సద్గురు:

యోగ ప్రక్రియలను ఉపయోగించుకోవడానికి మీరు ఏ మతానికి చెందినవారు అన్నదానితో సంబంధం లేదు, ఎందుకంటే యోగా ఒక సాంకేతికత. మీరు నమ్ముతారా లేదా అన్నదానిలో సాంకేతికత బేధం చూపదు. మీరు నమ్మేదీ, నమ్మనిదీ అంతా మీ మానసిక ప్రక్రియకు సంబంధించినది – దానికీ, సాంకేతికతను ఉపయోగించుకోవడానికీ ఏమాత్రం సంబంధం లేదు.

గురుత్వాకర్షణ క్రైస్తవం అయితే, యోగం హిందుత్వం అనవచ్చు. గురుత్వకర్షణ సూత్రాన్ని కనుగొన్న ‘ఐసాక్ న్యూటన్’ క్రైస్తవ సంస్కృతిలో నివసించారు, కనుక ఆ సూత్రం క్రైస్తవ మతానికి చెందినది అవుతుందా? యోగ ఒక సాంకేతిక విజ్ఞానం. దాన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. యోగాకు ఏదో మతపు రంగు అద్దాలనుకోవటం హాస్యాస్పదం!

ఆధ్యాత్మిక ప్రక్రియ, యోగ విజ్ఞానం అనేవి అన్ని మతాలకు పూర్వమే ఉన్నవి. మానవులను విభజించి, వారి మధ్య అనుబంధాన్ని ఎప్పటికీ నిలపడానికి వీలులేకుండా మతవర్గాలను ఏర్పరచాలని మానవులు ఆలోచించక ముందే, ‘మానవుడు తనంతట తానుగా పరిణామం చెందడం‘ గూరించి ఆదియోగి, శివుడు చెప్పారు.

హిందు అనేది ఒక ‘మతం’ కాదు

శాస్త్ర సాంకేతికతలు ఈ సంస్కృతిలో పుట్టి పెరిగినందున యోగశాస్త్రాలకు హిందుత్వ ముద్ర కలిగింది. అంతేకాదు ఈ సంస్కృతి మాండలిక స్వభావం కలది. అందువల్ల ఇది మాండలికంగానే అందించబడింది. అందువల్లనే ఈ శాస్త్రం ఏ ప్రాంతానికి ఆప్రాంతపు ప్రత్యేకతలను ఇమిడ్చి వెలయించారు. అదే హిందూ జీవన విధానం. హిందూ అనే పదం ‘సింధు’ అనే పదం నుంచి జనించింది. అది ఒక నది. ఈ సంస్కృతి సింధూ లేక ఇండస్ నదీ తీరాన జనించి వ్యాపించింది కాబట్టి ‘హిందూ’ అన్నారు. సింధు నది ప్రవహించే దేశంలో పుట్టిన వారందరూ హిందువులే. అది ఒక ప్రాంతానికి సంబంధించిన గుర్తింపు. కాని క్రమంగా అది ఒక సంస్కృతికి గుర్తుగా మారింది. కొన్ని ఆక్రమణదారీ మతాలూ ఈ దేశంలోకి ప్రవేశించినప్పుడు, ఒక గొప్ప పోటీ తత్త్వం ఏర్పడింది. అప్పుడు ఇక్కడివారు తమను తాము ఒక మతంగా ఏర్పరుచుకొనే ప్రయత్నం చేశారు. కాని అది ఇప్పటికి జరగలేదు. ఇప్పటికీ వారందరినీ ఒక గాటన కట్టలేరు. ఎందుకంటే వారికి ఒకే విశ్వాస విధానం అంటూ లేదు.

మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే హిందుత్వం, ఒక వాదం కాదు. హిందువు అంటే ఒక ప్రత్యేక విశ్వాస విధానం ఉన్న వారు అని అర్థం కాదు. ఈ సంస్కృతిలో మీరు ఏమి చేస్తే అదే హిందుత్వం. ఒక ప్రత్యేక భగవంతుడిని కాని, ఒక ప్రత్యేక భావజాలాన్ని కాని హిందు జీవన విధానం అని చెప్పటానికి అవకాశం లేదు. ఒక మానవుని ఆరాధించి హిందువుగా చెలామణి కావచ్చు. ఒక దేవతను ఆరాధించి హిందువు కావచ్చు. ఒక ఆవుని ఆరాధించి హిందువు కావచ్చు. మొత్తం పూజా విధానాన్నే వదలి వేసి హిందువు కావచ్చు. అందుచేత మీరు దేన్ని నమ్మి అయినా హిందువు కావచ్చు, నమ్మకుండా కూడా హిందువు కావచ్చు.

భగవంతుని తయారుచేసే వారు

అయితే వీటన్నింటినీ కలిపే ఒక సూత్రం ఉంది. ఈ సంస్కృతిలో మానవునికి ఉండే ఒకే ఒక్క లక్ష్యం ముక్తి. ఈ జీవన విధానం నుండి, జీవితం యొక్క ప్రతి పరిమితి నుండి ముక్తి పొందటం. ఆ పరిమితిని అధిగమించటం. ఈ సంస్కృతిలో మానవుని తుది గమ్యం భగవంతుడు కాదు, ఈ సంస్కృతిలో భగవంతుడు కేవలం మెట్టు మాత్రమే! ఈ భూగోళంలో భగవంతునికి సంబంధించి ఒక ఖచ్చితమైన అభిప్రాయం లేనిది ఈ సంస్కృతి మాత్రమే! అసలు ఆ రకంగా చూస్తే భగవంతుడులేని సంస్కృతి ఈ సంస్కృతి మాత్రమే. ఒక రాయిని, మీ తల్లిని, ఆవును దేనినైనా పూజించవచ్చు- మీరు దేన్నీ ఆరాధించాలనుకుంటే దాన్నే ఆరాధించవచ్చు. ఎందుకంటే ఈ సంస్కృతిలో మనమే దేవుడిని తయారు చేసుకుంటాము. మిగతా సంస్కృతులలో ‘భగవంతుడు మనలను తయారు చేశాడు’ అని నమ్ముతారు. అందువల్ల మనం మనకు ఎక్కడ గురి కుదురుతుందో అక్కడ మన ఆరాధనను నిలుపుతాం. మానవుడిని తన సంపూర్ణ క్షమత అందుకునేలా చేసే శాస్త్రం ఇది.

భగవంతుని తయారుచేసే ఒక సాంకేతికతను అభివృద్ధి చేశాం. కేవలం రూపాలను సృష్టించడం కాదు, వాటికి శక్తిని కల్పించాం. ఎటువంటి శక్తిని అంటే, అది మన జీవితపు ఒకానొక ప్రత్యేక కోణాన్ని స్పృశించటానికి దోహదం చేస్తుంది. నిజానికి అది సృష్టికి మూలమైనది. ఎవరో నమ్మారు కదా అని అది ప్రతిధ్వనించదు. ఇది రాతిని భగవంతునిగా మలచే శాస్త్రం, ప్రతిష్టించే శాస్త్రం. .

Isha Yoga classes for children are conducted during the summer vacations. For more info visit the Isha Yoga Programs page.