సద్గురు: కొన్ని యోగ శాస్త్ర సంప్రదాయాలలో యోగులను మూడు తరగతులుగా విభజిస్తారు, మంద యోగులు, మధ్యమ యోగులు, ఉత్తమ యోగులు అని.

మంద యోగులు: వచ్చి పోయే జ్ఞానం

‘మంద’ యోగి అంటే, ఉన్నతమైన సచేతనత్వ (conscious) స్థితిని కొంత చవి చూసినవాడు. సృష్టి మూలాలను దర్శించి, ఏకత్వాన్ని అనుభూతి చేసుకొన్న వాడే కానీ, నిరంతరం అదే అనుభూతిలో ఉండిపోలేడు. అప్పుడప్పుడు మళ్ళీ తనకు తానే దాన్నిగుర్తు చేసుకొంటూ ఉండాలి. స్పృహలో ఉన్నప్పుడు ఆ అనుభూతి ఉంటుంది, కానీ అది లేనప్పుడు, సాధారణ స్థితికి వస్తాడు. ఈ అనుభూతి కేవలం మనశ్శాంతికీ, సంతోషానికీ సంబంధించింది కాదు. ఇది పేరు లేని, చెప్పలేని బ్రహ్మానంద పారవశ్య అనుభూతి! మొదటి తరగతికి చెందిన ‘మంద’ యోగులు ఈ అనుభూతిని ఎరిగిన వారే. కానీ వాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోలేరు. ఎప్పటికప్పుడు తమకు తాము ఆ స్థితిని గుర్తు చేసుకొంటూ ఉండాల్సిందే. మరోలా చెప్పాలంటీ, ఈ తరగతి యోగుల చైతన్యానుభూతి ఎప్పుడూ ఒకేలా ఉండదు.

మీరు చైతన్యంతో ఉండి, గ్రహించగలిగితే, మీకు పెద్దవీ చిన్నవీ ఎన్నో విషయాలు కనిపిస్తాయి. మీరు జాగ్రదవస్థలో లేకపోతే, మీ బాహ్య స్పృహ మందగించి ఉంటే, అవన్నీఅనుభవంలోకి రావు. మీ స్పృహ మరింత తగ్గిపోతే, (ఉదాహరణకు మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు), మీకు బాహ్య ప్రపంచంలో విషయాలను గ్రహించే శక్తి లోపిస్తుంది. అందుకే మీకు మీ నిద్రావస్థలో బయటి ప్రపంచం అనేదే మాయమైపోతుంది.

సరిగ్గా అదే విధంగా, కొన్ని రకాలైన అతి సూక్ష్మమైన(subtle) విషయాల ఎరుకా, అనుభూతీ కలగాలంటే, మామూలుకంటే ఎక్కువ సచేతనమైన (conscious), ఉన్నతమైన స్థితి అవసరమవుతుంది. ఎవరూ కూడా ఇరవై నాలుగు గంటలూ ప్రయత్నపూర్వకంగా ఎరుకతో ఉండలేరు. అలాంటి స్థితిని ప్రత్యేక కృషితో ప్రయత్నపూర్వకంగా మాత్రమే చేరగల వాళ్ళకు, ఆ స్థితిలో కొన్ని సెకన్లపాటో, నిమిషాలపాటో ఉండగలగటమే గొప్ప! అతి స్వల్ప సమయం లోనే ఆ ఉన్నత చైతన్య స్థితి చెదిరిపోతుంది. ఇదిగో, ఇలాంటి ఈ మొదటి దశలో ఉన్న యోగిని ‘మంద’ యోగి అంటారు.

‘మధ్యమ’ యోగులు – నీమ్ కరోలీ బాబా

యోగులలో రెండవ కోవకు చెందినవారు ‘మధ్యమ’ యోగులు. ఇది ఉత్తమ స్థాయికీ, మంద స్థాయికీ మధ్యస్థం. ఈ యోగికి అంతరంగ అనుభూతులూ, అలౌకిక అనుభవాలూ ఎప్పుడూ అనుభవమౌతూనే ఉంటాయి. కానీ అతనికి భౌతిక విషయాల ధ్యాస బొత్తిగా లోపించి, మామూలు లౌకిక వ్యవహారాల నిర్వహణ కూడా కష్టమైపోతుంది. ఇలాంటి మహా యోగులెందరో ఈనాటికీ మహనీయులుగా, లోక పూజ్యులుగా నిలిచి ఉన్నారు. వీళ్ళు తమ జీవిత కాలంలో, ప్రాపంచికమైన పనులేవీ చేయగలిగే వారు కాదు. జీవితంలోని కొన్ని దశలలో వీళ్ళకు భోజనం చేయాలీ, కాల కృత్యాలు తీర్చుకోవాలీ అని కూడా మరెవరో పక్కన ఉండి గుర్తుచేయాల్సి వస్తుండేది. వీళ్ళు ఎప్పుడూ అలౌకికానంద పారవశ్య స్థితిలో ఉండేవారు. కానీ భౌతిక విషయాలలో మాత్రం పసిపాపలలా నిస్సహాయంగా ఉండేవాళ్లు. వీళ్ళకు భౌతిక ప్రపంచంతో సంబంధమే ఉండేది కాదు.

ఇలాంటి యోగులకు ఉదాహరణ నీమ్ కరోలీ బాబా. ఆయన ఒకే చోట అలా పారవశ్య స్థితిలో కూర్చొని ఉంటే, ఆయనకు లఘుశంకాదులు తీర్చుకోవాలని గూడా గుర్తుండేది కాదు. ‘మీరు ఇలా కూర్చొని చాలా గంటలు గడిచిపోయాయి, మీరు వెళ్ళి కాల కృత్యాలు తీర్చుకొని రావాలి’ అని ఎవరయినా వచ్చి చెప్తుండే వారు. అప్పుడే ఆయన వెళ్ళేవారు! అలాంటి యోగులకు శరీర ధర్మాలూ, ప్రాపంచిక విషయాల స్పృహ ఉండేది కాదు. వాళ్ళు నిరంతరం ఒక అలౌకిక పారవశ్య స్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఎంతటి పారవశ్యమైనా, మీరు అదే స్థితిలో ఉండిపోలేరు. భౌతిక ప్రపంచంతో బంధాలు పూర్తిగా తెంచేసుకొన్న తరవాత, భౌతిక శరీరంతో ఉండటం కూడా అసాధ్యమే అయిపోతుంది.

‘ఉత్తమ’ యోగులు - దత్తాత్రేయ గురుదేవుల కథ

మూడవ దశలో ఉన్న యోగులు ఎప్పుడూ పరతత్త్వ ధ్యాన మగ్నులై పారవశ్యంలోనే ఉన్నా, అదే సమయంలో, వాళ్ళకు బాహ్య ప్రపంచ స్పృహ కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఎంత సంపూర్ణంగానంటే, వాళ్ళను చూసినప్పుడు, చూసే వాళ్ళకు ‘వీళ్లసలు నిజంగా యోగులేనా?’ అని అనుమానం కలుగుతుంది. దీనికి ఉదాహరణ దత్తాత్రేయుల వారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురి ఏక కాల అవతారంగా భావించేవాళ్లు. ఎందుకంటే ఆయన మానుష రూపంలో ఉన్నా, ఆయన స్వభావం మాత్రం పూర్తిగా మానవాతీతంగా ఉండేది. అంటే ‘అమానుషం’ అని కాదు. కానీ, ఆయన సాధారణ మానవుడు మాత్రం కాదు. ఆయనకున్న మానవాతీత లక్షణాలను గమనించే, ఆయనను, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చే వాళ్ళు. ఆయన ఆ త్రిమూర్తులు ముగ్గురి సంయుక్తావతారం అనే వాళ్ళు.

అందుకే కొన్ని చోట్ల దత్తాత్రేయ విగ్రహాలు మూడు ముఖాలతో చెక్కబడి ఉండటం మీరు గమనించచ్చు. ఆయన రూపం త్రిమూర్తులు ముగ్గురి మూర్తీభావం.

దత్తాత్రేయుల జీవిత చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. కొన్ని వందల తరాలు గడిచిపోయిన తరవాత కూడా, ఈ నాటికీ, దత్తాత్రేయ ఉపాసకులది ఒక ప్రముఖమైన సంప్రదాయం. ‘కన్ఫట్’ యోగుల గురించి మీరు వినే ఉంటారు. ఈనాటికీ వాళ్ళు నల్ల కుక్కలను వెంటపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. దత్తాత్రేయుల వారి చుట్టూ ఎప్పుడూ నల్లని నలుపురంగు కుక్కలు ఉంటూ ఉండేవి. కుక్కల జ్ఞానేంద్రియాలు మన ఇంద్రియాలకంటే చురుకుగా పని చేస్తాయి. మీ ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉంటే, మీకు ఈ విషయం బాగా తెలుస్తుంది. వాసన పట్టటంలోనూ, వినికిడిలోనూ, దృష్టి శక్తి లోనూ, అవి మనకంటే ముందుంటాయి. అందుకే దత్తాత్రేయుల వారు వాటిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనుకొన్నారు. ఆయన పూర్తిగా నల్లటి నలుపు రంగు కుక్కలను ఎంచుకొన్నారు. ఈనాటికి కూడా ‘కన్ఫట్’ యోగులు పెద్ద పెద్ద కుక్కలను వెంటపెట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఆ కుక్కలను నేలమీద నడవనివ్వరు. భుజాలకెత్తుకొని మోస్తారు! అవి దత్తాత్రేయుల వారికి ప్రియమైన పెంపుడు జంతువులు కనక వాళ్ళ దృష్టిలో అవి చాలా ప్రత్యేకం. దత్తాత్రేయుల వారు ఏర్పరచిన ఆధ్యాత్మిక సాధన సంప్రదాయం నేటికీ నడుస్తున్నది. అది చాలా విస్తృత ప్రచారం ఉన్న సంప్రదాయం కూడా!

గురువు కోసం పరశురాముడి అన్వేషణ

పరశురాముడు గొప్ప తపస్వి మాత్రమే కాదు, అతి పరాక్రమవంతుడైన యుద్ధ వీరుడు కూడా. ఈయన మహాభారత కాలానికి పూర్వం వాడు. ఒక విధంగా చూస్తే, ఈయన మహాభారత యుద్ధంలో తను ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా, ఆ యుద్ధ ఫలితాన్ని నిర్ణయించిన కీలకపాత్రను ఈయనే పోషించాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ఎన్నో యేళ్ళు ముందే కర్ణుడి కథకు ముగింపు పలకటం ద్వారా. ఆయనకు అన్ని విధాలా శక్తులూ ఉండేవి. కానీ భావోద్వేగ పరమైన ఆటుపోటులు, ఆయనను జీవితంలో అనుక్షణమూ దివ్యత్వ దర్శనం చేయగల జ్ఞానిని కానివ్వలేదు. ఒక్కొక్కప్పుడు జ్ఞాన స్థితిలో ఉండే వాడు, మరొకప్పుడు దానికి దూరమయ్యే వాడు. దూరంగా ఉన్న సమయమే ఎక్కువ.

ఆయన వెళ్ళటమయితే చాలా చాలా మంది గురువుల దగ్గరకూ, ఆచార్యుల దగ్గరకూ వెళ్ళాడు. కానీ తను కోరుకొన్న జ్ఞానం వాళ్ళ దగ్గర లభించలేదంటే, తన ఆయుధానికి పని చెప్పేవాడు! చిట్టచివరకు ఆయన దత్తాత్రేయుల వారిని ఆశ్రయించాడు. ‘దత్తాత్రేయుల వారే నీకు తగిన గురువు కాగల’రని ఆయనకు ఎందరో చెప్పి పంపారు. ఆయన వెళ్ళాడు, గండ్రగొడ్డలి చేత పుచ్చుకొని. ఆయన దత్తాత్రేయుల ఆశ్రమాన్ని సమీపిస్తుండగా, అక్కడ ఆధ్యాత్మిక సాధకులు చాలా మంది గుమిగూడారు. కానీ, ఆశ్రమంలోకి ఒక్క సారి తొంగి చూసి వాళ్ళందరూ పారిపోయారు.

పరశురాముడు ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమంలో ఒక మనిషి కూర్చొని ఉన్నాడు. ఆయనకు ఒక చేతిలో కల్లు ముంతా, ఒళ్ళో ఒక పడుచు పిల్లా! దత్తాత్రేయులు మద్యం మత్తులో జోగుతున్నట్టు కనిపించారు. ఆయన పరశురాముడి వైపు చూశారు. పరశురాముడు ఆయనను చూశాడు. మారు మాట లేకుండా తన గొండ్రగొడ్డలిని నేల మీద ఉంచేసి (ఆయన ఆ గండ్రగొడ్డలిని మళ్ళీ ఎప్పుడూ ముట్టలేదు!), సాష్టాంగ ప్రణామం చేశాడు. మిగిలిన వాళ్ళందరూ నిష్క్రమించారు. పరశురాముడు సాష్టాంగ పడ్డ క్షణమే, కల్లు ముంతా, కామినీ రూపం కనుమరుగైపోయాయి. దత్తాత్రేయుల వారు మామూలుగా, తన పాదాల దగ్గర ఉన్న తన పెంపుడు కుక్కతోసహా, దర్శనమిచ్చారు. పరశురాముడు కోరుకొన్న గమ్యం ఆయనకు దత్తాత్రేయుల వారి దగ్గర లభించింది.

ఈ ప్రపంచంలో తను ఏదయినా చేయగలననీ, ఏమి చేసినా కూడా తన ఆధ్యాత్మిక ఔన్నత్యం నుంచి అణుమాత్రం కూడా జారేది లేదనీ, దత్తాత్రేయులు పరశురాముడికి ప్రత్యక్షంగా చూపించారు. అందుకో ముఖ్యకారణం ఉంది. పరశురాముడి శక్తి యుక్తులు అపారమైనవి. కానీ ఆయన శక్తంతా ఆయన ఆవేశ కావేషాల కారణంగా, కేవలం క్రోధం రూపంలో మాత్రమే, కేవలం నకారాత్మకంగా నష్టమైపోతూ వస్తున్నది. కాబట్టి దత్తాత్రేయుల వారు ఉపాయం పన్నవలసి వచ్చింది. దత్తాత్రేయులవారు కాంతా సాంగత్యంలో కల్లు ముంతతో ఎంత మత్తెక్కి ఉన్నట్టు కనిపించినా, ఆ మాయకు లొంగకుండా, నిరంతర దివ్యత్వానుభూతితో ప్రకాశిస్తున్నఆయన స్వస్వరూపాన్ని గ్రహించగలగటం, పరశురాముడి జ్ఞానోదయానికి తొలి సోపానంగా పరిణమించింది. అలాంటి ఆధ్యాత్మిక అవగాహనే కనక పరశురాముడికి ముందు నుంచీ ఉండి ఉంటే, అది చాలా మందిని ఆయన గండ్రగొడ్డలి వేటు నుంచీ రక్షించగలిగేది!

ప్రేమాశీస్సులతో,

సద్గురు