చంద్రవంశం ఎలా ఆరంభమైంది..? - రెండవ భాగం
క్రిందటి భాగంలో ఈలా, బుధుల సంతానం ద్వారా చంద్రవంశ ఆగమాన విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వారి పుత్రుడైన నహుషుడి గురించీ,ఇంకా దేవతల - అసురుల మధ్య వివాదం గురించీ తెలుసుకుందాం..
చక్రవర్తిగా ఉండి కొండచిలువగా మారిన నహుషుడు బుధ, ఈల సంతానంలో వాడైన నహుషుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఒకసారి దేవలోకంలోని ఇంద్రుని రాజభవనానికి అతడిని అహ్వానించారు. ఇంద్రుడికి ఎక్కడికో వెళ్ళవలసి వచ్చినందున "కొద్దిసమయం నా దేవలోకాన్ని చూస్తూ ఉండు, చక్కగా పరిపాలించు, ఇక్కడే ఉండి, ఆనందించు" అని నహుషుడిని కోరాడు. ఇంద్రుడు వెళ్ళిన వెంటనే నహుషుడు ఆ చిన్నబాధ్యతకే గర్వం ఎక్కువై ఇంద్రుని ఆసనంపై కూర్చుని తనకు కావలసిన అప్సరసలను పిలిపించాడు.
అంతటితో ఆగలేదు, ఇంద్రుని భార్య అయిన సచీదేవి మీద కన్ను వేసాడు. "ఇప్పుడు నేను సింహాసనంపై కూర్చున్నాను నేనే ఇంద్రుడిని, నువ్వు నా దానివి" అంటూ బలవంత పెట్టటం ఆరంభించాడు. సచీదేవి ఎన్నో విధాలుగా అతనిని తప్పించుకోవటానికి ప్రయత్నం చేసింది కానీ నహుషుడు వదలలేదు. సచీదేవి "నువ్వు ఇంద్రుడివే, సప్తరుషులు నిన్ను పల్లకీ మీద మోసుకొని నా దగ్గరికి తీసుకు వస్తే నేను నీ దానిని" అని షరతు పెట్టింది. నహుషుడు తనను పల్లకీ మీద మోసి సచీదేవి దగ్గరికి తీసుకువెళ్ళమని సప్తరుషులను ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేశారు.
నహుషుడు పూర్తిగా గర్వంతో పెట్రేగి పోయాడు, ఆవేశంలో ఉన్నాడు. ఋషులు తొందరగా నడవడం లేదని భావించి అహంకారంతో పల్లకీ కుడి ప్రక్కన ఉన్న అగస్త్యముని శిరస్సుని తన్ని "తొందరగా వెళ్ళండి" అన్నాడు. అగస్త్యుడు అతని వంక ఒక్కసారి చూసి "నీకు గర్వం తలకెక్కింది, నువ్వు పూర్తి నీచంగా మారావు, నువ్వు దేవలోకంలో కాదు భూలోకంలో మనిషిగా కూడా ఉండడానికి అర్హుడివి కాదు. నువ్వు కొండచిలువగా మారమని శపించాడు. కొండచిలువ చాలా అధమ జంతువు. నహుషుడు కొండచిలువగా దేవలోకం నుండి కింద పడిపోయాడు. ఈ కొండచిలువ కధ దగ్గరికి తరువాత వద్దాం.
నహుషుడికి ఇద్దరు సంతానం, వారిలో ఇద్దరు ముఖ్యమైన వారు యతి, యయాతి. యతి అసాధారణమైన తెలివికీ, గుణానికీ పేరొందాడు, ప్రపంచం వంక ఒక్క క్షణం చూసి " నాకు ఈ ప్రపంచంతో సంబంధంలేదు" అని సన్యాసం తీసుకుని హిమాలయాల్లోకి వెళ్ళిపోయాడు. యయాతి రాజు అయ్యాడు.
దేవాసురుల నిత్య పోరాటాలు
ముందేచెప్పినట్టుగా బృహస్పతి దేవతల పురోహితుడిగా ఉండి వారి క్రతువులనన్నిటినీ జరిపించుతున్నాడు. శుక్రాచార్యుడు అసురుల పురోహితుడు. గంగాతీరంలో దేవాసురులు నిరంతరం పోట్లాడుకునేవారు. దేవతలు పైప్రాంతాల నుండీ దిగువలోకి రావడానికీ, అసురులు ఎడారి నుండి భారతదేశంలోని సారవంతమైన ప్రదేశంలోకి చేరుకోవడానికీ ఈ యుద్ధాలు. ఈ నిరంతర యుద్ధంలో శుక్రాచార్యుని వల్ల అసురులకు పైచేయి ఉండేది. ఎన్నో సామర్ధ్యాలతో పాటు ఆయన దగ్గర సంజీవిని ఉంది. ఈ మంత్రంతో యుద్ధంలో చని పోయినవారిని ఆయన తిరిగి బ్రతికించగలడు.
ప్రతిరోజూ యుద్ధంలో చనిపోయిన అసురులనందరినీ శుక్రాచార్యుడు తిరిగి బ్రతికించేవాడు, రెండోరోజు మళ్ళీ వారు యుద్ధంలో పాల్గొంటారు. చనిపోయిన సైన్యం తిరిగి బ్రతుకుతూ ఉంటే, ఇటువంటి సేనతో యుద్ధం చేయడం దేవతలకి కష్టంగా ఉంది. శుక్రాచార్యులు వారిని మళ్ళీ బ్రతికిస్తున్నారు, దేవతలు నిరాశ చెందారు. ఇదంతా చూస్తున్న బృహస్పతి కుమారుడు కచుడు, రాక్షసుల గురువు శుక్రాచార్యుడి వద్దకు వచ్చి తల వంచి వినమ్రతతో "నేను ఆంగీరుడి మనుమడిని, బృహస్పతి కుమారుడిని, నేను గొప్ప వంశం నుండి వచ్చాను, నన్ను మీ శిష్యుడిగా అంగీకరించండి" అని వేడుకున్నాడు.
కచుడు శుక్రాచార్యుడి శిష్యుడయ్యాడు
అసురులు "ఇతడు శతృ కూటమికి చెందినవాడు, సంజీవిని రహస్యం నేర్చుకోవడానికే వచ్చాడు, వెంటనే చంపేద్దాము" అని శుక్రాచార్యుని హెచ్చరించారు. శుక్రాచార్యుడు "ఈ పిల్లవాడు మనకు హాని చేయలేదు, నా శిష్యునికి కావలసిన అర్హతలు ఇతడిలో ఉన్నాయి, నేను ఇతడిని తిరస్కరించలేను" అని సమాధానమిచ్చాడు. అర్హుడైన విద్యార్థిని తిరస్కరించడం ఆ రోజుల్లో ధర్మం కాదు.
కచుడుని శిష్యునిగా శుక్రాచార్యుడు అంగీకరించారు, అతడు మంచి శిష్యుడిగా రాణించాడు. గురువుకు కావలసిన సేవచేస్తూ, సూచనలను పాటిస్తూ ప్రతి విషయంలోనూ అతను పాలుపంచుకున్నాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుని చూసి, ప్రేమించింది కానీ, కచుడికి ఆమెపై మక్కువ లేదు. ఆమె ఎంత ప్రయత్నించినా కచుడు తన దృష్టి ఆమె వైపు మరల్చలేదు, తను వచ్చిన పని నుండి అతను ధ్యాస మరల్చలేదు. అతను సంజీవిని కొరకే వచ్చాడని అసురుల నమ్మకం.
కచునిపై దాడి
ఒకరోజు కచుడు గురువుగారి పశువులని ఆడవికి తీసుకు వెళ్ళాడు. అసురులు అతనిపై పడి, చంపి, ముక్కలు చేసి అడవి జంతువులకి వేశారు. సాయంకాలం ఆవులు మాత్రమే ఇంటికి రావటం చూసి, దేవయాని కంగారుపడి తండ్రితో "కచుడు ఇంటికి రాలేదు, అతనికి ఎవరో హాని చేసి ఉంటారు, ఎక్కడున్నా అతన్ని మీరు జీవింపచేయాలి" అని ఫిర్యాదు చేసింది. కూతురి విన్నపం విని శుక్రాచార్యుడు సంజీవిని మంత్రంతో కచుని తిరిగి బ్రతికించాడు.
జరిగిన సంగతి చెప్పమని కచుని అడుగగా, అసురులు తనపై దాడిచేసి చంపిన విషయం శుక్రునికి వివరించాడు. శుక్రాచార్యుడు " నువ్వు శత్రువుల తరపు వాడివని అసురులు నిన్ను ఇష్టపడరు, అయినా నేను నిన్ను శిష్యుడిగా అంగీకరించాను, జాగ్రత్తగా ఉండు" అని హెచ్చరించాడు. కొద్ది రోజుల తరువాత కచుడు ఉదయం పూజకు పూలు తేవడానికి వెళ్ళాడు. అసురులు కచుడిని పట్టి చంపి, అతని ఎముకలను, మాంసాన్ని రుబ్బి సముద్రపు నీటితో కలిపి, అవయవాలతో రుబ్బి కొంత శుక్రాచార్యుని మద్యంతో కలిపారు. ఇది తెలియక శుక్రాచార్యుడు ఆ మద్యం సేవించాడు.
సాయంకాలం వరకూ తిరిగిరాని కచుని గురించి దేవయాని వాకబు చేసింది. కానీ శుక్రాచార్యుడు "కచుని చావు విధి నిర్ణయంలా ఉంది. ఇతను పలుమార్లు చంపబడుతున్నాడు. ఎక్కువమార్లు తిరిగి బతికించడం మంచిది కాదు. ఉన్నత కుటుంబములో పెరిగి, జీవితపు లోతులు తెలిసిన నీవంటి తెలివిగల వ్యక్తి చావు బ్రతుకులకి చలించకూడదు. ఇది ప్రతి జీవి ఎదుర్కోవలసిన సత్యం. అతడిని మరణించనివ్వు" అని ఓదార్చాడు. కాని దేవయాని దు:ఖంతో "కచుడు తిరిగి రావాలి, లేకపోతే నేను చెరువులో దూకుతాను" అని తండ్రితో అన్నది. అలా జరగటం ఇష్టంలేక శుక్రాచార్యుడు "చివరిగా ఒక సారి బ్రతికిస్తాను" అని ఒప్పుకున్నాడు.