స్వచ్ఛంద సేవ(Volunteering)లోని సారం జీవితాన్ని ఇష్టపూర్వకంగా జీవించడమే. మన జీవితంలో ప్రతీ అంశంలో కూడా మనం ఒక వాలంటీర్ గా ఉండడం అంటే మనం జీవితాన్ని ఇష్టపూర్వకంగా జీవించడమే - అని సద్గురు మనకి ఇక్కడ చెప్తున్నారు.  మనం ఇష్టపూర్వకంగా ఉండడం ద్వారానే జీవితంలో సంతోషాన్ని, సంతృప్తిని పొందవచ్చు.

ప్రశ్న :  సద్గురూ.. మీరు ఎప్పుడూ కూడా ఏది అవసరమో... అది చెయ్యాలి అని నొక్కి చెప్తూ ఉంటారు. మనం వాలంటీరింగ్ సందర్భంగా చూస్తే దీని అర్థం ఏమిటి ?

సద్గురు : ఎక్కడైనా సరే ప్రజలు, ఇతరుల శ్రేయస్సును వారి శ్రేయస్సు కంటే ఉత్తమమైనదిగా చూసినప్పుడు -  ఆ వాతావరణం ఎంతో శక్తివంతమైనదిగా, అందంగా మారిపోతుంది. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇలా ఉన్నట్లైతే ప్రపంచం మనం జీవించడానికి ఎంతో గొప్ప చోటుగా ఉండి ఉండేది. ఎదైతే అవసరమో, ఉదాహరణకి - ఎవరి ముక్కో తుడవాలనుకోండి...వారు అందుకు సుముఖంగా ఉండి, అది ఒక త్యాగం చేస్తున్నట్లో, ఒక సేవ చేస్తున్నట్లో కాకుండా ముక్కు తుడవాలి కాబట్టి తుడుస్తున్నారు. వారు ముక్కుకి మరీ ఎక్కువ సేవ చేస్తే ఆ ముక్కు కాస్తా రాలి పడిపోతుంది. ఇలా చేసే ప్రజలు, అంతటా ఉన్నారు. ఎదైతే అవసరమో ... అది మాత్రమే చెయ్యాలి. తుడవడమే అవసరమైతే, తుడవాలి ... అంతే..! దాని గురించిన పెద్ద ఆలోచన ఏమీ ఉండకూడదు. ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రజలు కనుక ఉన్నట్లైతే, ఈ ప్రపంచం మనం జీవించడానికి ఎంతో మెరుగైన ప్రదేశంగా ఉండేది.

ఒక వాలంటీర్ అంటే... అతన్ని ఎవరో ఇక్కడ వల వేసి పట్టుకున్నారు కాబట్టి అతను ఈ పనులన్నీ చెయ్యడం లేదు. అతను అందుకు సుముఖంగా ఉన్నాడు. ఇతను నా కోరిక ఏమిటీ ... అని ఆలోచించడు. అతను ఏది అవసరమో అది చేస్తాడు. అలాంటి పరిస్థితుల వల్ల మీరు స్వేచ్ఛా జీవిగా మారతారు. ఎంతో కొద్దిపాటి కర్మ మాత్రమే ఉంటుంది. మీరు, మీ జీవితంలో సంపూర్ణమైన స్వచ్ఛంద సేవకులుగా ఉండాలి. మీరు ఏమి చేస్తున్నా సరే. మీరు ఏమీ చెయ్యకపోయినా సరే. మీ ఉనికి స్వచ్ఛందంగానే ఉండాలి. అంతే కానీ అదొక నిర్బంధంగా ఉండకూడదు. మనం, ఇలాంటి ప్రజలను ప్రపంచం అంతటా సృష్టించాలి.

ప్రశ్న :  కొంతమంది వారి వాలంటీరింగ్ అనుభూతులు చెప్తున్నప్పుడు ... అది వారికి ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందని చెప్తారు. దీని గురించి చెప్పగలరా..?

సద్గురు:  ఈ ప్రపంచంలో ఎవరికీ ఉపయోగపడకుండా కూడా నేను పారవశ్యంలో ఉండగలను. కానీ చాలా మంది ఈ విధంగా ఉండలేరు. వారికి, ఏదో ఒకటి కావాలి. లేకపోతే వారు, ఎక్కడో తప్పిపోయినట్లుగా, ఉపయోగపడనట్లుగా అనుకుంటారు. వారు ఊరికే అలా సంతోషంగా పారవశ్యంలో ఉండలేరు. కానీ వారికి ఏదో ఒక చర్య చేసే అవకాశం కలిగితే తప్ప, వారు ఎవరు ? -  అన్నదాన్ని అభివ్యక్తీకరించుకోగలిగితే తప్ప సంతోషంగా పారవశ్యంలో ఉండలేరు. ఆధ్యాత్మిక ప్రక్రియలో మనం ఇలాంటి అవకాశాన్ని అందిస్తున్నాము. అది ఏమిటంటే ఎక్కడైతే, ఏదైనా ఒక కార్యం, పని అవసరమో... అది కేవలం మీ గురించి కాదు... అది మీ చుట్టూరా ఉన్నవారి గురించి – ఇది మీ సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం. మీ సంతోషాన్ని వెతుక్కోవడం కాదు. మీరు స్వర్గానికి ఒక టికెట్ కొనుక్కోవడమూ కాదు.

మీరు కేవలం ఏది అవసరమో అది చేయడం. దానివల్ల ఏమి జరుగుతుంది..? అన్నదాని గురించి ఆలోచించకుండా. ఇది, ఖచ్చితంగా ఆధ్యాత్మిక ప్రక్రియే..! నేను ఎంతోమందిని చూశాను. వారు, భావస్పందన వంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు, వారు అందులో పూర్తిగా నిమగ్నమవ్వలేకపోతారు. కానీ, తరువాత వారొక వాలంటీర్ గా వచ్చినప్పుడు వాళ్ళు ఇందులో పూర్తిగా నిమగ్నులైనప్పుడు ఎంతో గొప్ప అనుభూతిని పొందగలరు. ఈ ప్రోగ్రామే - ఇలాంటిది.   ప్రోగ్రాంలో వారు అంతగా అనుభూతి చెంది ఉండకపోవచ్చు. కానీ, వారు ఒక వాలంటీర్ గా వచ్చినప్పుడు, వారి అనుభూతి మొత్తం మరో కోణంలో ఉంటుంది. మేము ఎల్లప్పుడూ కూడా ఇలాంటి అవకాశాలను సృష్టిస్తూ దీనికి ఒక అధ్యాత్మిక కోణాన్ని కల్పించాలని, ప్రజలు చేసే పనిలో ఇలాంటి అధ్యాత్మిక కోణాన్ని జోడించాలని, ఇది ప్రజలకి సంతోషకరంగా మారాలని ప్రయత్నం చేస్తున్నాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు