దేనినైనా కూలదొసేయడం ప్రతివారికీ ఎంతో తేలికైన పని. కానీ, సృష్టించడం అంత తేలికైన పని కాదు. ఎవరైతే విమర్శిస్తారో, దేనినీ ఒప్పుకోరో వారు అందరికంటే తెలివిగల వారిగా, ఎక్కువ నాటకీయంగా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ, సద్గురు - ప్రతిదానినీ త్రోసిపుచ్చడం అన్నది పరిపక్వత, చెందకుండా ఉండడానికి ఒక సంకేతమనీ, అది మేధస్సు కాదనీ మనకి, ఇక్కడ చెబుతున్నారు.

మీ తర్కం ఎప్పుడైతే పరిపక్వత చెందలేదో, అప్పుడు అది నిరాకరణగా అభివ్యక్తం అవుతుంది.  దేనినైనా అంగీకరించడం, సృష్టించడం కంటే కూడా దేనినైనా విమర్శించడం లేదా నిరాకరించడం వలన ఎక్కువ తెలివిగల వారిలా కనిపిస్తూ ఉండిఉండవచ్చు. ఎప్పుడూ కూడా విమర్శించేవారు, ఎక్కువ తెలివిగలవారిలా కనిపిస్తారు. ఎందుకంటే, వారు కేవలం విమర్శిస్తారు. వారు, ఎటువంటిదాన్నీ సృష్టించరు. ఎవరైతే సృష్టిస్తున్నారో వారు అంత తెలివిగలవారిగా కనపడరు.  ఎందుకంటే, మీరు దేనినైనా సృష్టిస్తున్నప్పుడు, మీరు ఎన్నో తప్పులు చేస్తారు. కొన్ని సరిగ్గా జరుగుతాయి, కొన్ని సరిగ్గా జరగవు. కానీ, ఎవరైతే కేవలం విమర్శిస్తున్నారో వారు ఎంతో తెలివిగా కనిపిస్తారు.

దురదృష్టవశాత్తూ, ఈరోజున ప్రపంచంలో ఎంతోమంది, ముఖ్యంగా మీడియాలో ఇదేవిధంగా కొనసాగుతున్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే, నిజంగా దేన్నైనా సృష్టించగలరు. వారిలో చాలామంది ప్రతీదాన్నీ కూడా కేవలం విమర్శించగలరు అంతే. ప్రతివారికంటే కూడా వారు ఒక మెట్టు ఎక్కువ, అని చూపించుకోవాలని తాపత్రయ పడుతుంటారు.

విమర్శ అన్నది ఎంతో తెలివిగల పనిగా మనకి అనిపించడం ప్రపంచంలో ఒక తీవ్రమైన సమస్య

దేనినైనా ప్రశ్నించడం అన్నది సరైన పనే. కానీ, మీరు ఎవరినైనా విమర్శించినప్పుడు, మీ ఉద్దేశ్యం వారిని సరిచేయడం అయితే మంచిదే. కానీ,  ఊరికే విమర్శించడం, ప్రతిదాని మీద రాళ్ళు విసిరేయడం అన్నది - ఏవిధంగానూ ముందడుగు కాదు. విమర్శ అన్నది ఎంతో తెలివిగల పనిగా మనకి అనిపించడం ప్రపంచంలో ఒక తీవ్రమైన సమస్య - దేన్నైనా కట్టడం కంటే కూడా దేన్నైనా కూలదోసెయ్యడం అన్నది ఎక్కువ శక్తివంతంగా మనకు కనిపించడం. నేను దేన్నైనా పెంపొందించాను అనుకోండి, అందులో పెద్ద విశేషమేమీ కనపడదు. కానీ, నేను వచ్చి ఒక పది మంది ఎదురుగా దేన్నైనా కూలదొస్తే - అది ఎంతో నాటకీయంగా అనిపిస్తుంది. అందుకే  మనకు సినిమాల్లో కూడా, దేనినైనా కూలదొసేయడం, పడేయడం అన్నవి ఎంతో నాటకీయంగా చూపిస్తారు. ఎవరినైనా కొట్టిపారేయకపోతే అసలు సినిమాయే ఉండదు. ఇది ఎంతో నాటకేయంగా, ప్రభావితం చేసేలా ఉంటుంది. మీరు, విమర్శించడం లేదా ఎవరినైనా కొట్టడం లేదా దేనినైనా కూలదోసెయ్యడం, ఇవ్వన్నీ కూడా విమర్శలే.

మీరు ఒక సానుకూలమైన అడుగు తీసుకున్నప్పటికంటే కూడా మీరొక ప్రతికూలమైన అడుగు తీసుకున్నప్పుడు - అందరికీ మీరెంతో తెలివిగా కనిపిస్తారు. ఇది, పరిపక్వత లేని తర్కం. ఎందుకంటే, మీరు మీ అభిప్రాయాలను ప్రక్కకు పెట్టి ఏది కావాలో దాన్ని మాత్రమే సృష్టించాలంటే ఎంతో మేధస్సు కావాలి. మీ తర్కం గనక అపరిపక్వంగా ఉన్నట్లైతే,  మీరు ప్రతిదాన్నీ నిరాకరించవచ్చు.

మీ తర్కం పరిణతి చెందుతున్నకొద్దీ, మీరు ప్రతిదానినీ అంగీకరించడం నేర్చుకుంటారు. ఎందుకంటే మీకు జీవన ప్రక్రియ అర్థం అవుతుంది కాబట్టి. మీరు కేవలం తార్కికంగా మాత్రమే వెళ్లరు. మీరు జీవితాన్ని అర్థం చేసుకుంటూ వెళ్తారు. మీలో జీవితానికి సంబంధించిన ఇంగితం, ఆలోచన ఉంటాయి, కేవలం తార్కికమైన ఆలోచన మాత్రమే కాదు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు