ప్రశ్న: సద్గురు, మనం కైలాసానికి ప్రయాణికుల్లా వెళితే ఆ కొండ ప్రదేశాన్ని ఇంకాస్త ఆరగగొడతామనీ, అదే భక్తుల్లా వెళితే మనలోనున్నది ఎదో కాస్త అరుగుతుందనీ అన్నారు. కైలాస యాత్రకు సన్నద్ధం అవ్వాలంటే ఏవేవి వదిలేయాలి. 

సద్గురు: "నేను" అని మీరు పిలిచేది దేన్ని? మీరు నిజమైన వస్తువు కాదు. ‘మీరు’ మీ అనుభవాల, జ్ఞ్యాపకాల, బంధాల, అర్హతల ఇంకా చెప్పాలంటే మీ ఫేస్ బుక్ అకౌంట్ల ఒక సమాహారం! ‘మీరు’ ముక్కలు చెక్కలుగా ఉన్నారు. మీరివన్నీ పక్కనబెట్టి, జీవమున్న ఒక పదార్ధంలా నడవటం నేర్చుకోవాలి. మీ తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబం, మీ కాలేజీ   మీ అర్హతలు  – వీటిల్లో నుంచి సంక్రమించనిది ఎదో మీలో ఒకటి ఉంటుంది. దాన్ని అలంకరించటానికే మనం ఒక శరీరాన్ని పొంది, దానికి అన్ని హంగులూ చేర్చాం. కానీ ఇప్పుడా అలంకారాలు ఎంత ఎక్కువ అయిపోయాయంటే మనం అసలు దేన్ని అలంకరిస్తున్నామో దాన్ని మర్చిపోయాం.

జీవితాలంకరణ

జీవితంలో ఎవరు ఏమిచేస్తున్నా సరే - కొందరు సాయంత్రాలు తాగుతారు, కొందరు మాదక ద్రవ్యాలు తీసుకుంటారు, కొందరు గుడిలో కూర్చుని భజన గీతాలు పాడుకుంటారు, కొందరు ధ్యానం చేస్తారు, కొందరు కైలాష్ కి వెళ్ళాలనుకుంటారు, కొందరు డబ్బు సంపాదించటంలో మునిగి ఉంటారు. ప్రతి మనిషీ తన తరహాలో తన జీవితాన్ని మెరుగుపరచటానికే ప్రయత్నిస్తాడు. వారు చేసే పనులు అందుకేనని వారు నమ్ముతారు. జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికి అలంకరణను ఒక మార్గం అనుకుంటున్నాం మనం. మీరొక జత బట్టలు వేసుకుంటే బావుంటుంది. కొండ ప్రాంతంలో ఉన్నప్పుడు వాతావరణం వల్ల ఒకదాని మీద ఒకటి నాలుగు వేసుకోవలసి రావచ్చు. కానీ ఉన్నాయి కదా అని పాతిక జతల బట్టలు వేసుకుంటారా మీరు? పన్నెండు జతల చెప్పులు వేసుకోగలరా ? మనం అలంకరిస్తున్న దానికన్నా మనం చేస్తున్న అలంకరణలే మనకు ముఖ్యం అయిపోయి, ఎక్కువ అలంకరణతో మనం మెరుగౌతామని నమ్మటం మొదలెట్టాం మనం.

వస్తువులను సౌలభ్యం తీసుకురావచ్చేమో కానీ వాటివల్ల జీవితం మెరుగుపడదు. “వస్తువులు” అంటే నా ఉద్దేశం అన్నీ. మనుషులు, బంధుత్వాలు ఇంకా మీది అని మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ. మీరివన్నీ జీవితానికి చేర్చింది, మీ జీవితాన్ని మెరుగుపరుస్తాయనే ఉద్దేశంతోనే. దీనితో, అంతా బావుందని మీకొక అబద్ధపు భావం కలుగుతుంది. వాటిలో ఒకటి ముక్కలైతే మిమ్మల్ని నైరాశ్యం ఆవరిస్తుంది.

చిన్నప్పటి నుండీ “పక్షపాతం” అనే విషం మనలో రకరకాలుగా ఎక్కించబడుతుంది.
ఎవరైనా ఒక మనిషి చనిపోతే, ఆ వ్యక్తి మీకు చాలా ప్రియమైన వారైతే, ఉన్నట్టుండి మీ ప్రపంచమంతా విచ్చిన్నమైనట్టనిపిస్తుంది.అసలు జరిగింది ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఏడులక్ష కోట్ల మనుషుల్లో ఒకరు తగ్గారు అంతే. ఇది వింటే చాలా కర్కశంగా, భావరహితంగా, మొరటుగా అనిపిస్తుంది కానీ అది కాదు విషయం. నాకు భావోద్వేగాలు లేవనుకోకండి. నాకు మనుషులతో అద్భుతమైన అనుబంధాలు ఉన్నాయి. కానీ ఒకరు చనిపోతే ప్రపంచమంతా బద్దలైనట్టుండి, మరొకరు చనిపోతే ఏమీ అనిపించదు ఎందుకని?. చిన్నప్పటి నుండీ “పక్షపాతం” అనే విషం మనలో రకరకాలుగా ఎక్కించబడుతుంది. "మనం ముగ్గురం(కుటుంబం) ఒకటి, మిగతా వాళ్ళంతా మనవాళ్ళు కారు" అని చెప్పారు మీకు. “ఇదే కుటుంబమంటే”- అన్నారు. ఇది మొదటి నేరం. ఆ తర్వాత దానికి సమాజం, మతం, జాతి, వంశము అంటూ ఎన్నో అదనపు తొడుగులు. ఇదంతా చేసి మనుషులంతా కొట్టుకుంటున్నారనీ, ఉన్మాదం ఎక్కువైందనీ వాపోతుంటాం. మనం నిర్మించుకుంది అదే మరి.

ఇటుకలకూ బంగారానికీ తేడా లేదు

ఒక కట్టడం అందంగా ఉన్నా లేకపోయినా పరవాలేదు. సమస్యేంటంటే మీరొక టన్ను ఇటికెలు మీ తల మీద మోస్తున్నారు. అది మీ తలమీదున్నప్పుడు బరువు బరువే. ఒకవేళ నేను మీకొక టన్ను బంగారం ఇస్తే అది మీ నెత్తి మీద పెట్టుకుంటారా? మీరు మోసేది బంగారమా లేదా బండరాయా అనేది ముఖ్యం కాదు, మోస్తున్నప్పుడు అది మీ తల మీద బరువుగా ఉంది అంతే. అది మిమ్మల్ని అణిచివేసి చంపేస్తుంది. మీరు మోస్తోంది అందమైంది లేదా అసహ్యమైంది అయినా సరే ఏదీ ఆగదు. అది దేనిమీదైతే ఉందో దాన్ని అణిచి చంపేస్తుంది.

విషాన్ని వడబొయ్యటం

మిమ్మల్ని మీరు మొయ్యటం అంటే, మీరు నిర్మించుకున్న అబద్ధపు సౌధాన్ని మోస్తున్నట్టే. మీరు నిర్మించుకున్న వ్యక్తిత్వం, మీరు బాహ్య ప్రపంచం నించీ పోగేసుకున్న చిన్న చిన్న వస్తువుల సమ్మేళనం. అది ఎప్పటికీ మీరు కారు..కాలేరు. ప్రస్తుతానికి “అది మీరు” అని మీరు అనుకుంటున్నారంతే. అందులో ఒక భాగం తీసేస్తే, మీలో ఒక ముఖ్య భాగం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది మీకు. దీనివల్ల మనుషులు ఎంతో దుఃఖం ఇతరత్రా అనుభవిస్తూ తమ అస్థిత్వాన్ని పూర్తిగా పోగొట్టుకుంటున్నారు. కానీ మీరు మీ మస్తిష్కాల్లో నిర్ణయించుకుంది ఇదే., అది మిమ్మల్ని పూర్తిగా నాశనం చేసేంతగా దాన్ని మీరు నమ్ముతారు. శివునిది విషకంఠం అంటున్నాం అంటే అర్ధం, ఆయన విషాన్ని గొంతులోనే వడబోస్తారనమాట. విషం అనేది కేవలం మీరు తినే, తాగే వస్తువుల ద్వారానే మీ శరీరంలోకి ప్రవేశించదు. కేవలం ఒక ఆలోచన, ఒక ఉద్దేశం, ఒక గుర్తింపు, ఒక భావోద్వేగం, మీ పూర్తి జీవితంలో విషాన్ని నింపగలదు. మీ జీవితంలో విషాన్ని నింపినవి ఏవి? మీ జీవితాన్ని నాశనం చేసే వాటినే మనం విషం అంటాం.

మీ ఉద్దేశాలు, ఆలోచనలు, భావోద్వేగాలు, గుర్తింపులూ కలిసి మీ జీవితాన్ని ఎన్ని రకాలుగా నాశనం చేస్తున్నాయో ఆలోచించారా? మీకున్న మానసికమైన కొరతలు తీర్చుకోవడానికి ఇవన్నీ తగిలించుకుని బలంగా మారాం అనుకుంటున్నారు. అలాంటిదేమీ ఉండదు. ఒకానొక సమయంలో వాటివల్ల మనకి నిండుదనం వచ్చిందనిపిస్తుంది. కానీ తప్పకుండా ఒకానొక స్థాయిలో అవి మీకు విరక్తి కలిగిస్తాయి లేదా చివరికి మరణం మీ అపోహలు తొలగిస్తుంది. ఎదో ఒక మార్గంలో అది జరిగి తీరుతుంది. అంటే దీని అర్ధం మనుషుల భావాలకీ భావోద్వేగాలకీ విలువ లేదనా? మీరు వీలైనంత లోతుగా దీన్ని అర్ధం చేసుకోండి. మీకు ప్రస్తుతం ఏది ముఖ్యం? మీ భావోద్వేగమా మీ ఆలోచనలా లేక మీ జీవితమా? జీవితం. అంతే కదా?. కేవలం ఒక ఆలోచనకో, భావోద్వేగానికో లోబడి మీరు చనిపోవాలనుకుంటున్నారు. అంటే మీరు జీవితాన్ని తలకిందులుగా చూస్తున్నట్టే. ఏమాత్రం భయం లేని వాడు మాత్రమే జీవించి ఉండటానికి మిగిలిన అన్నిటినీ విరమించుకుంటాడు. ఇక్కడ ఒక జీవం ఉండటం వల్లనే కదా, ఈ ఆలోచనలూ, భావోద్వేగాలు, శరీరం, బట్టలు, బంధాలు, అన్నిటికీ విలువ!! మీరు పరిణామాన్నే కారణంగా భ్రమపడితే, ఒక విత్తనాన్ని వేసే బదులు మీరొక చెట్టుని తలకిందులుగా పాతినట్టే.

కాశీ యాత్ర

మన దేశంలో ఒక సంప్రదాయం ఉంది, మీరు వినే ఉంటారు.ఇవాళ మీరు కాశీ వెళితే రైల్లోనో, విమానంలోనో, ఇతర వాహనంలోనో వెళతారు. కానీ ఇది వరకు రోజుల్లో నడిచే వెళ్ళే వారు. ఈ రోజుకీ మన భారతదేశంలోని పెళ్ళిలో లాంచనంగా కాశీయాత్ర ఉంటుంది. పెళ్లి చేసుకోబోతూ పెళ్ళికొడుకు కాశీకి పోతానని అంటాడు. దానర్ధం ఏంటంటే, “నాకీ భవబంధాలు వద్దు, నేను అసలైన దాన్ని తెలుసుకోవటానికి వెళతానని అర్ధం”. అయినా సరే అతన్ని మురిపించి పెళ్లి చేస్తారు. ఈ కాశీ యాత్ర ప్రాముఖ్యత ఏంటంటే, మనుషులు ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి ఎప్పటినించో ప్రయత్నం చేస్తూనే ఉన్నారని తెలియజేయటం.

ఎవరైనా సుమారు రెండు మూడు వేల కిలోమీటర్లు నడవాలంటే దానికొక ఉన్నత ప్రయోజనం ఉండాలి కదా, ఆ విషయం వారిలో ఎంతో దృఢoగా ఉండేది. వాళ్ళు ఆ జిజ్ఞ్యాసలో అలా నడిచి వెళ్ళిపోయేవారు.చాలా దూరం కాబట్టీ, తిరిగి రావటం దాదాపు అసాధ్యంగా ఉండేది. చాలా అరుదుగా మాత్రమే కాశీ వెళ్ళినవారు తిరిగొచ్చేవారు. మరికొందరు, కొంత వయసు వచ్చాక వెళ్లి ఇక తిరిగి వచ్చేవారు కాదు. అందుకే ఈ రోజుకీ మనలో కాశీలో పోవాలనే ఆ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ప్రక్రియంతా ఏమి చెబుతోందంటే, ఎక్కడో “మనం ఏంటి? మనం పోగుచేసుకునేది ఏంటి” అనే విషయాల మధ్య వ్యత్యాసం తెలుసుకొమ్మని.

తేలికగా నడవండి

మీరు కొండల్లో నడవాలనుకుంటే, ఎంత తక్కువ బరువుంటే అంత మంచిది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎక్కుతున్నప్పుడు మీరు కొంత సామాను విసిర పారేస్తారు. ఏది పడేయ్యాలో నిర్ణయించుకోండి. అది మీకు నేను చెప్పను. ఏది ఎక్కువగా ఉందో అది ఇప్పుడే తీసేయండి. ఎందుకంటే పైకి ఎక్కుతున్నప్పుడు కాస్త బరువు కూడా మీకు ఎక్కువైపోతుంది. తేలిగ్గా నడవండి, తక్కువ సరంజామాతో నడవండి, ఎందుకంటే అక్కడి గాలి పలచన. ఎక్కువ బరువుతో మీరు నడవలేరు. ఇవాళ్టి రాత్రి నిద్రపోయేముందు ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, కళ్ళు మూసుకుని మీ చిన్నప్పటినించీ పోగు చేసుకున్న ఆలోచనలూ, భావోద్వేగాలూ, వస్తువులూ, బంధాలు అన్నీ చూడండి. ఏదైతే మీకు ఎక్కువగా అనిపిస్తుందో, అది మీ టెంటు అవతల పారేయండి. రేపు ఉదయమే మనం నడుద్దాం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు