Death-Book-Banner

కర్మకాండలు కేవలం మానసిక సాంత్వన కోసం మాత్రమే కాదు, ఇవి మానవ వ్యవస్థ పనితీరును లోతుగా అర్థం చేసుకోవటం నుంచి వచ్చినవి. మరణించిన వారికీ ఇంకా జీవించి ఉన్నవారికీ కూడా కర్మకాండలు వహించడానికి గల ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు.

కర్మకాండలలోని ఉద్దేశ్యం

సద్గురు: ఈ శరీరం ఒక పోగుచేసుకున్న పదార్థం. మనం భూమి నుంచి ఈ చిన్న ముక్కను కొద్దికొద్దిగా సేకరించుకున్నాము. శరీరంగా మనం ఏదైతే కూడబెట్టుకున్నామో అదంతా భూమికి ఒక్కొక్క అణువుగా తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. మానసిక వ్యవస్థ విషయానికి వస్తే, మృత్యువుతో పాటు విచక్షణా జ్ఞానం కూడా అంతమవుతుంది. సేకరించిన సమాచారమంతా - సూక్ష్మ శరీరం, సూక్ష్మ బుద్ధి ఇంకా కర్మ అని పిలువబడే సమాచారం, సాఫ్ట్ వేర్ అలాగే మిగులుతుంది కానీ, విచక్షణ మాత్రం నశిస్తుంది.

మీరు ఆహ్లాదకరమైన అస్థిత్వానికి చేరుకుంటే దానిని స్వర్గమని అంటారు. మీరు దుఃఖపూరితమైన అస్థిత్వాన్ని అనుభవిస్తుంటే దానిని నరకమని అంటారు. ఈ రెండూ భౌగోళిక ప్రదేశాలు కాదు - అవి అనుభవపూర్వక వాస్తవాలు.

(ఉదాహరణకి) ఈ రోజున స్టాక్ మార్కెట్ పడిపోయిందనీ, మీరు చాలా డబ్బు నష్టపోయారనీ విన్నారని అనుకోండి. అప్పుడు మీరు "పర్వాలేదు, ఇది పోయినా, నా దగ్గర ఇంకా ఉంది ఈ రోజు నేను సంతోషంగా ఉంటాను" అని ఆలోచించడానికి తగిన విచక్షణ మీకు ఉంది. తర్వాత ఇంకేదో విషయంలో నిమగ్నమై మీరు సంతోషంగా ఉండగలరు.

ఈ విచక్షణను కోల్పోయినప్పుడు మీరు తెలియకుండానే నిరాశా స్థితిలోకి జారిపోతారు. అటువంటప్పుడు మీరు ఇప్పటివరకు కూడగట్టుకున్న గుణాలను/వాసనలను అనుసరించి, మీ సహజ ధోరణికి లొంగిపోతారు. మీరు మీ శరీరాన్ని వదిలేసినప్పుడు, మీ విచక్షణా జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటారు, ఆ తర్వాత మీ వ్యవహారం అంతా మీ వాసనలను అనుసరించి సాగుతుంది. మీకున్న సాఫ్ట్వేర్ ప్రకారం అది ఎటు మొగ్గితే అటువైపే.

విచక్షణ ఇంకా వివేకం లేనందువల్ల , ఒక మనిషి తన శరీరం వదిలి పెట్టేసిన తర్వాత అతని మనస్సుకి ఒక్క బొట్టు ఆహ్లాదాన్ని అందిస్తే అది కోటిరెట్లు పెరుగుతుంది. అదే ఒక చుక్క మాత్రం దుఖాన్ని అందిస్తే అది కూడా కోటిరెట్లు పెరుగుతుంది. దీనిని పిల్లలతో పోల్చవచ్చు, పిల్లలు బయటకు వెళ్లి ఆడటం మొదలుపెడితే, ఓపిక అయ్యిపోయేంతవరకూ ఆడుతూనే ఉంటారు, ఎందుకంటే వాళ్లకి ఎప్పుడు ఆపాలో తెలియదు కాబట్టి.

మరణం తరువాత వివేకం పూర్తిగా లుప్తమైపోతుంది, పిల్లలతో పోల్చితే వారి కన్నా కూడా తక్కువే. అటువంటప్పుడు మీరు ఏ లక్షణాన్ని మనస్సులో పెట్టగలిగితే, అదే ఎన్నో రేట్లు పెరుగుతుంది. దీనినే స్వర్గం అనీ, నరకం అనీ అంటూ ఉంటారు. ఆహ్లాదకరమైన అస్తిత్వానికి చేరుకుంటే అది స్వర్గం, దుఃఖపూరితమైన అస్తిత్వానికి చేరుకుంటే అది నరకం. ఇవి భౌగోళిక ప్రదేశాలు కాదు. శరీరం కోల్పోయిన తరువాత ఆ అశరీర జీవం చవి చూసే అనుభవాత్మక వాస్తవాలు.

ఇలా విచక్షణ కోల్పోయిన మనస్సులో కొద్దిపాటి ఆహ్లాదాన్ని నింపడానికి ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వీటివల్ల ఈ ఆహ్లాదం ఎన్నో రెట్లు పెరిగి ఆ జీవం తనకొరకు సృష్టించుకున్న స్వర్గంలో సుఖంగా ఉంటుంది. కర్మకాండల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇదే.

మరణించిన వారిని చూసుకోవడం

శరీరం వదిలి వేసిన తరువాత ఆ జీవి పయనంపై కొంతవరకైనా ప్రభావం చూపగల క్రతువులు కొన్ని ఉన్నాయి. ఈ సూత్రంపై ఆధారపడే, కర్మకాండలు తయారయ్యాయి. మరణించిన తరువాత సాంప్రదాయకంగా చేసేవాటిలో మొట్టమొదటిది - మరణించిన వారి కాలి బొటన వ్రేళ్ళని రెండిటిని కలిపి కట్టివేయడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే, ఇలా కట్టడం వల్ల మూలాధారం గట్టిగా మూసుకుపోయి, ఆ జీవి తిరిగి ఆ శరీరాన్ని మళ్ళీ ఆక్రమించడానికి అవకాశం లేకుండా చేస్తుంది. "ఈ శరీరం నేను కాదు" అన్న అవగాహన లేకుండా బ్రతుకు గడిపేసిన ఏ జీవి అయినా, తిరిగి శరీరంలోకి ఏ రంధ్రం గుండానన్నా, ముఖ్యంగా మూలాధారం ద్వారా తిరిగి చొరబడడానికి ప్రయత్నం చేస్తుంది. మూలాధారంలో జీవి ఉత్పత్తి చెందుతుంది, శరీరం చల్లబడుతున్నప్పుడు అన్నిటికంటే ఆఖరుగా చల్లబడే స్థానం ఇది.

సాంప్రదాయికంగా మనమెప్పుడూ చెబుతాము - ఎవరైనా చనిపోతే, వారి శరీరాన్ని ఒక నిర్దిష్ట వ్యవధి లోపుగా దహనం చేసేయాలని. ఎందుకంటే, ఆ జీవి తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది జీవించి ఉన్న వారికి కూడా ముఖ్యమైనది. మీకు ఎంతో ప్రీతిపాత్రులు చనిపోతే, మీ మనస్సు మీపై చూపే ప్రభావం వల్ల, మీరు, ఏదైనా చమత్కారం జరిగి దేవుడు వచ్చి వారికి తిరిగి ప్రాణం పోస్తాడని ఆశిస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ జరగలేదు. అయినా, ఆ వ్యక్తి పట్ల మీకున్న భావోద్వేగం మనస్సును అలా వంచింపచేస్తుంది. అదే విధంగా, మరణించిన జీవి కూడా తిరిగి శరీరంలోకి చేరవచ్చని ఆశిస్తూ ఉంటుంది.

దహన సంస్కారం వెనుక దాగి ఉన్న విజ్ఞానము

మరణం తరువాత జరిగే నాటకాన్ని ముగించాలంటే మొట్టమొదట ఆ శరీరాన్ని గంటన్నర లోపు దహనం చేసేయాలి. అసలు మరణించారని నిర్ధారించుకోవడానికి, దానిని నాలుగు గంటలకు పొడిగించారు. శరీరాన్ని వీలైనంత త్వరగా తీసుకు వెళ్లి పోవాలి. వ్యవసాయ సమాజాల్లో మృత శరీరాల్ని పూడ్చి పెట్టేవారు. తమ పూర్వీకుల శరీరాలు మట్టిలోని భాగంగా భావించి ఆ శరీరాన్ని తమను పోషించే మట్టిలో తిరిగి కలిపి వేసేవారు. ఈ రోజుల్లో మీరు ఆహారాన్ని మార్కెట్లో కొనుక్కుంటారు, అదెక్కడి నుండి వస్తుందో మీకు తెలియదు. అందువల్ల ఖననం ఇక సమంజసం కాదు. పూర్వ కాలంలో శరీరాన్ని తమ సొంత భూమిలో ఖననం చేసినప్పుడు, అది త్వరగా భూమిలో కలిసిపోవడానికి మృత దేహం మీద ఉప్పు, పసుపు తప్పకుండా ఉంచేవారు.

దహనం కూడా మంచిదే, ఎందుకంటే అది ఆ జీవిత అధ్యాయానికి ముగింపు పలుకుతుంది. కుటుంబంలో మరణం సంభవించినప్పుడు అందరూ దుఃఖంలో మునిగి ఏడుస్తూ ఉంటారు. దహనం జరిగిన వెంటనే జరిగిన దానిని (ఆప్తుల మరణం) అంగీకరించి ఒక్కసారిగా నిశ్శబ్దంలోకి జారుకుంటారు. ఇది చనిపోయిన వ్యక్తి యొక్క ఆప్తులకి మాత్రమే కాదు, అప్పుడే శరీరం వదిలిన జీవికి కూడా వర్తిస్తుంది. శరీరం ఉన్నంత వరకూ ఆ జీవికి కూడా తిరిగి వెళ్లగలనన్న భ్రమ ఉంటుంది.



కర్మకాండలప్రాముఖ్యత - (“Death – An Inisde Story” అన్న సద్గురు రచించిన పుస్తకం నుండి)

కర్మకాండలు చనిపోయిన జీవికి తన తదుపరి ప్రయాణంలో సహాయం అందించడానికి మాత్రమే కాదు, తాను వదిలి వెళ్లిన వ్యక్తులకి కూడా వీటివల్ల ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే, ఒకవేళ ఆ మరణించిన వ్యక్తి మన చుట్టుప్రక్కల అస్తవ్యస్తమైన జీవాన్ని వదిలి వెళితే మన జీవితాలు సుఖంగా ఉండలేవు. దెయ్యాలు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటాయని కాదు కానీ, అది అక్కడున్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది, ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులని మానసికంగా ప్రభావితం చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్న వారి జీవన స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇందువల్లే ప్రపంచంలో ప్రతి నాగరికతలోనూ చనిపోయిన వారి కోసం, వారి వారి ప్రత్యేక కర్మకాండలు నిర్దేశింపబడి ఉన్నాయి. సాధారణంగా, ఇవి చాలా మటుకు, మరణించిన వ్యక్తి చుట్టూ ఉన్న ఆప్తుల మానసికతను స్థిరపరచడానికే. ఒక రకంగా వీటి వెనుక కొంత ఔచిత్యమూ, కొంతవరకూ విజ్ఞాన శాస్త్రము కూడా ఉన్నాయి. కానీ, మన భారతీయ సంస్కృతిలో ఉన్నంత విస్తృతమైన పద్ధతులు ఇంకే సంస్కృతిలోనూ లేకపోవచ్చు. మృత్యువుని ఈ సంస్కృతిలో చూసినంత లోతుగానూ, అవగాహనతోనూ ఇంకెవరూ చూడలేదు. మృత్యువు సంభవించిన క్షణం నుండీ, లేక అది జరుగక పూర్వం నుండే, ఒక వ్యక్తి తనకు సంపూర్ణంగా ప్రయోజనకరమైన రీతిలోమరణించడానికి ఆవశ్యకమైన పూర్తి వ్యవస్థను నిర్ధారించారు. జీవం గురించి అన్ని కోణాల నుండీ అవగాహన చేసుకుని, చివరికి మృత్యువు నుండి కూడా ముక్తికి తోడ్పడే వ్యవస్థను వెలికితీశారు. మరణం ఎలాగూ సంభవిస్తున్నప్పుడు దీనిని కూడా ముక్తికి ఉపయోగించుకోవాలని, మరణించేవారికి, మరణించిన వారికి కొన్ని శక్తివంతమైన కర్మకాండలను సృష్టించారు. ఈ రోజున ఈ కర్మకాండల ప్రాముఖ్యత ఇంకా పెరిగింది. ఎందుకంటే, దాదాపుగా ఈ భూమ్మీద ఉన్నవాళ్ళందరూ తమలోని జీవ వ్యవస్థను గురించి తెలుసుకోకుండానే మరణిస్తున్నారు. పూర్వం ఎక్కువ శాతం మనుషులు అనారోగ్యం వల్లనో లేక అంటువ్యాధుల వల్లనో మరణించేవారు. అందువల్ల ప్రజలు, ఈ శరీరాన్ని దాటి వెళ్లడంలో సహాయపడటానికి సంపూర్ణమైన శాస్త్రాన్ని రూపొందించారు. వారు శరీరంతో ఉన్నప్పుడు చుట్టుప్రక్కల ఉన్నవారు వారి అనారోగ్యానికి కారణం తెలుసుకోలేక పోయేవారు. వారికి తగిన వైద్యం దొరికేది కాదు, లేకపోతే ఏదో ఒకటి జరిగి, వాళ్లు చనిపోయేవారు. అందువల్ల కనీసం మరణించిన తరువాత వారు ఎక్కువ కాలం అక్కడే తిరుగాడుతూ ఉండకుండా, తొందరగా పంచభూతాల్లో విలీనమవడానికి సహాయం చేయదలిచారు. ఈ రకంగా ఈ కర్మకాండలన్నిటికీ ఆధారభూతమైన శాస్త్రం తయారయింది. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో అవి చాలా మటుకు అవగాహన, నైపుణ్యము రెండూ లేకుండా చేసే అర్థంలేని ఆచారాలుగా మిగిలిపోయాయి.

మరణించిన వారిని మనము సరిగ్గా చూడకపోతే, తత్ఫలితంగా మన సమాజంలోని యువత ఎంతగానో బాధలకు గురవుతారు. శరీరం వీడిన జీవాలు మొట్టమొదటిగా యువత వైపు చూస్తాయి, ఎందుకంటే యుక్త వయసులో ఉన్నవారు తేలికగా ప్రభావితం అవుతారు. కౌమార దశలో ఉన్నప్పుడు శారీరక పెరుగుదల మాత్రమే కాదు అన్ని విధాలుగానూ పెరుగుదల వేగంగా జరుగుతుంది. అందువల్ల ఈ సమయంలో జీవం తొందరగా ప్రభావితం అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది. చుట్టుప్రక్కల ఏదైనా సానుకూల శక్తి లేక ప్రతికూల శక్తి ఉంటే, కౌమార దశలో ఉన్నవారు ముందుగా ఆ శక్తి ప్రభావానికి గురవుతారు.

యువతలోనూ మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ తొందరగా ప్రభావితం అవుతారు. కౌమారంలోకి అడుగు పెట్టని పిల్లలు ఎనిమిది, పది సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ విషయాలకు మామూలుగా ప్రభావితం కారు. ప్రకృతి వారికి ఆ రక్షణ కల్పించింది. మీరు వారిని అంతగా రక్షించనవసరంలేదు. పది నుండీ ఇరవై సంవత్సరాల వయసు ఉన్నవారే ప్రభావితం కాగలరు. అంటే వారు హార్మోన్లకో, మద్యానికో, మాదక ద్రవ్యాలకో లోబడి, దారి తప్పుతారని నేను ఇక్కడ చెప్పడం లేదు. అవి కూడా జరగవచ్చు, కానీ ఇవి ఇతర రకమైన ప్రభావాలు. కౌమారదశను ఎదురుకోవడానికి యువత పడుతున్న కష్టాలను మనము ఈ రోజున చుట్టూ చూస్తున్నాము. గత తరాలలో కౌమార దశలో పోరాటం లేదు. దీనికి ఒక కారణం మనము మరణించిన వారిని తగినట్టుగా చూసుకోకపోవడమే. ఒక విధంగా చెప్పాలంటే, వదులుగా ఉన్న సాఫ్ట్ వేర్ వ్రేలాడుతూ ఉండగా యువత అందులో సహజంగా చిక్కుకుంటున్నారు. ఇది తెలిసో, లేక సహజంగానో ప్రతీ సంస్కృతిలోని వారు, తమ యువతను రక్షించుకోవడానికి తగిన వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రజలు ప్రయత్నించారు.

Death-Book-Banner