కథ:

ఒకాయన బుద్ధుడి జీవితం గురించి విన్నాడు. దాంతో, ఆయనకు తనుకూడా బుద్ధుడి అంత ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించాలనే గాఢమైన కోరిక కలిగింది.

అందుకోసం ఆయన ఎందరో గొప్ప గురువులను కలిశాడు. బుద్ధుడి బోధల గురించి వాళ్ళతో చర్చించాడు. కానీ వాళ్లెవ్వరి సమాధానాలూ ఆయనను సంతృప్తి పరచ లేక పోయాయి. అప్పుడాయన కెవరో చెప్పారు, ‘ఫలానా పర్వత శిఖరాగ్రం మీద ఫలానా గురువు గారు ఉన్నారు. ఆయన బుద్ధుడి గురించి సమస్తమూ తెలిసిన జ్ఞాని. నీ ప్రశ్నలేవో ఆయన్ని అడిగావంటే, తప్పక సమాధానాలు చెప్తారు ‘ అని.

సరే, ఈయన ఎంతో కష్టపడి ఆ పర్వతమంతా ఎక్కి, చివరికి గురువుగారి కుటీరం చేరి, లోపలికి ప్రవేశించాడు. అక్కడ అప్పటికే చాలా మంది శిష్యులు కూర్చొని ఉన్నారు. గురువుగారు ఆ శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈయన ప్రవేశించగానే గురువు గారు, ఈయనను తన దగ్గరకు రమ్మని పిలిచి, ’ఏం కావాలి నీకు ?‘ అని అడిగారు.

ఈ శిష్యుడు, ‘నేను బుద్ధుడి బోధనలు సమగ్రంగా తెలుసుకోవాలని తిరుగుతున్నాను. ఇప్పటికే చాలామంది పండితులను కలిశాను. కానీ వాళ్ళెవరూ నా సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదు. మీరు ఆ విషయాలను వాళ్లందరికంటే, బాగా విశదపరచగలరని విని, మీ దగ్గరకు వచ్చాను.’ అన్నాడు.

‘అలాగా! అయితే దయచేసి కూర్చో.వీళ్ళందరూ వెళ్ళిపోయిన తరవాత, నేను నీతో మాట్లాడతాను’ అన్నారు ఆ జెన్ గురువు. శిష్యుడికి ఊరట కలిగింది. ‘ఈ గురువు గారి దగ్గర ఇప్పటికే ఇందరు శిష్యులున్నారంటే, ఈయన నిజంగా గొప్ప గురువే అయ్యుండాలి!’ అని నమ్మకం కుదిరింది.

గురువు గారు తన శిష్యులు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి వాళ్ళను పంపేశారు. చివరికి తన సరికొత్త శిష్యుడి దగ్గరికి వచ్చారు. ‘నువ్వు నాతో రా!’ అని పిలిచారు. గురుశిష్యులిద్దరూ ఆ కొండ చరియల మీదుగా నడుస్తూ వెళ్లారు. కొంత దూరం నడిచిన తరవాత వాళ్ళకు కొన్ని పచ్చని చెట్లు కనిపించాయి..

‘ఇవేమిటో తెలుసా?’ అని శిష్యుడిని ప్రశ్నించారు గురువు గారు.

‘వెదురు చెట్లు కదా?’ అని సమాధానమిచ్చాడు శిష్యుడు.

అప్పుడు గురువుగారు ఆ వెదురు చెట్లకు పక్కగా పుట్టుకొస్తున్న చిన్న వెదురు రెమ్మలను (bamboo shoots) చూపించారు.

‘ఇప్పుడు వీటిని చూస్తే, ఇవి నీకెలా కనిపిస్తున్నాయి?’ అని అడిగారు.

‘ఆ వెదురు మొక్కలు బాగా పెరిగి, పొడుగై పోయాయి. ఈ వెదురు రెమ్మలు ఇంకా ఎంతో పెరగాల్సి ఉంది కనక ఇవి చిన్నవిగా, పొట్టిగా ఉన్నాయి’ అన్నాడు శిష్యుడు.

‘ఇవీ వెదుళ్ళే!’ అన్నాడు గురువుగారు. అనేసి తన కుటీరం వైపు చక చకా నడక సాగించాడు.

సద్గురు:

మీరు ఆరడుగుల పొడుగున్నారనుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అయిదున్నర అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్లయితే, మీరు ‘నేను చాలా పొడగరిని!’ అని అనుకొంటారు. పొడగరి మనిషిని అన్న భావన తోనే నడుస్తారు. పొడగరి మనిషిని అనుకొంటూనే నిలుచొంటారు, కూర్చొంటారు, పరుగెత్తుతారు. అకస్మాత్తుగా మిమ్మల్ని తీసుకెళ్లి మరో దేశంలో పడేశామనుకోండి. అక్కడ మనుషుల కనీసపు ఎత్తే ఎనిమిది అడుగులు దాటి ఉందనుకోండి. అప్పుడు మీకు ‘ నేను చాలా పొట్టివాడిని సుమా!’ అనిపిస్తుంది. అప్పుడు మీరు నడిచినా, కూర్చొన్నా మిమ్మల్ని మీరు పొట్టివాడిగానే భావించుకొంటూ ఉంటారు.

మనుషులు మామూలుగా తమ అయిదు జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించే విషయ పరిజ్ఞానం చాలా వరకూ ఇలా ఒక విషయాన్ని మరొక దాంతో పోల్చి గ్రహించేదే. మీకు పోలికల ద్వారా పట్టుబడే ఈ సాపేక్ష జ్ఞానం మీ దైనందిన జీవితం నడుపుకొనేందుకు మాత్రమే అవసరమౌతుంది.

మీరు దేన్నయినా ముట్టుకొన్నప్పుడు, అది మీకు చల్లగా అనిపించింది. అంటే మీ శరీరం వేడిగా ఉందని అర్థం. అంతే కదా? ఇలా విషయాలను కేవలం పోలికల ద్వారా మాత్రమే అర్థం చేసుకొంటే, అది ఆ విషయాల గురించిన సరైన జ్ఞానమూ, అవగాహనా కాదు.

మీరు జీవితాన్ని దాని సమగ్రమైన యథార్థమైన రూపంలో చూడాలనుకొంటే యిలా పోలికలు పెట్టటం మానేయాలి. కేవలం పోలికల ఆధారంగా ‘ఇది ఉన్నతం, అది అధమం’ , ‘ఇది పొడుగూ, అది పొట్టీ’, ‘ఇది అందంగా ఉంది, అది వికారంగా ఉంది’ అని నిర్ణయించేసుకోవటం మానేయాలి. మీరు ఆరడుగుల పొడుగున్నా, ఎనిమిదడుగుల పొడుగున్నా, నిజానికి మీరు ఎప్పటికీ మీరే.

బుద్ధుడి బోధలు కానీయండి, యోగ శాస్త్ర మూల సూత్రాలు కానియ్యండీ. అవన్నీ ఉన్నది జీవితాన్ని అది ఎలా ఉందో అలా యథాతథంగా సాక్షాత్కరింపజేసుకోవటానికి ఉపకరించేందుకు మాత్రమే!

అలా చేసుకోవాలంటే, మీరు మీ అయిదు జ్ఞానేంద్రియాల ద్వారా నమోదయ్యే విషయ పరిజ్ఞానం పరిధులు దాటి వెళ్లగలగాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు