ప్రశ్న: సద్గురు, ధ్యానలింగం ప్రతి మనిషికి జీవితాన్ని సంపూర్ణంగా అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తుందని మీరు చెప్పారు. ఎలాగో వివరిస్తారా?

సద్గురు: ధ్యానలింగం వెనుక ఉన్న సైన్స్ గురించి మీకు కొంత వివరించాల్సిన అవసరం ఉంది. యోగ సంప్రదాయంలో మనం దేన్నయితే శివ ఇంకా శక్తి అని పిలుస్తామో, అదంతా కూడా ఈ జీవానికి ఉన్న ద్వంద్వత్వం గురించే. మీరు ఈ జీవితాన్ని మీ ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందుతునప్పుడు, మీ జీవితానుభూతి ఒక విధమైన ద్వంద్వత్వం మధ్య కొనసాగుతుంది. ఈ ద్వంద్వత్వాన్నే సాంప్రదాయంలో శివుడు ఇంకా శక్తి అని పిలుస్తారు, అదే అర్ధనారీశ్వర రూపం. యోగాలో మనం దీన్ని ఈడ మరియు పింగళ అని పిలుస్తాము. అదే దూరపు తూర్పు సంస్కృతులలో, ఇన్ మరియు యాంగ్ అని పిలుస్తారు. మీరు దాన్ని స్త్రీత్వంగా మరియు పురుషత్వంగా పిలవచ్చు, లేదా ఒకరిలో ఉండే, స్వభావ వైఖరి మరియు తాత్విక అంశంగా పిలవచ్చు. మీరూ ఇంకా మీ చుట్టూ ఉండే ఈ ప్రపంచం రెండు పార్శ్వాల్లో ఉంటుంది. ఈ ద్వందత్వాన్ని ఆధారంగా చేసుకునే, మతపరమైన శాస్త్రాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. దీని ఆధారంగానే జీవం సృష్టించబడింది. ఈ ద్వంద్వత్వాలు లేనిదే, జీవం ప్రస్తుతం అది ఉన్న విధంగా ఉండదు..

ప్రారంభంలో, ప్రతిదీ బీజభూతమైనదిగా ఉంటుంది, ద్వంద్వత్వం ఉండేది కాదు. కానీ  ఒకసారి సృష్టి జరిగాక ద్వంద్వత్వం అనేది వచ్చింది. మీ ఇంద్రియాల పని మీకు ఈ ద్వంద్వత్వ అనుభూతిని ఇవ్వడమే, అలాగే మిమ్మల్ని ఈ ద్వంద్వత్వానికి పరిమితం చేయడమే. మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని మీరు  ఇంద్రియాల ద్వారా అనుభూతి చెందుతారు - చూడడం, వాసన చూడటం, రుచి చూడటం, వినటం, స్పృశించటం. ఈ ఇంద్రియాలు ఈ ప్రపంచంలో ఉన్న ద్వంద్వత్వాన్ని తయారుచేస్తాయి, ఇంకా దాన్ని మరింతగా పెంచుతాయి. ప్రతిదీ కూడా మరింత స్థిరమైనదిగా కనిపించేలా చేసేది, ఈ వెలుతురు ఇంకా చీకటి, మంచి ఇంకా చెడు, ఆహ్లాదము ఇంకా విచారము అనే ఈ భావనలే. మీరు ఈ ఇంద్రియ అనుభూతిలో మరింతగా నిమగ్నమయ్యే కొద్ది, ఆలోచించే కొద్దీ, జీవితాన్ని అనుభూతి చెందే కొద్దీ, ఈ ద్వంద్వత్వం మరింత లోతుగా అవుతుంది.

అయితే, ఈ ద్వంద్వత్వంతో ఏదైనా తప్పుందా అంటే, విషయం అది కాదు. ద్వంద్వత్వం లేనిదే సృష్టే ఉండదు, ఈ పరస్పర వైరుధ్యాల వల్లే సృష్టి జరిగింది. కాకపోతే ఈ ద్వంద్వత్వంలో చిక్కుకోవడమనేదే సమస్య. ద్వంద్వత్వానికి పరిమితమైతే, అంతకుమించి మీరు ఏమీ తెలుసుకోలేరు, అది మీ జీవితంలో ఒక పెద్ద పరిమితి అవుతుంది. ద్వంద్వత్వమే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలకూ మూలం. ఈ పరస్పర వైరుధ్యాలు లేకుంటే, సుఖము అనేదే ఉండదు. అదే సమయంలో, ఈ ద్వంద్వత్వమే ప్రపంచంలోని దుఃఖం అంతటికీ మూలం కూడా.  ఈ ద్వంద్వత్వం కారణంగానే మనిషి దుఖిస్తాడు. జీవన ప్రయాణంలో ప్రజలు, జీవిత అనుభూతిలోని సుఖదుఃఖాలలో చిక్కుకుపోయి గాయపడతారు.  జీవితానుభూతితో వారు వివేకవంతులు కారు, వారు గాయపడిన వారవుతారు. వారు ఈ ద్వంద్వత్వాన్ని సరిగ్గా నిర్వహించలేరు, పోనీ దీన్ని అధిగమించడం అన్నా చేయలేరు.

మిమ్మల్ని మీరు ఈ ఇంద్రియ అనుభవానికి పరిమితంచేసుకున్నప్పుడు, మీరు ఈ ద్వంద్వత్వానికి పరిమితమైన వారవుతారు. అలా జరగకుండా మీరు చేయలేరు. ఈ ఇంద్రియ అనుభవాలు స్వేచ్ఛకు మార్గాలు అనిపిస్తాయి. ఉదాహరణకు మీ కంటి చూపు, మీకు ఒక స్వేచ్చలా అనిపించవచ్చు. కళ్ళు లేకపోతే బయట ఏం జరుగుతుంది అన్న అనుభూతి మీకు ఉండదు. అదే సమయంలో, ఎన్నో విధాలుగా మిమ్మల్ని పరిమితమైన వారిగా చేస్తున్నది కూడా ఈ  కన్నే. ఈ కన్ను మీ శరీరానికి ఒక కిటికీ వంటిది. ఈ కిటికీ ద్వారా మీరు బయటి ప్రపంచాన్ని చూస్తారు. ఈ కిటికీ ఒక గొప్ప అవకాశంగా కనబడుతుంది. కాని, ఈ కిటికీ కూడా ఒక పరిమితే. మీరు ఈ పరిమితిని తీసేస్తే, అప్పుడు మీకు తెలుస్తుంది. చూస్తున్నది ఈ కన్ను కాదు, చూస్తున్నది మీరు అని. మీ కళ్ళు, ప్రపంచాన్ని చూడటానికి ఒక మార్గం మాత్రమే. కాబట్టి, ఈ ఇంద్రియ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అవి కేవలం చిన్న కిటికీలే. కానీ అదే సమయంలో మీకున్న అతి పెద్ద బంధనాలు కూడా అవే.

ఈ ధ్యానలింగం వెనుక ఉన్న ప్రక్రియ లేదా శాస్త్రీయత ఏంటంటే, జీవపు ద్వంద్వంలోని వైభవాన్ని స్థిరపరచడమే. ఈ జీవం, ఈడ ఇంకా పింగళ నాడుల ద్వారా, అలాగే ఏడు చక్రాల ద్వారా, అలాగే అనేక రకాల రూపాలు ఇంకా అనుభవాల ద్వారా  జరుగుతుంది. ఎన్నో జీవ రూపాలు, అలాగే ఎన్నో స్థాయిల జీవాలు, అలాగే జీవాన్ని అనుభూతి చెందే అనేక విధానాలు, ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉండటానికి కారణం, కేవలం ఈ ద్వంద్వత్వమే, ఇంకా ఈ ఏడు చక్రాలు లేదా జీవితానికి ఉన్న ఈ ఏడు పార్శ్వాలే. ధ్యానలింగం ఈ అన్ని స్థాయిలలో అభివ్యక్తం కాబడింది. కానీ  దాని ప్రయోజనం ఏమిటంటే, వ్యక్తి ఈ ద్వంద్వత్వానికి అతీతంగా వెళ్లగలిగేలా సాయం చేయడమే. మేము ఇంద్రియ అనుభవానికి వ్యతిరేకం కాదు. కానీ దానికి ఉన్న పరిమితులను చూసినప్పుడు, ఒకరు దానికి అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. ఈడ-పింగళ లేదా శివ-శక్తి అనే ఈ రెండు పార్శ్వాలను అభివ్యక్తీకరించడం ద్వారా, తర్క ఇంకా సహజసిద్ధమైన వైఖరి అనే ఈ రెండు పార్శ్వాలను ఆస్వాదించవచ్చు. అయితే ఈ తర్క పరమైన ఇంకా సహజ సిద్ధమైన వైఖరిని తెలుసుకోవడం సరిపోదు.  వీటికి అతీతమైనది మీరు తెలుసుకోవాలి.. దాన్నే యోగాలో ప్రతిభ అంటారు. అంటే మీరు సహజసిద్ధ వైఖరి స్థాయిలోనో లేదా తార్కిక స్థాయిలోనో ఉండరు. వాస్తవానికి ఈ ప్రపంచం ఎలా ఉంది, అనే దానికి సంబంధించిన, ఒక ప్రత్యక్ష వీక్షణ మీకు ఉంటుంది. మీరు జీవాన్ని, అది ఉన్నది ఉన్నట్టుగా అనుభూతి చెందుతారు. అంతేకాని ఇంద్రియాలు చూపించే విధంగా కాదు.