ప్రశ్న: యోగ కార్యక్రమానికి వెళ్ళేందుకు జీవిత భాగస్వామి నుంచి సరైన సహకారం లభించకపోతే, అలాంటి వారు ఏం చేయాలి. ఇందులో ఉండే ప్రయోజనాల్ని జీవిత భాగస్వామికి ఎలా తెలియజేయాలి.?

సద్గురు: ఎవరైనా సరే మీ ఆధ్యాత్మిక సాధనకు సహకారించాలని మీరు కోరుకుంటున్నట్లైతే, ఈ సాధనను మీరు ఎదుటి వారికి లాభదాయకంగా ఉండేలా చేయాలి. సాధనతో మీరు ఎంతో ఆనందగా, ఉల్లాసంగా అద్భుతంగా మారడాన్ని ఎదుటి వారు గమనించాలి. అప్పుడు వారే “ఈ రోజు ధ్యానం చేశావా, ధ్యానం చేసుకో..”అని  మిమ్మల్ని ప్రోత్సహిస్తారు.. అలా కాకుండా మీ ఉద్దేశ్యంలో ఆధ్యాత్మికత అంటే, ‘నేను ఈ రోజు వంట చేయడం లేదు, ఈ రోజు నుంచి నానపెట్టిన వేరుశనగ గింజలనే తిందాం. ఈశా తరగతుల్లో నానబెట్టిన వేరుశెనగ గింజల్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయని చెప్పారని’ మీరు అంటే, అప్పుడు మీకు  సరైన సహకారం దొరకదు.

వ్యవస్థలో సరైన మార్పులు జరగకుండా ఇటువంటివి చేసినట్లయితే, దీనివల్ల మీకు మేలు కంటే హానే ఎక్కువగా జరుగుతుంది.
మీ ఆధ్యాత్మికతను, మీ జీవిత భాగస్వామికి లాభసాటిగా ఉండేలా మీరు చేస్తే, అప్పుడు  వారే “ఈ రోజు ఉదయం క్రియ పూర్తైందా” అని అడుగుతారు. మీ సాధన ఇలా ఉండాలి. మీ ఆధ్యాత్మికత వారి కోసం ఉపయోగపడాలి. వారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి అద్భుతమైన వ్యక్తిగా మీరు ఉండాలి. అప్పుడే మీకు ఉదయం క్రియ ఖచ్చితంగా జరిగేలా, కుటుంబానికి ఫలితం చేకూరేలా వారే చూసుకుంటారు, . కానీ కొన్ని కుటుంబాల్లో ఎవరైనా 15 నిముషాల పాటు ధ్యానంలో కూర్చుంటే, అందరూ వస్తారు. ‘నువ్వు కళ్ళు ఎందుకు మూసుకున్నావు’... అని కుదిపి మరీ ప్రశ్నిస్తారు. అలాంటి పరిస్థితులు మీకు ఎదురైతే వారు ప్రతి చిన్నదానికీ అభద్రత అనుభూతి చెందుతుంటే, నా ఉద్దేశ్యంలో అప్పుడు మీకు ఉన్నది కుటుంబం కాదు. నేను అంత కఠోరంగా మాట్లాడుతున్నందుకు క్షమించాలి, కాని వాస్తవం అదే అని గ్రహించాలి. కుటుంబం అంటే ఇద్దరో, నలుగురో వ్యక్తులు ఒకరి శ్రేయస్సుకు మరొకరు సహకారం అందిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఎదుటివారి శ్రేయస్సు గురించి శ్రద్ధ తీసుకోవాలి. అటువంటి శ్రద్ధ లేకపోతే మీకు నిజానికి కుటుంబం లేనట్లే. దీని గురించి ఆలోచించాల్సిన సమయం ఇదే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు