Table of Content
1. అగస్త్య ముని ఎవరు?
2. అగస్త్య ముని - అసాధారణ జీవితాన్ని గడిపిన ఒక అపూర్వమైన వ్యక్తి
3. అగస్త్య ముని - దక్షిణ భారత ఆధ్యాత్మికతకు పితామహుడు
4. అగస్త్య ముని- అందించిన అద్భుతమైన వారసత్వం - కైలాస పర్వతపు దక్షిణ ముఖం
5. అగస్త్య ముని - ప్రాచీన యుద్ధ కళ 'కలరిపయట్టు' సృష్టికర్త
6. అగస్త్య ముని - సిద్ధ వైద్యానికి మార్గదర్శకుడు
7. అగస్త్య పురాణం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు

అగస్త్య ముని ఎవరు?

సద్గురు: కాంతి సరోవరం అంటే "అనుగ్రహపు సరస్సు". మొట్టమొదటిగా యోగ విజ్ఞాన ప్రసారం ఈ సరస్సు ఒడ్డున జరిగినందున దీనికి "అనుగ్రహపు సరస్సు" అని పేరు పెట్టారు. పదిహేను వేల సంవత్సరాల క్రితం, హిమాలయాల ఎగువ ప్రాంతాల్లో, ఆదియోగి కనిపించినప్పుడు, ప్రజలు వేలాదిగా గుమిగూడారు. ఆయన ఉనికే ప్రజలను ఆకర్షించే విధంగా ఉంది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా నెలల తరబడి కదలకుండా కూర్చున్నాడు. ఎవరైనా ఇలా కూర్చుని ఉండాలంటే, అతను తన శారీరక స్వభావానికి అతీతంగా వెళ్ళాలి. కేవలం ఏడుగురు మాత్రమే దీనిని గుర్తించారు. అందువల్ల వారు అక్కడే ఉండిపోయారు. ఏడుగురు వ్యక్తులనే ఈరోజు 'సప్త ఋషులు' లేదా 'సప్త దేవర్షులుగా' మనం పిలుస్తున్నాం.  

ఒకరోజున, ఆదియోగి దృష్టి వారిపై పడినప్పుడు, ఆయన వారికి కొన్ని సాధనా ప్రక్రియలు చెప్పి, "మీరు సిద్ధం అవ్వండి, చూద్దాం" అని అన్నారు. వారు ప్రజ్వలించే భాండాల లాగా తయారవడం గమనించి, కాంతి సరోవరం ఒడ్డున కూర్చుని యోగ శాస్త్రాన్ని వివరించడం ప్రారంభించాడు. వారు ఈ శాస్త్ర, జ్ఞానాలను సమ్మిళితం చేసి, దానిని మానవ రూపంలో సమీకృతం చేయడానికి చాలా కాలం పాటు సమాధిస్థితిలో ఉండిపోయారు. వారిలో అందరిలోకి ప్రముఖుడు అగస్త్యుడు.

అగస్త్యుడు ఒక భూగర్భ ప్రదేశంలో తన సాధన చేసాడని, అక్కడ నిద్రాణస్థితిలో చాలా కాలం పాటు ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. అతను బయటకు వచ్చినప్పుడు, జ్ఞానాన్ని పూర్తిగా తనలో ఒక భాగంగా ఏకీకృతం చేసుకున్నాడు. దానిని మేధో సంపత్తిగా కాకుండా తన స్వీయ శారీరిక వ్యవస్థ అనుక్షణం ప్రతిధ్వనించే ఒక ప్రక్రియగా చేసుకున్నాడు. అతను దక్షిణానికి వెళ్ళే తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆధ్యాత్మికతను భారత ఉపఖండంలోని దక్షిణ భాగం అంతటా ఎంతో శక్తివంతంగా విస్తరించిన కారణంగా అతను ఆ ఏడుగురు శిష్యులలో తాను అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్నాడు.

అగస్త్య ముని - అత్యద్భుతమైన జీవితాన్ని గడిపిన అసాధారణ యోగి

అగస్త్య ముని ఒక అసాధారణమైన జీవితాన్ని గడిపాడు. ఆయన సాధారణ మానవ జీవన కాల పరిమితిని మించి అచిరకాలం జీవించి ఉన్నాడని కూడా నమ్ముతారు. ఆయన 4000 సంవత్సరాలు జీవించాడని పురాణాలు చెబుతున్నాయి.

4000 సంవత్సరాలు జీవించాడో లేదో మనకు తెలియదు కానీ, ఖచ్చితంగా సాధారణ మానవ జీవితకాలం కంటే చాలా ఎక్కువ కాలం జీవించాడు. మీరు ఆయన జీవితకాలంలో చేసిన కార్యాచరణను చూస్తే, 100 సంవత్సరాల కాలంలో మరణించినట్లు అనిపించదు. కనీసం 400 సంవత్సరాలు అయినా జీవించి ఉండాలి, ఎందుకంటే ఆయన చేసిన కార్యకలాపాల పరిమాణం సాధారణ మానవ జీవితకాలంలో సాధ్యం కాదు. ఈరోజు మనం విమానాలలో తిరుగుతున్నాము, వాహనాలను ఉపయోగిస్తున్నాము కాబట్టి, మనము తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ పనులు చేయగలుగుతున్నాము. కానీ అగస్త్యుడు కాలినడకన చేసిన ప్రయాణాలను బట్టి చూస్తే, ఒక మనిషి సాధారణ జీవితకాలంలో అంత పని చేయడం అసాధ్యం. అతను ఖచ్చితంగా చాలా ఎక్కువ కాలం జీవించాడు

అగస్త్య ముని - దక్షిణ భారత ఆధ్యాత్మికతకు పితామహుడు

అగస్త్యుని ద్వారా దక్షిణ భారతదేశానికి యోగా ఒక నిర్దిష్ట క్రమపద్ధతిలో నిర్వచింపబడి వచ్చింది. అనేక విధాలుగా, అగస్త్యుడు దక్షిణ భారతీయ ఆధ్యాత్మికతకు తండ్రి.

దక్షిణ భారతదేశంలోని సిద్ధులందరూ అగస్త్య సంప్రదాయంలో ఉన్నవారే. దక్షిణ భారతీయ మార్మిక తత్వానికి విభిన్నమైన రుచి ఉంటుంది. అందుకు కారణం అగస్త్యులే. ఒక రకంగా చెప్పాలంటే, నేను చేసేదంతా అగస్త్యుని పనికి ఒక చిన్న పొడిగింపు మాత్రమే. ఆయన ఒక బృహత్తరమైన నిర్మాణాన్ని రచించాడు. మేము దానికి ఒక అదనపు గదిని జోడిస్తున్నాము, అంతే. అగస్త్యుడు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మికతలోని ఏదో ఒక అంశం ఉండేలా చూసుకున్నాడు. ఇది ఇప్పడు దూరం అవుతూ ఉండచ్చు, కానీ మీరు గత తరాన్ని గమనిస్తే, అది ఇంకా ఉంది. దక్షిణ భారతదేశంలోని ఒక సాధారణ రైతులో కూడా ఎంతో కొంత ఆధ్యాత్మికత ఉంది. ఇది అగస్త్యుని పనే.

భారతదేశ దక్షిణ భాగానికి వెళితే, వింధ్యాచల పర్వతాలకు దక్షిణంగా ఎక్కడైనా, దాదాపు ప్రతి గ్రామంలోనూ, "అగస్త్య ముని ఇక్కడ తపస్సు చేసాడు, అగస్త్య ముని ఈ గుహలో నివసించాడు, అగస్త్య ముని ఈ చెట్టును నాటాడు" అని అంటారు. ఆయన హిమాలయాలకు దక్షిణాన ఉన్న ప్రతి మానవ నివాసాన్ని ఆధ్యాత్మిక ప్రక్రియతో తాకడం వల్ల ఇలాంటి కథలు అనంతంగా వినిపిస్తాయి - బోధనగానో, మతం లేదా ఏదో వేదాంతంలాగానో కాకుండా, జీవితంలో ఒక భాగంగా. పొద్దున్నే లేచి పళ్లు తోముకోవడం మీ అమ్మ మీకు ఎలా నేర్పించారో, అగస్త్యులు ఆధ్యాత్మిక ప్రక్రియను అలా నేర్పించారు.

ఆధ్యాత్మికత అవశేషాలను, చాలా మామూలుగా, ఇది ఆధ్యాత్మిక ప్రక్రియ అని తెలియకుండానే పాటించే సామాన్యులను, మీరు చూడవచ్చు. మీరు కూర్చునే విధానం, నిలబడి పనులు చేసే విధానం, ప్రతిదానికీ ఆధ్యాత్మిక ఆధారం ఉంటుంది. దాదాపు ఎనిమిది, పది తరాల నుండి పూర్తిగా పేదరికంలో జీవిస్తున్నప్పటికీ, అక్కడి ప్రజలలో ఒక రకమైన సంతులనం, ఆనందం ఇంకా సంతృప్తిని మీరు ఇప్పటికీ ఇక్కడ చూస్తారు, ఇలా ఈ భూమి మీద మరెక్కడైనా చాలా అరుదుగా కనిపిస్తుంది.

అగస్త్య ముని అందించిన అద్భుతమైన వారసత్వం - కైలాస పర్వతపు దక్షిణ ముఖం

కైలాసం నాకు బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక గ్రంథాలయం లాంటిది. ఇది శివుని నివాసం అని అంటే అర్థం, ఆయన ఇప్పటికీ మంచు మీద నృత్యం చేస్తున్నాడని కాదు. దాని అర్థం ఏమిటంటే శివ తత్వపు సమస్తమూ, ఆ ప్రదేశంలో నిక్షిప్తమై ఉంది. ఆయన ఒక్కరే కాదు, అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కైలాసంలో తమ శక్తిని నిక్షిప్తం చేశారు. నాకు అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, అగస్త్య ముని తన శక్తిని కైలాసంలో నిక్షిప్తం చేశారు. దక్షిణ దేశపు మార్మిక తత్వానికి మూలం అగస్త్యుడు. నా అస్తిత్వానికి మూలము ఆయనే. కైలాస పర్వత దక్షిణ పార్శ్వంలో ఆయన తన శక్తులన్నింటినీ నిక్షిప్తం చేశారు. సహజ సౌందర్యపరంగా కైలాసం గురించి చెప్పడానికి మాటలు లేవు కానీ, శక్తి సామర్ధ్యాల పరంగా ఖచ్చితంగా అది అద్భుతమైనది

అగస్త్య ముని - అత్యంత ప్రాచీన యుద్ధ కళ, కలరిపయట్టు- సృష్టికర్త

కలరిపయట్టు బహుశా ఈ భూమి మీద అత్యంత ప్రాచీనమైన యుద్ధ కళ. మొట్టమొదటగా దీన్ని అగస్త్యముని నేర్పించారు ఎందుకంటే, యుద్ధ కళలు అంటే కేవలం తన్నడం, కొట్టడం లేదా కత్తితో పొడవడం మాత్రమే కాదు. ఇది శరీరాన్ని అన్ని సాధ్యమయ్యే విధానాల్లోనూ ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం. దీనిలో వ్యాయామం ఇంకా చురుకుదనం వంటి అంశాలు మాత్రమే కాకుండా, శక్తి వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా ఉంటుంది. కలరి చికిత్స, కలరి మర్మం- అంటే శరీర రహస్యాలను తెలుసుకోవడం, అతి త్వరగా శరీరాన్ని స్వస్థ పరిచి తిరిగి పునరుజ్జీవన స్థితిలో ఉంచడం, వంటి పద్ధతులు  ఉన్నాయి. నేటి ప్రపంచంలో తగినంత సమయాన్ని కేటాయించి, ఈ విద్యపై శక్తిని ఇంకా శ్రద్ధని పెట్టగల 'కలరి' అభ్యాసకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మీరు దీనిలో తగినంత లోతుకు వెళితే, మీరు సహజంగానే యోగా వైపుకు వెళతారు ఎందుకంటే అగస్త్యుని నుండి వచ్చింది ఏదైనా సరే ఆధ్యాత్మికం కంటే వేరు కాదు. ఇది అన్వేషణకు మరొక మార్గం, అంతే.

మన శరీరంలో లోతుగా పరిశీలించని పార్శ్వాలు ఎన్నో ఉన్నాయి. కొంతమంది యుద్ధ కళా నిపుణులు, ఒక చిన్న స్పర్శతో మిమ్మల్ని చంపగలరు. ఒకరిని కేవలం స్పర్శతో చంపడం పెద్ద విషయం కాదు. మీరు వారిని స్పర్శతో సజీవం చేయగలిగితే, అది చాలా పెద్ద విషయం. కేవలం ఒక చిన్న స్పర్శతో, శరీరం మొత్తం మేలుకుంటుంది. ఈ మానవ వ్యవస్థను మీరు గనక పరిశోధిస్తే, స్వయంగా అది ఒక విశ్వరూపం. ఇది ఇక్కడే కూర్చుని అద్భుతమైన పనులు చేయగలదు. యోగ పనిచేసే విధానమే అది. కలరి కేవలం దాని మరింత చురుకైన రూపం.

అగస్త్య ముని - సిద్ధ వైద్యానికి మార్గదర్శకుడు

సిద్ధ వైద్యం, యోగ శాస్త్రం నుండి ఉద్భవించిన వైద్య విధానం. దీన్ని సూత్రీకరించిన వారు అగస్త్య ముని. ఆదియోగి తాను స్వయంగా దీనిని ఉపయోగించారని, అగస్త్యుడు దానిని దక్షిణ భారతదేశానికి తీసుకువచ్చాడని చెప్తారు. ఇది స్వాభావికంగా మౌలికమైనది కాబట్టి దీనిని ఆచరించేవారికి ఇందులో అధ్యయనం కంటే ఎక్కువగా, అంతర్గత నియంత్రణ చాలా అవసరం. స్వభావ పరంగా ఇది పంచభూతాల పైన ఆధారపడి ఉన్నది. "భూత శుద్ధి" అంటే మనలోని పంచభూతాల శుద్ధీకరణమే యోగ శాస్త్రానికి మూలం కాబట్టి, ఈ సిద్ధ వైద్యం యోగ శాస్త్రం నుంచి ఉద్భవించింది. 

అగస్త్య పురాణం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు

మనం అగస్త్యుడిని ఇంకా ఇతర (సప్త)ఋషులను నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తాము, ఎందుకంటే వీరు మాములు మనుషులుగా కనిపించరు. వారు ప్రత్యేకంగా కనిపించవచ్చు, కానీ వాస్తవానికి వారు తమను తాము అలా తయారు చేసుకున్నారు. ఆకాంక్ష, సంకల్పం, ఎటువంటి మద్దతు లేకపోయినా లొంగని ఏకాగ్రత, తమని నిర్లక్ష్యం చేయబడినప్పటికీ వారు కొనసాగించిన సాధన - ఈ లక్షణం వారికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశం. తాము ఎనభై నాలుగు జీవితకాలాలు తిరిగి వచ్చి ఈ ప్రయత్నాన్ని చేయవలసి వచ్చినా సరే, వారికి అది పరవాలేదు; అలా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు.

సప్తఋషులు ఆకాశం నుండి ఏమీ ఊడిపడలేదు. భారత ఉపఖండంలో వారు ఎక్కడ పుట్టారో ఎవరికీ తెలియదు. ఎవరో కొందరు స్త్రీలు వారిని ఎక్కడో ఒక అనామక ప్రదేశంలో ప్రసవించి ఉండవచ్చు. వారు స్వర్గం నుండి ఏమీ ఊడిపడలేదు; వారు తమను తాము అలా తయారు చేసుకున్నారు. ఇదే వారి జీవిత గాథ, యోగా ఇంకా సాధలలో గుర్తించవలసిన ముఖ్యమైన అంశం. మీరు ఎవరు, ఎలా జన్మించారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీకు ఎలాంటి కర్మ ఉంది ఇవ్వన్ని లెక్కకు రావు - మీరు గట్టిగా అనుకుంటే, మిమ్మల్ని మీరు అద్భుతంగా తయారు చేసుకోవచ్చు.

అగస్త్య ముని ఇక్కడే చుట్టుపక్కల ఉన్న ఒక గ్రామం నుండి వచ్చాడనుకుందాం. ఉన్నట్టుండి ఒక రోజు అతను అదృశ్యమయిపోయాడు. ఆదియోగితో కలిసి ఉండేందుకు హిమాలయాలకు వెళ్లాడు. గ్రామస్థులు అగస్త్యుని గురించి ఏమి మాట్లాడుకున్నారని మీరు అనుకుంటున్నారు? “ఓహో, మీ అబ్బాయి గొప్ప జ్ఞాని కాబోతున్నాడా?” అని వాళ్ళు అతని తల్లిదండ్రులను మెచ్చుకున్నారని అనుకుంటున్నారా? లేదు. వారు అతని తల్లిదండ్రులను ఎగతాళి చేస్తూ, “మీ బుద్ధిహీనుడైన అబ్బాయి ఎక్కడ ఉన్నాడు?” అన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత అతను తిరిగి వచ్చినప్పుడు, వారు అతనిని చూసి అత్యుత్సాహం పొందారని మీరు అనుకుంటున్నారా? హిమాలయాలకు వెళ్లి, ఆదియోగిని కలుసుకుని తిరిగొచ్చాడని ఉత్సాహపడ్డారా? లేదు. అతను గోచీ కట్టుకొని ఒక అడవి మనిషిలాగా, తిరిగి రావడంతో వారు అతనిని చూసి నవ్వుకున్నారు. ఇప్పుడు, మనం ఈ మనిషిని నోరు తెరిచి ఆశ్చర్యంగా ఇలా ఎలా మారాడు అనే కోణంలో చూడవచ్చు, కానీ అతని కాలంలో, గుర్తింపు కానీ ప్రశంసలు కానీ లేవు. అతని కోసం ఎవరూ చప్పట్లు కొట్టలేదు. తల్లితండ్రులను వదిలి పారిపోయిన బాధ్యత లేని కుర్రాడని అందరూ అనుకున్నారు. వీటన్నింటి అధిగమిస్తూ, స్థిరంగా - ఎల్లప్పుడూ తన మార్గంలోనే ఉన్నాడు- అదే అగస్త్యముని. అతని దిశ నిర్ధేశించబడింది. ఇంక ఏమి జరిగినా, అతను తాను చేస్తున్న పని నుండి ఎప్పుడూ చలించకుండా-, అనుగ్రహ పథంలొనే ఉండాలని నిశ్చయించుకున్నాడు.

కాబట్టి ఒకవేళ మీరు ఒక అగస్త్య ముని కావాలనుకుంటేమీరు ఈ పద్ధతిని అనుసరించగలిగితే, ఎందుకు కాలేరు?