జీవన్మరణాలను నిర్దేశించే మూడు అంశాలు - కాలం,శక్తి, సమాచారం
జీవన మరణాలన్నవి కాలం, శక్తి, సమాచారాలు ఆడే ఆట మాత్రమేనని, ఈ మూడింటిని స్పృహతో నిర్వహించుకున్నట్లయితే మనం సంపూర్ణంగా విముక్తులవుతామని సద్గురు చెప్తున్నారు.
మనిషి పుట్టినప్పుడు అతనిలో ఒక నిర్దిష్టమైన సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ సాఫ్ట్‌వేర్ కాలం, శక్తి ఇంకా సమాచారాల కలయిక. అది అతనితోపాటు కొనసాగుతుంది. జీవితంలోని వివిధ అంశాలను ఈ మూడూ కలిసి నిర్ణయిస్తాయి. ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడో, ఎలా జీవిస్తాడో కూడా ఈ మూడూ నిర్దేశిస్తాయి. సమాచారం కచ్చితంగా ముందు నిర్ణయింపబడిందే. అంటే మీరు కొత్త సమాచారం తీసుకోలేరని అర్థం కాదు. మీలో ఎటువంటి సమాచారం ఉన్నదో, దాన్నిబట్టి అది మిమ్మల్ని కొన్ని రకాల విషయాలవైపు లాగడమో, మరోవైపు నెట్టడమో జరుగుతుంది. అయితే మీరివ్వాళ, ఇప్పుడు కొత్త సమాచారం పోగుచేసుకోవడాన్ని ఇది ఆపదు.
ఈ మొత్తం సమాచార రాశినంతా కలిపి సంచిత కర్మ అంటారు. ఈ సమాచార స్వభావం ప్రకారం, జీవితంలోని వివిధ అంశాలకు శక్తిని కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మీ కర్మ సమాచారం గనక శారీరికత వైపు మొగ్గుచూపితే, మీలోని శక్తి సహజంగానే మీ శరీర నిర్మాణం వైపు కేటాయించుకుంటుంది. ఈ సమాచారం మీ మేధా ప్రక్రియ వైపు మొగ్గుచూపితే, దానికి తగినట్లు శక్తి తనను ఆ కార్యకలాపం వైపు కేటాయించుకుంటుంది. మీలోని ఈ సమాచారం మనోభావ పూరితమైతే, ఆవైపే శక్తి తనను కేటాయించుకుంటుంది. అది ఆధ్యాత్మిక కోణం వైపు మొగ్గుచూపితే, శక్తి కూడా తనను ఆవైపే కేటాయించుకుంటుంది.
ఈ కేటాయింపు సహజ ధోరణిలో జరుగుతుంది. కాని ఎవరైనా దీన్ని మరోవిధంగా కేటాయించుకోలేరని అనలేము. అలా చేయవచ్చు. కాని పూర్వ నిర్దిష్ట రీతిలోనే మీరు వెళ్లినట్లయితే మీ జీవితం కూడా మళ్ళి అదే విధంగా జరుగుతుంది. మీరు మీ ధోరణులకు 100% బానిసలైతే మీ జీవితం పూర్వనిశ్చితమే. ఏం జరుగుతుందో మనం తేలికగా ఊహించవచ్చు.
కాలం ఎవరికోసమూ ఆగదు
మన శక్తుల్ని ఎలా నిర్వహించుకుంటాం, ఏ దిశలో వాటిని కేంద్రీకరిస్తాం, మనం వాటిని వృద్ధి చేసుకుంటామా, తరిగించుకుంటామా - అంతా మన చేతుల్లోనే ఉంటుంది. కాని మన జీవితంలో అత్యంత ప్రధానమైన భాగం కాలం, ఇది మూడోది. ఇది ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది. మీరు దాన్ని వేగవంతం చేయలేరు, మెల్లగా నడిపించలేరు. మీరు మీ శక్తిని నిలువచేసుకోవచ్చు, వృథా చేయవచ్చు, పెంచుకోవచ్చు, చాలా పెద్దదిగా చేసుకోవచ్చు, అది అల్పంగా కూడా చేసుకోవచ్చు. కాని కాలం మాత్రం జరిగిపోతూనే ఉంటుంది.
కాలానికి సంబంధించి దాని మేధస్సు దానికుంటుంది. ఒక వ్యక్తి వ్యవస్థలో, అందుబాటులో ఉన్న శక్తి కేటాయింపు, కర్మ సమాచారాన్ని బట్టి అది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విషయంలో మనమేమీ చేయలేమా అంటే..? చేయగలం, కాని అది తక్కిన రెండు జీవనాంశాలకంటే కష్టం. తక్కిన రెండింటినీ నిర్వహించడం తేలిక, మనిషి జీవితంలో అవి వ్యక్తమవుతాయి. శక్తిని సృజించడం, దాన్ని మీ ఇష్టమొచ్చినరీతిలో ఉపయోగించడం, మీ ధోరణులు, మీ ఆలోచనా సరళిని మీ భావోద్వేగాలను, కార్యకలాపాలను నిర్ణయించడానికి అనుమతించడం, కాలాన్ని చేతిలో పెట్టుకోవడం కంటే చాలా తేలిక. చివరికి ఆదియోగి కూడా నిర్దిష్ట స్థితులలోనే కాలాన్ని తన అధీనంలో పెట్టుకున్నాడు. ఆయన అటువంటి స్థితులలో ఉన్నప్పుడు ఆయన్ని కాలభైరవుడంటాం.
ఒక వ్యక్తి ఆయుః ప్రమాణాన్ని, జీవన మరణాలను కాలం నిర్దేశిస్తుంది. జీవితం, మరణం రెండూ కాలం పరిధిలోనే ఉంటాయి. కాలంపై ఆధిపత్యం సంపాదించినవాడికి తన జీవితం, మరణంపై కూడా అధికారం ఉంటుంది. తన జీవన్మరణాలని తానే నిర్ణయించుకోగలడు. అదే తన శక్తుల మీద ఆధిపత్యం ఉన్న వ్యక్తి - తన జీవిత స్వభావాన్నీ, జీవన విధానాన్నీ నిర్ణయించుకోగలడు. తన జీవితం మీద అతనికి సంపూర్ణాధికారం ఉంటుంది కాని మరణం మీద ఉండదు.
తన సమాచారం మీద, లేదా ఆ సమాచారం ఏర్పరచిన ధోరణుల మీద అధికారం ఉన్నవాడు లేదా తాను మోస్తున్న కర్మ సమాచారం నుండి విముక్తుడైన వాడు తన జీవిత ప్రమాణాలపై ఆధిపత్యం సంపాదించగలడు - తాను లోపల ఆనందంతో ఉండాలా లేక దుఖంతో ఉండాలా అనేది తనే నిర్ణయంచుకోగలడు. ఈ మూడు అంశాలూ కలిపితే జీవితం. మీరిప్పుడు ఈ మూడింటి సమాహారమే. తనలోని ఈ మూడు కోణాలనూ అర్థం చేసుకున్నవాడు, తాను కాలం, శక్తి, సమాచారాల సమాహారమని గ్రహించినవాడు ఈ మూడింటినీ స్పృహతో నడిపినట్లయితే వాడు అన్ని విధాలా విముక్తుడు. 100% విముక్తుడు. అదే ముక్తి.