సంగీతము – ఆధ్యాత్మికత

సద్గురు: చాలా కాలంగా, భారతదేశం అని అన్నప్పుడు, ప్రపంచ ప్రజలంతా దానిని ఒక ఉత్తమ సంభావ్యతగానే చూసేవారు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో, తమ సంస్కృతిలోని ప్రతి అంశాన్ని ఆధ్యాత్మిక ప్రక్రియగా గొప్ప ప్రయోగం చేసినది భారత దేశంలోనే. ఒకసారి ఈ భూమి మీద జన్మించిన తర్వాత , మీరెన్నో పనులు చేయ వచ్చు- మీ వృత్తిని అనుసరించ వచ్చు, మీ కుటుంబాన్ని వృద్ధి చేసుకోవచ్చు, జీవితంలోని ఎన్నో అంశాల మీద కృషి చేయవచ్చు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మీ జీవితం ఉన్నది, పరమోన్నతమైన విముక్తి పొందడం కోసమే. ముక్తి లేదా జ్ఞానోదయం అనేది ఒక్కటే లక్ష్యం. ఈ విధంగానే ఈ సంస్కృతి రూపుదిద్దుకుంది. మీరు ఏ పనిచేసినా దాని లక్ష్యం, మీ ఎరుకను, చేతనను పెంచడం కోసమే.

కాబట్టి, ఈ సంస్కృతిలో, సంగీతం, నృత్యం ఇంకా మరేమి చేసినా అది వినోదంకోసం కాదు, అది కూడా, ఆధ్యాత్మిక ప్రక్రియే. భారతీయ సంప్రదాయ సంగీతంలో, ధ్వనిని వాడిన పద్ధతులు- రాగములు, స్వరములు, అన్నీ ఎలా ఉంటాయంటే, దానిలో మీరు పూర్తి నిమగ్నమైతే, అది ధ్యానస్థితిని తెస్తుంది. నృత్యం కేవలం వినోదం కాదు. దానిలోని ముద్రలను, భంగిమలను మీరు సరిగ్గా అభినయిస్తే, అది ధ్యానస్థితికి దారి తీస్తుంది. సంప్రదాయ సంగీతంలో, జీవితాన్ని పూర్తిగా అంకితంచేసిన వ్యక్తిని మీరు చూస్తే, ఆయన ఒక ఋషిలా ఉంటారు. సంగీతం అనేది వినోదంకోసం ఎవరో సృష్టింపబడిన పిచ్చి మ్రోతలు కాదు. వినోదం అనేది అసలు జీవిత దృక్పథమే కాదు. ప్రతిదీ, ఉన్నత చేతనా స్థితికి చేరే సాధానే.