ధ్యానం ఎవరూ చేయలేరు!

ఎవరూ ధ్యానం చేయలేరని, ధ్యానం చేద్దామని ప్రయత్నం చేసిన చాలామంది, ధ్యానం చేయటం కష్టమని, సాధ్యం కాదని, అనే నిర్ణయానికి వచ్చారు, ఎందుకంటే వారు దానిని చేద్దామనుకుంటున్నారు. మీరు ధ్యానం చేయలేరు, మీరే ధ్యానులు కాగలరు.

సద్గురు:ధ్యానం అనే మాట అనగానే, అక్కడ దాని గురించి అన్ని రకాల అపోహలూ ఉంటాయి. మీరు కళ్ళు మూసుకుని అనేక పనులు చేయవచ్చు. అందులో అనేక కోణాలు ఉన్నాయి. మీరు జపం, తపం, ధారణ, ధ్యాన, సమాధి, శూన్య, చేయవచ్చు, లేక మీరు కూర్చుని నిద్రపోయే కళలో నిష్ణాతులు అయి ఉండవచ్చు. మరి ఈ ధ్యానం అంటే ఏమిటి? మనుషులు సామాన్యంగా ధ్యానం అనే మాట గురించి మాట్లాడుతున్నారు అనుకుంటాను. ఈ ధ్యానాన్ని మీరు చేయగలిగింది కాదు. ఎవరూ ధ్యానం చేయలేరు. ధ్యానం చేద్దామని ప్రయత్నం చేసిన చాలామంది అది చాలా కష్టమని, సాధ్యం కాదని అనే నిర్ణయానికి వచ్చారు. దానికి కారణం వారు దాన్ని చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు. మీరు ధ్యానం చేయలేరు. అది గుణం, అది ఒక చర్య కాదు. మీరు మీ శరీరాన్ని, మనసుని, శక్తిని, మీ భావాన్ని కొంత పరిణితికి తెచ్చినప్పుడు, ధ్యానం సహజంగానే జరుగుతుంది. అది ఎలాగంటే మీరు భూమిని దున్ని, దానికి కావలసిన నీటిని, ఎరువుని ఇచ్చి, సరైన విత్తనం నాటితే, అది పెరుగుతుంది. పుష్పాలను, ఫలాలను ఇస్తుంది. ఈ పుష్పాలు, ఫలాలు మీరు కోరుకున్నారు కాబట్టి రావట్లేదు. మీరు కావలసిన వాతావరణాన్ని ఏర్పరచారు కాబట్టి, అవి వచ్చాయి. అలాగే మీరు మీలో కావలసిన వాతావరణాన్ని ఆ నాలుగు (శరీరం, మనసు, శక్తి, భావ)స్థాయిలలో సృష్టిస్తే అప్పుడు ధ్యానం వికసిస్తుంది. అది ఒకరు తమలో తాము అనుభూతి చెందగల ఒక సుగంధం.

ధ్యానము, మనసు

మనసుకు, ధ్యానం నచ్చదు. ఎందుకంటే మీరు శరీరాన్ని నిశ్చలంగా ఉంచితే మనసు కూడా సహజంగానే అలా అవుతుంది. అందుకే హఠయోగాకు, ఆసనాలకు మేము అంత ప్రాముఖ్యత ఇస్తాము. మీరు మీ శరీరాన్ని పూర్తి నిశ్చలంగా ఉంచగలిగితే, అప్పుడు మీ మనసు కూడా నిశ్చలం అవుతుంది. మీ శరీరం అనవసరంగా ఎన్నిసార్లు కదులుతుందో మీరు గమనించి చూడండి. మీరు మాట్లాడుతున్నప్పుడు, కూర్చున్నప్పుడు నడుస్తున్నప్పుడు అది ఎన్ని రకాల అనవసరపు కదలికలు చేస్తుందో, మీకు మీరే గమనించండి. మీరు మీ జీవితాన్ని గమనిస్తే, మీరే విలువ ఇవ్వని, పట్టించుకోని ఈ పనులన్నీ, అది సగం జీవితకాలం చేస్తూ ఉంటుంది. మీరు మీ శరీరాన్ని నిశచలంగా ఉంచితే, మనసు నెమ్మదిగా కూలిపోవటం మొదలెడుతుంది. దీన్ని మీరు అలాగే జరగనిస్తే మనసు ఒక బానిస అవుతుందని దానికి తెలుసు. ప్రస్తుతం మీ మనసే మీకు యజమాని, మీరు బానిస. మీరు ధ్యానం చేస్తున్న కొద్దీ మీరే యజమాని, అవుతారు అప్పుడు మీ మనసు బానిస అవుతుంది. నిజానికి అది ఎప్పుడూ అలాగే ఉండాలి. మీరు మీ మనసుని, ఒక బానిసగా ఉంచకపోతే, అది మిమ్మల్ని అనేక బాధలు పెడుతుంది. మీరు మీ మనస్సుని అధికారం చెలాయించనిస్తే, అది ఘోరమైన యజమాని. కానీ, ఒక బానిసగా అది ఎంతో అద్భుతమైనది. ఎంతో అద్భుతమైన బానిస.