ప్రశ్న: సద్గురు వెన్నెముకని స్పృశించటం గురించి, అందువల్ల సుషుమ్న సజీవం కావటం గూర్చి మాట్లాడారు. దానికి సంబంధించి మరికొంత వివరించ గలరా?

సద్గురు: సి ఎఫ్ ఎల్ బల్బును భారతదేశంలో ప్రచారం చేసే అందమైన ప్రకటనను ఒకదాన్ని చూశాను. ఒక టిబెటు పిల్ల వాడు ఒక పీఠమ్మీద కూర్చుని ఉంటాడు. అతని తల వెనుక ఒక కాంతి చక్రం ఉంటుంది. ఒక వృద్ధురాలు అతన్ని చూచి , “ రింపోచే , రింపోచే” ( టిబెట్లో గురువులను గౌరవిస్తూ ఇచ్చే బిరుదు) అనటం మొదలు పెట్టింది. అందరూ ఆమె మాటలు విని అక్కడకు చేరి ఆ పిల్లవడి ముందు నిలబడి , “రింపోచే, రింపోచే” అనటం ప్రారంభించారు. పిల్లవాడు వీళ్ళందరినీ చూసి తానూ కూడా పీఠం మీదనుండి దిగి అదే మాట అనటం ప్రారంభించాడు. అక్కడ కనిపించిన కాంతి వలయం నిజానికి వెలుగుతున్న సిఎఫెల్ బల్బుది.

మీరు అలా వెలగలేక పోవచ్చు కాని మీలో ఏదో వెలుగుతోంది. మేము ఈ ఈశా యోగకేంద్రంలో ఏర్పరచిన ఈ వాతావరణం మీకు మానసిక, సామాజికమైన సౌఖ్యాన్ని ఇవ్వడానికి కాదు. మీకు అధికారాన్ని ఒకానొక పట్టును ఇవ్వగలిగేది ఈ వాతావరణం కాదు.

మా వద్ద ప్రతివారి జీవితాన్ని తగినంతగా కదిలించే వ్యవస్థ ఉంది. కాని వారు ఇక్కడనుండి పారిపయేటంత కాదు. ఒక ప్రమాణం ప్రకారం, తగినంతగా భగ్నత ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా స్థిరపడిపోవటం మాకు నచ్చదు. ఇది ఇంటికి దూరంలో మీకు ఉన్న మరో ఇల్లు కాదు. ఇది ఇళ్ళు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పే చోటు. ధ్యాన లింగం ఇల్లు కాదు. అది గర్భం. ఎప్పుడైనా తనకు ఎంతో ఇష్టమని బిడ్డను కనకుండా ఒక స్త్రీ గర్భంలోనే ఉంచుకోవటాన్ని విన్నారా! ఆమెకు ఎంత ప్రేమ ఉన్నాసరే జన్మను ఇస్తుంది. ఇది కూడా అలాంటిదే!

మీరు ప్రేమను అర్థం చేసుకొనే విధానం ఇంకా రూపొందవలసి ఉంది. మీరు ప్రేమంటే పట్టుకొని కూర్చోవటం అని అనుకుంటారు. కాదు. ప్రేమంటే స్వేఛ్చనిచ్చి వదలివెయ్యటం. ముందుకు తొయ్యటం. మీకు జీవితం పట్ల నిజంగా చింత ఉంటే, ప్రేమంటే సాధ్యమైనంత ఉచ్చస్థితికి తీసుకొని వెళ్ళటమే! మీకు ఏ జీవరూపంతో నైనా అనుబంధం ఉంటే ఆ జీవ రూపం వీలైనంత ఉచ్ఛ స్థితికి వెళ్ళాలనుకుంటారు.

మేము ఈశా యోగాను మనుషుల మానసిక స్థితిని ఒక స్థాయికి తీసుకెళ్ళే ఉపకరణంలా వాడుతున్నాము . అది మిమ్మల్ని తప్పక కుదుపుతుంది. ఆ క్రమంలో మీ మానసిక ప్రక్రియ కొంత తెరుచుకోవడం జరుగుతుంది. మీ వెన్నెముకను మేము స్పృశించాము. సుముఖత్వం అనేది జరిగిన క్షణంలో మీ వెన్నెముక సూత్రాన్ని విడిచే(స్పృశించకుండా ఉండే)అవకాశమే లేదు. అలా ఆశపడవద్దు. అది వెంటనే స్పృశించ బడుతుంది. మీరు దాన్ని వెలగనిస్తారా, లేక ప్రతిఘటించి వేడిని సృష్టించుకుంటారా అనేది మీ ఇష్టం. అది మీ చేతుల్లోనే ఉంది. అది స్పృశించబడింది. అందులో శక్తి జ్వలితమై ఉంది. మీరు ప్రతిఘటిస్తే మీరు ఎక్కువ వేడిని, చాలా తక్కువ కాంతిని సృష్టించుకుంటారు. మీరు దాన్ని జరగనిస్తే, ఎక్కువ కాంతిని సృష్టించి, తక్కువ వేడిని సృష్టించుకుంటారు.

శక్తికి మూలంగా మారటం

మీరు దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే అంటే, దానర్థం ఇది మీ ఒక్కరి పరిణామానికి కాక ఈ గ్రహం మీద ఒక ప్రత్యామ్నాయ శక్తి వనరుగా మారాలంటే, మీరు దానిపై చాలా ధ్యాస ఉంచ వలసి ఉంటుంది. చాలా అంటే చాలా ! కానీ మీరు అంత ధ్యాసను దేనిపైనా ఉంచలేరు ఎందుకంటే మీరు మీకు ఎంత ఉన్నదో(ధ్యాస) అంతే ఉంచగలరు. కానీ మీకున్నదానిలో కూడా మీరు కొంత పొదుపు చేస్తారు. అది సరికాదు. ఇప్పుడు మీకు ఉన్న ‘ధ్యాసను నిలిపే శక్తి’ పరిమితి అంతే కాదు. అది ఇంకా ఎంతో పెరగటం సాధ్యం. కానీ అది ఇంకా సుప్త స్థితిలో ఉంది. మీకు అందుబాటులో లేదు. కానీ మీరు మీకు ఉన్నదానినైనా ఖర్చు చెయ్యాలికదా ! మేము స్పృశించినందువల్ల జరిగే పరిణామ అవకాశాలు మీరు దాన్ని లాగిపెట్టడం వల్ల సన్నగిల్లిపోతాయి.

మీ మానసిక ధ్యాస పరంగా చూసినా, ఇప్పుడు పూర్తిగా లేదు. గమనించండి. జీవితంలోని భిన్న సందర్భాల్లో మీ ధ్యాస భిన్నస్థాయిల్లో ఉంటుంది. మీరు మీ పనిని చేసుకునేటప్పుడు మీ ధ్యాస ఒక స్థాయిలో ఉంటే, మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మరొక స్థాయి, మీకు ఇష్టమైన దాన్ని తింటున్నప్పుడు ఒకస్థాయి అయితే, మీకు ఇష్టమైన వీడియో చూసేటప్పుడు మరొకస్థాయిలో మీ ధ్యాస నిలిచి ఉంటుంది. ఇలా భిన్న భిన్న సందర్భాల్లో భిన్న స్థాయిల్లో మీ ధ్యాస ఉంటున్నప్పటికీ, ఇప్పటికి మీ జీవితంలో కెల్లా ఉచ్ఛ స్థాయిలో ఏదోఒక సమయంలో మీరు నిలిపి ఉంచిన ధ్యాస కూడా మీకు గల పూర్తి సామర్థ్యం కాదని చెప్పాలి. అది అందులో ఒక భాగం మాత్రమే. మీకు మరింత ధ్యాసను నిలపగలిగే సామర్థ్యం ఉంది.

ఒకవేళ మిమ్మల్ని నేను ఒక అడవిలో అర్థరాత్రివేళ చేతికి ఒక టార్చి ఇవ్వకుండా వదలివేశాననుకోండి, మీరు నిలిపే ధ్యాస స్థాయి వేరుగా ఉంటుంది. మీరు ప్రమాదంలో ఉండి, అడవిమృగాల అరుపులు వినిపిస్తూ ఉంటె మీరేమీ చూడలేరు, మీరు నిలిపే ధ్యాస స్థాయి వేరుగా ఉంటుంది. అది మీ జీవన్మరణ సమస్య అయినప్పుడు, మీ ధ్యాస స్థాయి పూర్తి వేరుగా ఉంటుంది.

కొన్నేళ్ళ క్రితం నేను కొంతమందిని కర్ణాటకలోని సుబ్రమణ్య - మంగుళూరుల మధ్య రైల్వే ట్రాక్ మీద ట్రెక్ కు తీసుకొని వెళ్లాను. ఆ దోవలో 300 వంతెనలు, 100 సొరంగాలు ఉన్నాయి. మీరు ఆ తోవలో నడచినంత సేపు ఒక వంతెన మీదైనా ఉంటారు లేదంటే ఒక సొరంగంలో నైనా ఉంటారు. అది ఒక అందమైన కొండ. కొన్ని సొరంగాలు ఒక కిలోమీటర్ పొడవు ఉన్నాయి. మీరందులోకి వెళ్ళారంటే పగలు కూడా కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి. మీ చెయ్యి కూడా మీకు కనిపించదు. కొంచెం సమయం గడిచాక మీరు కళ్ళుమూసుకున్నారా –తెరిచారా అనే సంగతి కూడా మీకు తెలియదు. అక్కడ అంత చీకటిగా ఉంటుంది. బహుశ చాలా మంది అటువంటి చోటుకు ఎప్పుడూ వెళ్లి ఉండరు. నక్షత్ర కాంతి కూడా కొంత వెలుగుని కలిగిస్తుంది. సొరంగాల్లో కాంతి అన్నదే ఉండదు. చిమ్మ చీకటి. కొంత సేపటికి మీరు కళ్ళు మూసుకున్నారో తెరిచారో కూడా తెలియనంత చీకటి. ఎందుకంటే మీరు కళ్ళు మూసినా తెరచినా భేదం ఏమి ఉండదు కనుక!

నేను వారిని ఏ టార్చి లేకుండా నడవమన్నాను. అక్కడ ఒక గుంత ఉండవచ్చు, నేల నోరు తెరచి ఉండవచ్చు. ఏదైనా ఉండవచ్చు. అక్కడంతా గబ్బిలాలు ఎగురుతున్నాయి. అవి కూడా ఏమి చూడలేవు. కాని వాటికి తాము ఎక్కడకు వెళుతున్నామో తెలుసు. మొదట వారందరూ భయపడ్డారు, కాని నడక సాగి సమయం గడచినకొద్ది వారు దాన్ని ఆనందించటం ప్రారంభించారు. మీరు ఒకవేళ అలాంటి చోట ఉంటె మీ ధ్యాస ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. మీ జీవితంలో ప్రతి క్షణాన్ని అంత ధ్యాసతో గడప గలిగితే మీరు వెలిగిపోతారు.

ధ్యాసను నిలపండి

ఆశ్రమంలో వారిని ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోమని నేను నిరంతరం చెపుతూ ఉంటాను. అది కేవలం శుభ్రత కోసం కాదు. ఆ ప్రదేశం అందంగా ఉండాలని కాదు. ప్రతి చిన్న విషయంపై దృష్టి నిలపటం ముఖ్యం. ఒక చిన్న రాయి తిరగబడి ఉంటే ఆ విషయం మీ దృష్టికి వచ్చి తీరాలి. అక్కడ ఆగులకరాయి ముఖ్యమనికాదు, మీరు దృష్టి నిలపగలగటం ముఖ్యం. మీరు ధ్యాసను అంత ఉచ్ఛ స్థాయిలో నిలపగలిగినప్పుడు మీ వెన్ను సూత్రం ప్రకాశిస్తుంది. మీరు ధ్యాసను నిలపాలి. దాన్ని స్పృశించడం జరిగింది. అందులో అనుమానం లేదు. మీరు దాన్ని ప్రకాశింపజెయ్యలనుకుంటే, మీరు ధ్యాస పెట్టాలి. ఒకసారి మీ ధ్యాస ఉచ్ఛ స్థాయికి చేరుకున్నాక, మీరు మీ లోలోపల దేనిమీద దృష్టిని నిలపాలి, దేనిమీద అవసరంలేదు అనే విషయంపై మీకు శిక్షణను ఇస్తాం. అందుకు తగిన పద్ధతులను బోధిస్తాం.

మీరు మరింత ధ్యాసను నిలపగలిగినప్పుడు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పగలం. మీరు నిజంగా ధ్యాసను నిలపగలిగినప్పుడు గాని మీ జీవితం ఎప్పుడు మొదలయిందో, ఎప్పుడు అంతం అవుతుందో మీకు అర్థం కాదు. మీరు ఇప్పుడు ఎలా అనుకుంటున్నారంటే మీరు చేస్తున్నదే జీవితానికి ఆది అంతం అని. ఒక్కసారి మీరు ధ్యాసను నిలప గలిగితే అది నిజం కాదని తెలిసిపోతుంది.

ఆధ్యాత్మికతను గూర్చి మీకు ఆలోచన వచ్చిందంటేనే మీరు ఒక స్థాయిలో ధ్యాసను నిలపగలిగారని అర్థం. మీరు ప్రతి విషయంపై దృష్టిని నిలపగలిగితే, ముఖ్యంగా అలా నిలపగలిగే శక్తిని మీరు పెంపొందించుకుంటే దాన్ని మీరు ఎంతో అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అది ఒక ప్రత్యామ్న్యాయ శక్తి వనరును సృజించగలదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు