సద్గురు: భారతదేశంలో సుమారు 160 మిలియన్ హెక్టార్లు వ్యవసాయానికి అనువైన భూమి ఉంది. కానీ దాన్లో అరవై శాతం నేల, సారహీనమైన స్థితిలో ఉన్నదిగా వర్గీకరించబడింది. అంటే, మరో 25 - 30 సంవత్సరాల కాలంలో మనం మనకు అవసరమయ్యే ఆహార ధాన్యాలను పండించుకునే పరిస్థితి ఉండదు.

భారతదేశం ఎన్నో విజయాలను సాధించింది. మన అంతరిక్ష శాస్త్రజ్ఞులు అంగారక గ్రహం మీదికీ, చంద్రగ్రహం మీదికీ రాకెట్లను పంపుతున్నారు. దేశం వాణిజ్య రంగంలోనూ, ఇంజనీరింగ్ మొదలైన రంగాలలోనూ, గొప్ప సాఫల్యాలు సాధించింది. అంతే కాదు, విశేషమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే, కేవలం సాంప్రదాయక వ్యవసాయ పద్ధతులతో, మన దేశంలో రైతులు నూరు కోట్లకు పైబడిన జనాభాకు ఆహార ధాన్యాలు పండించి పెట్టగలుగుతున్నారు. నిజానికి మన దేశం సాధించిన ఘన విజయాలలో అతి ముఖ్యమైనది ఇదే.

కానీ దురదృష్టవశాత్తూ మనం మన రైతులను ఎంత దుర్భరమైన స్థితిలోకి నెట్టేశామంటే రైతులెవ్వరూ ఇప్పుడు వాళ్ళ పిల్లలు వ్యవసాయంలోకి ప్రవేశించాలని కోరుకోవటంలేదు. ఒక వంక చూస్తే మన వ్యవసాయ భూమిలో నాణ్యత బాగా తగ్గిపోతున్నది. మరో వంక రైతులు తమ సంతానాన్ని వ్యవసాయ వృత్తిలో దింపటానికి సుముఖంగా లేరు. ఈ రెండు కారణాల వల్ల మనం రాబోయే ఇరవయి అయిదు సంవత్సరాలలో ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నాం. నీరూ, ఆహారం కరువయిపోతే కలిగే జనాగ్రహం, దేశాన్ని అనేక విధాలుగా తీవ్రంగా దెబ్బ తీయగలదు. నీటి వనరులు పూర్తిగా ఎండిపోయి, నీరు బొత్తిగా లభ్యం కాని గ్రామీణ ప్రాంతాల నుండి జనం పెద్ద సంఖ్యలో నగరాలకు వలసలు వెళతారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. నగర ప్రాంతాలలోని మౌలిక వసతులు (infrastructure) అందరికీ సరిపోవు. కనుక, వాళ్ళు వీధులలోనే ఉండాల్సి వస్తుంది! కానీ అలా ఎన్నాళ్లని ఉండగలరు? కూడు - నీరు కూడా లేని పరిస్థితి వచ్చి, వాళ్ళు ఇక ఇళ్ల మీదకు దాడులకు దిగుతారు. నేనేదో లేనిపోని విపరీతపు పరిస్థితులన్నీ ఊహించి చెప్పేస్తున్నాననుకోకండి. మనం ఏవయినా గట్టి చర్యలు తక్షణమే చేపడితే తప్ప, రాబోయే ఎనిమిది, పది సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులను మీరు మీ కళ్ల ముందే చూస్తారు. సారవంతమైన భూమి – అమూల్యమైన వరం!

ఉష్ణ మండల దేశాలకు లభించే ఒకే ఒక్క నీటి వనరు ఋతుపవనాల వల్ల లభించే వర్షపాతం. ఈ ఋతుపవనాలు కూడా మనకు అందుబాటులో ఉండేది 45-60 రోజులు మాత్రమే. ఆ అరవయి రోజులలో కురిసే వర్షపునీటిని మనం 360 రోజులు నిలవ చేసుకుని, వాటితోనే నదులనూ, చెరువులనూ, జలాశయాలనూ నింపుకోవాలి. భారీ ప్రమాణంలో వృక్ష సంపద లేకపోతే, మనం ఈ నీటిని కాపాడుకునే అవకాశమే లేదు.

నీరు నేలలోకి ఇంకి, అక్కడే ఉండిపోవటానికి కారణం నేలలో ఉండే సేంద్రీయ పదార్థాలు. ఈ సేంద్రీయ పదార్థాలు ఉత్పత్తి కావాలంటే, జీర్ణించిన ఆకూ అలమూ, పశు సంపద విసర్జించే వ్యర్థాలూ అనే రెండు వనరులే కారణం. కుళ్లిన ఆకులూ, పశు వ్యర్థాలూ (animal waste) లేని చోట్ల నీరు నేలలో ఇంకి నిలిచి ఉండలేదు-ప్రవహించిపోతుంది.

అసలు ఒక దేశానికి ఉండే అసలైన సంపద ఏమిటో మీరు ముందు సరిగా గ్రహించాలి: జీర్ణించిన ఆకులూ, పశువుల పేడా! మన తరవాతి తరానికి మనం అందించ గలిగిన అమూల్యమైన సంపద లాభసాటి వ్యాపారాలు కాదూ, డబ్బూ దస్కమూ కాదూ, వెండి బంగారాలూ కాదు. మనం వాళ్ళకు అందించాల్సిన అమూల్యమైన సంపద, సేంద్రియ పదార్థాలతో సంపన్నమైన సారవంతమైన నేల మాత్రమే. సారవంతమైన నేల లేకపోతే, తగినంత నీరు లభించే ప్రశ్నే లేదు.

భారత దేశంలో ఒక క్యూబిక్ మీటర్ పరిమాణం గల మట్టిని తీసుకొని పరీక్షించి చూస్తే, అందులో ఉండే జీవ జాతుల సంఖ్య, ప్రపంచంలో మరే దేశపు మన్నులోనైనా కనిపించే జీవజాతుల సంఖ్య కంటే ఎక్కువ. ఈ మన్ను సారం ఇప్పుడు క్షీణిస్తున్న మాట వాస్తవమే అయినా, మనం కొంచెం చేయూత అందించ గలిగితే, ఈ మట్టికి మళ్ళీ సారం పుంజుకొనేందుకు కావలసిన జీవ శక్తి ఉన్నది. వేలాది సంవత్సరాలుగా వృక్ష సంపదకు కొరత లేకపోవడం వల్ల, ఈ నేలలో జీవశక్తి పుష్కలంగా ఉంటూ వచ్చింది. 12,000 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద మనం వ్యవసాయం చేస్తూ వస్తున్నా కూడా, నేల ఇప్పటివరకూ సారవంతంగానే ఉంటూ వచ్చింది. గత నలభయి, యాభయి సంవత్సరాలలో మాత్రం, వృక్ష సంపదనంతా ధ్వంసం చేయటం ద్వారా, మనం ఈ నేలను ఎడారిగా మార్చేస్తున్నాం.

ఆరోగ్యం – భూసారం

భారతదేశంలో భూసారం పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఈ నేలలలో పండించిన ఆహార ధాన్యాల పోషక విలువలు కూడా ప్రమాదకరమైన స్థాయికి క్షీణించిపోతున్నాయి. ముఖ్యంగా కూరగాయల పంటల విషయంలో, ఈ పోషక విలువలు గత ఇరవై అయిదు సంవత్సరాలలో ముప్ఫయి శాతం దాకా తగ్గిపోయాయి. ప్రపంచంలో అన్ని ఇతర దేశాలలో వైద్యులు మాంసాహారం నుంచి శాకాహారానికి మారితే మంచిదని సలహాలు ఇస్తున్నారు. భారతదేశంలో వైద్యులు మాత్రం, మీరు మాంసాహారానికి మారితే మంచిదంటున్నారు. మిగతా ప్రపంచంలో జనాభా ఎలాగో కష్టపడి మాంసాహారం మాని వేయాలని ప్రయత్నిస్తుంటే, ఎప్పటినుంచో ప్రపంచంలో ఎక్కువగా శాకాహారి దేశంగా మనుగడ సాగిస్తూ వచ్చిన మనం మాత్రం, ఇప్పుడు మాంసాహారం వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. మనం తీసుకునే శాకాహారంలో పోషక విలువలు క్షీణించి పోతూ ఉంటే మరేం చేసేట్టు?

దీనికంతటికీ అసలు కారణం మనం భూసార సంరక్షణ పట్ల సరైన శ్రద్ధ చూపక పోవటంమాత్రమే. ఫలితంగా నేలలో సూక్ష్మ పోషక పదార్థాల (micro nutrients content) మోతాదులు అతి స్వల్పకాలంలోనే గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్లే ఇప్పుడు మన దేశంలో మూడేళ్ళలోపు పసిపిల్లలలో డెబ్భయి శాతం మందిలో రక్త హీనత సమస్య కనిపిస్తున్నది.

మీరు అడవిలోకి వెళ్ళి అక్కడి మట్టి తీసుకుని చూస్తే దాని నిండా జీవశక్తి కనిపిస్తుంది. మన్ను ఉండవలసింది అలా! మన్నులో సారం తగ్గిపోతే, మన శరీరాలు కూడా బలహీనమైపోతాయి. కేవలం ఆహారంలో పోషక లోపం వల్లే కాదు, మౌలికంగానే మన ఆరోగ్యమం బలహీన పడుతుంది. అంటే మన తరవాత పుట్టుకొచ్చే తరాలు మనకంటే చాలా దుర్బలులుగా ఉంటారు. వారిని అలా చేయటం మానవ జాతి పట్ల మనం చేసిన ఘోరమైన నేరం అవుతుంది. మన తరవాతి తరాలు మనకంటే మెరుగుగా ఉండాలి. వాళ్ళు మనకంటే, ఏ విధంగానైనా తీసికట్టుగా ఉన్నారంటే, మనం ప్రాధమికంగా ఏదో తప్పిదం చేశామనే అర్థం. భారతదేశంలో భూసారం నానాటికీ క్షీణించిపోతున్నదంటే, మనవల్ల అలాంటి తప్పిదమే ఏదో భారీ స్థాయిలో జరుగుతున్నదని అర్థం.

తక్షణ కర్తవ్యం

1960 కి ముందు భారత దేశంలో ఎన్నో కరువులు సంభవించేవి. అలాంటి కరువులు వచ్చినప్పుడు, ఒక్కో వేసవి కాలం కేవలం మూడు నెలలలో 30 లక్షల మంది ప్రాణాలు తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన నదులు ఎండిపోయి, మన భూసారం క్షీణించిపోతే, మనం మళ్ళీ అదే స్థితికి దిగజారిపోతాం. ఇప్పుడు మనం ఏ మాత్రం ఆలస్యం లేకుండా తక్షణం చేపట్టవలసిన చర్యలు చేపట్టక పోతే, భవిష్యత్తులో ఈ భూమి ప్రజలను సంరక్షించలేదు.

ఇలాంటి పరిస్థితిలో నేను ‘కావేరీ కాలింగ్’ (Cauvery Calling) ప్రణాళికను ప్రారంభించాను. దాదాపు 83,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని ఆక్రమించి ఉన్న కావేరీ పరీవాహ ప్రాంతం (river basin) లో ఉన్న వ్యవసాయ దారులందరూ కలిసి మొత్తం 242 కోట్ల మొక్కలను నాటేందుకు అవసరమయ్యే సహాయ సహకారాలు అందించేందుకు ఈ ప్రణాళికా రూపేణా కృషి చేస్తున్నాం. ఈ మొక్కలన్నీ నాటితే, కావేరీ పరీవాహ ప్రాంతంలో మూడవ వంతు భాగాన్ని వృక్షచ్ఛాయా ప్రదేశంగా మార్చవచ్చు. ఇందువల్ల ఈ ప్రాంతంలో మొత్తం సుమారు 9 ట్రిలియన్ (తొమ్మిది లక్షల కోట్ల) లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వృథాగా సముద్రంలోకి ప్రవహిస్తున్న నీటి మొత్తం పరిమాణంలో ఇది నలభయి శాతం.

దీన్ని సాధించేందుకు ఏకైక మార్గం, రైతుల దృష్టిని వ్యవసాయ అటవీకరణ (agro forestry) వైపూ, వృక్షాధారిత వ్యవసాయం (tree based agriculture) వైపూ మళ్లించటం. మేము ఇప్పటికే కొన్ని చిన్న స్థాయి పథకాలు అమలు చేసి, వాటి ద్వారా 69,760 మంది రైతులచేత ఈ వ్యవసాయ అటవీకరణ (agro forestry) మొదలు పెట్టించాం. దీని ద్వారా అయిదు నుంచి ఏడు సంవత్సరాల స్వల్ప కాలంలోనే వాళ్ళ సంపద మూడు నుంచి ఎనిమిది రెట్లు పెరిగింది. ఇప్పుడు ఈ పథకాన్ని భారీ స్థాయిలో కావేరీ పరీవాహ ప్రాంతం అంతటా అమలు చేసి చూపగలిగామంటే, దీన్ని ఇతర నదీ ప్రాంతాలకు కూడా వర్తింపజేయవచ్చు.

తక్షణ చర్యలు చేపట్టేందుకు ఇదే తరుణం. ఈ ప్రయత్నాన్ని మరో 20-25 సంవత్సరాల పాటు పట్టుదలతో కొనసాగిస్తే, ప్రస్తుతం మనం చూస్తున్న దుస్స్థితిని పూర్తిగా మార్చివేయవచ్చు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు