మనలోపల ఉన్న  జన్యుగత స్మృతిని (Genetic Memory), అది కలిగించే బంధనాల్ని, దేవి పూర్తిగా తొలగించ గలదని, అటువంటి సంభావ్యతను మనకు ఆమె అందిస్తుందని సద్గురు చెప్తున్నారు.

ప్రశ్న: నేను భారతదేశంలో లింగభైరవి దేవి ప్రతిష్ఠకు వచ్చాను. అప్పటినుంచి నా జీవితం మారిపోయింది. నాకు అన్నిచోట్ల దేవి ఉన్న స్పృహ కలుగుతోంది. ఒక్కొక్కప్పుడు ఇది మరీ తీవ్రంగా ఉంటుంది. కొన్నిసార్లు నేను కారు నడుపుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు కూడా ఈ అనుభూతి నాకు ఉంటోంది. నాకు దానితో సమస్య ఏమీలేదు. నేనింతవరకు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు, మా అమ్మతో తప్ప. మా అమ్మ దీని గురించి చాలా ఆందోళన చెందుతోంది. నా జీవితం నుండి దేవి వెళ్లిపోవడం నాకిష్టం లేదు. ఆమె ఉనికి నాకెంతో సంతోషాన్నిస్తున్నది. నాకు సహాయం చేయగలరా?

సద్గురు: సహాయం మీకు కావాలా, మీ అమ్మగారికా? లింగభైరవి తత్వమేమిటంటే, మరొకరు తల్లిగా ఉండడం ఆమెకిష్టం ఉండదు. అందువల్ల మీ అమ్మగారు ఆందోళన చెందడంలో వింతేమీ లేదు. ఆమె తన స్థానం కోల్పోతోంది. మీరు దానిని ఇలాగే కొనసాగనిస్తే, ఆమె మీ అమ్మగారిని స్థానభ్రంశం చేసేస్తుంది. దానివల్ల మీకేమీ సమస్య లేకపోవడం, మంచిదే. ఇటువంటి శక్తిమంతమైన రూపాలను సృష్టించేది వినోదం కోసంమో లేక మీ నిత్యావసరాలు తీర్చడంకోసమో కాదు. బతుకుతెరువు సంపాదించుకోలేనివారు, తమ కుటుంబాలను, ఇళ్లను నిభాయించు కోలేనివారు దేవి వద్దకు వెళ్లి ఇలా మొరపెట్టుకుంటారు, “ఓ దేవీ! నా సంగతి చూసుకో. నాకు ఈ పని చేసిపెట్టు, ఆ పని చేసిపెట్టు” అని- ఇటువంటి వాళ్లకోసం కాదు, దేవిని సృష్టించింది. అసమర్థత అంటే ఆమెకి ఇష్టం ఉండదు. దైవత్వం ఇందుకోసం కాదు. అపారశక్తితో ప్రకంపించే దైవశక్తి సృజనకిది లక్ష్యం కాదు. ఆమె మీ అంతరంగంలో ఏ విధంగా ప్రకంపించాలంటే , మీలో ‘నేను’, ‘నాది’ అన్నదేమి మిగిలి ఉండకోడదు.

జన్యుపర అంశాలనుండి విముక్తి

మీరిప్పుడు ‘నేను’ అనుకుంటున్నది , ఆనువంశికత (parentage) వల్ల ఎక్కువ ప్రభావితమవుతోంది. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గాన్ని వారి జీవన మార్గంగా ఎంచుకున్నప్పుడు –అంటే, ఎవరైనా బ్రహ్మచర్యమో, సన్యాసమో తీసికున్నప్పుడు వాళ్లు మొదట చేసేపని ఏమిటంటే, తమ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు సాధారణంగా చేసే క్రియాకర్మలు. వారి తల్లిదండ్రులు జీవించి ఉండగానే ఇవి చేస్తారు. అంటే వాళ్లు చనిపోవాలన్న ఉద్దేశ్యంతో ఇది చెయ్యరు. వారి జన్యుపర స్మృతుల నుండి విముక్తి చెందే  ప్రయత్నంలో ఈ  ప్రక్రియలు చేస్తారు. మీరు ఇప్పడు ఎలా ఉన్నారో, మీరు అలా రూపుదిద్దుకోవడానికి మీ జన్యుపర స్మృతులే కారణం. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు, మీరు “నేను మా అమ్మానాన్నల్లాగా లేను” అనుకుంటారు, మీకిప్పుడు అర్థంకాదు. కాని చూడండి, మీరు 45-50 ఏళ్ల వయస్సుకు వచ్చేసరికి, మీలో కనీసం 70% మంది కచ్చితంగా మీ తల్లిదండ్రుల లాగే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వారి జన్యులక్షణాలు, ఒక మనిషిగా  మీ నిర్మాణంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు యువకులుగా ఉన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రుల లాగా లేరనుకోవడానికి కారణం వారిని మీరు వారి యుక్త వయస్సులో ఎలా ఉన్నారో చూడకపోవడమే.

జన్యుపర స్మృతులను తొలగించుకోవడం లేదా వాటినుండి విముక్తి చెందడం అన్నది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతిలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

జన్యుపర స్మృతులను తొలగించుకోవడం లేదా వాటినుండి విముక్తి చెందడం అన్నది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతిలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. మీ ఆనువంశికత, అంటే మీ తల్లితండ్రుల జన్యులక్షణాలు మీ మీద తీవ్రంగా పనిచేస్తున్నట్లయితే, అవి మిమ్మల్ని విముక్తి చందనీయవు. ఎందుకంటే  మీ లోపలినుంచి అది మిమ్మల్ని తన పట్టులో ఉంచుకుంటుంది. మీ తల్లితండ్రులు మరణించినప్పటికీ,  వారి జన్యులక్షణాలు మీ మీద పట్టు కలిగే ఉంటాయి. దీన్ని ఎన్నో విధాలుగా, మరింత దృఢమైన మాటల్లో వ్యక్తం చేయటం జరిగింది. ఉదాహరణకు ఏసుక్రీస్తు ఏమన్నాడు, ‘చనిపోయిన వారిని చనిపోయిన వారికి వదలండి, వారిని (వారి జన్యులక్షణాలని) మీ ద్వారా జీవించనీయకండి’ అని.

స్వయంభూ – తనను తాను సృజించుకున్నవాడు

మనం శివుణ్ణి స్వయంభువు అంటాము. ఇది  యాదృచ్ఛికంగా అనే మాట కాదు. ఆయన తనంత తానే ఉద్భవించినవాడు. మేము భైరవిని కూడా స్వయంభువు అనే అంటాం, ఎందుకంటే ఆమె కూడా స్వయంభువే కాబట్టి. మీరు ఆమెతో స్నేహం చేసుకుంటే, ఆమెకు, దేనికో (జన్యులక్షణాలకు) బానిసలైన వారితో స్నేహం చేయడం ఇష్టం ఉండదు. ఆమె వారిని కూడా స్వయంభువులాగా ఉండాలని కోరుకుంటుంది. అందువల్ల ఆమె చేసే మొదటి పని మీ లోని అమ్మను వినాశనం చేయడం – అంటే మీకు జన్మనిచ్చిన స్త్రీని కాదు – మీ ద్వారా జీవించడానికి ప్రయత్నించే మీ తల్లిదండ్రుల జన్యులక్షణాలని . లేకపోతే తర్వాతి తరమనేదే ఉండదు, భవిష్యత్తు అనేదే ఉండదు – ఎందుకంటే, ఈ పాత తరానికి చెందిన జన్యులక్షణాలే, మోసపూరిత పద్ధతుల్లో మళ్ళి భవిష్యత్తు తరాల ద్వారా వ్యక్తం అవుతూ ఉంటాయి. మీరు మీ ముందు తరాల జన్యులక్షణాలా నుండి విముక్తి చెందినప్పుడు మాత్రమే మీకు నిజంగా భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీరు అదే గతానికి పునరుక్తి అవుతారు, బహుశా కాస్త కొత్త వాసన ఉండవచ్చు, అంతే.

దేవిని మీలో నుంచి ప్రవహించనీయండి.

చాలా మంది సాధారణంగా తమ తల్లిదండ్రుల గురించో, వంశం గురించో గొప్పలు చెప్పుకుంటారు. ఇది వరికిగా వారు ఎటువంటి ఖ్యాతీ గడించనప్పుడే జరుగుతుంది. మీరు అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉదాహరణ తీసుకొని చూడండి. మొదట్లో, వాళ్లు తమ దేశాన్ని నిర్మించుకుంటున్నప్పుడు, అన్నిటికన్నా ముఖ్యవిషయం ఏమిటంటే, వాళ్ళు ఎవరనీ వాళ్ల తల్లిదండ్రులు గురించి అడగలేదు. కేవలం వారి ప్రతిభను చూశారంతే. సరే, ఇప్పుడు అక్కడ కూడా ఇది  మారుతోంది. తక్కిన అన్నిచోట్లా ఇంటి పేరుకు చాలా ప్రాధాన్యం ఉంది, ఎందుకంటే అది మీ వంశాన్ని తెల్పుతుంది కాబట్టి. ప్రజలు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వచ్చినప్పుడు వాళ్లకు ఇంటిపేరు లేకపోయినట్లయితే వాళ్లకు తమ వంశం, వారసత్వం తెలియదు కాబట్టి ‘చింగో’ ‘జింగో’ మరేదో ఒకటి పెట్టుకున్నారు. కాని దీనికి అర్థం వారి ఆనువంశికత వాళ్ళ లోపలినుండి పనిచేయట్లేదని కాదు; అది పనిచేస్తూనే ఉంటుంది. దానినుండి మీరు నిజంగా ఎప్పుడు విముక్తి చెందుతారంటే, మీరు దివ్యత్వాన్ని మీలోనుండి ప్రవహించ నిచ్చినప్పుడు.  లేదా ఆనువంశికత నుండి దూరం కావడానికి కావలసిన సాధన చేయడం జరిగినప్పుడు. లేకపోతే మీరు కేవలం గతానికి పునరుక్తిగా  మాత్రమే ఉంటారు.

మీరు కేవలం గతానికి పునరుక్తి మాత్రమే అయితే ఇక్కడ మీ అస్తిత్వానికి ఏ లక్ష్యమూ లేదు. మనం చరిత్ర పుస్తకమొకటి చదివితే చాలు. గత తరానికంటే గణనీయంగా ఏమీ భిన్నంగా లేనప్పుడు ఈ తరం వల్ల ప్రయోజనమేమిటి? భిన్నంగా ఉండడమంటే మీ తల్లిదండ్రులు చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకుంటే, మీరు నలిగిపోయిన బట్టలు వేసుకోవడం కాదు. ఇది భిన్నత్వం చూపించడానికి పిల్లలు ఉపయోగించే పద్ధతి. భిన్నంగా ఉండడమంటే గతాన్ని మీ తలపై కిరీటంగా మలచుకోకుండా,  దాన్ని మీ ఎదుగుదలకు ఒక మెట్టుగా వాడుకోవడం. మీ అమ్మగారికి ఆందోళన సహజమైనదే. కాని నాకు అది నచ్చింది.  దేవిని మీలో నుంచి ప్రవహించనీయండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు