1.గురువుగారూ! ఆధ్యాత్మిక కోణం నుండి చూసినప్పుడు ఈ మహమ్మారి , మానవాళినీ, మానవ పర్యావరణాన్నీ, తాము జీవించే విధానాన్నీ, తమ చుట్టూ ఉన్న వాటితో చేసే సహజీవన విధానాన్నీ పునరావిష్కరణ చేసుకోమని చెప్పినట్లుంది. మీకేమనిపిస్తోంది?

సద్గురు: ఇప్పుడు జంతుజాలం ‘‘మన గ్రహాన్ని మళ్ళీ శుభిక్షం చేసుకుందాం! అనంటున్నాయి!’’ ముంబై వీధుల్లో నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి . 20 సంవత్సరాల తరవాత పంజాబ్ నుండి హిమాలయ పర్వత శిఖరాలు స్పష్టంగా కనబడుతున్నాయి! పొగమంచు విడిపోయింది. ఎంతో కాలంగా మనం ఈ భూమండలాన్ని చెదల్లాగా తినేస్తూ వచ్చాము. మెల్లగా, దానిలోని జీవాన్ని పీల్చేసాము. భూమండలంపై ప్రతి జీవి మానవ వైరస్ అంటేనే భీతి చెందాయి.

మానవాళి ప్రతి సంవత్సరం కనీసం మూడు వారాల సెలవు తీసుకోవాలి. ఈ గడువులో పర్యావరణాన్ని కాలుష్యం చేసే టెక్నాలజీ, అన్ని మెషీన్లు నిలిపిపేయాలి. ఈ సెలవల సమయాన్ని అంతర్ముఖులు కావడానికి వినియోగించుకోవాలి. శారీరికంగా , మానసికంగా, భావోద్వేగపరంగా, సామర్ధ్యతలోనూ తమని తాము మెరుగు పరచుకోవడానికి ఈ కాలాన్ని వినియోగిస్తే , మనం ఒక అద్భుతమైన ప్రపంచంలో నివసిస్తాము.

ఈ వైరస్ మన మనసుల్లో, హృదయాల్లో మన అనిత్యతను తెలియబరుస్తోంది. నేను అనిత్యుణ్ణి అన్న వాస్తవాన్ని చూడగలిగినప్పుడే మీ జీవితాన్ని ఓ క్రమంలో పెట్టుకుంటారు. నేను మనుషుల జీవనశైలిని విమర్శ చేయదలచుకోలేదు కానీ, ఎన్నో సార్లు అది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఒకసారి నేను అమెరికాలోని మాల్ కి వెళ్ళినప్పుడు, అక్కడో షాపులో ముక్కులో వెంట్రుకలు కత్తిరించుకోవడానికి 20 రకాల కత్తెర్లని ప్రదర్శించారు! అందుకే, మన జీవితాలను మనం మరోసారి సరిచూసుకోవలసిన సమయం ఆసన్నమయింది. మనం కాస్త తక్కువతో జీవించగలమా? దీన్ని మనమో చట్టంగా మారిస్తే అసహ్యంగా ఉంటుంది, అదే మనమందరం స్పృహతో చేస్తే ఎంతో అందంగా ఉంటుంది . 

2. ‘మన దృక్కోణం నుంచి....మనవాస్తవాన్ని పునఃనిర్మించుకోవడం దాకా మనందరితో వైరస్ ఓ భాషణ ఇవ్వాలనుకుంటే’ అది ఇచ్చే ఉపన్యాసం గురించి మనం కొన్ని వాక్యాలు రాయవలసి వస్తే అది ఎలా ఉంటుంది?

సద్గురు - నిజానికి, మీరేవైనా కొత్త విషయాలు నేర్చుకోవడం వైరస్ కి అసలు నచ్చదు! మీ శరీరంలో వైరస్ కి విరుద్ధంగా యాంటీబోడీస్ ఉత్పత్తిచేయడం దానికిష్టం లేదు. ఇదివరకు వైరస్ మిగితా జంతువులతో సహజీవనం చేస్తూ ఉండేదేమో, ఇప్పుడు దాని నివాసస్థలము చిన్నదైపోయింది. అందుకే మనమింతమందిమి ఉన్నాము కాబట్టి మన మధ్యకి వచ్చేసింది. దానికి మనని చంపుదామన్న ఉద్దేశ్యం లేదు, మరో నివాసస్థలం వెతుక్కుంటూ వచ్చింది అంతే! కాకపొతే అదంత తీవ్రంగా ఉండేసరికి మనం తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నాము. కాని, మరికొద్ది నెలల్లో వైరస్ మార్పుచెంది ఉధృతం కొంత తగ్గి, మన శరీరంలో సునాయాసంగా నివసించగలదని శాస్త్రవేత్తల అంచనా.

ఈ వైరస్ కి మనకి ఏదో చెప్పే ఉద్దేశ్యమేమీ లేదు. అయితే పరిస్థితులు ఇలా ఉండడం వలన మనుషులు ఈ భూమిపై తమ ఉనికి చాలా స్వల్పకాలమని గ్రహిస్తున్నారు. మనం అనుక్షణం నడిచే ఈ భూమే మనకు ఎంతో అమూల్యమైనది. మన జీవితంలో ప్రతిక్షణం ఈ ఎరుకతో ఉంటే, ఈ భూమిపై వేసే ప్రతి అడుగూ ఎంతో సున్నితంగా వేస్తాము.  

3.భారతీయ సమాజాల్లో కష్టకాలాల్లో కలిసివుండే అలవాటు ఎంతో కొంత ఉంది. చిన్నవాళ్లు ఇంట్లో మిగితావాళ్లందరికీ , క్యూ లో నిలబడి సరుకులు తెచ్చిపెడతారు. వ్యక్తివాదం పెట్రేగిపోయిన పాశ్చాత్య దేశాల్లో గమనించిందేమిటంటే, సాధారణంగా వయోవృద్ధులకి ఇటువంటి సదుపాయాలుండవు. ఈ దేశాల్లో వృద్ధులు ఇటువంటి మహమ్మారిని ఎదురుకోవడానికి సంసిధ్ధంగా లేరని దౌత్య ప్రతినిధి అయిన నా మిత్రుడొకడు చెప్పారు. ఈ వైయక్తికత అన్ని పరిస్థితుల్లో అక్కరకు రాదని పాశ్చాత్యులు గ్రహిస్తారా? మీరేమంటారు?

సద్గురు- : భారతదేశంలో ప్రతి పిల్లా, పిల్లవాడూ మీకోసం పరిగత్తుకు వెళ్లి సరుకులు పట్టుకొస్తారని అనుకోవద్దు. ఎదో ఆర్థిక నిర్బంధతల వలన అలా చేస్తున్నారు వాళ్ళు . రెండు మూడు తరాల క్రితం కుటుంబమంటే, మీరూ, మీ జీవిత భాగస్వామీ, పిల్లలూ, తలిదండ్రులూ, అత్త మామలూ, తాతలూ-అమ్మమ్మలూ , ఇలా 300-400 సభ్యులుండేవారు. ఈ ఉమ్మడి కుటుంబం యొక్క ముఖ్య విషమమేమిటంటే ఆ ఇంటి పెద్ద ఆర్థిక అధికారాన్ని తన గుప్పిట్లో ఉంచుకునేవారు. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండేవారు, లేకపోతే వారు దిక్కులేనివారిగా ఉండిపోయే వారు.

ఈనాడు ప్రతీవారూ బయటకు వెళ్ళవచ్చు, లేదా ఇంట్లోనుండే పనిచేసి డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థికపరమైన బద్ధతలు అట్టే లేవు. ఇది కేవలం పాశ్చాత్య దేశాల్లోనే కాదు, మన భారతదేశంలోనూ ఉంది , ఆర్థిక స్వాతంత్రం ఎక్కువౌతున్న కొద్దీ మనుషులు ఒంటరిగా జీవించడాన్నే కోరుకుంటారు. మరొకరి పొడగిట్టదు . ఈవేళ కుటుంబమంటే భార్యా, భర్తా, పిల్లలూ, అంతే. ఒకవేళ తల్లిదండ్రులకి ఆరోగ్యం బాగా లేకపోతే కొన్నాళ్ళు చుట్టపుచూపుగా ఉండివెళతారు. ఈ విషయంలో పాశ్చాత్యులు మనకంటే ఓ ఆకు ఎక్కువే చదివారు, కుటుంబమంటే పురుఫుడో, లేక, స్త్రీనో - ఇద్దరిలో ఎవరో ఒక్కరే, ఒకవేళ ఉంటే వారి బిడ్డ, అంతే. ఇంక వయసు పైబడ్డవారికైతే ఏ మద్దతూ ఉండదు, వారు తమని తామే పోషించుకోవాలి. వైద్యసదుపాయాలిచ్చే వృద్ధాశ్రమాల్లాంటివి ఉంటాయి కానీ అందులో బాంధవ్యాలుండవు. 

చిత్తశుద్ధితో చూస్తే, మన కుటుంబాలు ఇంకా అవసరాలను బట్టే ఉంటాయని మనం ఒప్పుకోవాలి. అవసరాలు లేకపోతే మనం విడిపోతాము. అందుకే మనం ఎరుకతో కూడిన సమాజాన్ని నిర్మించువడం అవసరం, అక్కడ అందరూ కావాలని, చేర్చకునే తత్వంతో ఉంటారు. చాలా కుటుంబాలు ఇలా ఉంటున్నా, దురదృష్ట వశాత్తూ చాలామంది పోగొట్టుకుంటున్నారు.

4.మీకు వ్యక్తిగతంగా ఈ కరోనా వలన జరిగిన సత్యావిష్కరణ ఏదైనా ఉందా? మీ స్వీయచరిత్రలో మీకు ఆ మహాదేవునితో నేరుగా సంబంధం ఉందని అన్నారు. ఆ మహాదేవుడు ఈ మహమ్మారి గురించి, మానవచరిత్రలో దానికున్న స్థానం గురించి , మీతో ఏమైనా చెప్పారా?

సద్గురు: నిజానికది స్వీయచరిత్ర కాదు, మరెవరో రచించినది, అందుకే నన్ను తప్పు పట్టకండి! దేన్నైతే మీరు 'శివ' అని అంటున్నారో దానికి వైరస్ తో ఎటువంటి వైరం లేదు! వైరస్ విలయ తాండవం చేస్తున్నంతకాలం 'నా దీవెనలు నీతో ఉంటాయి' అని ఆయనంటారు. ఎందుకంటే 'జీవం' అన్నదానితో ఆయనెప్పుడూ ఉంటారు. మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ వైరస్ కూడా ఓ జీవి. అది చాలా తెలివిగా తనను తాను పది రకాలుగా జన్యు మార్పిడి చేసుకుంటూ పోయింది. మీరొకవేళ వాక్సిన్ కనిబెట్టినా, అది పది వైరస్ లలో ఏ ఒక్కవైరస్ నో చంపగలదంతే. శివుడు దాన్ని దీవిస్తాడని నేననుకుంటున్నాను. ఆయన పశుపతి. జీవానికే అధిపతి. వైరస్ ఆకారంలో మీకన్నా చిన్నదైనంత మాత్రాన ఆయన దానికీ మీకూ వ్యత్యాసం చూపించడు. అది అన్యాయం అవుతుంది. అందుకే నీ బుద్ధిని పదునుపెట్టి , నీ జీవితాన్ని బాధ్యతగా వ్యవహరించుకో, దాన్ని ఓడించు. సరిగ్గా ఆ శివుడిలాగే ఇప్పుడు సామాజిక దూరం పాటించు, ఎవరిమటుకు వారు ఏకాంతంగా ఇంటిపట్టున కూర్చుని, కళ్ళుమూసుకుని ధ్యానం చేసుకుంటే, ఈ వైరస్ మాయమవుతుంది . ప్రభుత్వం లాక్డౌన్ పెట్టడం కాదు, మీకు మీరే ఏకాంతంగా ఉండండి.



ప్రేమాశీస్సులతో,

సద్గురు