకూడదు. కానీ ప్రపంచంలో, ఇంగితం కలిగి ఉండటం అనేది ఎంతో అరుదు. జ్యామితిపరమైన లెక్కల ప్రకారం ఈ శక్తి వ్యవస్థ దాదాపుగా 7200 అడుగుల ఎత్తు ఉండి ఉండవచ్చు. అందుకే దీనిని కాంతి శిఖరం అని పిలిచారు. ఇది చూడగలిగిన వారికి ఇది ఎంతో ఎత్తయిన కట్టడంలా కనిపించింది. ఇది అక్కడితోనే ఆగిపోలేదు, ఇది మీకు ఆభౌతికమైన దానికి మార్గాన్ని అందించింది. ఎన్నో వేల సంవత్సరాల పాటు, ఆత్మజ్ఞానం కలిగిన ఎందరెందరో అనుభవ సారంతో రూపొందించిన ఒక సాధనం ద్వారా మానవులు తమలో తాము సాధించగల దానిని పొందగలరు అనేది దీని ఉద్దేశం. తమకుగా తమే అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే, అది ఎంతో కష్టమైన ప్రక్రియ. ఎన్నింటినో తిరిగి మళ్ళీ తెలుసుకోవాల్సిన ప్రక్రియ అవుతుంది. కానీ మరొకరి జ్ఞానం వల్ల మీరు తెలుసుకోగలగాలి అంటే అందుకు మీకు వినమ్రత కావాలి.
ఎంతో మంది ఆత్మ జ్ఞానంతో నిర్మితమైనది
చాలామంది పరాన్ని చేరడానికి ఇటువంటి సాధనం అమర్చబడింది. ప్రజలు వచ్చి ఎన్నో రకాల విధానాలు మార్గాలను రూపొందించారు. ఒకానొక సమయంలో ఇక్కడ 26 వేల ఆలయాలు ఉండేవి. మానవుడు ముక్తి పొందేవీలుగా, ప్రతి ఆలయానికీ, దానికంటూ ఒక విధానం ఉండేది. ఈ 26 వేల ఆలయాలు వాటికి చెందిన ఉపగ్రహాలను నిర్మించుకున్నాయి. ఆలయానికి గల చాలా కోణాలు, వాటికవి ఉప ఆలయాలుగా మారాయి. దీనితో ఆలయాల సంఖ్య 72 వేలకు చేరింది. కాశీ అనే యంత్రాంగం దాని పూర్తి వైభవంలో ఉన్నప్పుడు 72వేల ఆలయాలు ఉండేవి. ఇదంతా రాత్రికి రాత్రి జరిగింది కాదు. దీని మూలం ఏ కాలంలో మొదలైందో ఎవరికీ తెలియదు. సునీరుడు, 40 వేల ఏళ్ల క్రితం ఇక్కడకు ఏదో వెతుకుతూ వచ్చాడని చెబుతారు. సునీరుడు 40 వేల సంవత్సరాల పూర్వానికి చెందిన వాడు. అప్పటికే ఇది ఎంతో సుసంపన్నమైన నగరం.
మార్క్ ట్వేన్ దీనినే తనదైన శైలిలో, "ఇది పురాణాల కంటే కూడా పురాతనమైనది" అని చెబుతాడు. దీని ప్రాచీనత గురించి చెప్పాలంటే ఇది ఎంత ప్రాచీనం అయిందో ఎవరికీ తెలియదు. ఈ నగరం ఎంతో అందంగా ఉండటంతో శివుడు ఇక్కడికి రావాలి అనుకున్నాడు. ఆయన ఇక్కడికి రావడానికి ముందే ఈ నగరం ఎంతో వైభవంగా ఉండేది. ఓ రెండు సంవత్సరాల క్రితమే భూమి కింద మూడు వరుసలలో ఉన్న ఆలయాలు ఎంతోకాలంగా మూసేసి ఉండడాన్ని తెలుసుకున్నారు. దీని అర్థం ఏమిటంటే ఈ నగరం కాలగర్భంలో ఎన్నోసార్లు మునిగిపోయింది, తిరిగి నిర్మించబడింది. దానితో, ఒక దాని మీద ఒకటి నిర్మించబడ్డాయి- ఈ విధంగా మూడు నుండి ఐదు సార్లు ఒక దాని మీద ఒకటి నిర్మించారు, ఎందుకంటే కాలక్రమంలో భూమి తనను తాను పునరుజ్జీవింప చేసుకుంటుంది.
విధ్వంసాలు వెల్లువెత్తిన కాలం
ఆరు, ఏడు శతాబ్దాల పాటు కాశీ నగరం విధ్వంసాలకు గురి అయింది. అయినప్పటికీ మీలో కొద్దిపాటి గ్రహణ శీలత ఉంటే చాలు అది ఎంతో అద్భుతమైన ప్రదేశం అని తెలుసుకుంటారు. దీనిని పూర్వ వైభవానికి తీసుకురాగలమా అని అడిగితే నా దృష్టిలో మనము చేయలేము అని అనుకుంటున్నా. ఒక విషయం ఏమిటంటే, చాలా వినాశనం జరిగింది. మరొక విషయం ఏమిటంటే మళ్లీ ఇటువంటి దాన్ని నిర్మించడం అంటే అసాధ్యమే అవుతుంది. ఎన్నో ఎన్నో సార్లు ఈ నగరం సర్వ నాశనం చేయబడింది, కానీ కాశీనగరం యొక్క శక్తి కోశం భూమికి 33 అడుగుల పైన ఉండడంతో అది ఇప్పటికీ సజీవంగానే ఉంది. చాలా ఎక్కువ స్థాయిలోనే నష్టం జరిగినప్పటికీ ఇది ఎంతో వైభవం కలిగిన ప్రదేశమే. దీనినే మనం ఒక విధంగా ఎలా చూడవచ్చు అంటే ఇది 72 వేల గదులు ఉన్న ఒక ఇంటి లాంటిది. అందులో 3 వేలకుపైగా గదులు శక్తి రూపంలో ఇంకా సజీవంగానే ఉన్నాయి.
జీవితంలోని ప్రతి పార్శ్వానికి, మానవుడిలో ఉండే ప్రతి స్వభావానికి ఇక్కడ ఒక లింగాన్ని నిర్మించారు. ఈ ఆలయాలను ఈ విధంగానే నెలకొల్పారు, ప్రతి పార్శ్వానికి ఒక లింగం ఉంది. కొన్ని చాలా తీవ్రంగా ఉంటాయి, కొన్ని సమాజం ఆమోదించేలా ఉంటాయి. మరికొన్ని అందుకు ఎంతో భిన్నంగా ఉంటాయి... ఇలా ఎన్నో రకాల విషయాలు ఒకే సమయంలో అక్కడ ఉన్నాయి. ఎవరూ, ఏదీ తప్పు పట్టలేదు. వారు కోరుకుంటున్నది ముక్తి అయినంత వరకు, ఇక్కడ ఎవరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వారు విముక్తిని ఆకాంక్షిస్తూ దాని పట్ల నిబద్ధత కలిగి ఉంటే వారికి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ముక్తికి ఇంత ప్రాధాన్యతను ఇచ్చారు - దానిని మీరు ఈ జీవితకాలంలోనే పొందాలి.
అందరికీ ఒకటే లక్ష్యం : ముక్తి
ముక్తిని ఆకాంక్షించే ప్రక్రియ ఒక అంశం నుండి మొదలవుతుంది - మీ కర్మను తొలగించు కోవాలి అనుకోవడం - మీ స్మృతులు ఇంకా మీ ఊహాగానాలు - ఏవైతే మీలో ఎప్పుడూ ఆడుతూ, అసత్యమైన ఎన్నో విషయాలను మిమ్మల్ని నమ్మిస్తూ మిమ్మల్ని మోసపోయేలా చేస్తున్నాయో, వాటిని తొలగించుకోవాలి అనుకోవడం. మీరు ఇలా కూర్చుని ఉన్నప్పుడు, మీకు ఉన్నది జీవం ఒకటే, మిగిలినవన్నీ మీ ఊహాగానాలే. ముక్తి అంటే అర్థం మాయ తొలగిపోవడం అని. మీరు మాయతో పోరాడలేరు. మీరు మాయ కున్న మూలాన్ని తెలుసుకోవాలి. ముక్తి అంటే విముక్తులు అవ్వడం. విముక్తి అంటే మీ నుండి మీరు స్వేచ్ఛను పొందడం. ఎందుకంటే మీ జీవితంలో ఉన్న ఒకే ఒక అడ్డంకి మీరే కాబట్టి..!
ప్రేమాశీస్సులతో,