విషయ పట్టిక
1. సాధన – జీవిత తరంగాల మీద స్వారీ చేయడాన్ని నేర్చుకోవడం
2. భైరవి సాధన నుంచి చాలా ఎక్కువ ప్రయోజనాలను ఎలా పొందవచ్చు
3. భైరవి సాధన ప్రాముఖ్యత
4. భైరవి సాధనను ఏ విధంగా చూడాలి?
5. భైరవి సాధన వల్ల ప్రయోజనాలు
6. భైరవి సాధన చూపించే ప్రభావం

భైరవి సాధన 2022 కోసం నమోదు చేసుకోండి

సద్గురు: దురదృష్టవశాత్తూ ఆధునిక సమాజం అని పిలువబడే ఈ సమాజం, సాధన కాల ప్రాముఖ్యతను కోల్పోతోంది. నేడు చదువుకోని, గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే దీనిని చేస్తున్నారు. విద్యాభ్యాసం చేసిన తర్వాత, మీరు ఏదీ సరిగ్గా చెయ్యరు. ఆధునిక విద్య మనుషులని చిన్నాభిన్నం చేస్తోంది. వారు అందరి కంటే గొప్పవారమని భావిస్తారు, కానీ ప్రతి చిన్న విషయానికి గందరగోళానికి గురవుతుంటారు. నిరక్షరాస్యుడైన రైతుకు తెలిసింది కుడా వీళ్ళకి తెలియదు, కానీ వారే గొప్ప అన్న భావన వారికి. నిజానికి వాళ్ళు ఉన్నది చాలా గందరగోళంలో.

జీవన తరంగాల మీద స్వారీ చేయగల సాధనమే సాధన.

సాధన కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే, మీలోకి సహజమైన మేధస్సును పెంచడం, ఇది జీవితాన్ని సునాయాసం చేస్తుంది. సృష్టి అనేది మీరు పరిష్కరించాల్సిన ఒక సమస్య అని అనుకోవద్దు. సృష్టి ఒక సమస్య కాదు. సృష్టి ఒక మహత్తరమైన దృగ్విషయం. మీరు దానిమీద ఎక్కి తొక్కవచ్చు లేదా దాని చేత నలిపివేయబడవచ్చు. అది మీ ఇష్టం. మీరు దానిపై స్వారీ చేయగలిగితే, అది ఎవరి ఊహకు అందని ఒక దృగ్విషయం. మీరు దానిచే నలపబడితే, అది ఒక భయంకరమైన జీవనం.

సాధన – జీవన తరంగాల మీద స్వారీ చేయడాన్ని నేర్చుకోవడం.

“సాధన” అనే పదానికి అర్ధం సాధనం లేదా పరికరం. జీవిత తరంగాల మీద స్వారీ చేయగల సాధనం సాధన. నేను ఇటీవల ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాను, అక్కడ ఒక యువతిని చూసాను. ఆమె హాలు మధ్యలో కూర్చొని ఉంది, కుర్చీ మీద కాదు కానీ తన బ్యాగ్ మీద. వేలాది మంది ప్రజలు తమ ట్రాలీతో పైకి క్రిందికి నడుస్తున్నారు, ఎవరో ఒకరు విమానం కోసం పరుగెత్తుతున్నారు, ఎవరో దిగి వస్తున్నారు - కానీ ఆమె ఇవన్నీ చూసి కలవరపడలేదు. ఆమె అక్కడ ఒక చిన్న అద్దం ఇంకా ఒక చిన్న చిమటాతో (tweezer) తన కనుబొమ్మలను చాలా సమర్ధవంతంగా తీసుకుంటోంది. 

నేను ఆమె, ఆ పనిపై ఎంతగా దృష్టి పెడుతోందో అనుకున్నాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె వద్ద ఉన్నది చాలా చిన్న సాధనం. వేలాది మంది ప్రజలు తిరిగే విమానాశ్రయంలోని హాలులో ఆమె దానిని చాలా సమర్థవంతంగా ఉపయోగించుకుంది. ఒక చిన్న పరికరం నుండి అత్యున్నత స్థాయి పరికరం వరకు, దాన్ని ప్రభావవంతం చేసేవి ఏకాగ్రత ఇంకా నిమగ్నత. అయితే పరికరం యొక్క రూపకల్పన చాలా ముఖ్యం. కానీ చాలా మంది వ్యక్తులు అటు ఇటు పరిగెత్తడం వలన, మీరు చిమటాతో మీ కనుబొమ్మలకి బదులు కనుగుడ్లను బయటకు తీయవచ్చు. కాబట్టి ఈ పనిని మీరు తీవ్రమైన నిమగ్నతతో చెయ్యడం చాలా ముఖ్యం, మీరు ఆ పనికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నదే ప్రశ్న. ఇది మీ కనుబొమ్మల గురించి కాదు, మీ ఆధ్యాత్మిక ప్రక్రియ గురించి. మీరు మూడవ కన్ను పెంచుకున్నట్లైతే, ఆ కనుబొమ్మలు కూడా తీయాలి! కానీ సాధారణంగా దానికి కనుబొమ్మ పెరగదు, కేవలం కన్ను మాత్రమే!

భైరవి సాధన నుండి చాలా ఎక్కువ ప్రయోజనాలను ఎలా పొందవచ్చు

ఈ సాధన, కొద్ది ప్రయత్నంతోనే గరిష్ట ఫలితాలను ఇచ్చే విధంగా రూపొందించబడింది. సాధన అనేది చిమటా లాంటిది - మీరు దానిని ఖచ్చితంగా ఉపయోగిస్తే, అది బాగా పని చేస్తుంది. లేకపోతే మీరు దానితో మీ కనుగుడ్లను బయటకు తీస్తారు. కానీ దానిని సృష్టించబడిన ప్రయోజనం అది కాదు. మీరు దీనిని ఖచ్చితంగా ఉపయోగించే మార్గం ఇంకా దాని పట్ల మీ నిమగ్నత, ఏకాగ్రత స్థాయిలను బట్టి అది మీకు ఫలితాలను ఇస్తుంది. సాధనం ముఖ్యమైనది, కానీ మీరు దానిని ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. స్క్రూడ్రైవర్‌తో ఏదైనా బిగించమని నేను మిమ్మల్ని అడిగితే, మీరు తప్పు వైపుని అందులో పెట్టినట్లయితే, మిమ్మల్ని మీరు దానితో పొడుచుకోవడం మాత్రమే జరుగుతుంది.

భైరవి సాధన చాలా సులభమైనది. మేము దానిని మరింత క్లిష్టంగా చేయవచ్చు, కానీ మేము దానిని చాలా అధునాతనంగా ఇంకా సంక్లిష్టంగా చేస్తే, చాలా మందికి అది అర్థం కాదు. సరళంగా ఉందని మోసపోకండి. మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పించుకుంటే, అది మీకు ఊహించలేని ఫలితాలను ఇస్తుంది. జీవితానికి అంతే అవసరం, ఎందుకంటే మనం దానిని సృష్టించాల్సిన అవసరం లేదు - అది ఇప్పటికే ఉంది. మనము దానిని సాధ్యమైనంత తీవ్ర స్థాయిలో సజావుగా ఇంకా సమర్ధవంతంగా పనిచేసేలా చేయాలి. మీరు జీవితాన్ని తయారు చేయవలసి వస్తే, అది వేరే రకమైన సవాలు అవుతుంది. అన్నీ ఉన్నాయి. మీరు వాటిని సరిగ్గా ఉంచాలి. అంతే. అది సాధనతో జరుగుతుంది.

భైరవి సాధన యొక్క ప్రాముఖ్యత

ఈ సాధన ఉద్దేశపూర్వకంగా, కొంత మీకు నచ్చే విధంగా, కొంత మీకు నచ్చని విధంగా రూపొందించబడింది. ఏది మిమ్మల్ని విరగ్గొట్టదో లేదా వంచదో, అదే మీకు సౌకర్యంగా ఉంటుంది. కానీ మీకు ఏది నచ్చదో అది చాలా ముఖ్యమైనది. వందశాతం నిమగ్నతతో నచ్చినవి చేస్తుంటే, నచ్చనివి రెండు వందల శాతం నిమగ్నతతో చేయాలి.

వందశాతం నిమగ్నతతో నచ్చినవి చేస్తుంటే, నచ్చనివి రెండు వందల శాతం నిమగ్నతతో చేయాలి.

ఉదయాన్నే వేప ఉండ తింటున్నారా? బహుశా మీరు దానిని గొంతులో వేస్కొని, నీళ్లు త్రాగుతున్నారు. మీరు దానిని మీ నోటిలో పెట్టుకుని నమలాలి. వేప ఉండకి బదులుగా, మేము మీకు రసగుల్లాను ఇవ్వగలము. కానీ మీరు పూర్తి అవగాహన లేకుండా రసగుల్లాలను తింటారు. మేము మీకు రసగుల్లాల డబ్బా ఇస్తే, కొంత సమయం తరువాత, మీరు ఎన్ని తిన్నారో కూడా మీకు తెలియదు. అయితే మీరు ఎన్ని వేప ఉండలు తిన్నారో మరిచిపోతారా? “నువ్వు రెండు వేప ఉండలు తిన్నావు” అని ఎవరైనా అంటే, “లేదు, నేను మూడు తిన్నాను!” అంటారు. వేప చాలా ప్రయోజనకరమైనది, కానీ అన్నింటికంటే మించి, మీకు నచ్చని విషయాలు మిమ్మల్ని జీవితంలో చాలా అప్రమత్తంగా చేస్తాయి.

మీ ఇష్టాలు ఇంకా అయిష్టాలు కేవలం ఆలోచనల వరకు మాత్రమే. "నేను ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాను" అని మీరు అనుకోవచ్చు. మరుసటి క్షణం, "నేను ఈ వ్యక్తిని ద్వేషిస్తున్నాను" అని మీరు అనుకోవచ్చు. ఆ స్వేచ్ఛను మీరు అనుమతించారు. “నేను ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నాను” అని మీరు అనుకుంటే అది నిజం అవుతుంది. "నేను ఈ వ్యక్తిని ఇష్టపడను" అని మీరు అనుకుంటే, అది కూడా నిజమే అవుతుంది. అన్నింటిని మించి, ఇది కేవలం ఒక ఆలోచన - కనీసం మీరు ఆహ్లాదకరంగా ఆలోచించగలగాలి. సాధన అంటే మీరు శరీరం, మనస్సు, వాక్కు, వినికిడి ఇంకా చూడగలిగే పరికరాలను అర్ధం చేస్కోవడం. ఇవన్నీ మీ పరికరాలు. మీరు వాటిని ఎలా ఉపయోగిస్తారో అది మీ పని. మీరు వాటిని మీ శ్రేయస్సు కోసం ఉపయోగించవచ్చు లేదా ఒక స్వంత నరకాన్ని నిర్మించుకోవడానికి వాటిని ఉపయోగించవచ్చు.

భైరవి సాధనను ఏ విధంగా చూడాలి?

ఈ సాధన సమయంలో, ప్రతి శ్వాస, ప్రతి అడుగు ఇంకా ప్రతి హృదయ స్పందన ఎరుకతోఉండాలి. సాధారణ విషయాలు ఎంత ముఖ్యమైనవిగా ఉంటాయో ఇంకా ఈ సాధారణ విషయాలు ఎంత గొప్ప పనులు చేయగలవో మీకు అప్పుడే తెలుస్తుంది. ఇలాంటి సాధారణ విషయాలు అద్భుతాలు చేశాయి. పరమాణువులే మొత్తం విశ్వాన్ని నిర్మించాయి. మీరు వాటిని మైక్రోస్కోప్‌లో కూడా చూడలేనంత చిన్నవి. మనము వాటిని విస్మరించవచ్చు, కానీ ఈ భూమి విశ్వం ఇంకా ప్రతిదాన్ని అవి సృష్టించాయి. ఈ సాధారణ విషయాలను విస్మరించవద్దు. ఈ సాధారణ విషయాలను విస్మరించడం వల్లనే జీవితం సంక్లిష్టంగా మారింది. మీరు అలాంటి సాధారణ విషయాలపై శ్రద్ధ వహించినట్లయితే, జీవితం అద్భుతంగా మారుతుంది.

ఎలా కూర్చోవాలి, నిలబడాలి ఇంకా ఊపిరి పీల్చుకోవాలి - ఈ సాధారణ విషయాలపై మీరు శ్రద్ధ పెట్టండి. జీవితం ఒక అందమైన ప్రక్రియ అవుతుంది. సాధన అంటే అదే. మీ జీవితంలో ఉన్న ఏకైక ఆకాంక్ష ఏమిటంటే, మీరు మీ జీవితాన్ని సాధ్యమైనంత ఉన్నతంగా జీవించాలి అని; లేకుంటే విలువ లేని జీవితం అయిపోతుంది. నేను అత్యున్నతమైనదిగా దేనిని భావిస్తున్నానో, మీరు దానిని చేయవలసిన అవసరం లేదు. కానీ కనీసం మీరు అత్యున్నతమైనదిగా భావించేది జరగాలి. మీరు ఉన్నతమైనదిగా భావించే దాని కోసం ఆశపడకపోతే, అది వ్యర్థ జీవితం అవుతుంది. జీవితాన్ని వృధా చేయవద్దు ఎందుకంటే జీవితంలో అత్యంత విలువైనది జీవితమే - వజ్రాలు, ఆస్తి లేదా డబ్బు కాదు. మీరు దీన్ని ఇప్పుడు అర్ధం చేసుకుంటారా లేదా మీ చివరి శ్వాస తీసుకుంటున్నప్పుడు మరణశయ్యపై చేస్తారా? మీరు ఎలాగైనా ఒక రోజు దాన్ని పొందుతారు. ఈ రోజు మంచి రోజు అని నేను అనుకుంటున్నాను.

భైరవి సాధన వల్ల ప్రయోజనాలు – మీ భావోద్వేగ మేధస్సును మెరుగుపరుచుకోండి

సాధన అనేది మీ భావోద్వేగపరమైన మేధస్సును శక్తివంతం చేసే దిశగా ఉంటుంది. నేడు ప్రపంచంలో, "మేధస్సు" అనే పదం ఐ.క్యూ. గా గుర్తించబడింది. ఐ.క్యూ. అంటే, "నేను క్యూలో నిలబడతాను" అని. అంటే మీరు ఎప్పుడూ ఒకరి వెనుకే ఉంటారు. ఎందుకంటే బుద్ధి స్వభావం ఎప్పుడూ ఒకరిని అనుకరించటానికి ఇంకా ఒకరి కంటే ముందు ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒకరి కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవడం కూడా ఒకరిని అనుకరించడమే. ముఖ్యంగా, మనం కోతుల కంటే కొంచెం మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నామని దీని అర్థం - అది పరిణామం.

సాధన అనేది మీ భావోద్వేగ మేధస్సును శక్తివంతం చేసే దిశగా ఉంటుంది.

ప్రస్తుతం, చాలా మంది మానవులకు, సమాచార బ్యాంకు ఉంటే తప్ప తెలివి అనేది పనికిరాని సాధనం. సమాచారం లేకుంటే, చాలా మందికి తమ తెలివితేటలను ఎలా ఉపయోగించాలో తెలియదు. భావోద్వేగపరమైన మేధస్సుకు ఉన్న స్వభావం ఇది కాదు. దీనికి ఎలాంటి సమాచారం అవసరం లేదు. ఇది అన్నింటినీ స్వీకరించి, దానిని తెలుసుకోగలదు. ఇది జీవితంలో దాని మార్గంలో అది అనుభూతిని పొందుతుంది. ఇది ఒకరి వెనుక క్యూలో నిలబడవలసిన అవసరం లేదు, ఒకరి కంటే మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం జీవితంతో అంతర్భూతమవడం, విచ్ఛేదనం ద్వారా కాకుండా ప్రమేయం ద్వారా జీవితాన్ని తెలుసుకోవడం. బుద్ధికి, భావావేశానికి ఉన్న తేడా ఇదే. బుద్ధి ప్రతిదీ తెరిచి, విచ్ఛేదనం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. భావోద్వేగం ఆలింగనం ద్వారా, చేర్చుకోవడం ద్వారా విషయాలను తెలుసుకుంటుంది.

సాధన అనేది మీ భావోద్వేగ మేధస్సును పెంపొందించుకోవడం కోసం, ఎందుకంటే ఇది పనులు చేయడానికి చాలా సులభమైన మార్గం. మీరు దైవాన్ని విచ్ఛేదనం చెయ్యాలి అనుకుంటే, అది అంత మంచి విషయం కాదు ఇంక దానితో మీరు ఎక్కడికీ వెళ్ళలేరు. ఆలింగనం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. మీరు ఎవరినైనా ఆలింగనం చేసుకున్నప్పుడు, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడానికి కూడా అనుమతిస్తున్నారు; లేకుంటే అది జరగదు. భక్తి అంటే అంతే. భక్తి అనేది పరమాత్మని విచ్ఛేదనం చేయడం కాదు; ఇది దైవంతో కలసి నృత్యం చేయడం ఇంకా దైవంతో ఒకటి కావడం.

భావోద్వేగ మేధస్సు అంటే మీరు బాగా జీవించగల సామర్థ్యం మీ సహజ స్వభావంలోనే ఉంది, మీరు ఒకరి కంటే మెరుగైనవారు కాబట్టి కాదు. ఇందులో ఎలాంటి శ్రేణి లేదు. "ఈ వ్యక్తి అవతలి వ్యక్తి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు" అని ఎవరూ నిర్ణయించలేరు. భావోద్వేగ మేధస్సుకు పరిమాణాలు వర్తించవు. పరిమాణాలు వర్తించనప్పుడు, అధికం ఇంకా స్వల్పం, పెద్ద ఇంకా చిన్న అదృశ్యం అయిపోతాయి; జీవితం అంటే ఏంటో అదే అవుతుంది. మీకంటే చీమ జీవితం ముఖ్యమా లేక చీమ కంటే మీ జీవితం ముఖ్యమా? చీమ కూడా తన జీవితాన్ని, మీ జీవితాన్ని మీరు ఎంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారో అలానే పరిగణిస్తుంది - బహుశా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. 

బుద్ధి ఎల్లప్పుడూ ఒకదానికి మరొకదాన్ని ప్రతికూలముగా పెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ బుద్ధి సంఘర్షణను సృష్టిస్తుంది, మీ భావోద్వేగం దీనిని ఒకచోట కలుపుతుంది. కానీ భావోద్వేగం బుద్ధిని అనుసరిస్తే, భావోద్వేగం కూడా ఘోరమైన సంఘర్షణగా మారుతుంది. మీ బుద్ధి భావోద్వేగాన్ని అనుసరిస్తే, సంఘర్షణ ఉండదు; ప్రపంచంలో మాధుర్యం ఉంటుంది. ప్రపంచంలో అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. భైరవి సాధన తప్పనిసరిగా ఆ దిశగానే ఉంటుంది. ఇది ఒక సాధారణ రూపకల్పన, కానీ మీరు దానికి మిమ్మల్ని సమర్పించుకుంటే, అది మీకు అద్భుతాలు చేయగలదు.

భైరవి సాధన ప్రభావం

ఈ ఇరవై ఒక్క రోజులలో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, మీరు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న అన్ని స్థలములను శుద్ధి చేసుకున్నట్టే. దీని వల్ల దేశం ఇంకా ప్రపంచం ఎంతో ప్రయోజనాన్ని పొందుతాయి. ఇంకా భక్తి అనేది ఇరవై ఒక్కరోజుల పని కాదు. మీరు ప్రతిరోజూ దానిలో మునిగితేలుతూ ఉండాలి. ఇది మీరు చేసే ఒక పని కాదు; ఇది మీరు జీవించే శైలి. ఇది మీ శ్వాస లాంటిది. భైరవి అనుగ్రహం మీ హృదయంలో స్థిరపడినట్లయితే, మీరు విజయం లేదా వైఫల్యం, శ్రేయస్సు లేదా పేదరికం ఇంకా ఆ మాటకి వస్తే జీవితం లేదా మరణం గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. భగవంతుని ఒడిలో ఉన్న వ్యక్తికి, ఈ విషయాలన్నీ కేవలం అల్పమైనవి, వాటికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. ఈ ప్రక్రియ మిమ్మల్ని నిజంగా ఆ విధంగా నిమగ్నం చేయాలి.

Editor's Note:  Click here to register for Bhairavi Sadhana 2022.