ప్రశ్నకారుడు: మరణానంతరం ఏమవుతుంది? మళ్ళీ జన్మ అనేది ఉన్నదా? అలా ఉంటే ఒక మనిషిని ఒక జన్మ నుంచి మరు జన్మకు ఏది తీసుకువెళుతుంది?

సద్గురు: యోగాలో మేము శరీరాన్ని 5 కోశాలుగా చూస్తాము. ఈ భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటారు. అన్నం అంటే ఆహారం. అంటే ఇది ఆహారపరమైన శరీరం. తర్వాత మనోమయ కోశం అంటే మానసిక శరీరం. ఇక మూడోది ప్రాణమయ కోశం అంటే శక్తి శరీరం. ఈ భౌతిక, మానసిక, శక్తి శరీరాలు జీవిలోని భౌతికమైన అంశాలు. ఉదాహరణకు ఈ లైట్ బల్బు భౌతికమైనదని మీకు తెలుస్తుంది. అలాగే విద్యుచ్ఛక్తి అనేది, అంటే తీగ ద్వారా ప్రయాణించే ఎలక్ట్రానులు కూడా భౌతికమైనవే, అలాగే బల్బు నుంచి ప్రసరిస్తున్న కాంతి కూడా భౌతికమైనదే, కాని మనకు బల్బు ఒక్కటే కనబడుతుంది, మిగతావి కనబడకపోయినా అదికూడా భౌతికమైనవే. అలాగే, ఈ భౌతిక శరీరం స్థూలంగా కనబడుతుంటుంది. మానసిక శరీరం అనేది కొంత సూక్ష్మమైనది అలాగే ప్రాణమయ కోశం మరింత సూక్ష్మమైంది. కానీ ఈ మూడూ భౌతికమైనవే. ఒకరి శరీరం మీద, మనసు మీద, ప్రాణ శక్తి మీద, కర్మ లిఖించబడి ఉంటుంది. ఈ కర్మ సంబంధమైన నిర్మాణాలే (వాసనలే) మిమ్మల్ని ఈ భౌతిక శరీరానికి అంటించి ఉంచుతాయి. ఈ కర్మ అనేది ఒక బంధనమే అయినా, అదే సమయంలో కర్మ అనేది ఉన్నది కాబట్టి మీరు ఈ శరీరాన్ని పట్టుకొని ఉంటారు.

ఇక మిగతా రెండు అంశాలు విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. విజ్ఞానమయ కోశం అనేది అభౌతిక మైనది, కానీ భౌతికతతో సంబంధంలో ఉన్నది. విశేష జ్ఞానము లేక విజ్ఞానము అంటే వేరే రకమైన జ్ఞానము లేక మన జ్ఞానేంద్రియాలకు అందనిది. ఇది ఆకాశ శరీరం, అంటే ఇది భౌతికకు, అభౌతికకు మధ్యలో ఉన్న అంశము. అది భౌతికమైనదీ కాదు, అభౌతికమైనదీ కాదు. అది ఈ రెంటికీ మధ్య ఉన్న ఒక లింకు. ఇక ఆనందమయ కోశం అనేది పూర్తిగా అభౌతికమైనది. దానికి, తనకంటూ ఒక రూపం లేదు. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, అన్నమయ కోశం, మూటికీ సరైన రూపం ఉంటేనే అవి ఆనందమే కోశాన్ని ఉంచుకో కలవు. ఈ మూడింటిని తీసివేస్తే ఈ ఆనందమయ కోశం విశ్వంలో ఒక భాగమైపోతుంది.

మరణం అంటే ఏమిటి?

ఎవరైనా చనిపోయినప్పుడు, మనం ‘ఆ వ్యక్తి ఇకలేడు’ అంటాము. అది వాస్తవం కాదు. ఆ మనిషి, ఇక మీకు తెలిసిన విధంగా లేడు. అంతే కానీ అతను నిజంగా ఇంకా ఉన్నాడు. ఈ భౌతిక శరీరం పడిపోతుంది, కానీ మానసిక, ప్రాణ శరీరాలు ఇంకా మనుగడలోనే ఉంటాయి. వారి, వారి కర్మ బలాలను బట్టి అవి ఇంకా అలానే ఉంటాయి. ఇంకో గర్భాన్ని పొందటానికి ఈ కర్మ సంబంధమైన నిర్మాణానికి బలం తగ్గాలి. అది ఒక రకమైన స్తబ్థతకు రావాలి. ఈ కర్మనిర్మాణం తన పూర్తి కాలం బ్రతికే ఉంది కాబట్టి, అది బలహీనమై పోతే అప్పుడు మరో శరీరాన్ని పొందటం ఎంతో సులువు అవుతుంది. ఎప్పుడైతే ఒకరు ఈ జన్మకు సంబంధించిన ప్రారబ్ద కర్మను పూర్తి చేసుకుంటారో, అతను ఏ వ్యాధి, ప్రమాదము, గాయం తగలకుండా మరణించివుంటే, అటువంటి వ్యక్తి మరో శరీరాన్ని కొన్ని గంటల్లోనే పొందవచ్చు.

ఒక వ్యక్తి తన జీవితాన్ని పూర్తి చేసుకొని, ప్రశాంతంగా మరణిస్తే, అతడు ఎక్కువ నాళ్లు వేచి ఉండనక్కర్లేదు. అది వెంటనే జరిగిపోతుంది. అలా కాక కర్మనిర్మాణం చాలా బలంగా ఉంటే, అది పూర్తి కాకుండా ఉంటే, అప్పుడు అది మరో శరీరం పొందటానికి కొంతకాలం అవసరమవుతుంది. ఈ స్థితినే మనం దెయ్యము అంటాము. వారు మరింత బలమైన కర్మ నిర్మాణంతో ఉన్నారు కాబట్టి, వారు అనుభూతికి అందుబాటులో ఉంటారు. మీకు తెలిసినా, తెలియకపోయినా ఈ జీవాలు చుట్టూతా అనేకం ఉన్నాయి. వాటి కర్మ బలహీనంగా ఉంటే చాలా వరకు మీరు వాటిని అనుభూతి చెందలేరు. అవి మరో శరీరం పొందటానికి తమ కర్మ మరింత కరిగేదాకా వేచి ఉంటాయి.

మహా సమాధి – అంతిమ స్వేచ్ఛ

మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటే ఈ మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అంతిమ లక్ష్యం అనేది, ఈ మొత్తం కర్మ ప్రక్రియను భగ్నం చేయడమే. అది ఒక బుడగ వంటిది. ఈ బుడగ పైపొర అనేది మీ కర్మ నిర్మాణము, లోపల ఉన్నది గాలి. ఉదాహరణకు మీరు ఆ బుడగ పగలగొట్టారనుకోండి, మరి మీ గాలి ఎక్కడికి పోయింది. మీ గాలి అంటూ అక్కడ ఏమీ లేదు. అది మిగతా అంతటితో కలిసి, దానిలో ఒక భాగమైపోయింది. ప్రస్తుతం ఈ అపరిమితత్వం అనేది, కాస్తంత కర్మ నిర్మాణంలో చిక్కుకుని ఉన్నది, అందుకే మీకు మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని అని నమ్మేలా చేస్తోంది. అలా కాక ఈ కర్మ నిర్మాణాన్ని పూర్తిగా, నూటికి నూరుశాతం, పరిసమాప్తం చేస్తే, మీరు ఉనికిలో కలిసిపోతారు.

దీనినే మహా సమాధి అంటారు, దానికి సంబంధించిన తాళం చెవులు ఎక్కడ ఉన్నాయో మీరు మెల్లగా అర్థం చేసుకుని ఈ కర్మ సంబంధ నిర్మాణాన్ని పూర్తిగా కూలదోస్తారు. అప్పుడు మీరు నిజంగా లేకుండా పోతారు. హిందూ సంస్కృతిలో దీనినే ముక్తి అంటారు. యోగ సంప్రదాయంలో దీనిని మహా సమాధి అంటారు. దీనిని బౌద్ధమతంలో మహాపరినిర్వాణ అంటారు. సామాన్యంగా ఇంగ్లీషులో దీనిని లిబరేషన్ అంటారు. ముక్తి, లిబరేషన్ అంటే భౌతిక మానసిక ప్రక్రియల నుండి ముక్తి పొందటం, అంటే పూర్తిగా స్వేచ్ఛ పొందటం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు