సద్గురు: చాలా మందికి, జీవితంలోని అనుబంధాలే వారి జీవిత బాగోగులను నిర్ధారిస్తాయి. సంబంధాలు మీ జీవితంలో అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నప్పుడు వాటిని మనం పరిశీలించవలసి ఉంటుంది. అసలు ఈ అనుబంధాలకు మూలం ఏమిటి? అసలు వారికి వాటి అవసరం ఏమిటి? ఈ సంబంధాలు ఎన్నెన్నో స్థాయిల్లో ఉంటాయి. ఒక్కొక్క అవసరాన్ని తీర్చడానికి ఒక్కొక్క సంబంధం ఉపకరిస్తుంది. అవసరాలు భౌతికమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు, ఉద్వేగపరమైనవి, సామాజికమైనవి, ఆర్థికమైనవి, రాజకీయమైనవి ఏ విధమైనవైనా కావచ్చు.

ఆ సంబంధపు స్వభావం ఎటువంటిదైనా, ఏ రకమైనదైనా, దాని ప్రాథమిక అంశం ఏమిటంటే, మీ ఒక అవసరాన్ని తీర్చటం కోసం. ‘‘లేదు నేను తీసుకోవలసినది ఏమీలేదు, ఇవ్వ వలసినదే ఉంది” అంటే ‘‘ఇవ్వటం కూడా తీసుకోవటం వంటి ఒక అవసరమే! ‘‘నేను ఒకరికి ఏదో ఇవ్వాలి” – ఇదికూడా “ నేను ఒకటి పొందాలి” వంటి అవసరమే! ఇక్కడ ఒక అవసరం ఉంది. అవసరాలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో, సంబంధాలు కూడా అంతే వైవిధ్యంతో ఉంటాయి.

మానవునిలో ఏదో అసంతృప్తి, అసంపూర్ణత ఉండటం వల్ల వారి అవసరాలు పెరిగిపోతున్నాయి. తమలో ఏదో సంపూర్ణత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం కోసం మానవులు అనుబంధాలను ఏర్పరచుకుంటున్నారు.మీకు మీకు ప్రియమైన వారు ఎవరితోనైనా సత్సంబంధం ఏర్పడి ఉంటే మిమ్మల్ని మీరు సంపూర్ణంగా భావించుకుంటారు. అటువంటిది ఏదీ లేనప్పుడు అసంపూర్ణంగా అనిపిస్తుంది.అలా ఎందుకు జరుగుతుంది? ఈ జీవితం దానికదే సంపూర్ణమైనది. ఇలా ఎందువల్ల అసంపూర్ణంగాభావిస్తున్నారు. మరొక జీవితంతో ముడిపెట్టుకొని సంపూర్ణత్వాన్ని పొందాలనుకుంటున్నారు? అసలు విషయం ఏమిటంటే మనం ఈ జీవితాన్ని దాని లోతుపాతులు పూర్తిగా అనుభూతి చెందలేదు. మూలం అదేయినప్పటికీ, అనుబంధాలు అనేవి ఏర్పడటంలో ఒక సంక్లిష్టత ఉంది.

ఆకాంక్షలకు మూలం

అనుబంధం ఉన్నచోట ఒక ఆశ ఉంటుంది. చాలా మంది పెంచుకొనే కోర్కెలు ఎలా ఉంటాయంటే ఈ భూప్రపంచంలో ఎవరూ వాటిని తీర్చలేరు. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో ఆ ఆశలు ఎంతగా ఉంటాయంటే మీరు ఒక దేవుడినో, దేవతనో వివాహమాడినా వారు వాటిని తీర్చడంలో విఫలమవుతారు. మీకు మీ ఆకాంక్షలగూర్చి, వాటి మూలంగూర్చి తెలియనప్పుడు,మీరు వాటిని తీర్చలేరు. కాని, మీకు వాటి మూలం తెలిసినప్పుడు చక్కని అనుబంధాలను ఏర్పరచుకో గలుగుతారు.

ప్రాథమికంగా మీరు ఎందుకు అనుబంధాలను ఏర్పరచుకోవాలని అనుకుంటారు? ఎందుకంటే ఏ అనుబంధమూ లేకుంటే మీ జీవితంలో కృంగిపోతారు. మీరు ఆనందంగా ఉండటానికి ఒక అనుబంధాన్ని కోరుతున్నారు. మరో విధంగా చెప్పాలంటే మీరు మరొక వ్యక్తిని మీ ఆనందానికి వనరుగా భావిస్తున్నారు. మీరు మీ స్వాభావికంగానే ఆనందంగా ఉన్నప్పుడు అనుబంధాలు మీకు ఆనందాన్ని వ్యక్తం చేసేమార్గాలు అవుతాయి, అంతేకాని ఆనందం వెతుక్కునే ప్రదేశాలు కావు. ఎవరిద్వారానో ఆనందాన్ని పిండుకొనే ఉద్దేశంతో మీరు ఉన్నప్పుడు, అవతలి వ్యక్తీ మీ నుండి ఆనందాన్ని పిండుకోవాలని చూస్తున్నప్పుడు కొంత కాలం గడిచేసరికి అది బాధాకరమైన సంబంధంగా పరిణమిస్తుంది. కొంతకాలం ఎదో తృప్తి కలుగుతోంది కాబట్టి బాగానే ఉంటుంది. అలా కాక మీ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవటానికి అనుబంధాలను పెంచుకుంటే మీ గురించి ఎవరికీ పిర్యాదు చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇతరులనుండి ఆనందాన్ని పొందేందుకు కాక మీరు ఆనందాన్ని వ్యక్తం చేసే కార్యక్రమంలో ఉంటారు.

మీ జీవితం సంతోషాన్ని వెతుక్కునేదిగా కాక ఆనందాన్ని పంచుకునేది అయినప్పుడు మీకు ఉన్న అనుబంధాలన్నీ అద్భుతంగా ఉంటాయి. మీకు కోటి అనుబంధాలు ఉన్నా అన్నీ బాగానే నడుస్తాయి. మీరే ఆనంద స్వరూపులుగా ఉన్నప్పుడు ఇతరుల కోరికలను నేరవేర్చడమనే సర్కస్ చేసే పనే లేదు. ఎందుకంటే ఆ ఇతరులు మీతోనే ఉండాలని అనుకుంటారు. సంతోషాన్ని వెతుక్కునే క్రమం నుండి బయటపడి, ఆనందాన్ని వెదజల్లే స్థితికి వచ్చినప్పుడే అనుబంధాలు అన్ని స్థాయిల్లోనూ బాగుపడతాయి. ఎందుకంటే అనుబంధాలు పలురకాలు.

పలు రకాల అనుబంధాలు:

మీ శరీరం అనుబంధాలను కోరే విధంగా తయారు అయింది.మీ మనసుకూడా ఇంకా ఏదో ఒక అనుబంధాన్ని కోరుతూనే ఉంటుంది. మీ మనోభావాలు ఎలా ఉంటాయంటే వాటికి కూడా అనుబంధంతో అవసరం ఉంది. ఇంకా లోతుగా ఉండే మీ శక్తులన్నీ కూడా అనుబంధాన్ని కోరే స్థాయిలోనే ఉంటాయి. మీ శరీరం అనుబంధాన్ని కోరుతూ ఉంటే దాన్ని లైంగికత అంటాము.మీ మనసు అనుబంధాన్ని కోరితే దాన్ని సాహచర్యం అంటాము.మీ ఉద్వేగాలు అనుబంధాన్ని కోరితే దాన్ని ప్రేమ అంటాము.మీ శక్తులకు ఒక అనుబంధం కావలసి వస్తే దాన్ని యోగం అంటాం.

మొత్తం మీద లైంగికత అయినా, సాహచర్యం అయినా, మనోభావాలు, యోగం అయినా, మీరు మరొకదానితో ఏకం కావటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నస్థితి మీకు సరిపోవటం లేదు. ఇతరులతో మీరు ఏకమవటం ఎలా సాధ్యం? భౌతికంగా మీరు ప్రయత్నించారు, ఒకటి అయినట్లుగా అనిపిస్తుంది కాని విడిపోవటం కూడా జరిగిపోతుంది.మానసికంగా ప్రయత్నించారు, ఒకటి అయినట్లుగా తోచినా ఏ రెండు మనసులు ఒకటిగా ఉండలేవని మీకు అర్థం అయిపోతుంది. మనోభావ పరంగా కూడా అంతా సరిగా ఉన్నట్లే ఉంటుంది, కానీ విభేదాలు త్వరగానే వస్తాయి.

ఇలా దేనితోనో ఒకటై పోవాలనే కోరిక తీరే మార్గం ఏమిటి? దాన్ని ఎన్నో విధాలుగా చూడవచ్చు. మీ జీవితంలో ఎప్పుడో గొప్ప ఆనందాన్ని పొందినప్పుడు ప్రేమను పొందినప్పుడు, మీ శక్తులన్నీఉద్దీపితమై ఉల్లాసంగా ఉన్నప్పుడు మీలో ఏదో విస్తరించినట్లు అనిపించటాన్ని మీరు గమనించే ఉంటారు. విస్తరణ అంటే ఏమిటి? అంతకంటే ముందు మీరు ‘నేను’ అనుకుంటున్నది ఏమిటి? ఇది నేను, ఇది నేను కాదు అని ఎలా నిర్థారిస్తారు? అది కేవలం మీ స్పర్శ. అవునా? మీ స్పర్శ జ్ఞానానికి లోబడినది మీరు. ఆ పరిధికి అవతల ఉన్నది ఇతరులు. ఇతరులంటే నరకమే కదా! మీకు నరకబాధ వద్దు, అందుకే అందువల్ల అందులో స్వల్పభాగాన్నైనా మీదిగా చేసుకొని అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటారు.ఈ విధంగా ఎవరినో ఒకరిని మీ జీవితంలో భాగంగా ఏర్పాటు చేసుకోవటానికి ఉండే కోరికనుండే అనుబంధాలు పుడతాయి. ఇతరులను మీలో చేర్చుకున్నప్పుడు నరకం స్వర్గమవుతుంది.

అలా స్వర్గానుభావాన్ని పొందటానికి, మీ జీవితంలో స్వర్గాన్ని సృజించుకోవటానికి పడే తపనే అనుబంధం కావాలనుకోవటం. మీరు శరీరంతోనో,మనసుతోనో,ఉద్వేగంతోనో చేసే ప్రయత్నాలన్నీ ఆయా అనుబంధాల వెనుక ఉండే కాంక్ష మాత్రమే, మీరు ఎప్పటికి ఆ ‘ఒకటి అవటాన్ని’ అనుభవంలోకి తెచ్చుకోలేరు. ఒకటయ్యే క్షణాలు ఉండవచ్చేమో కాని, ఒకటవటం మాత్రం ఉండదు. అది ఎప్పటికీ జరగదు. మీ చుట్టూ ఉండే జీవితాన్ని మీదిగా చేసుకొనే అనుభవం కేవలం యోగం ద్వారా మాత్రమే సాధ్యం. ఇక్కడ మీ ఉనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఒకసారి అది జరిగిందంటే ఇతరులవైపు చూడటమంటే వారి అవసరమేదో చూడటమే! మీ అవసరాన్ని చూడటం కాదు. ఎందుకంటే మీకు అంటూ ఏ అవసరాలు మిగలవు. మీలో బలమైన ఆకాంక్షలు లేనప్పుడు మీరు చైతన్యవంతులు అవుతారు. అనుబంధాలు వరాలు అవుతాయి. ఇక ఆకాంక్షలులేవు! ఆరాటాలు లేవు!

ప్రేమాశీస్సులతో,

సద్గురు